దిల్లీ ఎన్నికల ఫలితాలు: బిరియానీ కథలు, కాల్పుల నినాదాలు బీజేపీకి ఎంతవరకు పనికొచ్చాయి?

దిల్లీ ఫలితాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
News image

"షాహీన్‌బాగ్‌ ప్రజలు మీ ఇళ్లలోకి దూరి మహిళలపై అత్యాచారం చేస్తారు."

"మిలిటెంట్లకు బిరియానీ తినిపించడానికి, బదులు బుల్లెట్లు తినిపించాలి."

"దేశ ద్రోహులను కాల్చి చంపండి."

"అరవింద్ కేజ్రీవాల్ తీవ్రవాది…"

ఇవి మామూలు మాటలు కాదు. దిల్లీ ఎన్నికల్లో మతపరమైన పునరేకీకరణ కోసం పూర్తి ప్రయత్నాలు జరిగాయనడానికి కొన్ని ఉదాహరణలు. దేశం యూపీలో దారుణమైన ఎన్నికల ప్రచారాన్ని చూసింది. కానీ, దిల్లీ ఎన్నికలు పునరేకీకరణ ప్రయత్నాలకు గుర్తుండిపోయే ఎన్నికల్లో ఒకటిగా మిగిలిపోతాయి.

రెచ్చగొట్టే నినాదాల ఫలితంగా పార్టీ స్టార్ ప్రచారకర్తలు ఈ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ అడ్డుకుంది.

దిల్లీ ఫలితాలు

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వేరే అంశాలే దొరకలేదా?

అలా అనడం కూడా తప్పవుతుంది. ప్రధానమంత్రి మోదీ దేశాభివృద్ధి మాటలు పునరావృతం చేశారు. "కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేజ్రీవాల్ ప్రభుత్వమే అడ్డుపుల్ల వేసిందని" ఆయన చెప్పారు. కేజ్రీవాల్ మొహల్లా క్లినిక్‌లను తక్కువ చేయడానికి, 'ఆయష్మాన్ భారత్' పథకాన్ని దిల్లీ ప్రభుత్వం అమలు చేయలేదని మోదీ మాటిమాటికీ చెప్పారు.

కానీ, పెద్ద స్థాయిలో చిన్న చిన్న సభలు నిర్వహించి ప్రవేశ్ వర్మ, అనురాగ్ ఠాకూర్ లాంటి నేతలు షాహీన్ బాగ్, దేశద్రోహి, పాకిస్తాన్, తీవ్రవాది అనే కామెంట్లు చేశారు.

అమిత్ షా లాంటి పెద్ద నేతలు "భారత సరిహద్దులు బలమైనవని, శత్రువులు చేరుకోలేని విధంగా ఉన్నాయని, భారత్ పాకిస్తాన్‌ను పరిస్థితిని దారుణంగా మార్చిందని, అది ఇప్పుడు భయంతో వణికిపోతోందని మాటిమాటికీ గుర్తుచేశారు.

స్వచ్ఛమైన నీరు, మెరుగైన రోడ్లు, మౌలిక సదుపాయాల్లో మార్పులు తీసుకురావడం గురించి కూడా వారు చెప్పారు. మరిన్ని విదేశీ పెట్టుబడులు, పేదలకు ఇల్లు, వారి పిల్లలకు మెరుగైన విద్య గురించి కూడా హామీలు ఇచ్చారు.

దిల్లీ ఫలితాలు

ఫొటో సోర్స్, Getty Images

పునరేకీకరణ ప్రయత్నాలు విఫలం

కానీ, వీటన్నిటి మధ్య కొన్ని అంశాలు చాలా మామూలుగా అయిపోయాయి. దాదాపు ప్రతి ఎన్నికల సభలో ప్రసంగాల్లో వినిపించాయి. ఆ అంశాలన్నింటినీ మరింత పునరేకీకరణ లక్ష్యంగానే లేవెనెత్తుతూ వచ్చారు.

"ఎవరు ఎంత భారతీయులు, జాతీయవాద భావన ఎవరిలో ఎక్కువగా, ఎవరిలో తక్కువగా ఉంది", "పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించేవారు, పొరుగు దేశాల్లో వేధింపులకు గురవుతున్న మైనారిటీలకు పౌరసత్వం లభించాలని కోరుకోవడం లేదు" ఇలా చాలా అన్నారు.

మాటిమాటికీ బంగ్లాదేశ్ చొరబాట్లు, రోహింజ్యా ముస్లింల గురించి మాట్లాడారు. బీజేపీకి సంబంధించిన ఒక నేత భారత్‌లో బంగ్లాదేశీయులు ఎలా చొరబడుతున్నారో, వారిని వెళ్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తోందో వరసగా చెబుతూ వచ్చారు. బంగ్లాదేశీ చొరబాటుదారుల సంఖ్య ఒకసారి కోటి అని, ఇంకోసారి రెండు కోట్లు అని చెప్పారు.

"భారత్ అంటే నచ్చనివారు, వేరే ఎక్కడికైనా వెళ్లాలంటే, మేం అడ్డుకుంటున్నామా" అని కూడా అన్నారు. "శతాబ్దాలపాటు విదేశీ పాలకులు భారత్‌లోని మెజారిటీ హిందువులపై తమ పాలన రుద్దారని, ఇక దానిని ఏమాత్రం సహించేది లేదని" అన్నారు.

దిల్లీ ఫలితాలు

ఫొటో సోర్స్, AFP

దేశ ప్రజలందరికీ ఎన్ఆర్సీ, సీఏఏ లాంటి చట్టాల అవసరం ఏంటి అనేదానిపై కూడా ఫోకస్ వెళ్లింది. సోషల్ మీడియా నుంచి ఎన్నికల వేదికలకు వేలాడుతున్న భారీ లౌడ్ స్పీకర్ల వరకూ ఎక్కువగా ఇలాంటి మాటలే వచ్చాయి.

భారతీయ జనతా పార్టీ తన 250 మంది ఎంపీలను రంగంలోకి దించింది. అంతే కాదు, చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో రాత్రింబవళ్లూ ప్రచారం చేయించింది. ఎంపీలను రాత్రుళ్లు మురికివాడల్లో బసచేయాలని ఆదేశించింది. ఆ మురికవాడల్లో కేజ్రీవాల్ పట్టును తగ్గించడానికి ప్రయత్నించింది.

మతపరమైన పునరేకీకరణతో ఎన్నికలు గెలవాలనే ప్రయత్నం ఇప్పుడే మొదటిసారి జరిగిందా, అంటే అలా ఏం లేదు.

2019 లోక్‌సభ ఎన్నికల సహా గత ఎన్నో అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ భారతీయ జనతా పార్టీ తమ స్టార్ ప్రచారకర్తలను చాలా ఉత్సాహంగా దించింది.

కాషాయం ధరించే యోగీ ఆదిత్యనాథ్, బెంగాల్‌లో బీజేపీ లోక్‌సభ స్థానాలను రెండు నుంచి 18కి చేర్చిన క్రెడిట్ కొట్టేసిన దిలీప్ ఘోష్, ఎంపీలు సన్నీ డియోల్, రవి కిషన్ ఈ ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. వీరు దిల్లీలో కూడా క్యాంప్ వేశారు.

మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేజారినా, ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో 'మతం మరో కొత్త రకం జాతీయవాదం' కలగలిసిన ప్రసంగాలు, సోషల్ మీడియా కాంపైన్ చాలా ప్రభావవంతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మంగళవారం దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ వెలువడుతున్నాయి. ప్రారంభ ట్రెండ్స్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆధిక్యం లభించింది. బీజేపీ నుంచి గతంలో కంటే స్పష్టంగా మెరుగైన ప్రదర్శన కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో దిల్లీ 70 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ కేవలం మూడు సీట్లు గెలుచుకుంది. ఇప్పటివరకూ ట్రెండ్స్ ప్రకారం ఈసారీ బీజేపీకి సుమారు 10 స్థానాలు ఎక్కువ వచ్చేలా కనిపిస్తోంది. ఇది పునరేకీకరణ రాజకీయ ప్రయోజనమే. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ పునరేకీకరణ హద్దు కూడా కనిపిస్తోంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)