రాజధాని-అమరావతి: హోంశాఖ సమాధానంపై వైసీపీ, టీడీపీ ఏమంటున్నాయి? గజెట్ ప్రాధాన్యం ఎంత?

అమరావతి
    • రచయిత, రవిశంకర్ లింగుట్ల
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా అమరావతిని నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 23న జీవో ఇచ్చిందని కేంద్ర హోంశాఖ మంగళవారం (ఫిబ్రవరి 4న) లోక్‌సభలో చెప్పింది.

ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మీడియాలో ఇటీవల కథనాలు వచ్చాయని హోంశాఖ పేర్కొంది. ప్రతి రాష్ట్రం తన భూభాగం పరిధిలో తన రాజధానిని తానే నిర్ణయించుకొంటుందని చెప్పింది.

అడ్డగీత
News image
అడ్డగీత

తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నలకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్

ఫొటో సోర్స్, FB/nityanandraibjp

ఫొటో క్యాప్షన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్

జయదేవ్ అడిగిన ప్రశ్నలు ఇవీ

(ఏ) మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (వైఎస్ జగన్మోహన్‌రెడ్డి) ఇటీవల తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా, లేదా?

(బీ) ఈ నిర్ణయం ప్రభుత్వం దృష్టికి వచ్చి ఉంటే స్పందన ఏమిటి?

(సీ) ఈ నిర్ణయం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడే అవకాశముంది?

(డీ) ఇలాంటి నిర్ణయాలు పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన వేల మంది రైతులకు తీరని నష్టం కలిగిస్తాయి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సలహా ఇస్తుందా? (ఈ) సలహా ఇవ్వదలిస్తే ఆ వివరాలు ఏమిటి?

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్న- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇచ్చిన సమాధానం
ఫొటో క్యాప్షన్, రాజధాని అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్న- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇచ్చిన సమాధానం

వైసీపీ, టీడీపీ వాదనలు ఇవీ

హోంశాఖ సమాధానంపై ఏపీలో ప్రతిపక్ష టీడీపీ, పాలక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ తమ వాదనలు వినిపిస్తున్నాయి.

రాజధానిగా అమరావతి ఎంపిక జరిగిపోయిందని, 2015లోనే రాజధానిగా అమరావతిని నోటిఫై చేశారని ఇప్పుడు లోక్‌సభలో కేంద్రం స్పష్టంగా చెప్పిందని టీడీపీ వాదిస్తోంది. రాజధానిగా అమరావతే కొనసాగుతుందని చెబుతోంది.

రాజధాని ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని హోంశాఖ చెప్పిందని వైసీపీ పేర్కొంటోంది. హోంశాఖ సమాధానంతో నిమిత్తం లేకుండా మూడు రాజధానుల ఏర్పాటుపై తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని అంటోంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో మంత్రి బొత్స సత్యనారాయణ

ఫొటో సోర్స్, FB/BOTCHA SATYANARAYANA

ఫొటో క్యాప్షన్, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో మంత్రి బొత్స సత్యనారాయణ

అది జీవోనే, గజెట్ ఇవ్వలేదు: మంత్రి బొత్స

ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బీబీసీతో మాట్లాడుతూ- టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోనే కేంద్ర హోంశాఖ ప్రస్తావించిందన్నారు.

"ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం జీవోలు ఇస్తుంటుంది, మార్చుకుంటుంటుంది. అమరావతే రాజధాని అని గజెట్లో(రాజపత్రంలో) రాలేదు. చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఈ దిశగా సమన్వయం చేసుకోలేదు, చర్యలు చేపట్టలేదు" అని ఆయన విమర్శించారు.

గజెట్ నోటిఫికేషన్ తప్పనిసరని, అయినా గత ప్రభుత్వం దీనిని జారీచేయలేదని, దీనివల్ల రాజధానికి ఒక చిరునామా అంటూ లేకుండా చేసిందని బొత్స విమర్శిస్తూ వస్తున్నారు.

కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానంతో నిమిత్తం లేకుండా మూడు రాజధానుల ఏర్పాటుపై తమ ప్రాథమ్యాల ప్రకారం తాము ముందుకెళ్తామని ఆయన చెప్పారు.

హోంశాఖ ప్రస్తావించిన 2015 ఏప్రిల్ 23 నాటి జీవో- ఎంస్ నంబరు 97. రాజధాని నగరం పేరును అమరావతిగా నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దీనిని జారీచేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ 'ఎక్స్‌ట్రార్డినరీ గజెట్'లో ఇవ్వాలని ఏపీ ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌ను ఇందులో ఆదేశించింది.

రాజధాని నగరం పేరు అమరావతి అని నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 23న జారీచేసిన జీవో ఎంస్ నంబరు 97
ఫొటో క్యాప్షన్, రాజధాని నగరం పేరు అమరావతి అని నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 23న జారీచేసిన జీవో ఎంస్ నంబరు 97

వైసీపీది పసలేని వాదన: టీడీపీ

గజెట్‌కు సంబంధించి వైసీపీ విమర్శలను టీడీపీ తోసిపుచ్చింది.

వైసీపీది పసలేని వాదనని, అది న్యాయస్థానంలో నిలిచేది కాదని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాల్యాద్రి శ్రీరామ్ బీబీసీతో చెప్పారు.

'గజెట్' చిన్న సాంకేతిక అంశమని ఆయన వ్యాఖ్యానించారు. గజెట్‌పై చేసే వాదన కేవలం వాదన కోసం చేసే వాదనన్నారు.

అమరావతే రాజధాని అని టీడీపీ ప్రభుత్వం అప్పట్లోనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లిందని ఆయన చెప్పారు. అమరావతే రాజధాననే విషయాన్ని కేంద్రం ఎన్నడూ తోసిపుచ్చలేదన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి వచ్చి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారని శ్రీరామ్ ప్రస్తావించారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.1,500 కోట్ల నిధులు కూడా ఇచ్చిందన్నారు.

భారత దేశ పటంలోనూ అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్ర ప్రభుత్వం చూపించిందని చెప్పారు.

హైకోర్టు అమరావతిలోనే ఏర్పాటైందని, రాజధాని కాబట్టే హైకోర్టును ఇక్కడ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గజెట్ జారీచేసిందని ఆయన చెప్పారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, గల్లా జయదేవ్

ఫొటో సోర్స్, FB/jayadev.galla

ఫొటో క్యాప్షన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, గల్లా జయదేవ్

గజెట్‌ అవసరం, ప్రాధాన్యం ఎంత?

ఈ అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ బీబీసీతో మాట్లాడుతూ- అమరావతే రాజధాని అని గజెట్లో చెప్పకపోయినా అది చట్టవిరుద్ధం కాదన్నారు. రాజ్యాంగం ప్రకారంగాని, మరేదైనా చట్టం ప్రకారంగాని రాజధాని నగరం ఫలానా అని గజెట్లో చెప్పాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రిని, మంత్రులను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఇతర ఉన్నతాధికారులను, సచివాలయ అధికారులను, విభాగాధిపతులను కలవలాంటే వారు ఎక్కడుంటారో ప్రజలకు తెలియాలి కాబట్టి, ప్రజాసౌకర్యార్థం రాజధాని ఏదో చెబుతూ ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని ఆయన వివరించారు. ఉదాహరణకు ముఖ్యమంత్రికి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రజలు లేఖ రాయాలనుకుంటే, వాళ్లు ఎక్కడుంటారో, ప్రభుత్వం ఎక్కడి నుంచి పనిచేస్తోందో ప్రజలకు తెలియాలని, గజెట్ ఆ సమాచారం ఇస్తుందని చెప్పారు. గజెట్ అంటే 'ప్రభుత్వ నోటీసు బోర్డు' అని వ్యాఖ్యానించారు.

ప్రజల సౌకర్యార్థం ఇలా ఇచ్చే నోటిఫికేషన్ కేవలం కార్యనిర్వాహక ఉత్తర్వు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) కిందకు వస్తుందని, చట్టపరమైన ఉత్తర్వు (స్టాట్యుటరీ ఆర్డర్) కిందకు రాదని శర్మ చెప్పారు. కార్యనిర్వాహక ఉత్తర్వు అంటే జీవో లాంటిదన్నారు.

అమరావతి

ఫొటో సోర్స్, Getty Images

"పబ్లిక్ నోటిఫికేషన్లన్నీ గజెట్లో పెడతారు. గజెట్లో వెయ్యకపోతే ప్రతి మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) కార్యాలయంలో, ప్రతి కలెక్టరేట్లో, ప్రతి విభాగాధిపతి కార్యాలయంలో ఈ సమాచారాన్ని నోటీసు బోర్డుల్లో పెట్టాలి. ఇదంతా చాలా కష్టమైన పని. గజెట్లో పెడితే 'ప్రజలకు తెలియజేశాం' అని అర్థం. అందులో వెలువరిస్తే అధికారికంగా అందరికీ చెప్పినట్లు అవుతుంది. అది సౌకర్యవంతంగా ఉంటుంది" అని శర్మ వివరించారు.

ఒకవేళ గజెట్లో పెట్టకపోయినా ఏమీ కాదని, ఎందుకంటే అదే విషయాన్ని ప్రభుత్వం మీడియా ప్రకటనల్లో తెలియజేయవచ్చని ఆయన చెప్పారు.

"ప్రజలందరూ గజెట్ చూస్తారనే భావనతోనే అందులో వేస్తారు. గజెట్లో వేయడానికి అంతకుమించిన కారణం ఏమీ లేదు. ప్రజలకు తెలియజేయాలనే కోణంలోనే గజెట్ ముఖ్యమైనది. రాజ్యాంగంలోగాని, చట్టాల్లోగాని రాజధాని నగరం ఏదనేది గజెట్లో పెట్టాలనే ప్రస్తావన లేదు" అని శర్మ వివరించారు.

అమరావతిలో హైకోర్టు

ఫొటో సోర్స్, AMARAVATI.GOV.IN

ఫొటో క్యాప్షన్, అమరావతిలో హైకోర్టు

ప్రభుత్వాన్ని మళ్లీ అడుగుతా: జయదేవ్

హోంశాఖ సమాధానంపై జయదేవ్ బీబీసీతో మాట్లాడుతూ- లాటరీలో తనది 'అన్‌స్టార్డ్' ప్రశ్నగా వచ్చిందని, దీంతో మంత్రి సమాధానంపై అనుబంధ ప్రశ్నలు వేయడం వీలు కాలేదని చెప్పారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలోగాని, మరో సందర్భంలోగాని రాజధాని అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడానికి ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)