ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అసలేం జరిగింది? సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుంది

- రచయిత, బళ్ళ సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని సంబంధిత బిల్లులు శాసన మండలిలో ఆగిపోయాయి. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను కౌన్సిల్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిలువరించింది. అధికార పార్టీ అభ్యంతరం చెప్పినా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు. దీంతో ఆ బిల్లులు చట్ట రూపం దాల్చడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమావేశాల కంటే వాడి వేడిగా, వ్యూహ ప్రతివ్యూహాల మధ్య సాగాయి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు. శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ ఉంది. దీంతో ఎలాగైనా రాజధాని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవాలని ఆ పార్టీ వ్యూహం రచించింది.

ఫొటో సోర్స్, aplegislature
రెండు రోజులు ఏం జరిగింది?
తెలుగుదేశం పార్టీ మంగళవారం రూల్ 71ను ప్రతిపాదించింది. 71వ రూల్ కింద చర్చ కోసం పట్టు పట్టడంతో ఆరోజు బిల్లు తీసుకోవడం చాలా ఆలస్యమైంది. అసలు బిల్లే తీసుకోవద్దని తెలుగుదేశం కోరింది. ముందు బిల్లులను సభకు పరిచయం చేయాలని వైసీపీ పట్టుపట్టింది. చివరకు మంగళవారం రాత్రి ఈ రాజధాని బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఆరోజు అత్యంత ఉద్రిక్తంగా సభ సాగింది. సాధారణంగా ప్రతిపక్ష సభ్యులు పోడియం దగ్గరకు వెళతారు. కానీ, ఈసారి 15 మంది మంత్రులు అధ్యక్షుడి పోడియం దగ్గరకు వెళ్లి నిరసన చెప్పారు.
ఆరోజు సందర్శకుల గ్యాలరీలో వైయస్సార్సీపీ ముఖ్య నాయకులు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి కూర్చొని తమ సభ్యులకు సలహాలు ఇచ్చారు. ఒక దశలో పరిషత్ ప్రత్యక్ష ప్రసారాలు కూడా నిలిపివేశారు. వాయిదా పడినప్పుడల్లా తమకు అనుకూలంగా ఓటేసేలా స్వతంత్ర్య సభ్యులను ఒప్పించేందుకు ప్రయత్నించారు. మొత్తానికి రూల్ 71పై చర్చ కూడా జరిగింది. గందరగోళం మధ్యే సభ బుధవారానికి వాయిదా పడింది.


ఇక బుధవారం కూడా సమావేశాలు అంతే వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సభలో మాట్లాడటానికి తెలుగుదేశానికి 84 నిమిషాలు, వైయస్సార్సీపీకి 27 నిమిషాలు, తెలుగుదేశం నామినేటెడ్ సభ్యులకు 8 నిమిషాలు, స్వతంత్ర్య సభ్యులకు 9 నిమిషాల సమయం ఇచ్చారు ఛైర్మన్ షరీఫ్.
స్వతంత్ర్య ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారు. బీజేపీ రాయలసీమలో హైకోర్టును స్వాగతించింది. మూడు ప్రాంతీయ బోర్డులను స్వాగతిస్తున్నట్టు ఆ పార్టీ ఎమ్మెల్సీ వీర్రాజు చెప్పారు.
"అమరావతిలో దాదాపు అన్ని భవనాలు నిర్మాణాలూ పూర్తయ్యాయనీ, అయినా సీఎం ఒక్క రోజూ అమరావతిలో పర్యటించలేదు" అని తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. రాజధాని తరలింపు వల్ల ప్రజాధనం వృథా అవుతుందని ఆయన అన్నారు. అయితే, తాము వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించే ఆలోచిస్తామని, అమరావతిలో తెలుగుదేశం నేతలు భూదోపిడీ చేశారని విమర్శించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఈ క్రమంలో అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌ల మధ్య వాగ్వివాదం జరిగింది.
లోకేశ్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో సెల్ ఫోన్ చూడటానికి మంత్రి బొత్స అభ్యంతరం చెప్పారు. సెల్ ఫోన్‌లో నోట్స్ చూస్తూ మాట్లాడడం తప్పేమీ లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాల సుబ్రమణ్యం స్పందించారు.

తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీ పోతుల సునీత వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. ఇతర ఎమ్మెల్సీలను తమకు అనుకూలంగా ఓటు వేసేలా ఒప్పించడానికి వైయస్సార్సీపీ పెద్దలు తమవంతు ప్రయత్నాలు చేశారు.
మండలి సమావేశాలను చూడడానికి చంద్రబాబు స్వయంగా గ్యాలరీకి వచ్చారు. తన చాంబర్‌లో లైవ్ రాకపోవడంతో ఇక్కడకు వచ్చారు. పక్కనే మరో గ్యాలరీలో విజయసాయి, సుబ్బా రెడ్డి కూర్చున్నారు. బాలకృష్ణ, రోజా ఒకే గ్యాలరీలో కూర్చుని సభను చూశారు. మార్షల్స్ అడగడంతో చంద్రబాబు తన సెల్ ఫోన్‌ను వారి దగ్గర డిపాజిట్ చేసి, అప్పుడు గ్యాలరీకి వెళ్లారు.
వీరంతా చూస్తుండగా, ఛైర్మన్ పోడియం ఎదురుగా లోకేశ్, బొత్స సత్యనారాయణలు వాగ్వివాదానికి దిగారు. నాయకులు ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు.
ప్రసంగాల తరువాత, బిల్లును సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయాలని తెలుగుదేశం పట్టుపట్టింది. కుదరదని అధికార పక్షం వాదించింది. నినాదాలు, తోపులాటలు, దూసుకెళ్లడాలు, ఫిర్యాదులు, దుందుడుకు మాటలు సాగాయి. సభను పది నిమిషాలు వాయిదా వేశారు.

తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామనీ, వైయస్సార్సీపీ నుంచి రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని మీడియాతో వ్యాఖ్యానించారు యనమల రామకృష్ణుడు. మండలిలో తెలుగుదేశం మెజార్టీ ఉంది కాబట్టి, తాము అడిగితే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందే అని చెప్పారాయన.
బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపకుండా ఉండేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. న్యాయ సలహా కోసం, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యాన్ని సభకు పిలిపించింది.
అనేకసార్లు వైసీపీ, తెలుగుదేశం సభ్యులు చైర్మన్‌ను విడివిడిగా కలిశారు. ఛైర్మన్ కూడా సభ్యులతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు.
సభ మళ్లీ ప్రారంభమైనా అదే పరిస్థితి. చివరకు నిబంధన 154 ప్రకారం తన విచక్షణాధికారాలను ఉపయోగించి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఆ తరువాత సభను నిరవధిక వాయిదా వేశారు.
"చంద్రబాబు చట్ట సభలపై గౌరవం లేకుండా వ్యవహరించారు. లాబీల్లో కూర్చుని ప్రభావితం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం తెచ్చిన బిల్లులను అడ్డుకున్న ఈ రోజు చరిత్రలో బ్లాక్ డే. అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపే వీలు లేకుండా ఉద్దేశపూర్వకంగా సెలెక్ట్ కమిటీకి పంపారు" అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ వ్యాఖ్యానించారు.
"ఛైర్మన్ షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం కాకుండా, చంద్రబాబు చెప్పినట్టు చేశారు. ఆయన చరిత్రహీనులుగా మిగిలిపోతారు" అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఫొటో సోర్స్, aplegislature
సెలెక్ట్ కమిటీ అంటే?
ఈ సెలెక్ట్ కమిటీ విధానం బ్రిటిష్ పార్లమెంటు సంప్రదాయం నుంచి వచ్చింది. రాజ్యసభలో కూడా ఈ నిబంధన ఉంది. రాజ్యసభ నుంచే రాష్ట్రాల శాసన పరిషత్‌లు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి.
ఏదైనా బిల్లుపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు దానిపై చర్చించడానికి సభలోని కొందరు సభ్యులతో ఒక కమిటీ వేస్తారు. అందులో అన్ని పార్టీల వారూ ఉంటారు. ఆ కమిటీకి ఒక ఛైర్మన్ ఉంటారు. ఆ కమిటీ ఈ బిల్లుపై అధ్యయనం చేసి తన నివేదికను ఛైర్మన్‌కు ఇవ్వాలి. సాధారణంగా సెలెక్ట్ కమిటీ ఛైర్మన్‌ను, గడువునూ సభాధ్యక్షుడు నిర్ణయిస్తారు. ఏ గడువూ నిర్ణయించని పక్షంలో మూడు నెలలకు మించకుండా ఆ కమిటీ తన నివేదికను ఇవ్వాలి.
భారతదేశంతో పాటూ బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్ వంటి దేశాల చట్టసభల్లో కూడా ఈ సెలెక్ట్ కమిటీ విధానం ఉంది. ఎవరైనా సభ్యుడు ఏదైనా బిల్లును ఈ కమిటీకి పంపమని సభాధ్యక్షుడు కోరవచ్చు. మెజార్టీ ఆధారంగా నిర్ణయం జరుగుతుంది.
బిల్లు గురించి అధ్యయనం చేసేందుకు సెలెక్ట్ కమిటీ అన్ని హక్కులూ కలిగి ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో తమకు నచ్చని బిల్లు వచ్చినప్పుడు దానిని ఆలస్యం చేయడానికి లేదా కనీసం ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని మార్పులైనా చేయడానికి ఈ కమిటీని ప్రతిపక్షాలు ఒక అస్త్రంగా వాడతాయి. ఈ కమిటీ కింద గరిష్టంగా మూడు నెలలు బిల్లును ఆపగలరు.
ఇవి కూడా చదవండి:
- బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక: విశాఖపట్నంలోనే సెక్రటేరియట్, సీఎం, అన్ని హెచ్ఓడీల కార్యాలయాలు
- ‘అమరావతి రుణాన్ని తిరస్కరించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానిదే.. ప్రపంచ బ్యాంకుది కాదు’
- అమరావతి ఆందోళనల్లో మహిళలు: ‘వంట చేసి, నేరుగా దీక్షా శిబిరాలకే వస్తున్నాం’
- విజయవాడలో చంద్రబాబు సహా టీడీపీ, ఇతర విపక్ష నేతల అరెస్ట్
- అమరావతి - సకల జనుల సమ్మె: 'మహిళలను నడిరోడ్లపై ఈడ్చేస్తారా.. నెట్టేసి గాయాల పాలు చేస్తారా' -చంద్రబాబు
- వినోదం కోసం ఇంట్లో చిరుతల్ని పెంచుకుంటున్నారు
- మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన ఫొటోలను గాంధీ స్మృతి మ్యూజియంలో నుంచి ఎందుకు తీసేశారు?
- భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి బదిలీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









