విజయవాడలో చంద్రబాబు స‌హా టీడీపీ, ఇతర విపక్ష నేత‌ల అరెస్ట్

చంద్రబాబు అరెస్ట్

ఆంధ్ర ప్రదేశ్ రాజ‌ధాని అంశం మ‌రింత రాజుకుంటోంది. బుధ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్‌లో ఉద్రిక‌త్త ఏర్ప‌డింది. బ‌స్సు యాత్ర కోసం అమరావతి జేఏసీ నేత‌ల ప్ర‌య‌త్నాల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రోడ్డుపై బైఠాయించిన మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌హా ప‌లువురు నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్ర‌బాబు తీరుని ఏపీ హోం మంత్రి త‌ప్పుబ‌ట్టారు.

బ‌స్సులు సీజ్ చేయడంతో మొద‌లైన ఆందోళ‌న‌

అమ‌రావ‌తి అంశంపై రాష్ట్ర‌వ్యాప్త ప్ర‌చారయాత్ర చేప‌ట్టాల‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి నిర్ణ‌యించింది. అందుకు త‌గ్గ‌ట్టుగా వాహ‌నాల‌ను సిద్ధం చేసుకుంది. విజ‌య‌వాడలో వాటిని సిద్ధం చేసి బ‌య‌లుదేరుతున్న వేళ పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీఏ, పోలీసు అనుమ‌తులు లేకుండా బ‌స్సు యాత్రని అంగీక‌రించేది లేదంటూ బ‌స్సుల‌ను సీజ్ చేశారు. పోలీసుల‌తో కొంద‌రు టీడీపీ నేత‌లు వాగ్వాదానికి దిగిన‌ప్పటికీ బ‌స్సులు ముందుకు క‌ద‌ల‌లేదు.

బెంజ్ స‌ర్కిల్‌లో చంద్ర‌బాబు ఆందోళ‌న‌

అమ‌రావ‌తి జేఏసీ కార్యాల‌యం ప్రారంభించేందుకు చంద్ర‌బాబుతో పాటు సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ, కాంగ్రెస్ నాయ‌కురాలు సుంక‌ర ప‌ద్మ‌శ్రీ వంటి కొందరు నేత‌లు విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్‌కి చేరుకున్నారు. ఈలోపు... బ‌స్సుల‌ను పోలీసుల‌ను అడ్డుకున్నార‌ని, బ‌స్సు యాత్ర‌కు అనుమ‌తి లేద‌ని చెబుతున్న విష‌యం చంద్ర‌బాబుకి చేరింది. దాంతో ఆయ‌న బెంజ్ స‌ర్కిల్ నుంచి బ‌స్సులు సీజ్ చేసిన ప్రాంతానికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే పోలీసులు దానికి అంగీక‌రించ‌లేదు.

పోలీసుల తీరును నిరసిస్తూ చంద్ర‌బాబు బెంజ్ స‌ర్కిల్‌లో బైఠాయించారు. పాద‌యాత్ర‌కు పోలీసుల‌ు నిరాక‌రించ‌డంతో ఆయ‌న‌తో పాటు, ఇత‌ర పార్టీల నేత‌లు కూడా ఆందోళ‌న‌కు దిగ‌డంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళ‌న విర‌మించాల‌ని పోలీసుల‌ు చంద్ర‌బాబుని కోరిన‌ప్ప‌టికీ ఆయ‌న నిరాక‌రించారు.

చంద్రబాబు అరెస్ట్

నేత‌ల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

రాత్రి 8 గంటల త‌ర్వాత ఆందోళ‌న ఉధృతం అవుతుండ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. చంద్ర‌బాబుతో పాటు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, నారా లోకేశ్, ఇతర టీడీపీ నేత‌ల‌ను, సీపీఐ, కాంగ్రెస్ నేత‌ల‌ను అదుపులోకి తీసుకుని ఉండవల్లి త‌ర‌లించారు.

పోలీసులు చ‌ట్ట‌విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు

పోలీసుల తీరుని చంద్ర‌బాబు త‌ప్పుబ‌ట్టారు. "ఎందుకీ దౌర్జన్యం సాగిస్తున్నారు.. ప్ర‌భుత్వం అడ్డ‌గోలుగా సాగుతోంది. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. రాజధానిని ఏం చేయాలనుకుంటున్నారు? మేం చట్ట ప్రకారం పర్మిషన్‌ తీసుకున్నాం.. కానీ పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. శాంతియుతంగా ఆందోళ‌న చేస్తుంటే అడ్డుకునే అధికారం ఎవ‌రిచ్చారు?" అని చంద్రబాబు ప్ర‌శ్నించారు.

చంద్రబాబు అరెస్ట్

పోలీసు బలంతో అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది

రాజధాని అమరావతిని రక్షించుకొనేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు బలంతో అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

"అందులో భాగంగానే జరిగిందే చంద్రబాబు నాయుడు అరెస్ట్. ఇలాంటి చర్యలు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు రాజధాని గందరగోళానికి వైసీపీ ప్రభుత్వం తక్షణం తెరదించాలి. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులను భయబ్రాంతులకు గురి చేస్తూ మహిళల్ని, వృద్ధుల్ని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న తీరు ఎంతమాత్రం సమంజసం కాదు. గత రెండుమూడు రోజులుగా రాజధాని ప్రాంతంలో రైతుల విషయంలో చోటు చేసుకొంటున్న ఘటనలు ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి అవకాశాలను ఇలాంటి చర్యలు దెబ్బ తీస్తాయి. అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ఆ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని ప్రభుత్వం గ్రహించాలి. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందా? ఇలాంటి చర్యలను ప్రభుత్వం తక్షణం మానుకొని రాజధాని విషయంపై స్పష్టత ఇవ్వాలి" అని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ను సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు

చంద్ర‌బాబు తీరుపై ఏపీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బెంజ్ స‌ర్కిల్ ఘ‌ట‌న‌పై ఆమె బీబీసీతో మాట్లాడారు.

"విజయవాడ, గుంటూరులో శాంతి భద్రతల సమస్య సృష్టించాల‌ని చూస్తున్నారు. రాజ‌ధాని పేరుతో ఆయ‌న చేసిన త‌ప్పిదాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌రిచేస్తోంది. అన్ని ప్రాంతాల అభివృద్ధికి మా ప్రభుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. దానిని ఆయ‌న స‌హించ‌లేక‌పోతున్నారు. చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగానే శాంతి భద్రతల సమస్యను సృష్టించి, తన పార్టీని బతికించుకోవాలని అనుకుంటున్నారు. ఇందుకోసం శవరాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ బెంజ్‌ సర్కిల్‌ వద్ద పక్కా పథకంతో ముందుగానే తన మనుషులను పిలిపించుకుని లా అండ్‌ ఆర్డర్‌ సమస్యను ఉద్దేశ పూర్వంగా సృష్టించారు. ముందుగానే తన అనుకూల మీడియాను పిలిపించుకుని, ఒక డ్రామా నడిపారు. విజయవాడలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే విజయవాడ ప్రజలకు మేలు జరుగుతుందా? పోలీసుల సహనాన్ని ఎంత పరీక్షించినా.. వారు మౌనంగానే ఉన్నారు. ప్రశాంతంగా వారు విధులు నిర్వర్తించారు. చంద్రబాబు రెచ్చగొట్టినా ప్రజలెవ్వరూ రెచ్చపోలేదు, రెచ్చపోరు కూడా"... అని ఆమె వ్యాఖ్యానించారు.

అరెస్ట్ చేసిన జేఏసీ నేత‌లంద‌రినీ పోలీసులు ఉండ‌వ‌ల్లి త‌ర‌లించి, చంద్ర‌బాబు నివాసం వ‌ద్ద విడిచిపెట్టారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)