JNU విద్యార్థులపై హింసాత్మక దాడి వెనుక... వాట్సాప్ గ్రూప్స్ సీక్రెట్ చాటింగ్

ఫొటో సోర్స్, इमेज कॉपीरइटSM VIRAL IMAGE
- రచయిత, గుర్‌ప్రీత్ సైనీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విద్యార్థులు, అధ్యాపకులపై దాడి జరిగింది. ముసుగులు ధరించిన కొందరు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.
ఈ దాడి తర్వాత వాట్సాప్ చాటింగ్‌కు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జేఎన్‌యూలో విద్యార్థులపై దాడికి ముందే కొందరు వ్యక్తులు పథకం రచించారని, ఒక వాట్సాప్ గ్రూపు ద్వారా ఆ దాడికి ప్రణాళిక రూపొందించారని చెబుతూ ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు.
ఆ ఆ వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ షాట్లలో జేఎన్‌యూలోకి ఎలా ప్రవేశించాలి? క్యాంపస్ లోపల ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి? లాంటి చాలా విషయాలను చర్చించుకున్నట్లు కనిపిస్తోంది.
వాటిలో కొన్ని మెసేజ్‌లు ఇలా ఉన్నాయి.
"ఈ రోజు జరిగిన మ్యాచ్ ఎలా ఉంది??"
"జేఎన్‌యూలో మేం చాలా ఎంజాయ్ చేశాం, ఆ దేశ ద్రోహులను కొడుతుంటే మజాగా అనిపించింది."
"ఇప్పటి వరకు బాగా చేశాం. గేటు దగ్గర ఏదైనా చేయాలి. ఏం చేయాలో చెప్పండి."
"ఏం చేద్దాం."
"జేఎన్‌యూ విద్యార్థులకు మద్దతుగా జనాలు మెయిన్ గేట్ దగ్గరికి వస్తున్నారు. అక్కడేమైనా చేయాలా?"
"చేయొచ్చు."
"పోలీసులు రాలేదే."
"ఈ గ్రూపులో ఓ లెఫ్టిస్టు చేరాడు సోదరా."
"లేదు. వీసీ ఎంట్రీ ఇవ్వనన్నారు, మన వీసీ కదా"
వాట్సాప్ చాట్‌లో ఇలాంటి చాలా సంభాషణలు జరిగినట్లు ఆ స్క్రీన్ షాట్లలో చూడొచ్చు.

ఫొటో సోర్స్, SM VIRAL IMAGE
అటు ఏబీవీపీ తరఫున కూడా వాట్సాప్ చాట్‌కు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ షేర్ అవుతోంది.

ఫొటో సోర్స్, Sm VIRAL
ఇందులో కొంతమంది హింస గురించి మాట్లాడడం కనిపిస్తోంది. వీళ్లు ఒకర్నొకరు కామ్రేడ్ అని సంభోదిస్తున్నారు. దానితోపాటూ వామపక్ష సంస్థల పేర్లు చెబుతున్నారు.
అయితే ఈ చాట్‌లో ఎలాంటి నంబరూ కనిపించడం లేదు. మెసేజ్ పెట్టిన వారి పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే బీబీసీ వారిని సంప్రదించలేకపోయింది.

ఫొటో సోర్స్, SM VIRAL IMAGE
కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్లలో నంబర్లు కూడా కనిపిస్తున్నాయి.
ట్రూకాలర్ యాప్ ద్వారా స్క్రీన్ షాట్లలో కనిపిస్తున్న ఫోన్ నంబర్లను బీబీసీ చెక్ చేసింది. ఆ నంబర్లు స్క్రీన్ షాట్లలో కనిపిస్తున్న అదే పేర్లతో రిజిస్టరై ఉన్నాయి
ఏడుగురు వ్యక్తుల పేర్లను పరిశీలించగా అవన్నీ నిజమేనని తేలింది. పేరు ముందు స్క్రీన్ షాట్‌లో ఏబీవీపీ అని ఉన్న ఒక వ్యక్తి మాత్రం INC అని వెల్లడైంది.
అలా చేయడం సాధ్యమే. ఎవరైనా మీ నంబర్ పేరు మార్చి సేవ్ చేసుకున్నప్పుడు ట్రూకాలర్‌లో పేరు మారిపోయే అవకాశం ఉంటుంది.
బీబీసీ ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్లలో కనిపిస్తున్న మొబైల్ నంబర్లకు ఫోన్ చేసింది. వీరు ఎవరు, జేఎన్‌యూలో దాడి ఘటనతో వారికి సంబంధం ఏమిటి? అని తెలుసుకునేందుకు ప్రయత్నించింది.
చాటింగ్‌లో రెండు రకాల నంబర్లు
ఈ చాట్స్‌లో రెండు రకాల నంబర్లు ఉన్నాయి. ఒకటి మేసేజిలు పంపుతున్న గ్రూప్. అందులో మెసేజిలు చదువుతుంటే అది యాక్టివ్‌గా ఉన్నట్టు, పథకం రచిస్తున్నట్లు అనిపిస్తోంది.
రెండో రకం నంబర్లలో వాటి ముందు వారు ఇన్వైట్ లింక్ ద్వారా గ్రూపులో చేరినట్లు కనిపిస్తోంది.
ఒక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఒక లింకును షేర్ చేసి ఎవరినైనా తన గ్రూపులో చేరేందుకు ఆహ్వానించవచ్చు. లింక్ ద్వారా వచ్చేవారికి పర్మిషన్ అవసరం ఉండదు.

ఫొటో సోర్స్, WHATSAPP FAQ
ఆ స్క్రీన్ షాట్లలో కనిపిస్తున్న రెండు రకాల ఫోన్ నంబర్లకు మేం ఒక్కొక్కటిగా ప్రయత్నించాం. మొదటి రకం నంబర్లు, అంటే ఎవరైతే గ్రూప్‌లో మెసేజులు పంపుతున్నారో వాటిలో చాలా నంబర్లు పనిచేయడం లేదు.
వారిలో ఒక్క వ్యక్తితో మాత్రమే మేము మాట్లాడగలిగాం. ఆ నంబర్ హర్షిత్ శర్మ అనే వ్యక్తిది అని తెలిసింది. తాను జేఎన్‌యూ విద్యార్థినని ఆయన చెప్పారు. దాడి జరిగినప్పుడు తాను క్యాంపస్‌లో లేనని ఆయన అన్నారు.
"క్యాంపస్ వాట్సాప్ గ్రూపులో ఈ దాడి గురించి చర్చ ప్రారంభిమైంది. ఆర్ఎస్‌ఎస్- ఏబీవీపీకి సంబంధించిన ఒక గ్రూపు ఉంది అంటూ మా గ్రూపులో ఒక మెసేజ్ వచ్చింది. దానితో పాటు ఆ గ్రూపులో చేరేందుకు ఇన్‌వైట్ లింకును కూడా షేర్ చేశారు. అక్కడ వాళ్లు ఏదో ప్లాన్ చేస్తున్నారని అన్నారు. అప్పటికే అందులో 50- 60 మంది ఉన్నారు. అప్పుడు వాళ్లు హాస్టల్‌లోకి చొరబడి దాడి చేస్తున్నారు. వాళ్లు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకుకుందామని మా జేఎన్‌యూ విద్యార్థుల్లో చాలామంది ఆ లింక్‌ను క్లిక్ చేసి ఆ గ్రూపులో చేరారు" అని ఆయన వివరించారు.
"యూనిటీ అగైనెస్ట్ లెఫ్టిస్ట్ పేరుతో ఆ వాట్సాప్ గ్రూపు ఉండడం మేం చూశాం. అప్పుడు రాత్రి తొమ్మిదిన్నర అవుతోంది. వాళ్లు ఒకరికొకరు మెసేజ్ చేసుకుంటున్నారు. అప్పుడే, అకస్మాత్తుగా నాలాగే 100 నుంచి 150 మంది తెలీనివారు అందులో చేరారు. అప్పుడే ఈ గ్రూప్‌లోకి చాలా మంది వామపక్షవాదులు వచ్చారంటూ ఒకరు అన్నారు. ఆ తర్వాత, గ్రూపులో మెసేజ్‌లు పెట్టడం ఆపేశారు" అని ఆయన చెప్పుకొచ్చారు.
గ్రూపులో ఉన్నవారు ఆ సమయంలో మాటిమాటికీ గ్రూపు పేరు మారుస్తూ వచ్చారని చెప్పారు. ఒకసారి "యూనిటీ అగైనెస్ట్ లెఫ్ట్", "ఏబీవీపీ ముర్దాబాద్", "ఏబీవీపీ జిందాబాద్", "లెఫ్టిస్ట్ దూకి చావండి" అని మార్చారని అన్నారు.
హర్షత్ కూడా ఆ గ్రూపులో ఒక మెసేజ్ చేసి, తర్వాత డిలీట్ చేసినట్లు ఉంది. ఆ విషయం గురించి ఆయన్ను మేము ఏం మెసేజ్ పెట్టారు అని అడినప్పుడు. ఆయన "క్యాంపస్ గేటు దగ్గరికి చాలామంది జనాలు వస్తున్నారంటూ గ్రూపులో అప్పుడు చర్చ జరుగుతోంది. ఆ సమయంలో మా స్నేహితులు చాలామంది ఆ గేటు దగ్గర ఉన్నారు. దాంతో, నేను ఆ గ్రూపులో జరుగుతున్న సంభాషణను స్క్రీన్ షాట్ తీసి వాళ్లకు పంపించాను. తర్వాత పొరపాటున దాన్ని అదే గ్రూపులో పోస్ట్ చేశాను. నేను డిలీట్ చేసింది ఆ స్క్రీన్ షాటే" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్వైట్ లింక్ ద్వారా ఈ వివాదాస్పద గ్రూపులో చేరిన మిగతావారు కూడా తమకు ఇన్వైట్ లింక్ స్క్రీన్ షాట్ ఒక వాట్సాప్ గ్రూపులో లేదా సోషల్ మీడియాలో దొరికిందని చెప్పారు.
ఆ తర్వాత ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకుందామని తాము అందులో జాయిన్ అయ్యామని చెప్పారు.
వారిలో కొందరు తాము కేరళ, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు చెందిన వాళ్లమని చెబుతున్నారు. తను దిల్లీకి ఎప్పుడూ వెళ్లలేదని, జేఎన్‌యూలో తనకు తెలిసినవారు ఎవరూ లేరని బిహార్‌కు చెందిన ఒక వ్యక్తి చెప్పారు.
కొంతమంది పొరపాటున ఆ లింకును క్లిక్ చేసి గ్రూపులో చేరామని అన్నారు. బాధ్యతాయుతమైన దేశ పౌరులుగా "వాళ్లు ఏం చేయబోతున్నారో" తెలుసుకోడానికి ఆ గ్రూపులో చేరడం అవసరం అనిపించిందని మరికొందరు చెప్పారు.
ఈ గ్రూపులో చేరిన వారిలో జేఎన్‌యూ విద్యార్థులు చాలామంది నంబర్లు ఉన్నాయి. హర్షిత్‌లాగే, గ్రూపులో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకునేందుకు మాత్రమే అందులో చేరామని వారిలో చాలామంది అంటున్నారు.
జేఎన్‌యూలో పర్షియన్ భాష అభ్యసిస్తున్న ఒక విద్యార్థి తన గుర్తింపును బయటపెట్టొద్దనే షరతుతో మాతో మాట్లాడారు. "మా డిపార్ట్‌మెంటుకు సంబంధించిన గ్రూపులో కూడా ఇన్‌వైట్ లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేయడంతో ఆ గ్రూపులో చేరాను. కానీ, ఆ తర్వాత చాట్ చదివిన తర్వాత ఏదో గందరగోళం ఉందనిపించడంతో, వెంటనే ఆ గ్రూపు నుంచి బయటకు వచ్చేశాను" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
"ఏబీవీపీ ఏం ప్లాన్ చేస్తోందో చూడండి అంటూ నాకు ఒక లింక్ వచ్చింది, అది చూడ్డానికి నేను లింక్ క్లిక్ చేశాను" అని మరో జేఎన్‌యూ విద్యార్థి చెప్పాడు. ఈ విద్యార్థి విధ్వంసం జరిగిన సబర్మతి హాస్టల్లోనే ఉంటారు.
విశ్వవిద్యాలయంతో సంబంధం లేని విద్యార్థులు కాని బయటి వ్యక్తులు కూడా ఈ గ్రూపులో ఉన్నారు.
ఒక మహిళ బీబీసీతో తను చాలా ప్రొటెస్ట్ గ్రూపుల్లో ఉన్నానని, అక్కడ నుంచే తనకు ఈ ఇన్వైట్ లింక్ వచ్చిందని చెప్పారు. వాళ్ల ప్లానింగ్ తెలుసుకోడానికి తాను అందులో చేరానని చెప్పారు.
భవదీప్ అనే ఒక వ్యక్తి తాను జర్నలిస్టునని, తాను కూడా ఆ గ్రూపులో ఏం సంభాషణ జరుగుతోందో చూసేందుకు లింక్‌ను క్లిక్ చేశానని తెలిపారు. ఇప్పుడు కూడా ఆ గ్రూపులో దాదాపు 250 మంది ఉన్నారని ఆయన చెప్పారు.
తనను వేరే వ్యక్తి ఆ గ్రూపులో యాడ్ చేశారని, తాను జేఎన్‌యూ విద్యార్థిని కాదని, ఎలాంటి రాజకీయ భావజాలం కూడా లేదని ఆదిత్య అనే మరో వ్యక్తి తెలిపారు. అయితే, దాడిలో పాల్గొన్న వారిలో చాలామంది తనకు తెలుసని ఆయన చెప్పారు. ఆ ఘటనలో మితవాద భావజాలం ఉన్న కొందరు ప్రొఫెసర్ల ప్రమేయం కూడా ఉందని అన్నారు.

ఫొటో సోర్స్, SM VIRAL IMAGE
ఆశిష్ కూడా అలాగే చెప్పారు. ఆయన జేఎన్‌యూలో పీహెచ్‌డీ విద్యార్థి. ఆయన ఈ వివాదాస్పద గ్రూప్‌కు అడ్మిన్ కూడా. చాలామంది అడ్మిన్‌లలో ఆయన కూడా ఒకరు. అయితే, ఆయన మాత్రం తనను వేరేవారు ఆ గ్రూపులో చేర్చారని, అడ్మిన్‌ని కూడా చేశారని, అప్పుడు తాను క్యాంపస్‌లో కూడా లేనని వివరించారు.
"ఆ ఘటన జరిగిన రోజు రాత్రి నేను మా ఊరి నుంచి బయల్దేరాను. రాత్రి 10 గంటలకు జేఎన్‌యూ క్యాంపస్‌కు చేరుకున్నాను. 5 గంటల సేపు బయటే నిలుచున్నాను. ఈ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు" అని ఆశిష్ చెప్పారు.
వీళ్లంతా తమకు ఆ ఘటన గురించి రాత్రి నుంచీ వరసగా చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని చెబుతున్నారు. వారిలో చాలామంది ఎక్కడున్నారో చెప్పాలని, తమ లొకేషన్ అడుగుతూ బెదిరించారని, దాంతో తాము భయపడిపోయామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- JNUSU అధ్యక్షురాలు ఐషీ ఘోష్: ‘ఆర్ఎస్‌ఎస్, ఏబీవీపీ గూండాలే దాడి చేశారు.. నాలుగైదు రోజుల్నుంచీ హింసను ప్రోత్సహించారు’
- గర్ల్స్డుపోర్న్: పోర్న్ వీడియోలు తీసి 22 మంది అమ్మాయిల్ని మోసం చేసినందుకు రూ. 919 కోట్లు జరిమానా
- చదివింది కెమికల్ ఇంజినీరింగ్.. చేస్తున్నది బూట్లు తుడిచే పని
- సులేమానీ కుమార్తె: నా తండ్రిని చంపిన అమెరికాకు 'చీకటి రోజు' తప్పదు
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!
- JNUSU అధ్యక్షురాలు ఐషీ ఘోష్: ‘ఆర్ఎస్‌ఎస్, ఏబీవీపీ గూండాలే దాడి చేశారు.. నాలుగైదు రోజుల్నుంచీ హింసను ప్రోత్సహించారు’
- ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు: మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








