చదివింది కెమికల్ ఇంజినీరింగ్.. చేస్తున్నది బూట్లు తుడిచే పని - 27 ఏళ్ల ఇథియోపియా విద్యార్థి కథ

చెకోలె మెంబెరు... ఈ 27 ఏళ్ల ఇథియోపియా విద్యార్థి రెండేళ్ల కిందట కెమికల్ ఇంజినీరింగ్ డిగ్రీ అందుకున్నారు. ఆ సమయంలో ఆయన తన భవిష్యత్‌కు ఇక ఢోకా ఉండదనుకున్నారు.
ఎన్నో కష్టాలను దాటుకుని అంతవరకు వచ్చిన చెకోలె డిగ్రీ పట్టా అందుకుంటున్నప్పుడు ఆ క్షణాలను ఎంతో ఆస్వాదించారు. కానీ, పట్టా అందుకుని రెండేళ్ల దాటినా పొట్ట పోషించుకోవడానికి అదెందుకూ పనికిరాలేదంటున్నారాయన.
నిరుపేద కావడంతో చెకోలె చిన్ననాటి నుంచి ఏదైనా పని దొరుకుతుందేమోనని వీధుల్లో ఎదురుచూసేవాడు. ఎన్నో ఏళ్లు ఆయన ఇతరుల బూట్లు శుభ్రం చేసి ఆ వచ్చే కొద్దిపాటి డబ్బుతో బతికారు.
చెకోలె చిన్నవయసులో ఉన్నప్పుడే ఆయన తండ్రి చనిపోయారు. తల్లి వేరే పెళ్లి చేసుకోవడంతో చెకోలె అమ్హారా ప్రాంతంలోని ఫోజెరాలో తన తాతగారింట్లో ఉంటూ పెరిగారు.
చిన్నప్పటి నుంచి చదువుపై ఇష్టం ఉండడంతో స్కూలుకు వెళ్లాలనుకున్నప్పటికీ తాత ఆర్థిక పరిస్థితి అనుకూలించక బడికి పంపించలేకపోయారు.
దాంతో చెకోలె తన అంకుల్ ఇంటికి వెళ్లి అక్కడ గొర్రెల కాపరిగా పనిచేయడం ప్రారంభించారు. ఎప్పటికైనా తన తాత ఆ పని నుంచి తప్పించి తనను స్కూలుకు పంపిస్తారని ఆశగా ఎదురుచూసేవారు.
''నన్ను స్కూలుకి పంపించమని నిత్యం తాతను అడిగేవాడిని'' అని బీబీసీతో చెకోలె చెప్పారు.
ఆ తరువాత కొన్నాళ్లకు వొరెటా అనే ఒక పట్టణంలోని ఎలిమెంటరీ స్కూలులో చెకోలెను ఆయన తాత చేర్చారు. కానీ, రెండో తరగతి తరువాత తాత నుంచి సహాయం ఆగిపోయింది.
దాంతో బూట్లు పాలిష్ చేసే కుటుంబానికి చెందిన ఓ స్నేహితుడి సహాయంతో చెకోలె కూడా ఆ పని ప్రారంభించారు. స్కూలు అయిపోయిన తరువాత వీధుల్లో తిరుగుతూ ఇతరుల బూట్లు తుడవడం, పాలిష్ చేయడం వంటి పనులు చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో చదువుకున్నారు.
అలా మూడో తరగతిలో మొదలుపెట్టిన ఆ పనిని యూనివర్సిటీలో చేరేవరకు కొనసాగించారు చెకోలె.

''రోజులో సగం సమయం బూట్లు తుడుస్తూ డబ్బు సంపాదించేవాడిని, మిగతా సమయం చదువుకునేవాడిని'' అని చెప్పారాయన.
''జీవితం చాలా కష్టంగా గడిచింది. కానీ, నాలాంటి నేపథ్యం ఉండి డాక్టర్లు, ఇంజినీర్లు అయినవారి జీవిత కథలు విని స్ఫూర్తి పొందాను'' అన్నారాయన.
నిరాశ కమ్మేసింది
కొత్త విద్యాసంవత్సరం మొదలవుతుందంటే చాలు చెకోలె భయపడేవారు. కారణం.. యూనిఫాం, పుస్తకాలు వంటివన్నీ కొనాల్సి రావడమే. అందుకు ఆయన వద్ద డబ్బుండేది కాదు.
ఎన్నో కష్టాలకు ఎదురీది చదువు కొనసాగించిన ఆయన 2013లో అమ్హారాలోని బహిర్ దార్‌లోని యూనివర్సిటీలో చేరారు. అక్కడ కెమికల్ ఇంజినీరింగ్ అభ్యసించారు.
''దేశంలోని పరిశ్రమలకు పెద్ద సంఖ్యలో ఇంజినీర్ల అవసరం ఉందని అప్పట్లో ప్రచారం జరిగితే దాన్ని నమ్మి నేనూ ఇంజినీరింగ్ చదివాను. ఇంజినీరింగ్ పూర్తికాగానే మంచి ఉద్యోగం దొరుకుతుందనుకున్నాను'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యూనివర్సిటీకి వచ్చేవరకు ఎన్నో కష్టాలు పడిన ఆయనకు యూనివర్సిటీ విద్య సమయంలో మాత్రం అంతగా కష్టాలు ఎదురవలేదు.
చెకోలెకు నా అన్నవారెవరూ లేరని ఆయన సొంతూరి అధికారులు ధ్రువపత్రం ఇవ్వడంతో యూనివర్సిటీ నెలకు 200 బిర్‌లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 450) ఇచ్చేది. దాంతోపాటు తన స్నేహితులు, సహాధ్యాయులు, హాస్టల్‌లో తనతో పాటు ఉండేవారు అంతా సహాయం చేసేవారని ఆయన చెప్పారు.
కాళ్లరిగేలా తిరిగినా
అలా 2017లో కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఎస్సీ పూర్తిచేసిన ఆయన ఉద్యోగ వేటలో పడ్డారు. కానీ, ఇంతవరకు ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.
''ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాలో మూడు నెలల పాటు ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నించాను. ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు తిరుగుతూ ఉద్యోగం దొరుకుతుందేమోనని అడిగాను. కానీ, ఎవరూ ఉద్యోగమివ్వలేదు'' అన్నారాయన.
'ఎలాంటి డిగ్రీలు అవసరం లేని ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా కూడా అక్కడా చుక్కెదురే అయింది.. ఎక్కువ అర్హతలుంటే ప్రమోషన్ అడుగుతారని కావొచ్చు అలాంటి ఉద్యోగాలకు నన్ను తీసుకోలేదు' అని చెప్పారాయన.
కొన్నాళ్లు ఒక ఫ్యాక్టరీలో రోజుకు 29 బిర్‌ల వేతనంపై పనిచేసినా అది ఎటూ చాలక ఆ ఉద్యోగం మానేశారాయన.
ఇథియోపియా ఇటీవల కాలంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ 2018లో అక్కడి 15 నుంచి 29 ఏళ్ల పట్టణ యువతతో నాలుగో వంతు మంది నిరుద్యోగులుగానే ఉన్నారని ఆ దేశ సెంట్రల్ స్టాటిస్టికల్ ఏజెన్సీ తెలిపింది. 2016 కంటే అది 22 శాతం ఎక్కువ.

ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో చెకోలె తిరిగి బహిర్ దార్ వచ్చేసి మళ్లీ బూట్లు శుభ్రం చేసే పని చేసుకుంటున్నారు.
చదువుకోసం ఎన్నో కష్టాలు పడ్డానని, త్యాగాలు చేశానని..కానీ, ఆ చదువు తనకేమీ ఇవ్వలేదని ఆయనంటున్నారు.
ఇథియోపియా ప్రభుత్వం రాజకీయాలు, భద్రతపై చూపించే శ్రద్ధ ఉద్యోగాల కల్పనపై చూపించడం లేదని ఆయన ఆరోపించారు.
''నేనిలా మళ్లీ బూట్లు శుభ్రం చేసే పని చేస్తుండడం చూసి నేను చదువుకున్న యూనివర్సిటీ ప్రొఫెసర్లు షాకయ్యారు. కానీ, మరికొందరు మాత్రం నన్ను ప్రోత్సహించి ఆర్థిక సహాయం చేశారు.
క్యాంపస్‌లోని స్నేహితులు కొందరు వాళ్ల బూట్లు బాగున్నా కూడా నా దగ్గరకు వచ్చి శుభ్రం చేయించుకుంటారు. నాకు పనివ్వడం ద్వారా ఎంతోకొంత సహాయపడడం కోసమే వారలా చేస్తార''ని చెప్పారు.
ఇప్పటికీ తాను ఇంకా ఉద్యోగాలు వెతుకుతున్నానని.. ఉద్యోగం దొరుకుతుందన్న ఆశతో ఉన్నానని చెకోలె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- డబ్బు ప్రమేయం లేకుండా వేల మందికి కొత్త మూత్రపిండాలు దక్కేలా చేసిన ఆర్థికవేత్త
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: చనిపోయే దాకా దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి?
- శ్రీజ డెయిరీ: ‘పూర్తిగా మహిళలతో నడుస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుల సంస్థ’
- దిశ చట్టం అమలు కోసం ఏపీ ప్రభుత్వం నియమించిన ఈ అధికారులు ఎవరు?
- రాళ్లలో దొరికే సిలికాన్.. మన జీవితాలను ఎలా మార్చేసింది
- JNU క్యాంపస్‌లో ఆదివారం రాత్రి ఏం జరిగింది? విద్యార్థులు, అధ్యాపకులు ఏం చెప్పారు?
- టెక్నాలజీ 2010-19: ఈ పదేళ్లలో ప్రజల జీవితాలు ఎలా మారిపోయాయంటే..
- 'మరణం తర్వాత మెదడులో మళ్లీ చలనం.. మనసును చదివే చిప్స్': వైద్య రంగంలో అద్భుత విజయాలు
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- పాకిస్తాన్లో ప్రతి హత్యా నేరానికీ ఓ రేటు
- ఇరాన్ అణుబాంబును ఎంత కాలంలో తయారు చేయగలదు...
- సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో జరిగేది ఇదే.. వాంతులు ఎందుకొస్తాయి? హ్యాంగోవర్ దిగేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








