JNUSU అధ్యక్షురాలు ఐషీ ఘోష్: ‘ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ గూండాలే దాడి చేశారు.. నాలుగైదు రోజుల్నుంచీ హింసను ప్రోత్సహించారు’

ఫొటో సోర్స్, ANI
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విద్యార్థులు, అధ్యాపకులపై దాడి జరిగింది. ముసుగులు ధరించిన కొందరు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో పాల్పడిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీ ఘోష్ సోమవారం సాయంత్రం మాట్లాడుతూ.. ‘‘ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ గూండాలే దాడి చేశారు. నాలుగైదు రోజుల్నుంచీ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ ప్రొఫెసర్లు క్యాంపస్‌లో హింసను ప్రోత్సహించారు’’ అని ఆరోపించారు.
విద్యార్థులపై వాడిన ప్రతి ఐరన్ రాడ్డుకూ చర్చతో సమాధానం ఇస్తామని అన్నారు. జేఎన్‌యూ తన ప్రజాస్వామిక సంస్కృతిని నిలబెట్టుకుంటుందని తెలిపారు.
ఆదివారం సాయంత్రం దాదాపు 200 మంది విద్యార్థులు, 50 మంది అధ్యాపకులు క్యాంపస్‌లో ఒక సమావేశం నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగిందని ప్రొఫెసర్ అతుల్ సూద్ తెలిపారు.
కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో విద్యార్థులను, అధ్యాపకుల్ని ఆ ముసుగు దుండగులు కొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
‘‘అవి చిన్నచిన్న రాళ్లు కాదు. కొడితే తలలు పగిలిపోయేంత పెద్ద రాళ్లు. నాపై దాడి జరగ్గానే నేను పడిపోయాను. లేచి చూసే సరికి అక్కడున్న కార్లను ధ్వంసం చేశారు. నా కారును కూడా ధ్వంసం చేశారు’’ అని ప్రొఫెసర్ అతుల్ సూద్ ఎన్డీటీవీతో చెప్పారు.
‘‘సాయంత్రం నాలుగు గంటలకు జేఎన్‌యూ టీచర్ అసోషియేషన్ శాంతి ర్యాలీకి ప్రణాళికలు సిద్ధంచేసింది. ఇందుకోసం మేం వేర్వేరు హాస్టళ్ల నుంచి వెళ్తున్నప్పుడు వాళ్లను చూశాం. వారి చేతుల్లో రాళ్లున్నాయి. కర్రలు, రాడ్లు కూడా ఉన్నాయి'' అని రాహుల్ పాండ్యా అనే విద్యార్థి బీబీసీతో అన్నారు.
''మేం రూముల్లో ఉన్నాం.. వాళ్లు రూం తలుపులు బాదారు, చెప్పాలంటే పగలగొట్టారు, వాళ్లు ముసుగులేసుకున్నారు, తలుపులు తెరవండి లేకపోతే బద్దలు కొట్టేస్తాం అన్నారు. తలుపులు తియ్యగానే దాడి చేశారు. మేం పడిపోయాం. ఎంతలా దాడి చేశారంటే, కర్రలు, రాడ్లతో కొట్టారు. మైనారిటీలే లక్ష్యంగా దాడి చేశారు. రూం 156లో జమ్మూకశ్మీర్ విద్యార్థులుంటారు. బాల్కనీ నుంచి వారి గదుల్లోకి వెళ్లి అగ్నిమాపక పరికరాలతో దాడి చేశారు'' అని ప్రియాంక భారతి అనే విద్యార్థిని తెలిపారు.
''మేం ప్రొఫెసర్లకు కాల్ చేశాం. వారే మమ్మల్ని కాపాడారు. మేం వాళ్లింట్లో దాక్కున్నాం. చాలా భయపడ్డాం. మాకు ఏదైనా జరుగుతుందేమో అని భయపడ్డాం'' అని మరో విద్యార్థి రాహుల్ పాండ్యా వివరించారు.
దాడికి నిరసనగా జేఎన్‌యూ గేటు బయట విద్యార్థులు నిరసనకు దిగారు.
అదే గేటు బయట ఏబీవీపీ అనుకూల వర్గాలు కూడా ప్రదర్శనలు నిర్వహించాయి.
అర్థరాత్రి పన్నెండున్నర దాటిన తర్వాత జేఎన్‌యూ క్యాంపస్‌లో ఒక మార్చ్ నిర్వహించారు.
''హాస్టల్‌లోకి దూరి, తలుపులు బద్దలు కొట్టి, రూంలోకి వెళ్లి దాడి చేశారు. అమ్మాయిల హాస్టళ్లలోకి దూరి దాడి చేశారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. దాడి 7 గంటలకు జరిగితే, దిల్లీ పోలీసులు 9 గంటల వరకూ క్యాంపస్‌కి రాలేదు. వైస్ ఛాన్సలర్ ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. దీనిపై ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు'' అని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాకేత్ మూన్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
అనంతరం పోలీసులు జేఎన్‌యూ క్యాంపస్‌లో కవాతు నిర్వహించారు. సోమవారం నాటికి క్యాంపస్ గేట్ల వద్ద 700 మంది పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారని దిల్లీ పోలీసులు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
''ఎంతమందిని భయపెడతారు. ఎప్పటి వరకూ భయపెడతారు. అందుకే మేం ఇక్కడ నిలబడ్డాం.. రండి ఎంత మంది దాడి చేస్తారో చెయ్యండి'' అంటూ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం సాయంత్రానికి కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- JNU: క్యాంపస్ హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు
- దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020: ఎన్నికల సంఘ కొత్త కాన్సెప్ట్.. పోలింగ్ కేంద్రానికి రాలేనివారికి పోస్టల్ బ్యాలెట్
- పాకిస్తాన్లో ప్రతి హత్యా నేరానికీ ఓ రేటు
- సులేమానీ కుమార్తె: నా తండ్రిని చంపిన అమెరికాకు 'చీకటి రోజు' తప్పదు
- ఇరాన్ అణుబాంబును ఎంత కాలంలో తయారు చేయగలదు...
- CAAకు మద్దతు కోసం బీజేపీ మిస్డ్ కాల్ ప్రచారం... అదే నంబర్‌తో నకిలీ అకౌంట్లు
- రెండో ప్రపంచ యుద్ధం నాటి ఓ అస్థిపంజరం చెప్పిన కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









