రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆ జపనీస్-అమెరికన్ కళాకారుడి అస్థిపంజరాన్ని ఎలా గుర్తించారు...

ఫొటో సోర్స్, Inyo County Sheriff's Office
అమెరికాలోని కాలిఫోర్నియాలో అక్టోబరులో కనిపించిన ఒక అస్థిపంజరం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నిర్బంధ కేంద్రంలో ఉంచిన జపనీస్-అమెరికన్ కళాకారుడిదని గుర్తించారు.
ఆయన పేరు గీచి మత్సుమురా. ఆయన 1945 ఆగస్టులో చనిపోయారు.
నాటి యుద్ధ కాలంలో జపనీస్ మూలాలున్న ప్రజలను నిర్బంధించేందుకు కాలిఫోర్నియాలోని మాంజనర్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
నాడు నిర్బంధ కేంద్రంలోని మరికొందరు బందీలతో కలిసి మత్సుమురా పర్వత ప్రాంతంలో సుదూర నడకకు వెళ్లారు. బొమ్మలు వేయడం ఆయన అభిరుచి.
బొమ్మలు వేసేందుకు మత్సుమురా ఈ బృందం నుంచి వేరుపడ్డారు. ఇంతలో ఆకస్మికంగా వచ్చిన ఒక అసాధారణ తుపాను వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు.
కాలక్రమంలో మత్సుమురా వివరాలు అందుబాటులో లేకుండా పోయాయి. 2019లో మళ్లీ ఆయన వివరాలు వెలుగు చూశాయి.

ఫొటో సోర్స్, Getty Images
టైలర్ హోఫర్, బ్రాండన్ ఫోలిన్ కాలిఫోర్నియాలోని మౌంట్ విలియమ్సన్ సమీప ప్రాంతంలో సంచరిస్తుండగా, దెబ్బతినని ఒక అస్థిపంజరం కనిపించింది. కొంత భాగంపై రాళ్లు ఉన్నాయి.
అస్థిపంజరంలో నడుము చుట్టూ బెల్టు, కాళ్లకు లెదర్ షూస్ ఉన్నాయని, చేతులు కట్టుకొన్న భంగిమ కనిపించిందని వార్తాసంస్థ 'అసోసియేటెడ్ ప్రెస్' తెలిపింది.
దశాబ్దాల కిందట ఆచూకీ తెలియకుండా పోయిన వ్యక్తుల రికార్డులను ఇన్యో కౌంటీ పోలీసులు పరిశీలించారు. అస్థిపంజరంలో కనిపించిన ఆనవాళ్లతో ఎవరి వివరాలూ సరిపోలలేదు.
మాంజనర్ నిర్బంధ కేంద్రంపై 2012లో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అప్పుడు మత్సుమురా మరణం చర్చలోకి వచ్చింది. ఆయన మరణానికి సంబంధించిన భాగం తుది డాక్యుమెంటరీలో లేదు. అయితే దర్శకుడు కోరీ షియోజాకి మత్సుమురా మరణం గురించి డాక్యుమెంటరీ ప్రదర్శన సందర్భంగా మాట్లాడారు.
మత్సుమురా మనవరాలు లోరి ఇచ్చిన నమూనా సాయంతో ఈ అస్థిపంజరానికి అధికారులు డీఎన్‌ఏ పరీక్షలు జరిపించారు.
పర్వతాల్లో ఎక్కడో ఒక చోట తన తాత అస్థిపంజరం ఉందని తనకు తెలుసని, ఆయన మృతదేహంపై ఉంచిన రాళ్ల ఫొటోను అవ్వ తనకు చూపించేదని లోరి అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు.
ఆయన్ను 'ది ఘోస్ట్ ఆఫ్ మాంజనర్'గా వ్యవహరించేవారని తమ సమీప బంధువు కాజువే చెప్పారని ఆమె వెల్లడించారు.

ఫొటో సోర్స్, Inyo County Sheriff's Office
జపాన్ సంతతి ప్రజలను నిర్బంధించేందుకు అమెరికా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పది నిర్బంధ కేంద్రాల్లో మాంజనర్ కేంద్రం ఒకటి.
చేపలు పట్టడానికో లేదా ఇతర అభిరుచుల వల్లో నిర్బంధ కేంద్రంలోని బందీలు ఎక్కువగా బయటకు వచ్చేవారని రికార్డులు చెబుతున్నాయి. మత్సుమురా ఈ కేంద్రం నుంచి బయటకు వచ్చే సమయానికి బందీలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు తొలగించింది.
నిర్బంధ కేంద్రం నుంచి సమీపంలోని సియెర్రా నెవడాలో ఎత్తైన పర్వత ప్రాంతాల్లోని సరస్సుల్లో చేపలవేటకు బయల్దేరిన బృందంలో మత్సుమురా భాగమయ్యారని ఇన్యో కౌంటీ పోలీసులు ఒక ప్రకటనలో చెప్పారు. కొంత సేపటి తర్వాత ఆయన, బొమ్మ వేసేందుకు ఈ బృందం నుంచి వేరుపడ్డారని తెలిపారు.
బొమ్మలు వేయడం ఆయనకు మాంజనర్ నిర్బంధ కేంద్రంలో అలవాటు అయ్యుండొచ్చు.
హఠాత్తుగా బలమైన తుపాను విరుచుకుపడింది. తుపాను తీవ్రత తగ్గిన తర్వాత మత్సుమురా వెంట వచ్చిన ఇరత బందీలు ఆయన ఆచూకీ కోసం గాలించారు. కానీ జాడ గుర్తించలేకపోయారు.
పర్వతాల్లో తిరుగుతున్న ఒక జంటకు 1945 సెప్టెంబరు 3న మత్సుమురా భౌతికకాయం కనిపించింది.
కొన్ని రోజుల తర్వాత మాంజనర్ అధికారులు ఒక చిన్న బృందాన్నిమత్సుమురా భౌతికకాయం కనిపించిన చోటకు పంపి, దానిని అక్కడే పూడ్చిపెట్టించారు. మృతదేహం కనిపించిన పర్వత ప్రాంతం చాలా ఎత్తైనది కావడం వల్ల అక్కడి నుంచి దానిని కిందకు తీసుకురావడం కష్టమని భావించి వాళ్లు అలా చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
1945 నవంబరు 21న మాంజనర్ నిర్బంధ కేంద్రాన్ని ప్రభుత్వం శాశ్వతంగా మూసివేసింది. నాడు నిర్బంధించిన చాలా కుటుంబాల మాదిరే మత్సుమురా కుటుంబీకులకు సొంతంగా ఇల్లు కానీ వ్యాపారం కానీ లేవని, నిర్బంధ కేంద్రం మూసివేసే వరకు వాళ్లు అక్కడే కొనసాగారని పోలీసులు ప్రకటనలో తెలిపారు.
నిర్బంధ కేంద్రం మూసేశాక మత్సుమురా కుటుంబం కాలిఫోర్నియా రాష్ట్రంలోనే ఉన్న శాంటా మోనికా నగరానికి చేరుకుంది. అప్పటికి మూడేళ్ల ముందు అంటే 1942లో అమెరికా సైన్యం తమను ఇళ్ల నుంచి బలవంతంగా పంపించే వరకు ఈ కుటుంబం అక్కడే ఉండేది.
2019లో మత్సుమురా సమాధిని చూశామని హైకింగ్‌కు వెళ్లిన కొందరు చెప్తే తాము దిగ్భ్రాంతి చెందామని మాంజనర్ పోలీసు అధికారి బెర్నాడెటే జాన్సన్ చెప్పారు. మత్సుమురాను గుర్తించినందున ఆయన కుటుంబానికి కొంత మనశ్శాంతి దక్కుతుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇప్పుడు మాంజనర్ నిర్బంధ కేంద్రం నాటి బందీల మ్యూజియంగా, స్మారక కేంద్రంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ప్రపంచానికి ఎలా అందించింది?
- చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా జనరల్ రావత్: ఆయన చేయగలిగే, చేయలేని పనులు ఏమిటంటే..
- 2020 నాటికి నేనేమవుతాను? ప్రపంచం ఏమవుతుంది? అని 29 ఏళ్ల కిందట ఊహించిన బాలుడు
- ప్రెస్ రివ్యూ: ‘ఇమ్రాన్ ఖాన్.. నువ్వు భారతీయ ముస్లింల గురించి ఆందోళన చెందకు, పాకిస్తాన్ గురించి ఆలోచించుకో’
- ఇరాన్‌కు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోగల సత్తా ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








