అసదుద్దీన్‌ ఒవైసీ: ‘ఇమ్రాన్ ఖాన్.. నువ్వు భారతీయ ముస్లింల గురించి ఆందోళన చెందకు, పాకిస్తాన్ గురించి ఆలోచించుకో’ - ప్రెస్ రివ్యూ

అసదుద్దీన్

ఫొటో సోర్స్, Shashi k

బీజేపీ నేతలకు దమ్ముంటే తనను చంపాలని మజ్లిస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సవాల్‌ విసిరారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

‘‘పాకిస్థాన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అసదుద్దీన్ అన్నారు. భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తెచ్చారని విమర్శించారు. ఈ చట్టంతో దేశంలోని హిందువులు, ముస్లింలను విభజించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధమన్నారు. మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచన.. అంబేడ్కర్‌, నెహ్రూ, గాంధీ, బాబూ రాజేంద్రప్రసాద్‌లలో ఏ ఒక్కరికీ రాలేదని, ఈ గొప్ప ప్రధాని మోదీకే వచ్చిందని ఎద్దేవా చేశారు. సీఏఏను తెలంగాణలో అమలు చేయొద్దని సీఎం కేసీఆర్‌ను తాను కోరతానని ప్రకటించారు.

సీఏఏకు వ్యతిరేకంగా సంగారెడ్డిలో శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్‌ మాట్లాడారు. ముస్లింల పట్ల వివక్ష చూపే సీఏఏను కేరళలో అమలు చేయబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. సీఏఏ ద్వారా ఎలాంటి డాక్యుమెంట్లు అడగబోమని ప్రధాని, హోంమంత్రి ప్రకటించడం హస్యాస్పదంగా ఉందన్నారు.

హైదరాబాద్‌లో 30 శాతం జనాభా వద్దే జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయని, దేశంలోని 120 కోట్ల జనాభాలో కేవలం 6 శాతం మాత్రమే పాస్‌పోర్టులు కలిగి ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్యుమెంట్లు సమర్పించడం ఎలా సాధ్యపడుతుదని ప్రశ్నించారు.

సీఏఏకు వ్యతిరేకంగా జనవరి 25న రాత్రి హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించి అదేరోజు రాత్రి 12 గంటలకు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తామన్నార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: 'ఇమ్రాన్ ఖాన్.. నువ్వు భారతీయ ముస్లింల గురించి ఆందోళన చెందకు, పాకిస్తాన్ గురించి ఆలోచించుకో'

కాగా, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. భారతదేశ ముస్లింల గురించి ఆందోళన చెందడం ఆపేయాలని అసదుద్దీన్ సూచించారు. పాకిస్తాన్ జాతిపిత జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తుంటారని, బంగ్లాదేశ్ వీడియోలను చూపించి అది ఇండియా అంటుంటారని తప్పుపట్టారు.

‘మిస్టర్ ఖాన్.. నీ స్వదేశం గురించి ఆలోచించుకో. మమ్మల్ని అసలు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవద్దు.

‘‘మేం భారతీయ ముస్లింలుగా గర్విస్తున్నాం. మేం సగర్వ భారతీయ ముస్లింలుగానే ఉంటాం. మా పౌరసత్వాన్ని ఎవ్వరూ తొలగించలేరు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆ హక్కును మాకు ఇచ్చింది’’ అని అసదుద్దీన్ అన్నారు.

చికెన్

ఫొటో సోర్స్, Getty Images

‘చికెన్ కొనలేం.. గుడ్డు తినలేం’

గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు అధికంగా ఉన్నాయని 'సాక్షి' పత్రిక కథనం ప్రచురించింది.

''సాధారణంగా శీతాకాలంలో మాంసం, కోడిగుడ్లను ఎక్కువగా తింటారు. ఆ డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ధర పెరుగుతూ ఉంది. నెలన్నర రోజులుగా స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర కిలో రూ.190 నుంచి కిందికి దిగిరాలేదు. ఇప్పుడది రూ.200కి చేరింది. వారం రోజుల క్రితం బ్రాయిలర్‌ చికెన్‌ ధర కిలో రూ.214కి చేరి కంగారెత్తించింది. ఈ సీజనులో ఇదే అత్యధిక ధర. గత ఏడాది కూడా చికెన్‌ కిలో ధర రూ.200 చేరి తర్వాత దిగొచ్చింది. ఇప్పుడు మాత్రం రేటు పైపైకే తప్ప సామాన్యుడికి అందుబాటులోకి రావడం లేదు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో రోజుకు సగటున 2 లక్షల కిలోల చికెన్‌ను వినియోగిస్తారు. ఆదివారం 3 లక్షల కిలోల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయి. అయితే ఆ స్థాయిలో కోళ్ల లభ్యత లేకపోవడం వల్ల ధరలు స్వల్పంగా పెరిగాయని కోళ్ల ఫారాల రైతులు చెబుతున్నార''ని ఆ కథనంలో విశ్లేషించారు.

మరోవైపు కోడిగుడ్డు ధర మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం వంద గుడ్లకు రైతుకు చెల్లించే ధర రూ.473గా ఉండగా.. రిటైల్‌ మార్కెట్లో డజన్‌ గుడ్ల ధర రూ.66 వరకు ఉంది. రైతు బజార్‌లో విడిగా ఒక్కొక్కటి రూ.6కు అమ్ముతున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు.

అచ్చెన్నాయుడు, చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, facebook/tdp

ముఖ్యమంత్రి చెప్పిందే బీసీజీ బొంకింది: చంద్రబాబు

ఏపీ రాజధాని విషయంలో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు(బీసీజీ) ఇచ్చిన నివేదిక ఒక అసత్యాల పుట్ట అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారంటూ 'ఈనాడు' పత్రిక కథనం ప్రచురించింది.

''బీసీజీ నివేదిక అసత్యాల పుట్ట, చెత్త కాగితమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం చెప్పింది జీఎస్ రావు కమిటీ, విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి చెప్పింది బీసీజీ వాళ్లు రాసిచ్చారు. ముఖ్యమంత్రి ఏం చెబితే అది బీసీజీ బొంకింది. దానికి విశ్వసనీయత లేదు. 2009లో కృష్ణానది వరదలకు అమరావతి ప్రాంతం మునిగిపోయిందని బీసీజీ అబద్ధాలు చెప్పింది. 2014లో విశాఖను హుద్‌హుద్ అతలాకుతలం చేయలేదా? 2009లో కర్నూలును వరదలు ముంచెత్తలేదా? ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదు అని ఆయన ప్రశ్నించారు. జీఎస్ రావు కమిటీ నివిదిక, బీసీజీ నివేదికలు రెండింటినీ భోగీ మంటల్లో తగలబెట్టాలని ప్రజలకు ఆయన సూచించార''ని ఆ కథనంలో ఉంది.

కేసీఆర్

ఫొటో సోర్స్, facebook/trsparty

మంత్రులూ.. బీ కేర్‌ఫుల్: కేసీఆర్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో టీఆరెస్ జయాపజయాల బాధ్యత ఎమ్మెల్యేలు, మంత్రులదేనని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారంటూ 'నమస్తే తెలంగాణ' కథనం ప్రచురించింది.

''మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమని, ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్‌ ఎన్నికల్లో ఇంటింటికీ తిరుగుతూ వివరించాలని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యత అంతా పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యులదేనని స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో శనివారం టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికులు అధికంగా ఉన్న దగ్గర పార్టీ ఓడిపోతే అక్కడి ఎమ్మెల్యేదే వైఫల్యమని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఇంటింటికీ వెళ్లి నేరుగా కలవాలని పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు మున్సిపల్‌ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని, కేవలం ప్రచారంతోనే ఈ ఎన్నికలను గెలువలేరని.. ప్రణాళికతో ముందుకు వెళ్తేనే సులువుగా గెలువగలుగుతామని వివరించారు. ముందునుంచే ఒక అంచనా ఉండాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు సూక్ష్మంగా జరిగే ఎన్నికలని.. మేనేజ్‌మెంట్‌ ద్వారానే గెలుస్తామని చెప్పారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే తండ్రిలాంటివాడని సీఎం అన్నారు.

అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ గెలువాలని, నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపోటముల వరకు మంత్రులు, ఎమ్మెల్యేలదే బాధ్యత అని స్పష్టంచేశారు. ఈ ఎన్నికలను ప్రతి ఒక్కరు సీరియస్‌గా తీసుకోవాలని హెచ్చరించార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)