హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌: ‘ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్‌కౌంటర్ చేయడం సాధ్యమేనా?’ - జస్టిస్ సుదర్శన రెడ్డి

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన రెడ్డి
ఫొటో క్యాప్షన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన రెడ్డి

దిశ అత్యాచారం, హత్య... షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌, తదనంతర పరిణామాలు, న్యాయవ్యవస్థలో పోలీసుల జోక్యం తదితర అంశాలపై సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన రెడ్డి, బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఇవీ...

ప్రశ్న: షాద్ నగర్ ఎన్‌కౌంటర్‌పై మీ అభిప్రాయం ఏమిటి?

సమాధానం: షాద్ నగర్‌లో జరిగింది ఎన్‌కౌంటర్ అని నేనే కాదు ఈ దేశంలో ఎవరూ అనుకోవడంలేదు. వాళ్లను కాల్చి చంపారనే అనుకుంటున్నాను.

ఎన్‌కౌంటర్ అంటే రెండు వర్గాల మధ్య భీకరమైన పోరు, కాల్పులు, ఇరువైపుల మారణాయుధాలు, ఆ ఘర్షణలో ఎవరైనా చనిపోతే దాన్ని ఎన్‌కౌంటర్ అంటారు. ఈ కేసులో తెల్లవారుఝామున పిల్లలను తీసుకెళ్లి నేరపరిశోధన పేరుతో కాల్చిచంపారని అనుకుంటున్నా.

line
News image
line

ప్రశ్న: నిందితులు రాళ్లతో దాడి చేయడం వల్లే ఆత్మరక్షణ కోసం దాడి చేశామని పోలీసులు చెబుతున్నారు. దీనిపై హక్కుల కార్యకర్తలు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, పోలీసులు మాత్రం ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని చెబుతున్నారు. ఈ ప్రశ్నలు, 'ఆత్మరక్షణ' అనే భావన గురించి ఏం చెబుతారు?

సమాధానం: తప్పించుకోడానికి వారిని చంపడం తప్పితే వేరే మార్గం లేదనే సందర్భంలో ఆత్మరక్షణ అనే అంశం వస్తుంది. కానీ, ఈ కేసులో ఏదో ఒక భాగంలో కాల్పులు జరిపి వారిని నిర్వీర్యం చేసే అవకాశం ఉండి కూడా ఎందుకు చేయలేదు? ఆత్మరక్షణ అంటే ఆయుధంతో అవతలి వ్యక్తిని చంపడం కాదు. అవతలి వ్యక్తి చేసిన బలప్రయోగానికి సమానంగా బలప్రయోగం ఉండాలి. కానీ, 50 మంది పోలీసులు 20 ఏళ్లు ఉన్న నలుగురిని చంపి ఎన్‌కౌంటర్ అని ఎలా అంటారు? ఆత్మరక్షణ కొరకు జరిపిన కాల్పులు అని ఎలా అంటారు?

''మేం ఒక సందేశం పంపించాం. ఇకముందు ఎవరైనా ఇలా చేస్తే ఇలానే జరుగుతుంది''అని బాధ్యతాయుతమైన, అధికారంలో ఉన్నవారు చెబుతుంటే.. ఇంకా దాన్ని మనం ఎన్‌కౌంటర్ అని చర్చించాలా?

ఈ విషయంలో మీడియా పోషించిన పాత్ర చాలా దురదృష్టకరం. కంటికి కన్ను అనే సిద్ధాంతం వల్ల ప్రపంచం గుడ్డిదవుతుంది. ఇక మనకు సామాజిక శాష్త్రాలు, చట్టాలు, పార్లమెంట్, సహజ న్యాయ సూత్రాలు ఎందుకు?

ఒక వ్యక్తం నేరం చేశాడని పోలీసులు అనుకుంటే వారిని శిక్షించే అధికారం కూడా పోలీసులకే ఇస్తే దాని గురించి ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు.

సౌదీ అరేబియాలాంటి దేశాలు నాకు ఆదర్శం కావు. భారత దేశంలో చట్టాలు, న్యాయ ప్రక్రియ, ప్రజాస్వామ్యం సమాజాన్ని ఒక చోట కట్టిపడేసి మనల్ని సహజీవనం చేసేలా చేస్తున్నాయి. ఇవన్నీ చిధ్రమైతే సమాజ మనుగడ కష్టమవుతుంది.

అత్యాచార అభియోగం ఉంటే చాలు మనిషిని చంపేయొచ్చు అని అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నవారితో ఒక చిన్న సందేహాన్ని వెలుబుచ్చుతాను.

అత్యాచారం ప్రయత్నం లేదా అత్యాచారం చేశారనే అభియోగాలు ఉన్నవారు చట్టసభల్లో చాలా మంది ఉన్నారు. వారిని ఏం చేద్దాం? వారిని కూడా మీరనే భాషలో ఎన్‌కౌంటర్ చేయోచ్చునా... ప్రజాస్వామ్యంలో అది సాధ్యమేనా? సత్వర న్యాయం జరగాలి. చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే ముఖ్యమైంది నేర పరిశోధన చేసే పోలీస్ వ్యవస్థ ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఏజెన్సీ పర్యవేక్షణలో పనిచేయాలి. ఇలాంటి మార్పుల కోసం ప్రయత్నం చేద్దాం.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ప్రశ్న: మీరు సత్వర న్యాయం గురించి చెబుతున్నారు. కానీ, చాలా మంది తక్షణ న్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఈ భావం పెరగడానికి న్యాయవ్యవస్థ వైఫల్యం కారణమని అనొచ్చా?

సమాధానం: అదొక్కటే కారణమని నేను అనుకోను. చార్జీషీట్ వేయడానికి 90 రోజుల సమయం ఉండాలని చట్టం చెబుతోంది. తీవ్రమైన నేరాల విషయంలో కూడా ఎన్ని కేసులలో స్టేట్ (రాజ్యం) చార్జీ షీట్ ను నిర్ణీత గడువులో వేస్తుందో చెప్పండి.

న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలకు కొంతవరకు రాజ్యమే కారణం. సరైన నిధులు సమకూర్చరు. తెలంగాణలో ఉన్న జిల్లాలకు అనుగుణంగా కోర్టులున్నాయా? ఇలాంటి వ్యవస్థలో ఉండి తక్షణ న్యాయం కావాలంటే ఎలా సాధ్యం అవుతుంది?

అభియోగం చేసే వ్యక్తి, శిక్షించే వ్యక్తి కూడా పోలీసే అయితే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? రాజ్యం చట్టాన్ని తమ చేతులోకి తీసుకుంటే సామాన్యుడికి రక్షణ ఏమిటి?

ప్రశ్న: పోలీసుల చేతిలో ఎవరైనా మరణించినప్పుడు దానికి ఉన్న న్యాయపరమైన ప్రక్రియ ఏంటి, తీర్పులు ఏమిటి?

సమాధానం: ఇలాంటివి ఇంకా వాస్తవ రూపం ధరించలేదు. పురోగతి లేదు. ఒక వేళ పురోగతి సాధిస్తే ఇలాంటి ఘటనలు కొంతవరకు తగ్గించవచ్చు.

వాస్తవానికి నేరం చేసినవారే నేరపరిశోధన చేస్తున్నారు. కానీ, ఇలాంటి విషయంలో సంస్థాగతమైన ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి వాళ్లకు తగిన శిక్షన ఇచ్చి ఆ కేసులో నేర పరిశోధన చేస్తే కొంత పురోగతి ఉండొచ్చు.

న్యాయప్రక్రియ అమల్లో ఉన్న దేశంలో తక్షణ న్యాయం ఉండదు. వాస్తవానికి తక్షణ న్యాయం అంటే అన్యాయమనే చెప్పాలి.

ప్రశ్న: చాలా సందర్భాలలో జడ్జీల మీద ప్రజాభిప్రాయ ప్రభావం ఉంటుందా?

సమాధానం: ఉండకూడదు. కానీ, ప్రజాభిప్రాయానికి కొలమానం ఏముంది? ఇప్పుడు కూడా మీడియాలో జరుగుతున్న అల్లరి, అలజడి తప్పితే దేశ జనాభా అంతా ఈ విషయంలో(షాద్ నగర్ ఎన్‌కౌంటర్) ఏమనుకుంటుంది? అనేదానికి కొలమానం ఏమిటి?

చట్టం, పోలీసులు, నేరారోపణ ఎదుర్కొన్న వ్యక్తి ఏం చెబుతున్నాడు, ఎవరి వాదనలో నిజం ఉంది అనేవి న్యాయమూర్తి పరిశీలించి తీర్పునిస్తారు. కానీ, మీడియాలో పదే పదే వచ్చే వార్తలను చూసి తీర్పు ఇస్తారని నేను అనుకోవడం లేదు. నేనెప్పుడు అలా ఇవ్వలేదు. చాలా సందర్భాల్లో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కూడా తీర్పులొచ్చాయి.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అమల్లో ఉన్న దేశంలో తక్షణ న్యాయం జరగడం సాధ్యం కాదు. గాంధీని హత్య చేసిన గాడ్సే కేసులోనూ తక్షణ న్యాయం జరగలేదు.

ప్రశ్న: ఎదురు కాల్పులు లేదా కాల్పులు జరిగినప్పుడు పెట్టాల్సిన కేసులపై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన జస్టిస్ రఘురాం తీర్పు ఉంది. ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పుడు కూడా అది సరిగ్గా అమలు కానప్పుడు రాజ్యం మీద కోర్టు ఆదేశాలు ఇవ్వలేదా? దానికీ రెమిడీ లేదా?

సమాధానం: అమలు చేయమని కోర్టులు అడగవచ్చు. కానీ, చేసేవాళ్లు చేయాలి కదా? అన్ని వ్యవస్థలకు ఆ ధర్మసూత్రం పట్ల నిబద్దత ఉండాలి కదా.. లేనప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కసబ్ మారణహోమం తర్వాత ఆ కేసులో సత్వర న్యాయం జరిగింది... తక్షణ న్యాయం జరగలేదు. అబ్జల్ గురు విషయంలోనూ ఇదే జరిగింది. న్యాయప్రక్రియ తన పని తాను చేసుకుంది. అతని పట్ల అన్యాయం జరిగిందని వాదించేవారూ ఉన్నారు. కానీ, నేను దానికి ప్రాముఖ్యత ఇవ్వను ఎందుకంటే, సుప్రీం కోర్టు అతడిని దోషిగా నిర్దారించింది.

సత్వర న్యాయం జరగాలి. కానీ, తక్షణ న్యాయం కాదు. సభ్యసమాజంలో తక్షణ న్యాయం సాధ్యం కాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)