ఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్: ఫోన్ కూడా లేని ఇంటి నుంచి గూగుల్ బాస్‌గా ఎదిగిన చెన్నై కుర్రాడు

ఫొటో సోర్స్, AFP
గూగుల్ సహవ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ తమ పదవుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం ఆల్ఫాబెట్ సీఈవో, అధ్యక్షులుగా ఉన్న ఈ ఇద్దరు ఇకపై కంపెనీ బోర్డులో సభ్యులుగా మాత్రమే కొనసాగనున్నారు.
గూగుల్ సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్ ఇకపై ఆల్ఫాబెట్ సీఈవోగానూ కొనసాగుతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
గూగుల్ పునర్వవ్యవస్థీకరణలో భాగంగా 2015లో ఆల్ఫాబెట్ ను మాతృసంస్థగా ఏర్పాటు చేశారు.
గూగుల్ కార్యకలాపాలు పారదర్శకంగా, జవాబుదారిగా ఉండేందుకు వీలుగా ఆల్ఫాబెట్‌ను స్థాపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆల్ఫాబెట్ ఏర్పాటుకాగానే వీరిద్దరు గూగుల్ నుంచి ఆ సంస్థకు వెళ్లారు. కొత్త కార్యక్రమాలపై దృష్టిపెట్టేందుకే తాము గూగుల్‌ను వీడుతున్నట్లు వారప్పుడు తెలిపారు.
అయితే, ఆల్ఫాబెట్ నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం తమ బ్లాగ్‌లో ఈ ఇరువురు పేర్కొన్నారు.
''ఇకపై క్రీయాశీల బోర్డు సభ్యులుగా కొనసాగుతాం. షేర్ హోల్డర్స్‌గా, సహవ్యవస్థాపకులుగా ఉంటాం'' అని ఓ సంయుక్త లేఖలో వారు ప్రకటించారు.
''సంస్థను నడపడానికి మంచి మార్గం ఉందని భావిస్తున్నప్పుడు ఇకపై నిర్వహణ బాధ్యతలను అంటిపెట్టుకొని ఉండలేం. ఆల్ఫాబెట్, గూగుల్‌కు ఇద్దరు సీఈవోలు, ఇద్దరు అధ్యక్షులు ఉండాల్సిన అవసరం లేదు'' అని ఆ లేఖలో పేర్కొన్నారు.
సలహాలు, ప్రేమను అందిస్తూ తల్లిదండ్రుల పాత్రను స్వీకరించడానికి సమయం వచ్చిందని వారు ప్రకటించారు. పిచాయ్ కంటే గొప్పగా సంస్థను ఎవరూ నడిపించలేరని నొక్కి చెప్పారు.
పిచాయ్ ప్రస్థానం..
47 ఏళ్ల సుందర్ పిచాయ్ భారత్‌లో జన్మించారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్, పెన్సుల్వేనియా యూనివర్సిటీల్లో చదువుకున్నారు. 2004లో గూగుల్‌లో చేరారు.
ఈ మార్పుపై సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు పిచాయి ఒక ప్రకటనలో తెలిపారు.
"గూగుల్ వ్యవస్థాపకులు మనందరికీ ప్రపంచంపై ప్రభావం చూపడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు" అని పిచాయ్ చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
టెలిఫోన్ లేని కుటుంబం నుంచి..
పిచాయ్ అపాయింట్‌మెంట్‌తో అమెరికా టెక్నాలజీ సంస్థల్లోని ఉన్నత ఉద్యోగాల్లో భారతీయులకు ఎక్కువ అవకాశాలు దక్కుతాయి. ఉదాహరణకు సత్య నాదేళ్ల ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారు.
పిచాయ్ జీవిత కథ అసాధారణమైంది. గూగుల్ సీఈవోగా ఆయన ఎదుగుదల అనేది అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో భారత్ అద్భుత ప్రగతికి ఒక నిదర్శనం.
చెన్నైలో పుట్టిన సుందర్ పిచాయ్ అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. స్కూల్‌లో క్రికెట్ టీంకు కెప్టెన్‌గా వ్యవహరించి అనేక టోర్నీల్లో విజయాలు సాధించారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ లో మెటలార్జికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ''పిచాయ్ తన బ్యాచ్‌లో మెరుగైన విద్యార్థి'' అని ఆయన ట్యూటర్ ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాసంస్థకు చెప్పారు.
2004లో గూగుల్‌లో చేరిన పిచాయ్ అక్కడ తన ప్రతిభతో రాణించారు. ఆయన కనుసన్నల్లోనే గూగుల్ వెబ్ బ్రౌజర్, క్రోమ్, ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉత్పత్తులు రూపుదిద్దుకున్నాయి.
ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిచెందిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఆండ్రాయిడ్ పేరొందింది. మరోవైపు, పిచాయ్‌కు 12 ఏళ్లు వచ్చేవరకు వారి కుటుంబంలో టెలిఫోన్ కూడా లేదు.

ఫొటో సోర్స్, Reuters
సవాళ్లు
బ్లూమ్‌బర్గ్ మ్యాగజైన్ కథనం ప్రకారం, పిచాయ్ చక్కటి నడవడికతో ఎదిగారు. అతని కుటుంబం చెన్నైలో రెండు గదులున్న అపార్ట్‌మెంట్‌లో నివసించేది. వారికి టీవీ, కారు కూడా లేదు.
కానీ, పిచాయ్ తండ్రి తన బిడ్డ మెదడులో టెక్నాలజీ అనే విత్తనాలను నాటాడు. బ్రిటన్‌కు చెందిన కంగ్లోమెరేట్ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేయడం కూడా ఆయనకు కలసివచ్చిందని చెప్పాలి.
''ఇంటికి రాగానే నా పని గురించి, అందులోని సవాళ్ల గురించి సుందర్‌కు చెప్పేవాడ్ని'' అని పిచాయి తండ్రి రేగునాథ పిచాయ్ బ్లూమ్‌బర్గ్‌తో అన్నారు.
''టెలిఫోన్ నంబర్లను గుర్తుంచుకోవడంలో సుందర్ టాలెంట్ అమోఘం'' అని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ చేశాక స్కాలర్‌షిప్‌తో స్టాన్‌ఫోర్ట్‌లో చదివే అవకాశం పిచాయ్‌కు వచ్చింది. అప్పుడు అమెరికాకు వెళ్లే విమాన టికెట్ ఖర్చు ఆయన తండ్రి వార్షిక వేతనం కంటే ఎక్కువ.
పిచాయ్ మృదుభాషి, అందరినీ ఇష్టపడే వ్యక్తి అని గూగుల్ ఉద్యోగులు వర్ణిస్తారు.
''సుందర్ కొంతకాలంగా నేను చెప్పే విషయాలు (కొన్నిసార్లు మంచివి) చెప్పేవారు, మేం పనిని బాగా ఎంజాయ్ చేశాం'' అని లారీ పేజ్ తన బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు.
గూగుల్‌కు ఆదాయాన్ని చేకూర్చే ఉత్పత్తులైన ప్రకటనలు, మ్యాప్‌లు, యూట్యూబ్, సెర్చ్‌ల విషయంలో పిచాయ్ పాత్ర కీలకం.
అయితే, ఇప్పుడు ఆయనకు సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా వీడియోల విషయంలో యూట్యూబ్‌కు ఫేస్‌బుక్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. కానీ, ప్రస్తుతానికైతే ఈ పోటీలో యూట్యూబే ముందుంది.

ఫొటో సోర్స్, Getty Images

అంతిమ అధికారం ఇంకా వారి చేతుల్లోనే..
బీబీసీ నార్త్ అమెరికా టెక్నాలజీ రిపోర్టర్ డేవ్ లీ విశ్లేషణ
గూగుల్ ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ఈ చర్య చాలా ముఖ్యమైన నాయకత్వ మార్పుగా భావించాలి. సిలికాన్ వ్యాలీలో భాగస్వామ్యమైన సెర్గీ బ్రిన్, లారీ పేజ్ జంట మొదటిసారి వారు స్థాపించిన సంస్థలో ముఖ్యమైన నిర్వహణ బాధ్యతల నుంచి దూరమవుతున్నారు.
ఇప్పుడు కంపెనీ ముఖ్య ప్రతినిధిగా పిచాయ్ కనిపిస్తారు. కొంతవరకు, యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుసాన్ వోజ్కికి కూడా. అయితే, ఇకపై లారీ పేజ్, సెర్గీ బ్రిన్ కంపెనీని నడపరని మంగళవారం వారు చేసిన ప్రకటన స్పష్టం చేస్తోంది.
వీరిద్దరు సంస్థ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం అంటే యాజమాన్య హక్కులను, అంతిమ అధికారాన్ని వదులుకుంటున్నారని కాదు. ఆల్ఫాబెట్ బోర్డులోని 51 శాతం వోటింగ్ రైట్స్ ఇప్పటికీ వారి నియంత్రణలోనే ఉన్నాయి. ఇది మారదు. ఇప్పుడు సంస్థకు సంబంధించిన 'గర్వించతగ్గ తల్లిదండ్రుల' పాత్రను తాము పోషిస్తామని అంటున్నారు.
అవసరం అనుకుంటే వారు ఎప్పుడైనా సరే పిచాయ్ నిర్ణయాన్ని అధిగమించగలరు.

ఇవి కూడా చదవండి:
- Idiot అని గూగుల్‌లో వెతికితే ట్రంప్ ఫొటో ఎందుకొస్తోంది?
- ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ పేరేంటో తెలుసా...
- గూగుల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్: భావి నగరాలకు నమూనా అవుతుందా?
- డిజిటల్ డ్రెస్... ఓ భర్త తన భార్య కోసం దీన్ని దాదాపు 7 లక్షలకు కొన్నారు
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
- దిశ అత్యాచారం, హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు
- జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? దానివల్ల ఉపయోగం ఉంటుందా?
- శ్రీజ డెయిరీ: ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుల సంస్థ’.. ఇందులో సభ్యులు, యజమానులు అంతా మహిళలే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








