ఇడియట్‌పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వివరణ: ఇడియట్ అంటే ట్రంప్ ఫొటో ఎందుకొస్తోంది? గూగుల్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తుంది?

ఫొటో సోర్స్, EPA
గూగుల్‌లో 'ఇడియట్' అనే ఆంగ్ల పదంతో వెతికితే, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫొటోలు వరుసగా కనిపిస్తున్నాయి. ఎందుకలా ఆయన ఫొటోలు కనిపిస్తున్నాయి? అసలు గూగుల్ సెర్చ్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తోందో చెప్పాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులు గూగుల్ సీఈవోను ప్రశ్నించారు.
"ఇడియట్ (idiot) అనే పదంతో వెతికితే, చిత్రాల్లో డోనల్డ్ ట్రంప్ ఫొటోలు వస్తున్నాయి. అలా ఎలా వస్తున్నాయి? అసలు గూగుల్ ఇమేజ్ సెర్చ్ ఎలా పనిచేస్తుంది?" అని డెమోక్రటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు జోయ్ లాఫ్‌గ్రెన్ అడిగారు.
గోప్యత, వ్యక్తిగత సమాచార సేకరణ వంటి అంశాల మీద జరిగిన కాంగ్రెస్ సభ్యుల జ్యుడీషియరీ కమిటీ సమావేశంలో ఆమె ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ సమావేశంలోనే ఆమె గూగుల్‌లో 'ఇడియట్' పదంతో ఆమె వెతికి చూపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సమావేశానికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా హాజరయ్యారు. రాజకీయ పక్షపాతం గురించి ఆయనకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ ఎలా వాడుతోంది? ముఖ్యమంగా జీపీఎస్ ద్వారా వినియోగదారుల స్థానాన్ని ఎలా ట్రాక్ చేస్తోంది? అన్నది చెప్పాలని కమిటీ సభ్యులు అడిగారు.
అందుకు సుందర్ పిచాయ్ వివరణ ఇచ్చారు. "కోట్లాది వెబ్ పేజీలలోని సమాచారం గూగుల్ ఇండెక్స్‌లో కాపీ చేసి ఉంటుంది. ఎవరైనా ఏదైనా 'కీ వర్డ్'తో గూగుల్‌లో వెతికినప్పుడు దాదాపు 200కు పైగా పోలికల ఆధారంగా సంబంధిత సమాచారం వస్తాయి. అంతేకానీ, తెరవెనుక ఎవరో ఉండి, కావాలని చేసేది కాదు." అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"మీరెప్పుడైనా సెర్చ్ ఫలితాలను తారుమారు చేయాలని మీ ఉద్యోగులను ఆదేశించారా?" అని సుందర్ పిచాయ్‌ని టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు లామర్ స్మిత్ అడిగారు.
అందుకు పిచాయ్ బదులిస్తూ... గూగుల్ సెర్చ్ ఫలితాలను మార్చడం ఒక వ్యక్తికి, ఒక బృందానికి సాధ్యమయ్యే పనికాదని, ఆ ప్రక్రియలో అనేక దశలు ఉంటాయని చెప్పారు.
కానీ, పిచాయ్ వివరణతో తాము ఏకీభవించడంలేదని స్మిత్ వ్యాఖ్యానించారని బీబీసీ ఉత్తర అమెరికా ప్రతినిధి టెక్నాలజీ రిపోర్టర్ డేవ్ లీ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








