అడ్వాణీని కోలుకోలేకుండా చేసిన ఆ ఒక్క తప్పు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అడ్వాణీకి నవంబర్ 8కి 91 ఏళ్లు పూర్తయ్యాయి. బీజేపీ శూన్యం నుంచి శిఖరంపైకి చేర్చడంలో అడ్వాణీ కీలక పాత్ర పోషించారు. కానీ, ప్రస్తుతం అడ్వాణీ ఆ పార్టీలో అంచులకు చేరారు. క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయారు.
ప్రధానమంత్రి మోదీ ఒకప్పుడు అడ్వాణీకి చాలా సన్నిహితంగా మెలిగేవారు. కానీ, 2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత నుంచి ఇద్దరి మధ్య బంధం బెడిసికొట్టింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గురువారం ప్రధాని మోదీ కూడా అడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయుష్షును కోరుకున్నారు. అడ్వాణీ రాజకీయ జీవితం అంతా ఎన్నో సంఘర్షణలు ఎదుర్కున్నారు. కానీ ప్రధాన మంత్రి పదవిని మాత్రం చేరుకోలేకపోయారు. అయితే, ఆయన ఎక్కడ తన రాజకీయ చాతుర్యం చూపించలేకపోయారు?
ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అడ్వాణీ గురించి దేశమంతా మాట్లాడుకునేవారు. ఆయన్ను ప్రధానమంత్రి పదవికి సమర్థుడైన నేతగా భావించారు.
కానీ, గత ఏడాది రాష్ట్రపతి ఎన్నికలు జరిగినపుడు. ఆ పదవిలో కూచోవచ్చని ఆశించిన అభ్యర్థుల జాబితాలో కనీసం ఆయన పేరు కూడా కనిపించ లేదు.

ఇదే అడ్వాణీ, 1984లో రెండు సీట్లకే పరిమితమైన భారతీయ జనతా పార్టీని తర్వాత, భారత రాజకీయాలకు కేంద్రంగా మార్చారు. 1998లో బీజేపీ మొట్టమొదటిసారి అధికారం రుచిచూసే స్థాయికి తీసుకొచ్చారు.
అప్పట్లో ఆయన నాటిన బీజాలతో పండిన పంట ఇప్పుడు కోతకొచ్చింది. కానీ పంటను కోసే విషయాన్ని పక్కన పెడితే, అడ్వాణీ భారత రాజకీయాలకు, బీజేపీకి ఇప్పుడు ఒక సంబంధం లేని వ్యక్తిగా మారిపోయారు.
2004, 2009లో వరసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 'లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్' సిద్ధాంతం అడ్వాణీకి కూడా వర్తించింది. ఒకప్పుడు ఆయన నీడలో ఎదిగిన నరేంద్ర మోదీ ఆయన స్థానాన్ని ఆక్రమించారు.
"2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత భారతీయ జనతా పార్టీ, దాని మిత్ర పక్షాలు కొత్త నాయకత్వం రావాలని ఆలోచించాయి. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు నేతృత్వం వహించనున్నారనే వార్తలు కూడా వారిలో ఆ ఆలోచనకు బీజం వేశాయి’’ అని భారతీయ జనతా పార్టీని దగ్గర నుంచి చూసిన.. ఇందిరా గాంధీ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ చీఫ్ రామ్ బహదూర్ రాయ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త నాయకత్వంలో చోటు లభించలేదు
"కొత్త నాయకత్వంలో అడ్వాణీకి ఎలాంటి చోటూ ఉండదేమో అనిపించింది. కానీ భారతీయ జనతా పార్టీపై అడ్వాణీ ప్రభావం ఆ ఆలోచనను ముందుకు వెళ్లనీయలేదు. కానీ ఆ విషయం తెలియగానే ఆ సమయంలో పార్టీ అధ్యక్షుడుగా ఉన్న వెంకయ్య నాయుడిని పదవికి రాజీనామా చేయాలని అడ్వాణీ ఆదేశించారు. ఆయనే స్వయంగా పార్టీ అధ్యక్షుడు అయ్యారు".
అడ్వాణీ పార్టీ అధ్యక్షుడు కావడాన్ని బీజేపీలోని వారు, దాని అనుబంధ సంస్థలు కూడా అంత పాజిటివ్‌గా తీసుకోలేకపోయాయి.
ఆ సమయంలో తను అనుకుంటే ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉన్నా, వాజ్‌పేయిని ప్రధానమంత్రి పదవి కోసం అడ్వాణీనే ముందుకు తీసుచ్చారని ఆయన మద్దతుదారులు చెబుతారు.
‘‘మనం 1994-95 మధ్య అడ్వాణీని చూస్తే ఆయన కూడా బీజేపీ తరఫున ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ఉన్నారు. కానీ వాస్తవికత గురించి అడ్వాణీకి ఉన్నంత అవగాహన మిగతా వారికి ఎవరికీ లేదు’’ అని సీనియర్ జర్నలిస్ట్ అజయ్ సింగ్ చెప్పారు.
అజయ్ సింగ్ చెప్పిన దాని ప్రకారం భారత్‌లో అప్పటి పరిస్థితుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక వ్యక్తి అవసరం. దానిని దృష్టిలో పెట్టుకునే ఆయన వాజ్‌పేయి పేరు తెరపైకి తెచ్చారు.

ఫొటో సోర్స్, Advani
జిన్నాను ఎందుకు ప్రశంసించారు
బీజేపీ గురించి బాగా తెలిసిన వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు పొందాలంటే హై-లైనర్‌గా ఉండడం చాలా అవసరం అని చెబుతారు. కానీ అదే వ్యక్తి ప్రధానమంత్రి పదవికి పోటీపడితే, తన ఇమేజ్‌ను సాఫ్ట్ అని చూపించుకోడానికి ప్రయత్నిస్తారు. అలా ఉన్నప్పుడే భారతదేశమంతా వారిని ఆమోదిస్తుంది.
అడ్వాణీకి కూడా బహుశా అలాగే జరిగింది. "ఈ కష్టాలు బీజేపీకి ఎప్పుడూ ఉంటూనే వచ్చాయి. దానికి ఒక కారణం ఉంది. బీజేపీ లేదా అంతకు ముందు భారతీయ జన్‌సంఘ్ లేదా ఆరెస్సెస్ అనేవి హిందూ దేశం అనే ఐడియాలజీ పునాదులపై నిలబడ్డాయి. కఠినంగా వ్యవహరించడం అనేది వారి ఐడియాలజీలో ఒక భాగం. మనం రాజ్యాంగబద్ధమైన పదవుల కోసం పోటీపడుతున్నప్పుడు దాన్నుంచి బయటపడాల్సిన సమస్య వచ్చేది" అంటారు అజయ్ సింగ్.
"కానీ ఈ నేతలు ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అవుతున్నప్పుడు, వారికి అలా సామరస్యంగా ఉండడం కష్టమయ్యేది. అడ్వాణీ, వాజ్‌పేయికి కూడా అలాంటి సమస్యే ఎదురైంది. కానీ అటల్ వాక్-చాతుర్యం, హిందీ హార్ట్‌ల్యాండ్ గురించి ఆయన అవగాహన, సమస్యల నుంచి ఆయన్ను బయటపడేసేవి. కానీ అడ్వాణీ అలా చేయలేకపోయేవారు. అందుకే ఆయన ఇమేజ్ చట్రంలో చిక్కుకుపోయారు" అని అజయ్ సింగ్ తెలిపారు.
"బహుశా భారత రాజకీయాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నేత అనిపించుకోవాలనే కోరికతోనే ఆయన పాకిస్తాన్ వెళ్లి మహమ్మద్ అలీ జిన్నాను ప్రశంసిస్తూ ఒక మాస్టర్ స్ట్రోక్ కొట్టాలనుకున్నారు. కానీ అది ఉల్టా కావడంతో ఒక విధంగా తన రాజకీయ జీవితానికి ఆయనే తెర దించేసినట్టైంది".

ఒక్క తప్పు
"ఆయన అలా ఎందుకు చేశారు అనే విషయం గురించి అడ్వాణీనే బాగా చెప్పగలరు. దాని గురించి ఆయన ఎప్పుడూ కప్పిపుచ్చుకునేవారు. ఆయన వాజ్‌పేయి లాంటి ఇమేజ్ సంపాదించాలని ప్రయత్నించేవారు. కానీ దానిని అంగీకరించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఆయన చరిత్ర దానికి కారణం అయ్యింది" అని రామ్ బహదూర్ రాయ్ చెప్పారు.
"కరాచీ నుంచి దిల్లీ వచ్చిన తర్వాత అడ్వాణీకి ఆ విషయం తెలిసింది. అప్పుడు ఆయన వాజ్‌పేయికి ప్రత్యామ్నాయంగా బాగానే కనిపించారు. కానీ స్వయంగా ఒక నేతగా ఆయన ఎదిగుంటే ఆరెస్సెస్ ప్రతినిధి అయ్యేవారు. ఆ పాత్ర నుంచి ఆయన తప్పుకోవాలని ప్రయత్నించగానే, ఆయనకు రెట్టింపు నష్టం జరిగింది. ఏ నేలపై ఆయన నిలబడ్డారో అది కదిలిపోయింది, ఆయనపై అపనమ్మకం ఏర్పడింది".
రాజకీయంగా చురుకైనవారుగా భావించే అడ్వాణీ ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పు ఎందుకు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటూ అటూ కాకుండా పోయారు
అడ్వాణీ విమర్శకులు, ఆరెస్సెస్‌పై పుస్తకం రాసిన ఏజీ నూరానీ స్పందిస్తూ.. "1984 ఎన్నికల్లో బీజేపీకి కేవలం రెండు సీట్లే వచ్చాయి. అప్పుడు ఆయన నిరాశ చెందారు. దూరమైన ఓట్లు తిరిగి పొందడానికి మళ్లీ హిందుత్వ అంశాన్ని లేవనెత్తాలని అనుకున్నారు! 1995లో ఆయన దేశ ప్రజలు తనను ప్రధానమంత్రిగా చేయరని తెలుసుకున్నారు. అందుకే ఆ కుర్చీని వాజ్‌పేయికి వదిలేశారు. జిన్నా గురించి ఆయన మాట్లాడినవి పాకిస్తానీలను సంతోష పరచడానికి కాదు, భారత్‌లో తనకు ఒక మంచి ఇమేజ్ తెచ్చుకోవాలనే ఆయన కోరుకున్నారు" అన్నారు.
కానీ అలా చేసి ఆయన తన వలలో తానే పడ్డారు. గుజరాత్ అల్లర్ల తర్వాత ఏ మోదీని కాపాడారో.. అదే మోదీ ఆయన్ను బయటకు పంపించారు. ఆయనకు ఏదీ దక్కకుండాపోయింది. ఎటూ కాకుండా అయిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీని ఎవరు కాపాడారు
కానీ గుజరాత్ అల్లర్ల తర్వాత అడ్వాణీతోపాటు, మరికొంతమంది కూడా మోదీని కాపాడారని రాం బహదూర్ రాయ్ చెబుతారు.
అప్పుడు నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని వాజ్‌పేయి కోరారు. ఒక ప్రకటనలో రాజధర్మం అనే మాట కూడా చెప్పారు. కానీ వాజ్‌పేయిని మెత్తపర్చడంలో ఇద్దరు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. వారే అరుణ్ జైట్లీ, ప్రమోద్ మహాజన్. వాజ్‌పేయి దిల్లీ నుంచి గోవా వచ్చినపుడు ఆ విమానంలో వారిద్దరే ఉన్నారు. అక్కడ అడ్వాణీ లేరు అని రాయ్ చెప్పారు.
‘‘దారిలో వాళ్లిద్దరూ వాజ్‌పేయికి నచ్చజెప్పారు. మోదీ రాజీనామా పార్టీకి మంచిది కాదని అన్నారు. నాకు తెలిసి, ఇలా చేయాలి, ఇలా చేయవద్దు అని వాజ్‌పేయికి చెప్పే ధైర్యం అడ్వాణీకి లేదు.’’
నరేంద్ర మోదీని కాపాడటంలో అడ్వాణీ హస్తం ప్రత్యక్ష్యంగా లేకపోవచ్చు, కానీ 2012 వరకూ నరేంద్ర మోదీ అడ్వాణీకి లెఫ్టినెంట్‌లా ఉండేవారని చాలా తక్కువ మంది చెప్పుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరెస్సెస్ అడ్వాణీ వెంట నిలిచినప్పుడు
కానీ బీజేపీ ఆయన స్థానంలో నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా నిలిపినపుడు అడ్వాణీ దానిని ఎందుకు జీర్ణం చేసుకోలేకపోయారు?
"2014 ఎన్నికల్లో మోదీ రాకను వ్యతిరేకించడాన్ని చూస్తే, ఒక్కసారైనా ప్రధానమంత్రి కావడానికి కచ్చితంగా ప్రయత్నించాలనే కోరిక ఆయనలో బలంగా కనిపిస్తుంది. ప్రధాని అభ్యర్థిని ముందే ప్రకటించాల్సిన అవసరం లేదని ఆయన కచ్చితంగా చెప్పారు. మనం మోదీ పేరుతో ఎన్నికలకు వెళ్తే, ఓటర్ల విభజన ఎక్కువగా ఉంటుందని ఆయన అనుకుని ఉండచ్చు. కానీ మోదీ పక్షం నుంచి కార్యకర్తలపై ఒత్తిడి రావడంతో ఆ ప్రభావానికి చివరకు అద్వానీనే సైడైపోయారు" అని అజయ్ సింగ్ చెప్పారు.
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడే అటల్ స్థానంలో అడ్వాణీని ప్రధాని చేయాలని ఆరెస్సెస్ కోరుకునేది అంటారు. కానీ ఆ అవకాశం కూడా ఆయన చేజారిపోయింది.
2001 చివరి వరకు అడ్వాణీకి నలువైపులా ఒక కోటరీ లాంటిది చేరింది. అది రజ్జూ భయ్యాను ప్రధానమంత్రి వాజ్‌పేయికి పదవి వదిలి అడ్వాణీని ప్రధాన మంత్రి చేయాలని చెప్పేలా సిద్ధం చేశారు. వాజ్‌పేయి, రజ్జూ భయ్యా మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవి, అందుకే ఆయన అది కూడా చెప్పుండేవారు అంటారు రామ్ బహదూర్.

ఫొటో సోర్స్, Getty Images
వాజ్‌పేయికి విషయం తెలిసిపోయిందా
‘‘మనం వరుసలో ఉన్న మిగతావారికి కూడా అవకాశం ఇవ్వాలి’’ అని వాజ్‌పేయితో ఆయన చెప్పారు. రజ్జూ భయ్యా స్వయంగా తన పదవిని వదిలి కేసీ సుదర్శన్ కోసం మార్గం సుగమం చేశారు. అందుకే ఆయన ఆ మాట చెప్పడాన్ని హక్కుగా కూడా భావించారు. ఆయన వాజ్‌పేయికి ఆ మాట చెప్పగానే, ఆయన దానికి కాదని చెప్పలేకపోయారు కానీ, ఆయనకు ఇది అడ్వాణీ ప్రయోజనం కోసమే అనే విషయం అర్థమైంది.
అరెస్సెస్ వాజ్‌పేయిని రాష్ట్రపతిగా చేయాలని భావించేదనే వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందని నేను రాం బహదూర్ రాయ్‌ను అడిగాను.
వాజ్‌పేయి ప్రధానమంత్రి పదవి వదలడానికి సిద్ధపడితే, ఆయనను రాష్ట్రపతి చేసుండవచ్చు కానీ వాజ్‌పేయి చాలా తెలివిగా ఆ రెండు పథకాలను విఫలం అయ్యేలా చేశారు అని రాయ్ చెప్పారు.
అయితే కంచన్ గుప్తా లాంటి ఆయన వారు ఆయన కోసం చాలా నిర్మాణాత్మక పాత్రను పోషించేవారు.
"కొత్త నేతృత్వం ఆలోచన సరిగ్గా అడ్వాణీలాగే ఉంటుందని అనుకోవడం తప్పు. అలాంటప్పుడు పార్టీ సమావేశం జరిగిన ప్రతిసారీ అడ్వాణీ అక్కడ ఉంటే, దాని వల్ల వారికి, అడ్వాణీకి సౌకర్యంగా ఉండదు. అడ్వాణీ స్థాయి ఇప్పుడు రోజువారీ రాజకీయాల్లో లేదనేది నిజం. ఆయన ఒక సలహాదారు పాత్రను పోషిస్తున్నారు. దానిని బీజేపీలో ఎవరూ పోషించలేరు" అని కంచన్ గుప్తా చెప్పారు.
కంచన్ గుప్తా ఏదైనా చెప్పచ్చు. కానీ భారతీయ జనతా పార్టీలో అడ్వాణీ పాత్ర ఒక సలహాదారుగా కూడా లేకుండాపోయింది. ఆయన సమస్యలకు కూడా అదే కారణం.
ఇవి కూడా చదవండి:
- ‘‘రండి.. ఫేక్ న్యూస్‌పై కలిసి పోరాడదాం’’
- చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు. ఆ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలు తెలుసా
- రామ్ మాధవ్: ‘రచ్చ గెలిచారు.. ఇంట గెలిచేనా?’
- తెలంగాణ ఎన్నికలు: “ప్రత్యేక రాష్ట్రం వస్తే పాతబస్తీ వెలిగిపోతుందన్నారు. కానీ హామీలే మిగిలాయి”
- Fake News -గుర్తించడం ఎలా-
- విరాట్ కోహ్లీ: 'మీకు విదేశీ ఆటగాళ్లు ఇష్టమైతే భారత్‌లో ఉండకండి'
- ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ‘ఆవు’
- "ఉద్యోగులతో మూత్రం తాగించి, బొద్దింకలు తినాలని ఒత్తిడి తెచ్చిన చైనా సంస్థ"
- అయోధ్య వాసులకు రామ మందిరం అంటే ఆసక్తి ఎందుకుండదు?
- హర్మన్‌ప్రీత్ కౌర్: టీమిండియా పురుష క్రికెటర్లతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న భారత మహిళా క్రికెటర్
- మొదటి ప్రపంచ యుద్ధం: భారత సైన్యం అక్కడికి చేరుకోకపోతే.. చరిత్ర మరోలా ఉండేది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








