వాజ్‌పేయి: 'నాణేనికి అటూ ఇటూ'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉల్లేఖ్ ఎన్‌పీ
- హోదా, 'ఓపెన్' న్యూస్ వీక్లీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
వాజ్‌పేయిని 'రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ' అని కొందరు అంటుంటారు. కానీ, అదేం కాదు. విద్యావేత్తలు, రాబిన్ జెఫ్రీలాంటి కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం 1960లో యువకుడైన వాజ్‌పేయి హిందుత్వ ఫైర్‌బ్రాండ్ అంబాసిడర్‌గా, ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటారు.
ఆర్ఎస్ఎస్ శిక్షణలో పెరిగి, ఆర్యసమాజం నుంచి వచ్చిన వ్యక్తిగా అతివాద జాతీయవాదాన్ని బాహాటంగా వెల్లడించే తీరును వాజ్‌పేయి వీడలేదు. కానీ, దిల్లీ కేంద్రంగా పార్లమెంటరీ రాజకీయాల్లో రాణించేందుకు ఈ విధానం అవరోధంగా మారడంతో ఆ అలవాటును నిద్రాణం చేశారు.
పూర్తికాలం పదవిలో కొనసాగిన తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి వాజ్‌పేయి. 1957 నుంచి 2004 వరకు పార్లమెంటేరియన్‌గా కొనసాగారు.

ఫొటో సోర్స్, Getty Images
చిన్న వయసులోనే దిల్లీ రాజకీయాలు
1962, 1984 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన రాజ్యసభ నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాల్సి వచ్చింది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ (63) చాలా పెద్ద వయసులో దిల్లీ పార్లమెంటరీ రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, వాజ్‌పేయి కేవలం 30 ఏళ్ల వయసులోనే జాతీయ రాజకీయాల్లోకి, దిల్లీ కేంద్రంగా ఉన్న మేధావులు, దిగ్గజాల సాహచర్యంలోకి అడుగుపెట్టారు.
1953 ఉప ఎన్నికల్లో తొలిసారి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. నాలుగేళ్ల తర్వాత బలరాంపూర్, మథుర, లఖ్‌నవూల నుంచి పోటీ చేశారు. కానీ, ఒక్క బలరాంపూర్ నుంచే గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్ఎస్ఎస్, ఆర్య సమాజం నుంచి వచ్చిన వారే
వాజ్‌పేయి, మోదీ ఇద్దరూ ఆర్ఎస్ఎస్ శిక్షణలో రూపుదిద్దుకున్నవారే. మోదీ తండ్రి చాయ్‌వాలా అయితే, వాజ్‌పేయి తండ్రి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. రాజకీయాల్లో రాణించేందుకు అనువుగా ఇద్దరూ ఉపన్యాస కళను అలవర్చుకున్నారు. వారిద్దరి ప్రసంగాల తీరు భిన్నంగా ఉన్నా ముస్లింలపై విద్వేష ప్రసంగాలు చేయడంలో ఇద్దరూ ఒకటే.
దేశ చరిత్రలోనే గొప్ప పేరున్న పార్లమెంటేరియన్లు, అందునా, ఉదారవాదులున్న కాలంలో వాజ్‌పేయి రాజకీయాల్లోకి రావడం ఆయన అదృష్టం.
చట్టసభలను అర్థం చేసుకునే అవకాశం చాలా చిన్న వయసులోనే వాజ్‌పేయికి వచ్చింది. దీంతో తన పరిధి, తమ పార్టీ పరిధి ఏంటో ఆయనకు బాగా అర్థమైంది. అంతేకాదు, విద్యార్థి దశలో ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కమ్యూనిజం భావజాలానికి కూడా ఆయన లోనయ్యారు.
అయితే, పార్లమెంటేరియన్‌గా ఉన్నప్పుడు తన సీనియర్ల విశాల దృక్పథాన్ని చూసి అదే తీరును అలవర్చుకున్నారు. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసినా సహనం, స్నేహపూర్వక ధోరణితో వ్యవహరించే నెహ్రూను వాజ్‌పేయి అమితంగా ఇష్టపడేవారు.
ఆర్‌ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ సుదీర్ఘకాలం ఆయన నెహ్రూ భావజాలానికి ప్రభావితమయ్యారు.
రాజకీయ ప్రయోజనమో, తనపై తనకున్న విశ్వాసమో తెలియదు కానీ, తర్వాత కాలంలో ఒకవైపు ఉదారవాద నెహ్రూ సిద్ధాంతాలను చెరిపేస్తూ, మరోవైపు హిందూత్వ రాజకీయాలు చేస్తూ ముందుకుసాగారు. కాంగ్రెస్ బలమైన రాజకీయ శక్తిగా ఉన్న కాలంలో ప్రజలను ప్రభావితం చేయడానికి ఇదే సరైన విధానం అని ఆయన భావించి ఉండవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
హిందుత్వ స్థానంలో భారతీయత
రాజకీయాల్లో ప్రయోగాలు చేయడం వాజ్‌పేయి ఘనతగా చెప్పుకోవాలి. అతివాద జాతీయవాదం నుంచి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా పార్టీని నిలపడంలో ఆయన విజయవంతమయ్యారు. హిందుత్వ స్థానంలో భారతీయతను ప్రవేశపెట్టాలని 1979లో రాసిన ఒక వ్యాసంలో అటల్ పేర్కొన్నారు. వారు స్థాపించే కొత్త రాజకీయ పార్టీ అన్ని మతాల వారిని ఆకర్షించేందుకే ఆయన ఈ నినాదం ఇచ్చారు. వాజ్‌పేయి ఉద్దేశం, అవసరం తెలుసు కాబట్టే ఆర్ఎస్ఎస్ ఆయనను తమ ముసుగుగా వాడుకుంది. ఇదే విషయాన్ని కొన్నాళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త కేఎన్ గోవిందాచార్య వెల్లడించారు.
వాజ్‌పేయి తన జీవితాంతం ఆర్ఎస్ఎస్ జాతీయవాదానికి కట్టుబడి ఉన్నాడని కొందరు వాదిస్తారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఆయోధ్యలో రామమందిర నిర్మాణ ఆందోళన, గుజరాత్‌లో మారణకాండ చోటుచేసుకున్నాయి.
అయితే, రాజకీయాల్లోని అత్యున్నత వర్గాలతో ఉన్న అనుబంధం, అగ్ర కులంలో జన్మించిన కారణంగా ఆయన విమర్శల నుంచి తప్పిచుకోగలిగారని కొందరు చరిత్రకారులు వాదిస్తుంటారు.
భారతీయ జన సంఘ్ తరువాత బీజేపీలో భాగమైనప్పటికీ, హిందూ జాతీయవాద ఉద్యమంలో ఉదారవాద, మితవాద ముఖంగా ఉన్నప్పటికీ, ఆయన అప్పుడప్పుడు అతివాద హిందూత్వ శిబిరాలకు హాజరయ్యేవారు.

ఫొటో సోర్స్, Getty Images
విద్వేష వ్యాఖ్యలు
అసోంలోని నల్లీలో 1983లో జరిగిన మారణకాండ అనంతరం ''బయటివారు'' అంటూ ఆయన విద్వేష ప్రసంగం చేశారు. 1990 లోక్ సభలో ఇదే విషయంపై ఆయన ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతకంటే ముందు 1970 మే 14న ఆయన లోక్ సభలో ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ప్రధాని ఇందిరాగాంధీ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
''భివాండీ పరిణామాలతో ముస్లింలు మరింత మతోన్మాదులయ్యారు. అందుకే, వారు హిందువుల నుంచి ప్రతిచర్యను కోరుకుంటున్నారు.'' అని పార్లమెంట్‌లో వాజ్‌పేయి వ్యాఖ్యానించారు. దీన్ని ఇందిరా గాంధీ ఖండించారు. ఆర్ఎస్ఎస్, హిందూత్వ సంస్థలే అల్లర్లకు కారణమని ఆరోపించారు. వాజ్‌పేయి వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ఈ వ్యాఖ్యలతో వాజ్‌పేయి నిజ రాజకీయ స్వరూపం బయటపడటం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
అలాగే, 1992 డిసెంబర్ 5న లఖ్‌నవూలోని అమినాబాద్‌లో ఆర్ఎస్ఎస్ కరసేవకులను ఉద్దేశిస్తూ ఆయన ఉత్సాహంగా ప్రసంగించారు. ''ఆయోధ్యలో భూమిని చదును చేసే పూజలు చేయాలి'' అని వ్యాఖ్యానించారు. అదే రోజు అయోధ్యకు (మరుసటి రోజు బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది) వెళ్లకుండా లఖ్‌నవూ నుంచే వెళ్లిపోయారు. ఈ చర్య తన మితవాద ఇమేజ్‌ను కాపాడుకునేందుకు ఆయనకు బాగా ఉపయోగపడిందని వాజ్‌పేయి ప్రత్యర్థులు అప్పుడప్పుడు వ్యాఖ్యానించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
అతివాద హిందుత్వానికి మితవాద ముసుగు
బాబ్రీ ఘటన అనంతరం బీజేపీ అగ్రనేతలందరూ అరెస్టయిన తరువాత వాజ్‌పేయి రూపంలో ఓ రక్షకుడిని ఆర్ఎస్ఎస్ గుర్తించింది. ఆ తరువాత నెలలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారనే ప్రచారానికి వాజ్‌పేయి నేతృత్వం వహించారు.
జీవిత చరమాంకంలో సొంత పార్టీ నుంచే వాజ్‌పేయి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడే ఎదుగుతున్న యువ నాయకులు ఆయనను నెహ్రూ దుష్ట ఆత్మగా చూసేవారు.
గుజరాత్‌లో 2002లో ముస్లిం వ్యతిరేక అల్లర్లు జరిగిన తర్వాత గోవాలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని పదవి నుంచి తొలగించాలని అటల్ భావించారు. కానీ, అడ్వాణీ, ఇతర నేతల వ్యూహంతో అక్కడున్న ప్రతినిధులు దీన్ని అంగీకరించలేదు.
అయితే, గోవాకు వెళ్లకముందే మోదీ మెడపై కత్తి పెట్టి తన సంకీర్ణ భాగస్వాములను సంతృప్తిపరచాలని, తన మితవాద ఇమేజ్‌ను కాపాడుకోవాలని వాజ్‌పేయి నిర్ణయించుకున్నారు. కానీ, గోవా సమావేశంలో పరిస్థితి తారుమారైంది. దీంతో అక్కడున్న అతివాద సహచరులను సంతృప్తిపరిచేలా ఆయన ప్రసంగించారు.
ఆ సమావేశం ముగింపు సదస్సులో మాట్లాడుతూ, "ముస్లింలు వేరేవారితో కలిసిమెలిసి ఉండాలని కోరుకోరు'' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయినప్పటికీ ఈ రాజకీయ కవి ప్రజాజీవితంపై ఎలాంటి మచ్చా పడలేదు. ప్రధాన మంత్రిగా వివిధ వర్గాల ప్రజల మన్ననలను ఆయన పొందగలిగారు.

ఫొటో సోర్స్, Getty Images
భావోద్వేగాలతో రాజకీయం
ప్రేమ, భావోద్వేగాలు రాజకీయాల్లో ఎంత కీలకమో వాజ్‌పేయికి బాగా తెలుసు. అందుకే, వాటిని ప్రదర్శించడానికి ఆయన ఎప్పుడూ వెనకాడలేదు.
భారీ జనసమూహాన్ని తన వాగ్ధాటితో ఆయన ఆకట్టుకోగలరు. అందుకే కశ్మీర్‌లోని కొందరు స్థానికులు ఆయనను సూఫీగా పిలుస్తారు.
కొన్ని విషయాల్లో అటల్ మార్గదర్శిగా నిలిచారనేది విస్మరించరాదు. సెల్‌ఫోన్ విప్లవం, పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపడటం ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే జరిగాయి.
బహుశా, సరైన సమయంలో సరైన స్థానంలోకి రావడం ఆయన అదృష్టమై ఉండొచ్చు. అంతేకాదు, సంపూర్ణ జీవితాన్ని అనుభవించి అన్ని వర్గాల ప్రజల నుంచి తుది శ్వాస విడిచేవరకు ప్రేమ, గౌరవాన్ని పొందే అదృష్టం ఆయనకు దక్కింది.
మాటల్లో, చేతల్లో వాజ్‌పేయికి విరుద్ధంగా అతని రాజకీయ వారసులు ప్రవర్తిస్తున్నప్పటికీ మరణంతో ఆయన ప్రాభవం మరింత పెరిగింది.
(ఈ వ్యాసకర్త 'ది అన్‌టోల్డ్ వాజ్‌పేయి: పొలిటీషియన్ అండ్ పారడాక్స్' పుస్తక రచయిత, 'ఓపెన్' న్యూస్ వీక్లీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉల్లేఖ్ ఎన్‌పీ. ఆయన ఇటీవల రాసిన పుస్తకం 'కన్నూర్: ఇన్‌సైడ్ ఇండియాస్ బ్లడియస్ట్ రివెంజ్ పాలిటిక్స్')
ఇవి కూడా చదవండి
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది?
- బిబిసి స్పెషల్: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ఎడారీకరణ ముప్పు
- మీ పిల్లల కోపాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి?
- ఆంధ్రప్రదేశ్: ఈ గ్రామంలో ప్రతి ఇంటి ముందూ సమాధులే!
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- కడప జిల్లా: వీరికి గబ్బిలాలు ‘దేవతలు’
- తెలంగాణలో సూర్యుడు 'అస్తమించని' గ్రామం!!
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- జెఫ్ బెజోస్: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యారిలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








