ఇస్రో: 'మానవ సహిత వ్యోమనౌక' ప్రాజెక్ట్ సారథి లలితాంబిక

లలితాంబిక
ఫొటో క్యాప్షన్, 'మానవ సహిత వ్యోమనౌక' ప్రాజెక్టుకు సారథ్యం వహిస్తున్న లలితాంబిక
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో ఎన్నో కీలక లక్ష్యాలను ఛేదిస్తూ మహిళా శాస్త్రవేత్తలు దూసుకుపోతున్నారు. తాజాగా ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మానవ సహిత వ్యోమనౌక' ప్రాజెక్టుకు బాధ్యతలను వి.ఆర్.లలితాంబికకు అప్పగించారు.

ప్రమాద సమయాల్లో వ్యోమనౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడటం ఈ ప్రాజెక్టులో కీలక అంశం. ఈ అంశానికి సంబంధించిన భారీ సాంకేతిక ప్రయోగం గత నెలలో చేపట్టారు.

మొదటి 'ప్యాడ్ అబార్ట్' పరీక్షను శ్రీహరికోటలో నిర్వహించారు. ఈ ప్రయోగంలో వ్యోమనౌక ప్రయోగాన్ని హఠాత్తుగా రద్దు చేయాల్సివచ్చినపుడు అందులోని సిబ్బంది ఉన్న క్యాబిన్‌‌ను సురక్షితంగా వ్యోమనౌక నుంచి బయటకు లాగే విధానాన్ని ప్రదర్శించారు.

300 సెన్సర్లు ప్రయోగ పనితీరును వివిధ కోణాల్లో రికార్డు చేశాయని ఇస్రో తెలిపింది.

ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, Getty Images

ఇస్రో చైర్మన్ కైలాసవడివూ శివన్ బీబీసీతో మాట్లాడుతూ, ''లలితాంబికకు సాంకేతికత పరిజ్ఞానంలోనే కాదు, కార్యనిర్వహణా రంగంలో కూడా అనుభవం ఉంది. పురుషులు, మహిళల మధ్య ఇస్రో ఎన్నడూ వివక్ష చూపదు. ఒక పని చేయడానికి ఎవరు సమర్థులన్నది మాత్రమే మేం పరిగణనలోకి తీసుకుంటాం. ఈ ప్రాజెక్టులో ఇద్దరు మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు’’ అన్నారు.

డా.శివన్ చెప్పిన ఆ రెండో మహిళ పేరు టి.కె.అనురాధ. ఆమె ఉపగ్రహ సమాచార వ్యవస్థ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నారు.

''మేం ఇద్దరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనుకున్నాం. ఈ ఇద్దరు కూడా శక్తిమంతులే'' అని శివన్ అన్నారు.

డా.శివన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇస్రో చైర్మన్ డా. కె. శివన్

ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న 'ఒకేసారి 104 ఉపగ్రహాల ప్రయోగం'లో కీలకంగా వ్యవహరించిన శాస్త్రవేత్తల బృందానికి లలితాంబిక నాయకత్వం వహించారు. (అంతకు ముందు రష్యా 37 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించింది)

ఈమె తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ ప్రయోగంలో ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి డీకొట్టుకోకుండా ఉండటమే ప్రయోగం విజయవంతం కావడానికి ఓ కారణమయ్యుంటుందని అంచనా.

''ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రకటించాక, ఈ ఆఫీసు నోడల్ సంస్థగా పని చేస్తోంది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో భాగంగా మేం ఇతర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పని చేయాల్సి ఉంటుంది'' అని శివన్ అన్నారు.

మనుషులు ప్రయాణించగలిగే స్పేస్ ఫ్లైట్ కార్యక్రమంలో భాగంగా భారత ఎయిర్ ఫోర్స్, డీఆర్‌డీఓ, ఇతర ప్రభుత్వరంగ సంస్థల సహకారంతో ఇస్రో తన సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటోంది.

రాకేష్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా వ్యోమనౌకలో 1984లో అంతరిక్షంలోకి తొలిసారిగా వెళ్ళిన భారతీయుడు రాకేశ్ శర్మ

1984లో రష్యా ప్రయోగించిన వ్యోమనౌకలో భారత పైలట్ రాకేష్ శర్మ వెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు ఆయనే.

అంతరిక్ష పరిజ్ఞానాన్ని దేశ ఆర్థికాభివృద్ధి కోసం ఉపయోగించాలని భారత అంతరిక్ష కార్యక్రమాల రూపకర్త విక్రమ్ సారాభాయ్ భావించారు. అందుకు అనుగుణంగానే దేశ అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఆర్థికాభివృద్ధిపైనే ఎక్కువగా కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలో ఈ మానవ సహిత వ్యోమనౌక పూర్తవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉంది.

విక్రమ్ సారాభాయ్ శతజయంతి ఈ ఏడాదిలోనే ఉంది.

పీఎస్ఎల్వీ

ఫొటో సోర్స్, Getty Images

ఇంతవరకూ విద్య, సమాచార వ్యవస్థ, రిమోట్ సెన్సింగ్ తదితర అంశాల కోసం ఉపగ్రహాలను ప్రయోగించిన భారత్ అంతరిక్ష చరిత్రలో మానవ సహిత వ్యోమనౌక ఓ మలుపు అని చెప్పవచ్చు.

జియో సింక్రొనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే ఉపగ్రహ ప్రయోగ శకటం(జీఎస్ఎల్వీ) ద్వారా భారీ ఉపగ్రహాలను ప్రయోగించడంపై దృష్టి సారించాక, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ)పై ఆధారపడటం నెమ్మదిగా తగ్గుతోంది.

2019 మధ్యలో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ)ను ప్రయోగించడానికి ఇస్రో సిద్ధమవుతోంది.

''ఎస్ఎస్ఎల్వీ నుంచి ఉపగ్రహాలను ప్రయోగించడం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. పీఎస్ఎల్వీ ద్వారా ఉపగ్రహ ప్రయోగానికి అయ్యే ఖర్చులో దాదాపు పదోవంతు ఖర్చుతో ఎస్ఎస్ఎల్వీ ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు. భారీ ఉపగ్రహ ప్రయోగ శకటాన్ని తయారు చేయడానికి ప్రస్తుతం 300-400 మంది పని చేస్తున్నాం. కానీ దీనికి అలా కాదు. కేవలం ముగ్గురు నుంచి ఆరు మంది ఉంటే చాలు'' అని డా.శివన్ అన్నారు.

జీఎస్ఎల్వీ

ఫొటో సోర్స్, Getty Images

''ఎస్ఎస్ఎల్వీకి మంచి డిమాండ్ ఉంది. ఇందులో 500-700 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి కేవలం 72 గంటల సమయం పడుతుంది. దీన్ని ఏ దేశానికైనా తీసుకువెళ్లి, అక్కడ నుంచి ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు. రానున్న మే లేదా జూన్ నెలలో దీని నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తాం'' అని డా.శివన్ అన్నారు.

పునర్వినియోగ ప్రయోగ శకటం(ఆర్‌వీఎల్) ప్రాజెక్టు పూర్తవ్వడానికి మరికొంత సమయం పడుతుంది. అందులోని సాంకేతికత ఇంకా పరీక్ష దశలోనే ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, లాంచ్ వెహికల్(ప్రయోగ శకటం) ఖర్చు దాదాపు 50శాతం వరకూ తగ్గుతుందని తాము అంచనా వేస్తున్నట్లు డా.శివన్ తెలిపారు.

''సాధారణంగా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించినపుడు ప్రయోగ శకటంకు చెందిన విడిభాగాలు సముద్రంలో పడిపోవడమో, లేక కాలిపోవడమో జరుగుతుంది. కానీ ఆర్‌వీఎల్‌లో అలా కాదు. ఉపగ్రహ ప్రయోగం అనంతరం, ప్రయోగ శకటం మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. దీంతో ఆర్థికంగా చాలా లాభం'' అని డా.శివన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)