BBC Special: ఈ ఆవులను ఎవరు చంపుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బండి. హృదయ విహారి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆవులు ఏం తింటాయి? ప్రశ్న కొత్తదేమీ కాదు. కానీ, 'ఆవులు గడ్డి తింటాయి' అని మాత్రం చెప్పకండి. ఎందుకంటే కాలం మారింది! ఆవులు గడ్డి తినే కాలం పోయింది. ఇప్పుడవి ప్లాస్టిక్ తింటున్నాయి.
పట్టణాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో చాలా చోట్ల ఆవులు కన్పిస్తుంటాయి. వీధుల్లో, చెత్తకుప్పల పక్కన తిరుగుతుండటం చూసే ఉంటారు. అలా తిరుగుతూ అవి నోటికందిన వాటిని మేస్తుంటాయి.
ఆ మేత ఏమిటో, అందులో ఏముందో తెలియని అమాయకమైన కళ్లతో చూస్తుంటాయి కూడా. పాచిపోయిన ఆహారం, కుళ్లిపోయిన పళ్లతోపాటు ఆ పళ్లను, ఆహారాన్ని పారవేసిన ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులను కూడా అవి మింగేస్తున్నాయి.
అలా ప్లాస్టిక్.. ఆవుల పొట్టలో గుట్టలా పేరుకుపోతోంది. మరి ఆ ప్లాస్టిక్ ఏమవుతోంది? ఈ వీడియోలో చూడండి..
'ప్లాస్టిక్ కౌ..!'
''2010లో అనుకుంటా.. అనంతపురం కార్పొరేషన్ 18 'వీధి ఆవుల'ను మా 'కరుణ సొసైటీ'కి అప్పగించింది. కొన్ని రోజులకే వాటిలో 4 ఆవులు చనిపోయాయి. చాలా ఆశ్చర్యమేసింది. అనుమానం వచ్చి ఆవులకు పోస్ట్‌మార్టం చేస్తే, వాటి కడుపులో 20-60 కిలోల ప్లాస్టిక్ ఉంది. ఇదే వీటి ప్రాణం తీశాయి. వాటి పొట్టలో కేవలం ప్లాస్టిక్ మాత్రమే కాదు అత్యంత ప్రమాదకర పిన్నులు, తోలు వస్తువులు కూడా బయటపడ్డాయి.’’ అని క్లెమెంటైన్ కునగ్రస్ బీబీసీతో అన్నారు.
క్లెమెంటైన్ పుట్టపర్తిలోని కరుణ సొసైటీని నెలకొల్పారు. ఈమె జీవితం 20 ఏళ్లుగా జంతువులతో ముడిపడి ఉంది.
అనంతపురం కార్పొరేషన్ ఆవుల ఘటన తర్వాత చాలా ఆవులకు ఆపరేషన్ చేయించి, వాటినుండీ కిలోల కొద్దీ ప్లాస్టిక్ బయటకు తీశారు.
ప్లాస్టిక్ ఆవుల గురించి బీబీసీ ఇంటర్వ్యూలో ఆమె చాలా విషయాలు చెప్పారు. ఇలాంటి ఆవులను క్లెమెంటైన్.. 'ప్లాస్టిక్ కౌ' అని పిలుస్తారు.
కడుపులో పేరుకుపోయిన ప్లాస్టిక్ కారణంగా వీటి జీర్ణశక్తి తగ్గిపోతుందని క్లెమెంటైన్ తెలిపారు.
''పొట్టలో ప్లాస్టిక్ ఉన్న ఆవులు వంటింటి వ్యర్థాలను మాత్రమే తినగలవు. తమ సహజ ఆహారమైన గడ్డిని తిని అరిగించుకోలేవు. ఈ ప్లాస్టిక్ ఆవులు 5-10 సం. కంటే ఎక్కువ కాలం బతకవు. ఓసారి అనంతపురం వచ్చి ఆవుల యజమానుల్ని కలిశాం. అప్పుడు అర్థమైంది నాకు. వాళ్లంతా యజమానులు కాదు, వ్యాపారులు అని! ఈ ఆవులను వీధుల్లో వదిలేస్తారు. అవి వీధుల్లోనే పెరుగుతాయి. వీధుల్లోని చెత్తాచెదారం తింటాయి. చివరకు వాటిని ఆ వ్యాపారులే కబేళాలకు అమ్మేస్తారు'' అని క్లెమెంటైన్ వివరించారు.

ఫొటో సోర్స్, KARUNA SOCIETY

ఫొటో సోర్స్, KARUNA SOCIETY
ఈ గోవులను చంపుతున్నది ప్రజలా? ప్రభుత్వమా??
''అనారోగ్యంతో ఉన్న ఒక ఆవుకు ఆపరేషన్ చేసి, దాని కడుపు నుంచి 80 కిలోల ప్లాస్టిక్ బయటకు తీశాం. కానీ ఆ ఆవు 4 రోజులకే చనిపోయింది.''
మరి ఈ ఆవుల మరణాలకు బాధ్యులు ఎవరు? వీటి సంరక్షణ చూడని వ్యాపారులా? లేక చెత్తను ప్లాస్టిక్ కవర్లు, సంచుల్లో పారవేసే ప్రజలా? ప్రభుత్వమా?
2012లో పర్యావరణ సంరక్షణ చట్టం - 1986, సెక్షన్ 5 కింద కరుణ సొసైటీ.. సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. వీధి ఆవులను సంరక్షించాలని, హానికరమైన ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని కోరింది. 2016 జూలైలో ఈ కేసుపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
''దేశంలో పరిస్థితి తీవ్రంగానే ఉందని స్పష్టమైంది. కానీ స్థానిక సంస్థలు.. తమ పరిధిలోని ప్రాంతాల పారిశుద్ధ్యంపై ఎలా వ్యవహరిస్తున్నాయో పర్యవేక్షించడం ఈ కోర్టు పని కాదు'' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
''ప్లాస్టిక్ ఆవులకు ఆపరేషన్ చేశాక వెంటనే వీధుల్లోకి వదిలేస్తే, అవి మళ్లీ ప్లాస్టిక్ కవర్లు, ఇతరత్రా తింటాయి. అలా జరిగితే ఫలితం ఉండదు. ఆపరేషన్ చేశాక, కొన్నాళ్లపాటు ఆయుర్వేదిక్ మందులను వాడాలి. ఆ తర్వాత వీటికి గడ్డి పెట్టాలి'' అని క్లెమెంటైన్ వివరించారు.
''జంతువుల దృష్టికోణం నుంచే మేం ఆలోచిస్తాం. ప్రస్తుతం మా వద్ద 500 జంతువులున్నాయి. ఇందులో పశుపోషణకు, వాటి వైద్యానికి 30 లక్షలు, కుక్కల కోసం 10 లక్షలు ఖర్చవుతోంది'' అన్నారు.
ఆమె సొంత డబ్బులతోపాటు విదేశాల నుంచి వచ్చే కొన్ని నిధులతో కరుణ సొసైటీ నిర్వహిస్తున్నారు.

ఎవరీ క్లెమెంటైన్? ఎక్కడి నుంచి వచ్చారు..?
క్లెమెంటైన్ కునగ్రస్ స్వదేశం హాలండ్. ప్రస్తుతం ఆమె వయసు 72 సంవత్సరాలు.
మిత్రుల ద్వారా సత్యసాయి బాబా గురించి విని, ఆయన్ను చూడటానికి 1985లో మొదటిసారి అనంతపురం జిల్లా పుట్టపర్తికి వచ్చారు. 1995లో పుట్టపర్తిలోనే స్థిరపడ్డారు.
అనాథ పశువులు, గాయపడ్డ జంతువులను చేరదీస్తూ.. 2000 సంవత్సరంలో కరుణ సొసైటీని ప్రారంభించారు. వీటికోసం ఓ వైద్యశాలనూ ఏర్పాటు చేశారు.
అందులో.. జంతువులు చికిత్స పొందడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.
కుక్కలు, పిల్లులు, గాడిదలు, ఒంటెలు, ఆవులు, బర్రెలు, ఎద్దులు, ఇలా ఎన్నో జంతువులు క్లెమెంటైన్ ఒడిలో సేదతీరుతున్నాయి. ప్రమాదాలకు గురైన జంతువులను అక్కున చేర్చుకుని, తన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు.

ఎలుగుబంటికి రమ అని పేరు పెట్టా..!
2004లో ఓ ఎలుగుబంటి పిల్లను అక్రమంగా తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పిల్లను సంరక్షించాలని కరుణ సొసైటీకి అప్పగించారు. అప్పుడు దాని వయసు 6 వారాలు.
''ఆ పిల్ల ఎలుగుబంటికి రమ అని పేరు పెట్టాం. తన తల్లి నుంచి దొంగిలించి తీసుకువెళుతుండగా అధికారులు కాపాడారు. ఇప్పటివరకూ 11 ఎలుగుబంట్లను రక్షించాం. వాటిలో చాలావాటిని అడవిలో వదిలేశాం. రమలాగ తిరిగి అడవిలోకి వెళ్లలేని జంతువులతో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రారంభమైంది.''
రమతో క్లెమెంటైన్‌కు గాఢమైన అనుబంధం ఏర్పడింది. రమను చూపించడానికి మమ్మల్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్లారు క్లెమెంటైన్.
కొంత స్థలంలో మూడు వైపులా ఎత్తైన గోడలు కట్టి, ఓ వైపు జాలరీ ఏర్పాటు చేశారు. ఆ జాలరీలోనుంచే రమ క్లెమెంటైన్‌ను పలకరించింది. అది ఆమెతో ఆడుకోవాలంటూ తపన పడింది.
కానీ, దాన్ని పెంపుడు జంతువులా పెంచడం క్లెమెంటైన్‌కు ఇష్టం లేదు. దాని సహజత్వాన్ని కోల్పోకూడదనే అడవిలాంటి ప్రదేశంలో పెంచుతున్నారు.
''ఒంటరి జంతువులను పెంచడం చాలా కష్టం. రమకు తల్లిగా, స్నేహితురాలిగా రోజంతా గడపాల్సి వచ్చేది. ఇప్పుడు దాని వయసు 3 సంవత్సరాలు. అప్పట్లో రమకు మా అవసరం చాలా ఉండేది. రమతోపాటు నేను, నా కొడుకు ఈ ప్రాంతంలో ఆడుకున్నాం, నడిచాం, పరిగెత్తాం. రమ పెంపుడు జంతువు కాదు. అది ఎప్పటికీ అడవి జంతువే! మాకు అలవాటయ్యిందికదా అని దాని స్వేచ్ఛను హరించదలుచుకోలేదు'' అని క్లెమెంటైన్ అన్నారు.

ఈ వన్యప్రాణ సంరక్షణ కేంద్రంలో ఎలుగుబంట్లతోపాటు విద్యుదాఘాతానికి గురైన కోతులు, ఆహారం, నీళ్లు దొరక్క ఊళ్లలోకి వచ్చి పట్టుబడ్డ జింకలు, నెమళ్లు కూడా ఉన్నాయి.
కొత్తగా మరో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నిర్మించాలని కరుణ సొసైటీ భావిస్తోంది. అందుకు భారత ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తోంది.
''మనుషుల మధ్య గడపడం కంటే జంతువులతో గడపడమే నాకిష్టం. ఆ ఇష్టమే నన్ను జంతువులకు దగ్గర చేసింది. నాకు సెలవుల్లేవు, విశ్రాంతి లేదు'' అని క్లెమెంటైన్ అన్నారు.
కరుణ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలకు 2018 మార్చి 8న భారత ప్రభుత్వం నుంచి ''నారీ శక్తి పురస్కార్'' అవార్డును క్లెమెంటైన్ కునగ్రస్ అందుకున్నారు.
' పరిస్థితి మెరుగుపడాలంటే.. మారాల్సింది మనుషులే! జంతువులు కాదు!’ అని క్లెమెంటైన్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









