బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన తండ్రీకూతుళ్లు

ఫొటో సోర్స్, SUBHASH PATIL
- రచయిత, ప్రాజక్తా డేకలె
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1942. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో 'క్విట్ ఇండియా' ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతున్న రోజులవి. అప్పుడే క్రాంతిసింహ్ నానా పాటిల్ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో సమాంతర ప్రభుత్వానికి బీజాలు నాటారు.
అంతకు ముందు మహాత్మా గాంధీ ప్రభావంతో నానా పాటిల్ తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకుని, జాతీయోద్యమంలోకి దూకారు.
గాంధీజీ నేతృత్వంలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న తర్వాత 1942లో నానా పాటిల్ సతారాలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గ్రామగ్రామానికి తిరిగి ఆయన స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యాన్ని, బ్రిటిష్ పాలనను కూలదోయాల్సిన అవసరాన్ని వివరించేవారు.
సమాంతర ప్రభుత్వంలో భాగంగా ప్రతి గ్రామంలో 'గ్రామ కమిటీలు' ఏర్పాటు చేశారు. అవి సమాంతర ప్రభుత్వం మార్గదర్శకంలో పనిచేసేవి.
క్రాంతిసింహ్ నానా పాటిల్ సారధ్యంలోని ఈ ఉద్యమం బ్రిటిషర్లను అయోమయంలో పడవేసింది. పాటిల్‌ను పట్టించేవారికి బహుమతి ఉంటుందని ప్రకటించారు. అయినా లాభం లేకపోగా, ఆయన రహస్య కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి.

ఫొటో సోర్స్, PRAJAKTA DHEKALE
పాటిల్ ఎక్కడ సమావేశం నిర్వహించినా, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చాలా తీవ్రంగా ప్రసంగించేవారు.
ప్రజలు ఆయన కంచుకంఠానికి ఆకర్షితులయ్యేవారు. దాంతో చాలా మంది యువత బహిరంగంగానే ఆ సమాంతర ప్రభుత్వం కోసం పని చేయడం ప్రారంభించారు.
క్రాంతిసింహ్ పాటిల్ కుమార్తె, 93 ఏళ్ల హౌసాబాయి పాటిల్ ప్రస్తుతం సాంగ్లి జిల్లాలోని హన్మాన్‌వడియె గ్రామంలో నివసిస్తున్నారు. బీబీసీతో మాట్లాడుతూ ఆమె తన తండ్రి జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఆయుధాగారంపై దాడి
ఆ రోజుల్లో సమాంతర ప్రభుత్వానికి అవసరమైన ఆయుధాలను హౌసాబాయి సమకూర్చేవారు.
నాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆమె ''సాంగ్లి జిల్లాలోని భవానీ నగర్ పోలీస్‌స్టేషన్ ఆయుధాగారం నుంచి ఆయుధాలను ఎత్తుకొచ్చే బాధ్యతను నాకు అప్పగించారు. పట్టపగలు ఆయుధాలను అలా ఎత్తుకురావడమంటే పులి నోట్లో తల పెట్టడం లాంటిది. కానీ నేను ఎలాగైనా ఆ పని పూర్తి చేయాల్సిందే'' అని చెప్పారు.
''నా సహచరులలో కొంతమందిని తీసుకుని పోలీస్‌స్టేషన్ కాంపౌండ్‌లోకి ప్రవేశించాను. వారిలో ఒకరు నాకు సోదరుడిగా నటించాడు. పోలీసుల ఎదురుగా నా భర్త వద్దకు ఎందుకు వెళ్లవంటూ నన్ను కొట్టడం ప్రారంభించాడు. నా తల మీద విసరడానికి పెద్ద రాయి తీసుకున్నాడు. అప్పుడు ఇద్దరు పోలీసులు వచ్చి అతణ్ని ఆపడానికి ప్రయత్నించారు. అలా మేం మా నాటకాన్ని కొనసాగించాం. ఈలోగా మిగిలిన మా వాళ్లు పోలీసుస్టేషన్‌లో ప్రవేశించి తుపాకులు, తూటాలు తీసుకుని పారిపోయారు'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, SUBHASH PATIL
'ప్రజలకు నిజంగా స్వాతంత్ర్యం వచ్చిందా?'
'క్రాంతిసింహ్ పాటిల్ తన జీవితమతా అడవుల్లో తిరుగుతూ, రహస్య జీవితం గడుపుతూ సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్న నన్ను వేధిస్తోంది. ప్రజలకు నిజంగా స్వాతంత్ర్యం వచ్చిందా? ఇప్పటికీ మనం జనానికి కూడు, గూడులాంటి ప్రాథమిక అవసరాలను తీర్చలేకపోవడం చూస్తే ఆ అనుమానం కలుగుతోంది'' అన్నారు హౌసాబాయి.
ప్రస్తుత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఆమె, ''మా నాన్న క్రాంతిసింహ్ పాటిల్ కనుక ఇప్పుడు జీవించి ఉంటే, ఈ ప్రభుత్వాన్ని మూడు రోజులలో కూలదోసేవాళ్లు'' అన్నారామె.
నానా పాటిల్‌కు హౌసాబాయి ఒక్కగానొక్క కుమార్తె. హౌసాబాయికి మూడేళ్ల వయసులోనే తల్లి మరణించింది.
తండ్రి నిరంతరం స్వాతంత్ర్యం సంగ్రామంలో నిమగ్నుడై ఉండడం వల్ల కూతురితో ఎక్కువ సమయం గడపలేకపోయేవాడు. దానికి తోడు ఆయన రహస్య జీవితం కారణంగా హౌసాబాయి తన జీవనం కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. ఆ క్రమంలోనే ఆమె వ్యక్తిత్వంలో దేశభక్తి బీజాలు నాటుకున్నాయి.
ఆ తర్వాత ఆమె పూర్తిగా సమాంతర ప్రభుత్వ కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. రహస్య జీవితం గడిపే కార్యకర్తలకు సందేశాలు చేరవేయడం, ఆహారాన్ని అందించడం, ఆయుధాలను రవాణా చేయడంలాంటి పనులన్నీ ఆమె చేసేవారు.

ఫొటో సోర్స్, SUBHASH PATIL
ఉద్యమంలో తన పాత్ర గురించి వివరిస్తూ ఆమె, ''రహస్య సందేశాలను తీసుకెళ్లేప్పుడు పోలీసులు వాటిని కనిపెట్టలేకుండా వాటిని మా జుట్టులో దాచుకునేవాళ్లం. లేకపోతే మా పాదాలకు అతికించుకునేవాళ్లం.''
''ఒకసారి, నేను మరో కార్యకర్త వెళ్తుంటే బ్రిటిష్ అధికారులు మమ్మల్ని ఆపి, ప్రశ్నించడం ప్రారంభించారు. అప్పుడు మేం ఒక రహస్య సందేశాన్ని మోసుకెళ్తున్నాం. దాంతో జరగబోయేది అర్థమై నేనా చీటిని నోట్లో వేసుకుని మింగేశాను. దాంతో మేం సురక్షితంగా బయటపడ్డాం'' అని తెలిపారు.
''నేను నా తండ్రితో పాటు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాను. అలాగే ఇతర మహిళలు కూడా పాల్గొనేలా చేశాను. ఆ సమాంతర ప్రభుత్వం ప్రభావం ఎంత శక్తిమంతంగా ఉండేదంటే, పంట నూర్చే మహిళలు కూడా విప్లవకారులను కీర్తిస్తూ పాటలు పాడేవాళ్లు'' అని ఆమె తెలిపారు.
నానా పాటిల్ తన కూతురిని స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న మరో యోధుడు భగవాన్‌రావ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లిలో ఎలాంటి కట్నమూ లేదు, ఎలాంటి ఆడంబరాలూ లేవు, ఎలాంటి వేడుకలూ జరపలేదు. కేవలం నవదంపతులిద్దరూ దండలు మార్చుకున్నారంతే.
ప్రస్తుత పరిస్థితులపై హౌసాబాయి ''మనం కేవలం ఆంగ్లేయులను వెళ్లగొట్టి, మనవాళ్ల పాలనను తెచ్చుకున్నాం. అయితే ఎక్కడో, ఏదో తప్పు జరిగింది. ఆనాటి స్వాతంత్ర్య యోధుల పోరాటాలతో సిద్ధించిన స్వాతంత్ర్యం ఇవాళ అస్తవ్యస్తంగా మారుతోంది'' అన్నారు.
ఇవికూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








