నెహ్రూ కాలర్ పట్టుకుని నిలదీసిన మహిళ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇక్బాల్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎవరైనా రాజకీయ నాయకునికి వ్యతిరేకంగా నల్లజెండాలు చూపడమో లేదా నిరసన ప్రదర్శన నిర్వహిస్తే.. చాలా సందర్భాల్లో ఆ నాయకులు నిరసనకారులతో మాట్లాడతారు. లేకుంటే వాళ్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తారు.
ఒకవేళ ఏదైనా కారణాలతో ఆ నాయకులు నిరసన తెలిపేవాళ్లను కలవలేకపోతే.. సాధారణంగా పోలీసులు వాళ్లను వీఐపీల దారి నుంచి తొలగిస్తారు. కానీ ప్రస్తుత భారతీయ రాజకీయాలలో ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది.
జులై 27న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అలహాబాద్ పర్యటన సందర్భంగా, కొంతమంది అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు ఆయన కాన్వాయ్‌కు ఎదురెళ్లి, నల్లజెండాలు ప్రదర్శించారు.
వారిలో నేహా యాదవ్, రమా యాదవ్ అనే విద్యార్థినులు, కిషన్ మౌర్య అనే విద్యార్థి ఉన్నారు. ఆ సందర్భంగా మగపోలీసులు వారిని లాఠీలతో కొట్టడమే కాకుండా, వారి జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోయారు.
ఈ ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఆ తర్వాత వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, ఆయన వారిని పధ్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
తర్వాత వాళ్లకు అలహాబాద్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కరుణానిధికి సంబంధించి బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనాలు


ఫొటో సోర్స్, Getty Images
బెయిల్‌పై విడుదలైన అనంతరం నేహా యాదవ్ బీబీసీతో మాట్లాడుతూ, ''యూనివర్సిటీలో ఒక ఏడాది పాటు రీసెర్చ్ స్కాలర్స్‌కు హాస్టల్ వసతి లభించలేదు. దాని వల్ల నేను అనేక సమస్యలు ఎదుర్కొన్నాను. మేం చాలా నెలలుగా వీసీని కలవడానికి ప్రయత్నిస్తున్నా, ఆయన మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు'' అని తెలిపారు.
''అమిత్ షా అలహాబాద్‌కు వస్తున్నారని తెలిసి మా బాధలు ఆయనకు చెప్పకోవాలనుకున్నాం. అది కుదరకపోవడం వల్లే నల్లజెండాలతో నిరసన తెలిపాం. కేవలం అలా నిరసన తెలిపినందుకే పోలీసులు మమ్మల్ని కొట్టి, జుట్టు పట్టుకుని అవమానించారు. కనీసం అక్కడ మహిళా పోలీసులు కూడా లేరు. జైలులోనూ మమ్మల్ని సాధారణ ఖైదీల్లా చూశారు. ఇంత జరిగినా అమిత్ షా మాకు ఏం కావాలో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు'' అన్నారు.
అయితే అలహాబాద్ ఎస్‌ఎస్‌పీ నితిన్ తివారీ మాత్రం అన్నీ చట్టప్రకారమే చేశామని తెలిపారు.
ఈ కేసులో విద్యార్ధులు చెప్పేది నిజమా, పోలీసులు చెప్పేది నిజమా అన్నది కాదు సమస్య. ఇలాంటి నిరసనలపై రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని తరచి చూడాల్సి ఉంటుంది.
బీజేపీ నేతలు తరచుగా మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను విమర్శిస్తుంటారు. మరి నెహ్రూ అలాంటి సందర్భాలలో ఎలా ప్రవర్తించేవారు?
విమర్శలను గౌరవించిన నెహ్రూ
ఇది 1937 నాటి విషయం. స్వాతంత్రోద్యమం ఉధృతంగా సాగుతోంది. నెహ్రూ మూడోసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అదే సమయంలో కోల్‌కతా నుంచి వెలువడే 'మాడర్న్ రివ్యూ' పత్రికలో చాణక్య అనే రచయిత పేరిట ఒక వ్యాసం వెలువడింది.
ఆ వ్యాసంలో ''నెహ్రూను ప్రజలు ఆదరిస్తున్న విధానం, ఆయనకు క్రమంగా పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే, ముందుముందు ఆయన నియంత కాడు కదా అన్న భయం కలుగుతోంది'' అని రాశారు.
తర్వాత తెలిసింది ఏమంటే, ఆ చాణక్య ఎవరో కాదు.. నెహ్రూనే. మారు పేరు మీద ఆయనే ఆ వ్యాసాన్ని రాశారు. ప్రజలు తన పట్ల చూపిస్తున్న ఆదరణ వల్ల తాను నియంతగా మారడు కదా అన్న అనుమానం ఆయనకు కలిగింది.

ఫొటో సోర్స్, Getty Images
నెహ్రూ రాజకీయాలు, వ్యక్తిగత సంబంధాలు
ఇంకాస్త ముందుకు వస్తే.. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం, నెహ్రూ ప్రధానమంత్రిగా మారడం జరిగాయి.
అది 1949. నెహ్రూ దిల్లీలోని జైలులో ఉన్న రామ్‌మనోహర్ లోహియాకు ఒక మామిడి పళ్ల బుట్టను పంపారు.
నాడు హోంమంత్రిగా ఉన్న సర్దార్ పటేల్‌కు ఇది నచ్చలేదు. కానీ నెహ్రూ 'రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు' అంటూ దానిని తోసిపుచ్చారు.
విషయం ఏమిటంటే, నేపాల్‌లో రాణాలు అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి నిరసనగా డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా తన సోషలిస్టు సహచరులతో కలిసి దిల్లీలోని నేపాలీ ఎంబసీ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
కాంగ్రెస్‌లో ఉన్నపుడు లోహియా, నెహ్రూలు కలిసి పనిచేశారు. లోహియా నెహ్రూను తన హీరోగా భావించేవారు. కానీ స్వాతంత్ర్యానంతరం వారిద్దరి దారులూ వేరయ్యాయి. అందువల్లే లోహియా నెహ్రూ మరణాంతరం ''1947కు ముందు నాటి నెహ్రూకు నా నివాళులు'' అన్నారు.
అయితే రాజకీయంగా ఎంత వైరం ఉన్నా, వారి వ్యక్తిగత సంబంధానికి అది ఆటంకంగా మారలేదు.
చైనా అక్సాయ్ చిన్‌ను ఆక్రమించుకున్నపుడు దానిపై పార్లమెంట్‌లో చర్చ జరిగింది. నెహ్రూ దానిపై మాట్లాడుతూ, ''అక్సాయ్ చిన్ బంజరు ప్రాంతం. అక్కడేమీ పండదు'' అన్నారు.
దానికి బదులుగా లోహియా, ''మీది బట్టతల కదా? అక్కడేమీ జుట్టు మొలవడం లేదని దాన్ని కత్తిరించుకుంటారా?'' అని ప్రశ్నించారు.
అయినా నెహ్రూ దానిని సీరియస్‌గా తీసుకోలేదు.
నెహ్రూ కాలర్ పట్టుకున్న మహిళ
అయితే వీటన్నిటికన్నా ఆసక్తికరమైన మరో కథనం కూడా ఉంది.
ఒకసారి ఓ మహిళ పార్లమెంట్ ప్రాంగణంలోకి వచ్చి, నెహ్రూ కాలర్ పట్టుకున్నారు. ''భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మీరు ప్రధానమంత్రి అయ్యారు. కానీ నాకేం ఒరిగింది?'' అని ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా నెహ్రూ, ''మీరు ఇలా నా కాలర్ పట్టుకుని అడిగే అధికారం వచ్చింది'' అని సమాధానం ఇచ్చారు.
నెహ్రూకు ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని వెల్లడించే సంఘటనలు ఇంకా అనేకం ఉన్నాయి.
1955లో పోలీసులు బిహార్ విద్యార్థులపై కాల్పులు జరిగాయి. తర్వాత నెహ్రూ పట్నాకు వచ్చినపుడు, సయ్యద్ షహబుద్దీన్ అనే విద్యార్థి నెహ్రూకు వ్యతిరేకంగా ఎయిర్‌పోర్టులో అనేకమంది విద్యార్థులతో కలిసి నల్లజెండాల ప్రదర్శన నిర్వహించారు.
సరిగ్గా రెండేళ్ల తర్వాత అదే యువకుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. కానీ ఇంటలిజెన్స్ విభాగం, నాటి నిరసన ప్రదర్శనలను చూపిస్తూ, ఆ యువకుని నియామానికి అభ్యంతరం తెలిపింది.
ఆ వ్యవహారం నెహ్రూ వద్దకు వచ్చినపుడు ఆయన స్వయంగా ఆ ఫైలుఫై ''ఆ ప్రదర్శన రాజకీయాలకు సంబంధించినది కాదు. అది కేవలం యువత అత్యుత్సాహం'' అని రాశారు.
విదేశీ వ్యవహారాల శాఖ నట్వర్ సింగ్ నెహ్రూ సంతకం చేసిన ఆ ఫైల్ నొటేషన్‌ను షాబుద్దీన్‌కు అందిస్తూ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు.
అదే షాబుద్దీన్ ఫారిన్ సర్వీసెస్‌కు ఎంపికై, వాజ్‌పేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. నెహ్రూ షాబుద్దీన్‌కు క్లీన్ చిట్ ఇవ్వకపోయి ఉంటే ఆయన ఏమైపోయి ఉండేవారో?

ఫొటో సోర్స్, Getty Images
తప్పును గుర్తించిన నెహ్రూ
నాగాలాండ్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలన్న డిమాండ్ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఉంది. నెహ్రూ నాగా నేత ఫీజోను కలిసినపుపుడు - స్వాతంత్ర్యం ఇవ్వలేం కానీ, రాజ్యాంగ పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తామని అన్నారు.
ఆ తర్వాత 1953లో నెహ్రూ నాటి బర్మా ప్రధాని యూ నూతో కలిసి నాగాలాండ్‌లో పర్యటించారు.
అప్పుడు నాగా నేతలతో కలిసి వారిద్దరూ ఒక సమావేశంలో పాల్గొంటుండగా, హఠాత్తుగా కొంతమంది నాగా నేతలు లేచి బైటికి వెళ్లిపోయారు. ఇది నెహ్రూకు చాలా అవమానకరంగా అనిపించింది. కానీ నెహ్రూ వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
మరోసారి నెహ్రూ బహిరంగంగా ఒక సుప్రీంకోర్టు జడ్జిని విమర్శించారు. అయితే వెంటనే తన తప్పు తెలుసుకుని, మరుసటి రోజే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తానన్న మాటలపై విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.
మీడియా విషయంలో కూడా ఆయన ఎన్నడూ జర్నలిస్టులపై ఒత్తిడి తీసుకురాలేదు.
ముంబయికి చెందిన ప్రముఖ జర్నలిస్టు డీఎఫ్ కరాకా (1911-1974) తాను రాసిన 'నెహ్రూ- ద లోటస్ ఈటర్ ఫ్రమ్ కశ్మీర్' పుస్తకంలో నెహ్రూను తీవ్రంగా విమర్శించారు. కానీ నెహ్రూ ఎన్నడూ దానిని నిషేధించాలనే యోచన చేయలేదు.
ఒకసారి అమెరికన్ జర్నలిస్ట్ నార్మన్ కజిన్స్ నెహ్రూను ''మీరు మీ వారసత్వంగా దేనిని వదిలి వెళ్లాలనుకుంటున్నారు?'' అని ప్రశ్నించారు.
దానికి సమాధానంగా నెహ్రూ, ''తమను తాము పరిపారించుకోగల ప్రజలను'' అని సమాధానం ఇచ్చారు.
ఇవికూడా చదవండి
- మల్టీప్లెక్స్: సినిమా టికెట్ రూ.150, పాప్‌కార్న్ రూ.270 ఎందుకిలా?
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
- చైనా బాహుబలి: వారం రోజులు కూడా ఆడని భారీ బడ్జెట్ సినిమా ‘అసుర’
- ఆమిర్ ఖాన్‌కు చైనాలో అంత ఫాలోయింగ్ ఎందుకు?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: చనిపోయే దాకా దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి?
- భవిష్యత్ బాగుండాలంటే ప్రజాస్వామ్యాన్ని మార్చాల్సిందేనా?
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








