కరుణానిధిని ఎందుకు ఖననం చేశారు?

కరుణ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తరహాలోనే డీఎంకే అధినేత కరుణానిధిని ఖననం చేశారు.

కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి (94) చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు.

జయలలిత మృతి సమయంలో ఆమెను దహనం చేయకుండా ఖననం ఎందుకు చేశారనే ప్రశ్న తలెత్తింది.

ఆ సమయంలో మద్రాసు యూనివర్సిటీకి చెందిన తమిళ ప్రొఫెసర్ డాక్టర్ వి.అరుసు బీబీసీతో మాట్లాడుతూ, ద్రవిడ ఉద్యమంలో పాల్గొన్నందువల్లే జయలలితను దహనం చేయకుండా ఖననం చేశారని తెలిపారు.

''హిందూ సంప్రదాయాలు , బ్రాహ్మణ పద్ధతులను ద్రవిడ ఉద్యమకారులు నమ్మరు. జయలలిత, కరుణానిధి ఆ ఉద్యమంలో పాల్గొన్నవారు కాబట్టి వారిని దహనం చేయడం లేదు'' అని చెప్పారు.

జయలలిత

ఫొటో సోర్స్, Reuters

బ్రాహ్మణ వ్యతిరేకత

జయలలిత కూడా ద్రవిడ పార్టీ నాయకురాలే. కరుణనిధి కూడా ఎప్పటి నుంచో ద్రవిడ ఉద్యమంలో భాగస్వామ్యులై ఉన్నారు. అందుకే జయలలిత మాదిరిగా ఆయన మృతదేహాన్ని కూడా ఖననం చేయనున్నారు.

ద్రవిడ ఉద్యమకారులు హిందూ ఆచారాలు, పద్ధతులనే కాకుండా కులాన్ని సూచించే పేర్లను కూడా పెట్టుకోరని వి.అరుసు తెలిపారు.

కరుణానిధి

ఫొటో సోర్స్, Getty Images

జయలలిత కంటే ముందు ఎంజీ రామచంద్రన్‌ను కూడా ఖననం చేశారు.

డీఎంకే వ్యవస్థాపకుడు, ద్రవిడ ఉద్యమ నేత అన్నాదురై సమాధి సమీపంలోనే వీరిద్దరి సమాధులున్నాయి.

ఎంజీఆర్ మొదట్లో డీఎంకేలోనే ఉండేవారు. అన్నాదురై మృతి తర్వాత పార్టీ పగ్గాలను కరుణానిధి చేపట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఎంజీఆర్, కరుణల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో ఎంజీఆర్ ..డీఎంకే నుంచి విడిపోయి అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)