1948 జనవరి 30: మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే...

ఫొటో సోర్స్, Fox Photos/Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1948, జనవరి 30, శుక్రవారం, రోజూలాగానే మొదలయ్యింది. గాంధీ తెల్లవారుఝామున మూడున్నరకే లేచారు.
ప్రార్థన చేసుకుని, ఓ రెండు గంటలు కాంగ్రెస్ కొత్త బాధ్యతలు, విధానాల మీద దృష్టి పెట్టి, మిగతావారు లేచేలోపు, ఆరు గంటలకి మళ్ళీ నిద్రకు ఉపక్రమించారు. మళ్ళీ ఎనిమిది గంటలకు లేచారు.
ఎప్పటిలాగే ఆయనకి నూనెతో మాలిష్ జరిగింది. స్నానం చేశాక మేక పాలు, ఉడికిన కూరగాయలు, ముల్లంగి, నారింజ రసం ఆరగించారు.
అదే సమయానికి, దిల్లీ నగరంలో మరో మూల, ఓల్డ్ దిల్లీ రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్‌లో నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే, విష్ణు కర్కరే ఇంకా నిద్రపోతూ ఉన్నారు.
ఇక్కడ, గాంధీ ఉపాహారం తరువాత, తనని కలవడానికి సపరివారంగా వచ్చిన పాత స్నేహితుడు రుస్తమ్ సోరాబజీతో కాసేపు సంభాషించారు. తరువాత దీల్లీలోని ముస్లిం లీడర్లను కలిసి 'మీ సమ్మతి లేకుండా వార్ధా వెళ్ళలేను' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Photodivision
పటేల్‌ను ఎందుకు కలిశారంటే..
తరువాత, గాంధీ సన్నిహితులు అయిన సుధీర్ ఘోష్, ప్యారేలాల్ కలిసి లండన్ టైమ్స్‌లో వచ్చిన వార్త 'నెహ్రూ, పటేల్ మధ్యన అభిప్రాయబేధాలు'పై స్పందించమని కోరారు. ఆరోజు సాయంకాలం వారిద్దరి ముందూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని గాంధీ అన్నారు.
అక్కడ, బిర్లా హౌస్‌కి బయలుదేరేముందు గాడ్సేకి వేరుసెనగలు తినాలనే కోరిక కలిగింది. అతని మిత్రుడు ఆప్టే వాటిని ఎలాగోలా సంపాదించి మిత్రునికి ఇచ్చాడు. అవి తిన్నాక తృప్తిగా బయలుదేరారు.
సాయంత్రం నాలుగు గంటలకి వల్లభాయ్ పటేల్ తన కూతురు మనుబెన్‌తో సహా గాంధీని కలిసి ప్రార్థనా సమయం.. 5 గంటలు దాటే వరకూ ముచ్చటించారు.
అదే సాయంత్రం నాలుగుంపావుకి గాడ్సే, అతని మిత్రులు టాంగా ఎక్కి కనాట్ ప్లేస్‌కి వెళ్ళారు. అక్కడినుంచి ఇంకో టాంగా తీసుకుని బిర్లా హౌస్‌కి బయలుదేరారు. హౌస్‌కి ముందు రెండు వందల గజాల దూరంలోనే టాంగా ఆపించి దిగారు.
ఇక్కడ గాంధీ.. పటేల్‌తో మాట్లాడుతూనే, ఒకచేత్తో చరఖా చేత పట్టి, మరో చేత్తో ఆభా తెచ్చిపెట్టిన సాయంత్రం భోజనం చేయసాగారు. ప్రార్థనా సభకి ఆలస్యంగా వెళ్ళడం గాంధీకి ఇష్టం ఉండదు. ఈ విషయం గురించి ఆభా ఆందోళన చెందసాగింది. కానీ పటేల్‌కు ఈ విషయం గుర్తు చేసే ధైర్యం ఆమెకి లేదు. పైగా ఆయనకు ఉక్కుమనిషి అని పేరు కూడా ఉంది. అలాగని, ఆలస్యం అవుతోందని గాంధీకి చెప్పే ధైర్యమూ లేదు. చివరికి హాల్‌లో ఉన్న జేబు గడియారం తీసి టైము చూపించే ప్రయత్నం చేశారు. అది గమనించిన మనుబెన్ గాంధీకి చెప్పగా ఆయన ప్రార్థనా సభకి 5.10 ని. బయలుదేరారు.

ఫొటో సోర్స్, GANDHISMRITI.GOV.IN
అలా వెళుతుండగానే..
తన సహాయకులైన ఆభా, మను లతో కలిసి నడుస్తూ, వారితో సరదాగా ముచ్చటిస్తూ ప్రార్థనా సభకు చేరుకున్నారు. అక్కడకు చేరాక ప్రజలకు అభివాదం చేశారు.
ఎడమవైపు నుండి నాథూరామ్ గాడ్సే, గాంధీగారి వైపుకి వంగడం చూసి, ఆయన పాదాలకు నమస్కరించబోతున్నాడని మను భావించింది.
అసలే ఆలస్యమైపోయిందనుకుంటే ఇలా మధ్యలో వచ్చి ఇంకా జాగు చేస్తున్నాడని ఆభా కాస్త చిరాకు పడ్డారు. గాడ్సే విసురుగా మనుని తోసుకుంటూ ముందుకి వచ్చాడు.
మను చేతిలో ఉన్న మాల, పుస్తకం రెండూ కిందపడిపోయాయి. అవి తీసుకోవడానికి ఆమె కిందకు వంగారు.
అదే సమయంలో గాడ్సే తుపాకీ తీసి ఒకదాని వెనుక ఒకటి.. మూడు గుళ్ళు.. గాంధీ ఛాతీమీద, పొట్టలోకి దిగేట్టు పేల్చాడు. ఆయన నోటి నుండి "రామ్....రా...మ్" అనే శబ్దాలు వెలువడ్డాయి.
మరుక్షణం ఆయన శరీరం నేలకొరిగిపోయింది. ఆభా వెంటనే ఒరిగిపోతున్న ఆయన తలను తన చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు.
అక్కడ, గాంధీగారితో ఉన్న ఇద్దరు అమ్మాయిలను చూసి తను కాస్త కంగారుపడ్డానని గాడ్సే, తన సోదరుడైనా గోపాల్ గాడ్సేతో తరువాత అన్నాడు.

ఫొటో సోర్స్, NAna Godse
పోలీసులకోసం అరిచిన గాడ్సే
నాథూరామ్ గాడ్సే మాటల్లో.. "ఫైర్ చేసిన తరువాత నేను తుపాకీ గట్టిగా పట్టుకుని, చేతిని పైకెత్తి పోలీస్... పోలీస్ అని అరిచాను. ఇది ఒక ప్రణాళిక ప్రకారం, కావాలనే చేసిన పని అని ఒక్కరైనా గుర్తించాలన్నది నా ఉద్దేశం. ఇది ఆవేశంలో చేసిన పని కాదు అని అందరూ గుర్తించాలన్నది నా తాపత్రయం. నేను అక్కడనుంచి పారిపోయే ప్రయత్నం చేసినట్టుగానీ, తుపాకీ కిందపడేసినట్టుగానీ ఎవరూ అనుకోకూడదు. కానీ, ఇది జరిగిన వెంటనే అక్కడంతా నిశ్శబ్దం ఆవరించింది. ఒక నిమిషంపాటు ఎవరూ నా దగ్గరకు కూడా రాలేదు."
అక్కడే ఉన్న తోటమాలి వెంటనే గాడ్సేని పట్టుకుని తలపై బలంగా నెత్తురు వచ్చేట్టు మోదారు. కానీ, గోపాల్ గాడ్సే అతని పుస్తకమైన "గాంధీ హత్య మరియు నేను" లో దీనిని ఖండించారు. గాడ్సే పట్టిబడిన కొన్ని క్షణాల తరువాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతని తలపై గట్టిగా బాదడంతో రక్తం వచ్చింది అని రాశారు.

ఫొటో సోర్స్, NANA GODSE
నివాళి
గాంధీ నేలకొరిగిన కొంతసేపటికే అప్పటి వైస్రాయ్ మౌంట్‌బాటన్ అక్కడికి చేరుకున్నారు. గాంధీ విరిగిపోయిన కళ్ళద్దాలు తీసేసి ఉన్నాయి. కొవ్వుత్తుల వెలుతురులో, కళ్ళజోడు లేని ఆయన పార్థివ దేహాన్ని చూసి మౌంట్‌బాటన్ గుర్తుపట్టలేకపోయారు. ఎవరో ఆయన చేతికి కొన్ని గులాబీ రేకులను అందించారు. వాటిని ఆయన గాంధీ పార్థివశరీరంపై ఉంచి చివరి అంజలి ఘటించారు. ఇది, తన దేశపు ఆధిపత్యాన్ని ఓడించి, స్వాతంత్య్రాన్ని సంపాదించిన మహనీయుడికి ఆ దేశపు చిట్టచివరి వైస్రాయ్ అందించిన నివాళి.

ఫొటో సోర్స్, Getty Images
‘మానవత్వం హత్యకు గురైంది’
మను, గాంధీ తలని తన ఒడిలోకి తీసుకుని నుదుటి మీద ఆప్యాయంగా నిమురుతూ కూర్చుండిపోయింది. మానవ హక్కుల కోసం ఎన్నో ఆలోచనలు చేసిన తల అది.
గాంధీ హత్య అనంతరం "మంచిగా ఉండడం ఎంత ప్రమాదమో ఈ ఉదంతం సూచిస్తుంది" అని బెర్నార్డ్ షా అన్నారు.
దక్షిణాఫ్రికాకు చెందిన మార్షల్ జైన్ స్మట్స్ "మన మధ్యన రాజకుమారుడు ఇక లేడు" అని అన్నారు.
"గాంధీ హత్యతో.. సంపూర్ణ మానవత హత్యకు గురైంది" అని కింగ్ జార్జ్ VI తన సందేశం పంపించారు.

జిన్నా సందేశం
అందరికన్నా భావోద్వేగంతో కూడిన సందేశం పాకిస్తాన్ నుంచి మియా ఇఫ్తిఖారుద్దీన్ పంపించారు..."గత కొద్ది నెలల్లో అమాయకులైన మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలపై చేయి ఎత్తిన మాలో ప్రతి ఒక్కడూ గాంధీ మరణానికి కారకుడు".
జిన్నా తన సందేశంలో "అక్కడి హిందూ సముదాయంలో ఆయన ఒక మహోన్నత వ్యక్తి" అన్నారు.
గాంధీ ఆలోచనలు ఒక సముదాయానికి పరిమితమైనవి కావని, ఆయన వ్యక్తిత్వం ఒక సముదాయం కన్నా చాల పెద్దది అని జిన్నాకు అతని స్నేహితుడు నచ్చజెప్పబోగా "దటీజ్ వాట్ హి వజ్.. ఎ గ్రేట్ హిందు" అని జిన్నా తన సందేశాన్ని సమర్ధించుకున్నారు.
గాంధీ దహనసంస్కారాలు జరుగుతున్నప్పుడు చూడలేక మను, పటేల్ భుజంపై తల పెట్టి రోదించారు. కాసేపయ్యాక తల ఎత్తి చూసేసరికి, హఠాత్తుగా పటేల్ చాలా ముసలివారైపోయినట్టు కనిపించారు.
ఇవి కూడా చదవండి:
- మీరు చూడని ఇందిరాగాంధీ ఫొటోలు!
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- ఇందిరాగాంధీతో పోటీపడుతున్న నరేంద్ర మోదీ
- 'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?
- ఇందిర, ఫిరోజ్‌ల దాంపత్యం: అపోహలు, వదంతులు
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?
- స్వచ్ఛ భారత్: అంకెల వెంట పరుగులా!?
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









