అభిప్రాయం: ఇందిరాగాంధీతో పోటీపడుతున్న నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాజేష్ ప్రియదర్శి
    • హోదా, డిజిటల్ ఎడిటర్, బీబీసీ

ఇప్పటివరకూ దేశ ప్రజలు ప్రజాస్వామ్యంపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియను నిర్వహించే ఎన్నికల సంఘానికి పూర్తి స్వతంత్రత ఉందని, నిష్పాక్షికంగానే తన విధులను నిర్వర్తిస్తుందని ప్రజలు ఇప్పటివరకూ నమ్మారు.

ప్రజల నమ్మకానికి బలమైన కారణమేమిటంటే నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించిన గొప్ప చరిత్ర ఎన్నికల సంఘానికి ఉంది. ప్రత్యేకించి 1990ల్లో అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ టీఎన్ శేషన్ భారత ఎన్నికల వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘ ప్రస్తుత వైఖరి అనేక సందేహాలకు తావిస్తోంది.

గుజరాత్‌లో ఎన్నికల తేదీలను ప్రకటించకపోవడం, ప్రకటన విషయంలో తీవ్ర జాప్యం చేయడం నిష్పాక్షిక సంస్థగా భావించే ఎన్నికల సంఘంపై పలు సందేహాలకు కారణమవుతోంది. గుజరాత్‌లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో తీవ్ర జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ కోర్టుకు కూడా వెళ్ళడం పరిస్థితి తీవ్రతను చెప్తోంది.

ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కాంగ్రెస్‌కు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నారో మర్చిపోయినట్లుగా ఉన్నారు. అప్పటి ఎన్నికల కమిషనర్ జేమ్స్ లింగ్డో మీద తాను చేసిన తీవ్ర ఆరోపణల విషయం మోదీకి గుర్తులేదేమో.

సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

జేమ్స్ మైకేల్ లింగ్డో క్రైస్తవుడని అందుకే ఆయన మరో క్రైస్తవరాలైన సోనియా గాంధీకి సహకరిస్తున్నారని అప్పటి సీఎం నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై లింగ్డో కూడా తీవ్రంగానే స్పందించారు. "నాస్తికుడనే పదానికి కూడా అర్థం తెలియని ఇలాంటి దిగజారిన నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు" అని ఆయన స్పందించారు.

ఓ దేశంలో ప్రజాస్వామ్య పటిష్టతకు ఎన్నికల సంఘ నిష్పాక్షికత ఎంతో అవసరం. ఎన్నికల కమిషన్‌ మీద ప్రభుత్వాల ఒత్తిడి ఉండకుండా చూడటం అంతకన్నా ముఖ్యం. లేకపోతే ఎన్నికల కమిషన్ ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తుందనే విషయాన్ని ప్రజలు నమ్మరు.

ఈవీఎం పనితీరుపై అనుమానాలు: ఎన్నికల సంఘం వైఖరి

ఈ ఏడాది మార్చిలో ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనే అనుమానాలు వ్యక్తమైనప్పుడు ఎన్నికల కమిషన్ వైఖరి పలు సందేహాలకు తావిచ్చింది. ఈవీఎంల పనితీరుపై ఆందోళన అనవసరమని చెప్పే బదులు ఈవీఎంలను హ్యాక్ చేయలేరని మాత్రమే ఎన్నికల సంఘం తెలిపింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు సౌరభ్ భరద్వాజ్ శాసనసభలో ఓ యంత్రాన్ని హ్యాక్ చేసి చూపించారు.

ఎన్నికల సంఘం

ఫొటో సోర్స్, Getty Images

ఈవీఎంల పనితీరుపై అనుమానాలుండటం కొత్త విషయం కాదు. 2009లో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2011లో ఈ విషయంలో కోర్టుకు కూడా వెళ్లారు.

ఎన్నికల సంఘం ఈ సమస్యను మరింత జటిలం చేసింది. హ్యాకింగ్ చేసి చూపించండనే సవాలు విసరడంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఎవరైనా హ్యాక్ చేసి చూపిస్తానంటే పారదర్శకత, స్పష్టత అనే తన విధానాలను పక్కనపెడుతూ ఎన్నో షరతులు విధించింది.

ఇక రాబోయే ఎన్నికల నుంచి ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీపీఏటీ) విధానాన్ని ప్రవేశపెడుతున్నామని మే నెలలో 12వ తేదీన అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైది ప్రకటించారు. వీవీపీఏటీ పద్ధతి వల్ల తాను వేసిన ఓటు అనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అనే విషయాన్ని ఓటరు రసీదు రూపంలో తెలుసుకోవచ్చు. అయితే ఈ విధానాన్ని ముందే ప్రవేశపెట్టి ఉంటే అనుమానాలన్నీ ఎందుకు వ్యక్తమౌతాయి?

ఈవీఎం

ఫొటో సోర్స్, CHANDAN KHANNA

ఒకవేళ హ్యాకింగ్ ఆరోపణలు నిరాధారమైనా, కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి మాత్రం ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతను ప్రశ్నించేలా చేసింది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు ఏమాత్రం మంచిది కాదు.

ఎన్నికల కమిషనర్ పదవి ఒక రాజ్యాంగబద్ధ పదవి. ఈ పదవిని ప్రభుత్వం అభిశంసన ద్వారా తప్ప మరేవిధంగానూ తొలగించలేదు. ఎన్నికల సంఘం ప్రభుత్వం ఒత్తిళ్లకు లోనుకాకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశం.

శేషన్ చేపట్టిన సంస్కరణలు

1990లో అప్పటి కేంద్ర ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ భారత ఎన్నికల వ్యవస్థలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఓటింగ్‌లో రిగ్గింగ్ చేసే, అవినీతికి పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఎన్నికల వ్యయాలు తగ్గేలా చేశారు. నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఆయన ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడేందుకు పలు సంస్కరణలు చేపట్టారు.

ఎన్నికల సంఘం

ఫొటో సోర్స్, Getty Images

టీఎన్ శేషన్ పదవీకాలంలో వీపీ సింగ్, చంద్రశేఖర్, నరసింహారావు, అటల్ బిహారి వాజ్‌పేయి, హెచ్‌డి దేవెగౌడ ప్రధానమంత్రులుగా ఉన్నారు. కానీ శేషన్ మాత్రం ఏ నాయకుడికి, ఏ పార్టీకి కూడా అనుకూలంగా వ్యవహరించలేదు. సంస్కరణల విషయంపై దూకుడుగా వ్యవహరిస్తూ తన అధికారాలను ఆయన ఉపయోగించారు.

ఈ ఏడాది ఆగస్టు నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందు రాత్రి పెద్ద హైడ్రామా జరిగింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విపక్షాల అభ్యర్థి అహ్మద్ పటేల్ గెలిచారని ప్రకటించింది. కానీ అప్పుడు ఎన్నికల సంఘంపై ఎక్కడోచోట ప్రభుత్వ ఒత్తిళ్లున్నాయనే విషయం మాత్రం స్పష్టమైంది.

ఓ పటిష్ట ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సంఘానికి పూర్తి స్వతంత్రత ఉండాలి. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా తన విధులు నిర్వర్తించాలనే విషయాన్ని శేషన్ బలంగా నమ్మారు. కానీ ఇప్పుడు తమపై ప్రభుత్వ ఒత్తిళ్లు లేవని ఎన్నికల సంఘం చెబుతున్న మాటలను కూడా ఎవరూ నమ్మడం లేదు.

హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం అక్టోబర్ 12న జారీ చేసింది. కానీ గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. అంతకు ముందు ఎన్నికల సంఘం లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తుందని తీవ్రంగా చర్చ జరిగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాకర్షక పథకాలను ప్రారంభించాలని అనుకుంటున్నారని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఇవన్నీ జరగవనీ అందుకే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించలేదని విపక్షాలు అంటున్నాయి. ఇప్పుడిప్పుడే జై షా వివాదం ముదరడంతో ఆ రాష్ట్రంలో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా లేవనే, బీజేపీ కొంత సమయం కోరుతోందని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ అమలులోకొస్తుంది. ఈ కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ప్రజాకర్షక కార్యక్రమాలు నిర్వహించలేవు. ఈ ఎన్నికల కోడ్ విధానాన్ని కూడా శేషన్ ప్రవేశపెట్టారు.

అచల్ కుమార్ జ్యోతి

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ ఆంతర్యం?

ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2013 వరకూ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ హయాంలో గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో విపక్షాల వాదనలో కూడా బలం ఉందని అనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించలేదో దానికి ఆయన చెప్పిన కారణం కూడా గర్హనీయం.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉండడం వల్లనే ఈ రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడం లేదని అచల్ కుమార్ జ్యోతి అన్నారు. కానీ ఇదే ఏడాది మార్చిలో మణిపూర్, గోవాలో ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులు, వాతావరణం కూడా భిన్నంగానే ఉన్నాయి కదా? మరెందుకు అక్కడ ఒకేసారి ఎన్నికలు జరిపించారనే ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికల సంఘమే దీనికి సమాధానం చెప్పాలి.

ప్రధానమంత్రి చెబుతున్న విధంగా ఎన్నికల కమిషనర్ ప్రశ్నల మధ్య చిక్కుకుని ఉండకూడదు. ఆయన వైఖరి ఎటువంటి అనుమానాలకు తావులేకుండా ఉండాలి. తమ ప్రభావం కోల్పోయిన సంస్థల్లో ఎన్నికల సంఘమే కాదు.. నోట్ల రద్దు సమయంలో ఆర్‌బీఐ కూడా ఎందుకు అప్రతిష్ఠను మూటగట్టుకుందో అందరికీ తెలుసు.

చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎలా నిలిచినా.. ప్రజాస్వామ్యానికి పునాదులుగా పరిగణించే పార్లమెంట్, ఆర్‌బీఐ, ఎన్నికల సంఘం లాంటి సంస్థలను బలోపేతం చేసే విషయంలో మాత్రం ఆయన గుర్తుండరు. ఈ విషయంలో ఆయన ఇందిరాగాంధీతో పోటీపడుతున్నట్లు కనిపిస్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)