''బిల్‌గేట్స్ నన్ను డబ్బులు అడగటానికి వచ్చారు - కరుణానిధి''

- రచయిత, తంగవేల్ అప్పాచ్చి
- హోదా, ఎడిటర్, బీబీసీ తమిళ్
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ 2005లో ఒకసారి చెన్నైలోని డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు కరుణను చుట్టుముట్టి.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు మీ ఇంటికి వచ్చారు కదా! ఎలా ఫీలవుతున్నారు? అని అడిగారు. దానికి ''బిల్‌గేట్స్ నన్ను డబ్బులు అడగటానికి వచ్చారు'' అని ఠక్కున సమాధానం ఇచ్చారు కరుణ.
ప్రజాజీవితంలో కరుణానిధి ఎప్పుడూ ఇదే స్థాయి ఆత్మవిశ్వాసాన్ని కనబరిచారు.
బ్రిటిష్ పాలనాకాలంలో పుట్టిన కరుణ తమిళనాడుకు 5 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 13 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 70 ఏళ్ల పాటు ప్రజాజీవితంలో ఉన్న అరుదైన రాజకీయ నేతల్లో ఆయన ఒకరు.

కరుణానిధికి సంబంధించి బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనాలు


మాట..రాత..
రెండే రెండు ఆయుధాలతో తమిళ రాజకీయాలను కరుణ శాసించారు. అందులో ఒకటి ఆయన వాగ్ధాటి, రెండోది ఆయన రచనా నైపుణ్యం.
కరుణ ముందుతరం నేతలు అన్నాదురై, మదిఅళగన్ ఉన్నత చదువులు చదివితే, ఈయన స్కూల్ చదువు మధ్యలోనే వదిలేశారు. కానీ, వారికంటే ఎక్కువ రచనలు చేశారు. రచనపై ఉన్న మక్కువే ఆయనను శిఖర స్థాయిలో నిలబెట్టింది.
17 ఏళ్ల వయసులోనే హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనేందుకు విద్యార్థులను సమీకరించారు. తమిళనాడు స్టూడెంట్ క్లబ్‌ను స్థాపించారు.
సీఎన్ అన్నాదురైని 1940లో తొలిసారి కరుణ కలిశారు. పెరియార్‌తో విభేదాలు రావడంతో 1949లో అన్నాదురై డీఎంకేను స్థాపించారు. ఆ సమయంలో అన్నాదురైకి కరుణ సన్నిహితుడయ్యారు. పార్టీ ప్రచార కమిటీ మెంబర్‌గానే కాకుండా ఆ సంస్థను ముందుండి నడిపించి నాయకుడిగా మారారు.
అన్నాదురై మరణానంతరం 1969లో తొలిసారి తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టారు. పెట్టుబడిదారీ, సామ్యవాద సిద్ధాంతాలను మిళితం చేసి పాలన సాగించాలని అప్పటికే కరుణ నిశ్చయించుకున్నారు.
''రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో ముందుంచడంతో పాటు సగటు మనిషి సంక్షేమాన్ని ఆయన ఎప్పుడూ విస్మరించలేదు. ప్రజాపంపిణీ వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తరించారు. అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం అందించేందుకు ప్రయత్నించారు.'' అని కరుణ పాలన తీరును సీనియర్ జర్నలిస్టు ఎ.ఎస్.పన్నీరు సెల్వం విశ్లేషించారు.

'నా స్థాయి ఏంటో నాకు తెలుసు'
కరుణానిధి జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించినప్పటికీ కేంద్రంలో ఏ పదవులూ చేపట్టలేదు. ప్రధాన మంత్రి పదవి వరించే అవకాశం వచ్చినప్పటికీ కింగ్ మేకర్‌గా ఉండటానికే ఇష్టపడ్డారు.
ప్రధాని అయ్యే అవకాశం ఎందుకు వదులుకున్నారని ఎవరైనా అడిగితే.. 'నా స్థాయి ఏంటో నాకు తెలుసు' అని చెప్పేవారు.
1969లో కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోయినప్పుడు ఇందిరా గాంధీ ప్రభుత్వం పడిపోకుండా తన 25 మంది ఎంపీలతో చివరి వరకు మద్దతిచ్చారు. ఈ ఘటన జరగడానికి కొన్ని నెలల ముందే అన్నాదురై మరణించడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
కరుణానిధి ఎప్పుడూ ఘర్షణాత్మక వైఖరితో ఉంటారని విన్నానని ఒకసారి ఇందిరా గాంధీ వ్యాఖ్యానించారు. కానీ, ఆ వ్యక్తే ఇందిర ప్రభుత్వం కుప్పకూలకుండా కాపాడారు.
కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలని భావించే కరుణ.. కేంద్రీకృత పాలనను మాత్రం తీవ్రంగా వ్యతిరేకించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా..
నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. రిజర్వేషన్లపై మండల్ కమిషన్ రిపోర్ట్ తీసుకురావడంలో, శ్రీలంక నుంచి శాంతి సైన్యాన్ని వెనక్కి రప్పించడంలో, కావేరీ జలాలపై ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడంలో తమిళనాడు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
వీపీ సింగ్ రాజీనామా తర్వాత నేషనల్ ఫ్రంట్ తరఫున ప్రధానిగా దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ను ఎన్నుకోవడంలో కరుణ తనదైన పాత్ర పోషించారు.
ఎప్పుడూ మతవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా కనిపించే కరుణ.. 1999లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరడం దిగ్ర్భాంతి కలిగించింది. అయితే, తమ పాలనలో రామమందిర నిర్మాణం చేపట్టబోమని బీజేపీ మాట ఇవ్వడంతోనే వారితో జత కలిశానని కరుణానిధి స్పష్టం చేశారు.
కేంద్రంలో 1996 నుంచి 2014 వరకు సంకీర్ణ ప్రభుత్వాలు కుప్పకూలకుండా నడవడంలో డీఎంకే కీలకపాత్ర పోషించింది.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి పోరాటం
రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఉండాలని కరుణ పోరాడారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఆయన విమర్శలు చేసేవారు. రాష్ట్రాల అధికారాలు విస్తృతం చేయాలనే ఉద్దేశంతో డీఎంకే ప్రభుత్వ నేతృత్వంలో డాక్టర్ రాజమన్నార్ కమిటీని ఏర్పాటు చేశారు. 356 అధికరణ రద్దు, అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు తదితర సూచనలను ఈ కమిటీ చేసింది. అయితే, ఈ సూచనలను కేంద్రం ఆమోదించలేదు. ఈ విషయం పక్కనపెడితే నాయకుడిగా కరుణ వెనక్కి తగ్గలేదని ఈ ఉదంతం రుజువు చేస్తోంది.
వారసత్వ రాజకీయాలపై విమర్శలు
వారసత్వ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని ప్రతిపక్షాల నుంచి ఆయన తరచూ విమర్శలు ఎదుర్కొనేవారు. కరుణ కుమారుడు ఎంకే స్టాలిన్ ఇప్పుడు డీఎంకే అధినేత స్థాయిలో ఉన్నారు. అయితే, స్టాలిన్‌కు పార్టీ అధ్యక్ష పదవినో, ముఖ్యమంత్రి పదవినో కరుణ ఎప్పుడూ కట్టబెట్టలేదని ఆ పార్టీ వారు వాదిస్తుంటారు.
కరుణ మరో కుమారుడు అళగిరి, ఆయన చెల్లెలు కనిమొళి, కరుణ మేనల్లుడు మారన్ కుమారుడు దయానిధి మారన్ కూడా డీఎంకేలో కీలకంగా వ్యహరిస్తున్నారు.
కరుణ కుటుంబంలో పార్టీ పగ్గాల కోసం ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంది. స్టాలిన్‌ను తన వారసుడిగా ప్రకటించడంతో ఆయన పెద్ద కుమారుడు అళగిరి ఎదురుతిరిగారు. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

అవినీతి మరకలు
వ్యవస్థీకృత దోపిడీకి, అవినీతికి పాల్పడ్డారని కరుణపై విమర్శలు వచ్చాయి. అయితే, వీటిని డీఎంకే తోసిపుచ్చింది.
చెన్నైలోని ఫ్లైఓవర్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారంటూ 2001లో జయలలిత ప్రభుత్వం కరుణను అర్ధరాత్రి నాటకీయంగా అరెస్టు చేసింది. అయితే, ఇవి రాజకీయ కక్షసాధింపు చర్యలుగానే చాలా మంది భావించారు.
2007లో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని డీఎంకేకి చెందిన ఏ రాజా, కరుణ కుమార్తె కనిమోళిపై కేసులు నమోదవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది.
అవినీతి ఆరోపణల కారణంగా 2014 ఎన్నికల్లో డీఎంకే తగిన స్థాయిలో సీట్లు సంపాదించలేకపోయింది.

శ్రీలంకలో అంతర్యుద్ధాన్ని ఆపలేకపోయారు
అంతర్జాతీయంగా ఉన్న తమిళులకు ప్రతినిధిగా మన్ననలను అందుకున్న కరుణ.. శ్రీలంకలోని తమిళుల సమస్యలను విస్మరించారని విమర్శలు ఎదుర్కొన్నారు.
శ్రీలంక సైన్యానికి, ఎల్టీటీఈకి మధ్య 2009లో అంతర్యుద్ధం జరిగినప్పుడు శ్రీలంకలోని తమిళుల ప్రాణాలను కాపాడటంలో ఆయన విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
అయితే, డీఎంకే అధికార ప్రతినిధి కేఎస్ రాధాకృష్ణన్ ఆ విమర్శలను తోసిపుచ్చారు.
''ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు కరుణను మోసం చేశారు. యుద్ధాన్ని ఆపుతామని వారు మాట ఇచ్చారు. కానీ, వాస్తవంగా అది జరగలేదు. అయితే, చాలా మంది దీన్ని నమ్మడం లేదు. ఆయన మృతి తర్వాత కూడా ఈ విషయంపై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూనే ఉన్నారు.'' అని చెప్పారు.

'తార'లను సృష్టించిన తార
రాజకీయాల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించిన కరుణ సినీరంగంలో సూపర్ స్టార్‌లను తయారు చేశారు.
1949లో 'మంత్రి కుమారి' సినిమాకు ఆయన మాటలు అందించారు. ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ఎంజీఆర్, ఆ తర్వాత సూపర్ స్టార్ అయ్యారు.
శివాజీ గణేశన్, ఎస్ఎస్ రాజేంద్రన్ నటించిన 'ప్రజాశక్తి' సినిమా సూపర్ హిట్ అవడంతో వారికి మంచి పేరు వచ్చింది. దీనికి కూడా కరుణనే మాటలు రాశారు.
1954లో 'మనోహర' సినిమాకు మాటలు అందించారు. ఇది కూడా సూపర్ హిట్టే. ఈ చిత్రం స్క్రిప్ట్‌ను కరుణ పుస్తకంగా తీసుకొచ్చి కొంత డబ్బు కూడా సంపాదించారు. దీనితో పాటు పార్టీ పత్రిక మురసోలి కోసం ప్రింటింగ్ ప్రెస్ కూడా కొన్నారు. మురసోలిని తన మొదటి సంతానంగా కరుణ భావించేవారు.
''ధైర్యవంతుడికి మరణం ఉండదు. పిరికివాడికి జీవితం ఉండదు'' అని పార్టీ పత్రిక మురసోలిలో కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆయన తరచూ రాసేవారు.
ఇవికూడా చదవండి
- మల్టీప్లెక్స్: సినిమా టికెట్ రూ.150, పాప్‌కార్న్ రూ.270 ఎందుకిలా?
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
- చైనా బాహుబలి: వారం రోజులు కూడా ఆడని భారీ బడ్జెట్ సినిమా ‘అసుర’
- ఆమిర్ ఖాన్‌కు చైనాలో అంత ఫాలోయింగ్ ఎందుకు?
- మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే..
- సోనియా గాంధీ గౌను ఇందిర రక్తంతో తడిచిపోయింది..
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








