‘‘స్మార్ట్ కళ్లజోడుతో నన్ను రహస్యంగా చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు’’

ఫొటో సోర్స్, Georgia Poncia/BBC
- రచయిత, జార్జియా పాన్సియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
భవిష్యత్తులో ముఖ్యమైన టెక్నాలజీగా చెబుతున్న స్మార్ట్ కళ్లజోళ్లు మరోసారి ప్రాచుర్యం పొందుతున్నాయి.
కానీ, ఈ ఉత్పత్తులను మహిళల గోప్యతను ఉల్లంఘించడానికి, వారిని అవమానించేందుకు, వేధించడానికి వాడుతున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా ఒకరు అంతర్గతంగా కెమెరా ఉన్న స్మార్ట్ కళ్లజోడు ద్వారా తనను చిత్రీకరించారని ఉనా చెప్పారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో చేశారని, దానికి సుమారు 10 లక్షల వ్యూస్, వందలాది కామెంట్లు వచ్చాయని తెలిపారు. ఈ కామెంట్లలో చాలా వరకు లైంగిక వేధింపులకు చెందినవే. అవి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి.
''నాకేం జరుగుతోందో నాకు తెలియదు. రహస్యంగా వీడియో తీసేందుకు, దాన్ని పోస్టు చేసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ ఘటన నన్ను చాలా భయపెట్టింది. ఇప్పుడు జనాల్లోకి వెళ్లాలంటే భయంవేస్తోంది'' అని ఉనా తెలిపారు.
గత ఏడాది జూన్‌లో బ్రైటన్ బీచ్‌లో సన్ బాత్ చేసిన తరువాత తన వద్దకు స్మార్ట్ కళ్లజోడు పెట్టుకున్న ఒక వ్యక్తి తన వద్దకు వచ్చారని ఉనా చెప్పారు. ఆ వ్యక్తి ఆమె పేరును, ఆమె ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుని ఫోన్ నెంబర్ ఇస్తారా అని అడిగారు. కానీ ఉనా ఆ వ్యక్తిని మర్యాదగా తిరస్కరించి, తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నట్లు తెలిపారు.

కొన్ని వారాల తర్వాత, ఆమెకో టిక్‌టాక్ వీడియో వచ్చింది. అది ఆమె బీచ్‌లో అపరిచిత వ్యక్తితో జరిగిపన సంభాషణకు సంబంధించిన వీడియో. ఇది పూర్తిగా ఆమెను మాత్రమే చిత్రీకరించిన వీడియో. ఇందులో సంభాషణ జరిపిన వ్యక్తి లేరు. దీంతో తనను ఆ వ్యక్తి స్మార్ట్ కళ్లజోడు ద్వారా చిత్రీకరించాడని ఆమె అర్థం చేసుకున్నారు.
స్మార్ట్ కళ్లజోడు ధరించే వ్యక్తికి, ఆ కళ్లజోడు స్మార్ట్‌ఫోన్ తరహా సమాచారాన్ని, అప్లికేషన్లను అంటే మ్యాప్స్ చూసుకోవడం, మ్యూజిక్ వినడం, వీడియోలు రికార్డు చేసుకోవడం తదితర ఫీచర్లను అందిస్తుంది.
ఆ వీడియోకు వ్యూస్ పెరగడం చూసి చూసి తను చాలా భయోద్వేగానికి గురైనట్లు ఉనా చెప్పారు. ఆ వీడియోలో తాను బ్రైటన్‌వాసిననే విషయం వెల్లడి అయిందని, కింద కామెంట్లు చాలా అసభ్యంగా ఉన్నాయని తెలిపారు.
''నా చేతిలో ఏం లేదు, నాకు చాలా భయం వేసింది'' అని ఉనా చెప్పారు.

ఫొటో సోర్స్, TikTok
ఉనా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలని వీడియో తీయడం చట్టవిరుద్ధం కాదని, ఈ విషయంలో తామేమీ చేయలేమని పోలీసులు చెప్పారు.
''ప్రతి మహిళకు ఇలాంటివి జరుగుతాయని నాకు తెలుసు. కానీ, ఇలాంటి సంభాషణలు చిత్రీకరించి, ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తారన్న ఆలోచనే నాకు చాలా భయానకంగా ఉంది'' అని ఉనా తెలిపారు.
ఉనా వీడియోను పోస్టు చేసిన అకౌంట్‌కు సంబంధించిన యజమానిని బీబీసీ సంప్రదించింది. కానీ, వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
ఉనా వీడియోను పోస్టు చేసిన వ్యక్తి తన టిక్ టాక్ పేజీలో ఇదే తరహాలో కొన్ని వందల వీడియోలను పోస్టు చేశారు. ఈ రకమైన కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నది ఈయనొక్కరే కాదు.

ఫొటో సోర్స్, Georgia Poncia/BBC
‘‘జిమ్‌లో ఉన్నప్పుడు వీడియో తీశారు’’
స్మార్ట్ కళ్లజోడు పెట్టుకున్న మరో వ్యక్తి, కేట్ వీడియోను చిత్రీకరించారు. ఆమె జిమ్‌లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వెళ్లి నెంబర్ అడిగారు.కానీ కేట్ తన నెంబర్ ఇవ్వడానికి తిరస్కరించారు. ఈ సంభాషణకు చెందిన వీడియో, ఆ తర్వాత రోజు ఆమెకు పంపించారు. టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేశారు.
ఆన్‌లైన్‌లో పోస్టు చేసిన ఆరు గంటల్లోనే.. ఆ వీడియోకు సుమారు 50 వేల వ్యూస్ వచ్చాయి. కేట్ శరీరాకృతిపై, ప్రవర్తనపై పలు అసభ్యకరమైన, అనుచితమైన కామెంట్లు వచ్చాయి.
''నాకు వాంతులు వచ్చేంత అసహ్యంగా అనిపించింది. జరిగిన దాంతో నాకు సంబంధం లేదని అర్థం చేసుకోకుండానే ఇంటర్‌నెట్‌లో ప్రజలు నన్ను ఇమిటేట్ చేస్తుండటంపై, ఎగతాళిగా మాట్లాడుతుండటంపై ఆందోళనగా అనిపించింది'' అని కేట్ తెలిపారు.
వీడియో రూపొందించిన వ్యక్తిపై తనకు చాలా కోపం వచ్చినట్లు కేట్ చెప్పారు. ''ఆన్‌లైన్‌లో నీచమైన పాపులారిటీ పొందేందుకే ఇదంతా.'' అని తెలిపారు.
రెండుసార్లు తాను లైంగిక వేధింపులకు గురైనట్లు కేట్ బీబీసీకి చెప్పారు. ''కొన్నిసార్లు మీ మానసిక ఆరోగ్యం బాగుపడుతుందని మీకనిపించవచ్చు. కానీ, ఇలాంటివి జరుగుతాయి'' అన్నారు.
ఫిర్యాదులు అందిన తర్వాత.. ఉనా, కేట్‌కు చెందిన వీడియోలను పోస్టు చేసిన ఆ అకౌంట్ల నుంచి టిక్ టాక్ తొలగించింది.

ఫొటో సోర్స్, Georgia Poncia/BBC
‘‘ఇది ప్రమాదకరం’’
అనుమతి లేకుండా స్మార్ట్ గ్లాసెస్ ద్వారా మహిళలను చిత్రీకరించే ట్రెండ్ పెరగడం చాలా బాధాకరమని ‘‘ఎండ్ వయెలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్ కొయిలేషన్ 'సభ్యురాలు రెబెకా హిచ్అ న్నారు.
''ఈ కళ్లజోడు నేరగాళ్లు లేదా మహిళలను అవమానపరిచే, సిగ్గుపడేలా చేసే ప్రమాదకరమైన లైంగిక స్వభావం ఉన్న వారు వాడే ప్రమాదముందని స్పష్టమైంది. మహిళలు, అమ్మాయిల విషయంలో ఇది కచ్చితంగా ఆందోళనకరమైన విషయం'' అన్నారు.
గూగుల్ గ్లాస్‌ను తొలి స్మార్ట్ కళ్లజోడుగా పరిగణిస్తున్నారు. 2014లో తొలిసారి యూకేలో విక్రయానికి వచ్చాయి. వీటి ధర సుమారు 1000 పౌండ్లు. అంటే భారత కరెన్సీలో 1,20,985 రూపాయలు.
అయితే ఇవి మార్కెట్‌లోకి వచ్చిన ఏడునెలల్లోపే గోప్యతకు సంబంధించిన ఆందోళనలు వెల్లువెత్తడంతో వీటి అమ్మకాలు 2015లో నిలిచిపోయాయి. చాలా బార్లు, రెస్టారెంట్లు తమ ప్రాంగణాల్లో స్మార్ట్ కళ్లజోడు వాడకాన్ని నిషేధించాయి.
ఏఐతో కూడిన స్మార్ట్ గ్లాసెస్‌తో తిరిగి ఈ మార్కెట్లోకి ప్రవేశించాలని ప్రస్తుతం గూగుల్ యోచిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
కాలక్రమేణా స్మార్ట్ కళ్లజోడును సాధారణ కళ్లజోడులా కనిపించేలా మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం వీటిని గుర్తించడం కష్టమవుతుందని నిపుణులు అంటున్నారు.
వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను కలిగి ఉన్న మెటా కంపెనీ 2021 నుంచి స్మార్ట్ కళ్లజోడును విక్రయిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి సుమారు 20 లక్షల జతల స్మార్ట్ కళ్లజోళ్లను అమ్మింది.
స్మార్ట్ కళ్లజోడును ఎల్‌ఈడీ లైట్‌తో రూపొందిస్తామని కంపెనీ చెప్పింది. ఎవరైనా రికార్డింగ్ చేసేటప్పుడు, ఆ లైట్ వెలిగి, ముందున్న వారిని అప్రమత్తం చేస్తుందని తెలిపింది. ఈ లైట్‌ను దాచి పెట్టడం వీలుకాని టెక్నాలజీని వాడుతున్నట్లు కంపెనీ చెప్పింది.
అయితే, రహస్యంగా వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఈ లైట్‌ను ఆపివేయడానికి లేదా దాచిపెట్టడానికి ఉపయోగించే ఎన్నో పద్ధతులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ పద్ధతుల్లో కొన్ని రికార్డు చేస్తున్నప్పుడు ఎల్ఈడీ లైట్‌ను దాచిపెడుతున్నాయని బీబీసీ ధ్రువీకరించింది.
ఉనా, కేట్‌ను రికార్డు చేస్తున్నప్పుడు కూడా వారు గ్లాసెస్‌పైన ఎలాంటి ఫ్లాష్ లైట్లను చూడలేదు.
దీనిపై మెటాను ప్రశ్నించగా.. ''కస్టమర్ ఫీడ్‌బ్యాక్, రీసర్చ్ ఆధారంగా తమ ఏఐ గ్లాసెస్‌ను మెరుగుపరిచే అన్ని అవకాశాలను పరిశీలిస్తాం'' అని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














