ఇరాన్‌లో నల్లటి వర్షం కురవడానికి కారణమేమిటి? ఇది ప్రమాదకరమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మార్క్ పోంటింగ్, అలెక్స్ ముర్రే, కెలీన్ డెవ్లిన్, బార్బారా మెట్‌జ్లెర్
- హోదా, బీబీసీ వెరిఫై
- చదివే సమయం: 4 నిమిషాలు
మీరెప్పుడైనా నల్లటి వర్షం (బ్లాక్ రెయిన్) గురించి విన్నారా? ఇరాన్‌లో కొంతమంది ఈ వర్షం గురించి చెప్పారు. ఇప్పుడీ బ్లాక్‌రెయిన్ విస్తృత చర్చకు దారితీసింది.
ఇంతకీ ఏమిటీ బ్లాక్ రెయిన్, ఇదెంతటి ప్రమాదకరం?
ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాయి. తర్వాత అక్కడి రాజధాని తెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో కనీసం నాలుగు చమురు స్థావరాలపై దాడులు జరిగినట్లు నిర్థరణ అయింది.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు, కాలుష్యం కారణంగా సూర్యుడు కూడా కనిపించడం లేదని, కాలిన వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు.

కాలుష్య కారకాలు గణనీయంగా పెరిగాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు కేంద్రాలపై దాడులు స్థానికుల ఆరోగ్యానికి ముప్పు కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) హెచ్చరించింది.
ఇంచుమించుగా కోటిమంది ప్రజలున్న తెహ్రాన్, లక్షలాదిమంది ప్రజలు నివసించే పరిసరాలలోనూ వాయు కాలుష్యం తీవ్రమైంది.
మార్చి9న తీసిన తాజా ఉపగ్రహ చిత్రాలను బీబీసీ వెరిఫై పరిశీలించింది. వాటిలో తెహ్రాన్‌లోని రెండు పెద్ద చమురు స్థావరాలు ఇంకా మంటల్లోనే ఉన్నట్టుగా కనిపించాయి.
తెహ్రాన్‌కు వాయువ్య దిశలో ఉన్న షహ్రాన్ డిపో, ఆగ్నేయ దిశలో ఉన్న తెహ్రాన్ ఆయిల్ రిఫైనరీ నుంచి పొగ ఎగజిమ్ముతున్నట్టు ఆ ఫోటోల్లో కనిపించింది.

ఫొటో సోర్స్, EPA
ఈ వర్షం ఎంతటి ప్రమాదకరం..
చమురు రిఫైనరీలపై జరిగిన దాడుల వల్ల వాయు కాలుష్యం పెరుగుతోంది. ఎందుకంటే వాటిలో విభిన్న రకాల రసాయనాలు ఉంటాయి.
చమురు పూర్తిగా దగ్ధం కాలేదంటే తగినంత ఆక్సిజన్ లేదని, కార్బన్ డయాక్సైడ్, నీటికి బదులుగా కార్బన్ మోనాక్సైడ్, నల్లటి కణాలు విడుదలవుతాయని అర్ధం.
చమురు మంటల వల్ల సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్ కూడా విడుదల కావచ్చు. ఇవి వర్షపు నీటిలో కలిస్తే ఆమ్లం (యాసిడ్)గా మారొచ్చు. వీటితోపాటు హానికరమైన హైడ్రోకార్బన్లు, మెటాలిక్ కాంపౌండ్స్, చమురు బిందువులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
తెహ్రాన్‌లో చమురు కేంద్రాలపై దాడులవల్ల ‘‘కాలిన వాసన’’ స్పష్టంగా తెలుస్తోందని ఓ 20 ఏళ్ల యువతి చెప్పారు.
"సూర్యుడు కనిపించడం లేదు. అన్ని వైపులా భయంకరమైన పొగ కమ్మకుంది, ఇప్పటికీ అలాగే ఉంది" అని ఆమె శనివారం బీబీసీ పర్షియన్‌కి చెప్పారు.
వాయు కాలుష్యాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టమైన పని. ఎందుకంటే భూమిపై నుంచి వాయు కాలుష్యాన్ని కొలిచే సమాచారం అందుబాటులో లేదు.
అలాగే గాలి, మేఘాలు, ఇతర కారణాల వల్ల ఉపగ్రహ సమాచారాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంది.
కానీ దెబ్బతిన్న చమురు స్థావరాల నుంచి బయటకు వస్తున్న అనేక రసాయనాల మిశ్రమాన్ని చూసినప్పుడు, ఇది హానికరమైనది, తీవ్రమైంది అనడంలో ఎలాంటి సందేహంలేదని శాస్త్రవేత్తలంటున్నారు.
ఇది బీజింగ్ లేదా దిల్లీ వంటి నగరాల్లో కనిపించే పొగకంటే చాలా భిన్నంగా ఉంది.
"ఇరాన్‌లో వాయు కాలుష్యం కచ్చితంగా చాలా భిన్నమైంది. ఎందుకంటే ఇది క్షిపణులు , ఆయిల్ రిఫైనరీలపై వైమానిక దాడుల వల్ల వ్యాపిస్తోంది. అనేక ఘర్షణల్లో ధూళి, కణాల కాలుష్యం పెరుగుతుంది, కానీ ఈ సందర్భంలో విభిన్న రసాయనాల 'మిశ్రమం' కచ్చితంగా అసాధారణమైంది" అని రీడింగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక శాస్త్రవేత్త డాక్టర్ అక్షయ్ దేవోరాస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నీటి వనరులు కలుషితం
తెహ్రాన్‌లో ఆదివారం "బ్లాక్ రెయిన్" పడిందని స్థానికులు చెప్పారు.
"బ్లాక్ రెయిన్" అధికారిక పదం కాదు. కానీ వర్షపు నీటిలో కాలుష్య పదార్థాలు కలిసిపోయి వర్షపు బిందువులు నల్లగా కనిపించే పరిస్థితిని ఇది సూచిస్తుంది.
సాధారణంగా వర్షం పడేటప్పుడు గాలిలో ఉన్న కాలుష్య పదార్థాలు కొట్టుకుపోతాయి.
"బ్లాక్ రెయిన్" పడడం చాలా అరుదు. ఇది సాధారణంగా గాలిలో ఎక్కువ స్థాయిలో పొగ, కాలుష్య కణాలు ఉన్నప్పుడు జరుగుతుందని శాస్త్రవేత్తలు బీబీసీ వెరిఫైకి చెప్పారు.
"వర్షపు బిందువులు చిన్న స్పాంజ్ లేదా అయస్కాంతంలా పనిచేస్తాయి. అవి కిందకు పడేటప్పుడు తమతోపాటు గాలిలోఉన్నవాటినన్నింటినీ కిందకు తెస్తాయి. అందుకే ప్రజలు దీన్ని బ్లాక్ రెయిన్ అంటున్నారు" అని డాక్టర్ అక్షయ్ దేవోరాస్ వివరించారు.
కొన్ని పెద్ద కాలుష్య కణాలు వర్షం లేకపోయినా గాలిలో నుంచి నేరుగా కింద పడిపోయి ఉండవచ్చు.
తెహ్రాన్‌లో రాబోయే రోజుల్లో మళ్లీ వర్షం పడే అవకాశం ఉంది, అలాగే బలమైన గాలులు కూడా వీస్తాయని బీబీసీ వెదర్ అంచనావేసింది. ఇవి కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కానీ దీనర్థం తెహ్రాన్‌లో కాలుష్య ప్రమాదం పూర్తిగా తగ్గిపోతుందని కాదు.
ఈ కణాలు నదుల్లో, ఇతర నీటి వనరుల్లో కలిసిపోవచ్చు. నేలపై చేరి ఎండిపోయిన ఈ కాలుష్య కారకాలు గాలుల కారణంగా తిరిగి వాతావరణంలో కలిసిపోవచ్చు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













