మీ పేరు, నంబర్, అడ్రస్ ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారని మీకు తెలుసా? ఈ ప్రైవసీ టూల్ మీకు సాయపడవచ్చు..

ఫొటో సోర్స్, Serenity Strull/ BBC
- రచయిత, థామస్ జెర్మైన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఇతర సమాచారాన్ని అనేక కంపెనీలు ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నాయని మీకు తెలుసా?
డేటా బ్రోకర్లుగా పిలిచే వీరు.. మీ సమాచారాన్ని ఏ కొనుగోలుదారునికైనా చాలా చౌకగా అమ్మేస్తారు. వీరిలో టెలీమార్కెటర్లు, ఈర్ష్యతో రగిలిపోతున్న మాజీ భాగస్వాములు, వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేవారు ఉండవచ్చు. ఇది మీ భద్రతను ప్రమాదంలో పడేస్తుంది.
అయితే, ఇలాంటి వ్యక్తిగత సమాచారం కనిపెట్టడాన్ని కష్టతరం చేసే ఒక సాధనం(టూల్) ఉంది. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ నుంచి మీ వ్యక్తిగత సమాచారాన్ని తొలగించేందుకు ఈ ఉచిత ఆటోమేటిక్ టూల్ ఉపయోగపడుతుంది.
అదే 'రిజల్ట్స్ ఎబౌట్ యు' (Results About You) అనే ఉచిత సర్వీస్.
కానీ, సమస్య ఏంటంటే చాలామందికి దీని గురించి తెలియకపోవడం.

గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ కోసం ఇంటర్నెట్ నుంచి నిరంతరం సమాచారాన్ని సేకరిస్తుంది. ఇందులో మీరు ప్రైవేట్‌గా ఉంచాలనుకునే సున్నితమైన సమాచారం కూడా ఉండవచ్చు.
ఈ ప్రక్రియలో కంపెనీ తరచుగా తెలియకుండానే సమాచార తస్కరణ వంటి ప్రమాదాలకు కారణం కావొచ్చు. కానీ, 'రిజల్ట్స్ ఎబౌట్ యు' బటన్‌తో మన సమాచారాన్ని తొలగించమని గూగుల్‌ని అడగవచ్చు.
ఇది చాలా సులభం. ఈ సర్వీస్‌ను మరింత ఉపయోగకరంగా మార్చడానికి కంపెనీ ఇటీవల దానిని అప్‌డేట్ కూడా చేసింది.
ఇది చాలా సులువైన పని అని అమెరికాలో డిజిటల్ రైట్స్ గ్రూప్ అయిన ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ (ఈఎఫ్ఎఫ్)లో సెక్యూరిటీ ప్రైవసీ యాక్టివిస్ట్ థోరిన్ క్లోసోవ్స్కీ అంటున్నారు.
రిజల్ట్స్ ఎబౌట్ యు అనేది మార్కెట్‌లో అత్యంత ముఖ్యమైన, సులువుగా ఉపయోగించగలిగిన ప్రైవసీ టూల్స్‌లో ఒకటని థోరిన్ అంటున్నారు.
"బహుశా, ఇదే నంబర్ వన్ కావొచ్చు" అని ఆయన అన్నారు.
ఈ టూల్‌ను సెటప్ చేసిన తర్వాత.. పేరు, ఇమెయిల్, ఫోన్ నంబర్ లేదా చిరునామాను గుర్తించినప్పుడు గూగుల్ మీకు ఈ మెయిల్ చేస్తుంది.
ఈ సమాచారం కనిపించిన వెబ్‌సైట్లను ఒకే క్లిక్‌తో చూడవచ్చు. ఈ టూల్ మీ పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి వ్యక్తిగత వివరాలను గుర్తించి మీ ప్రైవసీని కాపాడడంలో సాయపడుతుంది.

ఫొటో సోర్స్, Serenity Strull/ BBC
ఇదెలా పనిచేస్తుంది?
ఈ ఆటోమేటిక్ సర్వీస్‌కు గూగుల్ అకౌంట్ అవసరం. కానీ, సెర్చ్ రిజల్ట్స్‌లో సున్నితమైన సమాచారాన్ని కనుగొంటే దానిని తొలగించడానికి మాన్యువల్ మార్గం కూడా ఉంది. అందుకు, అకౌంట్ కూడా అవసరం లేదు.
అయితే, ఈ లింక్‌పై క్లిక్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.
హ్యాక్ చేయడం ద్వారా, లేదా డేటా లీక్‌ల ద్వారా పొందిన సున్నితమైన సమాచారాన్ని నేరస్తులు నిరంతరం కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. ఈ విషయంలో గూగుల్ ఎలాంటి సాయం చేయజాలదు.
రిజల్ట్స్ ఎబౌట్ యు ఇతర వెబ్‌సైట్‌లలోని సమాచారాన్ని తొలగించదని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. ఇది గూగుల్ సెర్చ్ నుంచి వాటికున్న లింక్‌ను తొలగిస్తుంది.
ఈ టూల్ పూర్తి వ్యక్తిగత గోప్యతను అందించలేదు. కానీ, సులభంగా మన సమాచారం తెలుసుకోకుండా అడ్డంకులను సృష్టిస్తుంది.
"ఎవరైనా తీవ్రంగా ప్రయత్నిస్తే, మన సమాచారాన్ని తెలుసుకోగలరు" అని క్లోసోవ్స్కీ చెప్పారు.
"కానీ, గూగుల్‌ను చాలాచోట్ల వాడుతుంటాం. అందువల్ల, దీనిని ఉపయోగించడం ద్వారా సులువుగా గుర్తించగలిగిన మన సమాచారాన్ని తొలగించవచ్చు. మన సమాచారాన్ని కనుగొనడానికి తేలికగా ఉండే మొదటి లేయర్‌ను ఇది తొలగిస్తుంది."

ఫొటో సోర్స్, Getty Images
సెర్చ్ ఇంజన్ నుంచి మొత్తం సమాచారం తొలగిపోతుందా?
ఈ టూల్ వినియోగించడం చాలా సులభం. రిజల్ట్స్ ఎబౌట్ యు హబ్‌కి వెళ్లి ఫారమ్‌ను పూరించాలి. గూగుల్‌లో గుర్తించిన ఏదైనా సమస్యాత్మక కంటెంట్‌ను మాన్యువల్‌గా కూడా సమర్పించవచ్చు.
సెర్చ్ ఫలితాల్లో లింక్ పక్కన ఉన్న మూడు - చుక్కల మెనూని ఓపెన్ చేసి "రిమూవ్ రిజల్ట్స్" లేదా ''యూజ్ దిస్ పేజ్'' క్లిక్ చేయండి.
అయితే, అది సెర్చ్ ఇంజన్ నుంచి ప్రతిదాన్నీ తీసివేయదు. ప్రభుత్వ, ఇతర వెబ్‌సైట్‌ల నుంచి సమాచారం తొలగించదు.
చాలామంది గూగుల్‌లో సమాచారం అందుబాటులో లేకపోతే ఇక ఆ సమాచారం లేనట్టే అని భావిస్తారు. కానీ, ఈ డేటాను ఇంటర్నెట్ నుంచి పూర్తిగా తొలగించాలనుకుంటే అది మరింత కష్టం.
డేటా బ్రోకర్లను నేరుగా సంప్రదించి సమాచారాన్ని తొలగించమని అడగవచ్చు. డబ్బులు చెల్లించడం ద్వారా కొన్ని సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి.
డిజిటల్ ఫుట్‌ప్రింట్స్‌కు సంబంధించిన స్వీయ రక్షణ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈఎఫ్ఎఫ్ సర్వైలెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ గైడ్‌ను చూడొచ్చు.
2022లో ప్రారంభించినప్పటి నుంచి కోటి మందికిపైగా రిజల్డ్స్ ఎబౌట్ యు టూల్‌ను ఉపయోగించారు. ఇది పెద్ద సంఖ్యే, కానీ దాదాపు 180 కోట్ల గూగుల్ ఎకౌంట్లతో పోలిస్తే చాలా చిన్నసంఖ్య.
ఇంత సులువుగా, ఇంత రక్షణను అందించే మరో ప్రైవసీ టూల్ దొరకడం కష్టం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













