గ్యాస్ బుకింగ్: 25 రోజుల తరువాతే రెండో సిలిండర్.. కేంద్రం కొత్త నిబంధనలు

ఇంధనం, గ్యాస్ కొరత, కేంద్రం ఆంక్షలు

ఫొటో సోర్స్, ANI

చదివే సమయం: 4 నిమిషాలు

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 25 రోజుల 'ఇంటర్ బుకింగ్ పీరియడ్' (గ్యాస్ బుకింగ్‌ల మధ్య విరామం) నిబంధనను అమల్లోకి తెచ్చింది.

ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని, అదనపు ఉత్పత్తిని గృహ అవసరాలకే అందుబాటులోకి తీసుకురావాలని చమురు శుద్ధి కర్మాగారాలను ఆదేశిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ 'ఎక్స్' పోస్టులో తెలిపింది.

ఇదే సమయంలో ఇకపై 25 రోజుల విరామం లేకుండా మరో సిలిండర్‌ను బుక్ చేయరాదన్న నిబంధనను అమల్లోకి తెచ్చింది.

అంతేకాదు.. పెట్రోలియం, పెట్రోలియం ఉత్పత్తులు, నేచురల్ గ్యాస్ లభ్యత, సరఫరా, సమాన పంపిణీని క్రమబద్ధీకరించడానికి నిత్యావసర వస్తువుల చట్టం-1955ను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్ల ఏఎన్ఐ వార్తాసంస్థ రిపోర్ట్ చేసింది.

ప్రస్తుతం ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతోంది. మారిన భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల తలెత్తిన ఇబ్బందులు, ఇంధన, గ్యాస్ కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

ఇంధనం, గ్యాస్ కొరత, కేంద్రం ఆంక్షలు

అత్యవసర సేవలకు ప్రాధాన్యం

ఎల్‌పీజీ సరఫరాలో గృహ వినియోగదారులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది.

దీంతో పాటు, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు సిలిండర్ బుకింగ్ మధ్య '25 రోజుల విరామ సమయాన్ని' అమలులోకి తెచ్చింది.

గతంలో రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి 21 రోజుల సమయం నిబంధన ఉండేది. దీన్ని మరో నాలుగు రోజులకు పెంచుతూ రెండు బుకింగ్‌ల మధ్య 25 రోజుల వ్యవధి ఉండాలన్న నిబంధన తీసుకొచ్చారు.

దిగుమతి చేసుకున్న ఎల్‌పీజీని కమర్షియల్ అవసరాల కంటే.. ఆస్పత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర సేవలకే ముందుగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇతర గృహేతర రంగాలకు సంబంధించిన ఎల్‌పీజీ సరఫరా అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే సరఫరా అభ్యర్థనలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హోటల్ రంగంపై ప్రభావం

ఇదేసమయంలో, గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం హోటల్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది.

గ్యాస్ కొరత కారణంగా ముంబయిలోని 20 శాతం హోటళ్లు మూతపడ్డాయి.

ఇదే పరిస్థితి కొనసాగితే దాదాపు 50 శాతం హోటళ్లు మూసివేసే ప్రమాదం ఉందని ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ శెట్టి బీబీసీతో చెప్పారు.

ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ సరఫరా సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తూ పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ లేఖ రాసింది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం గృహ వినియోగదారులకే (డొమెస్టిక్ గ్యాస్) ప్రాధాన్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ లేఖ రాశారు.

ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ లేఖ
ఫొటో క్యాప్షన్, ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ లేఖ

లేఖలో ఏముంది?

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు నియంత్రణలో లేవని, దీని ప్రభావం పీఎన్‌జీ సరఫరాపై పడిందని అసోసియేషన్ తన లేఖలో పేర్కొంది. దీనివల్ల హోటల్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతిందని, ఈ రంగంపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ఉపాధి కల్పనలో హోటల్ రంగం కీలకంగా ఉందని వారు వివరించారు.

కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల హోటల్, హాస్పిటాలిటీ రంగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇది ఉద్యోగులపై కూడా ప్రభావం చూపుతుందని, వారి ఆదాయం తగ్గిపోతుందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ అనివార్య పరిస్థితుల దృష్ట్యా, పీఎన్‌జీ సరఫరాలో 25 శాతం వరకు కోత విధించినా పరిశ్రమ ఎలాగోలా తట్టుకోగలదని కానీ, 100 శాతం కోత లేదా సరఫరాను పూర్తిగా నిలిపివేసినా అనేక పరిశ్రమలు, సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడం అసాధ్యమని లేఖలో పేర్కొంది.

అదే సమయంలో, హాస్పిటాలిటీ రంగానికి కనీస స్థాయిలోనైనా పీఎన్‌జీ సరఫరా కొనసాగేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అసోసియేషన్ కోరింది. దీనివల్ల రెస్టారెంట్లు, హోటళ్లు నడవడమే కాకుండా, కార్మికుల జీవనోపాధికి రక్షణ లభిస్తుందని విజ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలో, రెస్టారెంట్, హాస్పిటాలిటీ రంగానికి ఎల్‌పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లేఖ రాసినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

 చమురు మార్కెట్‌, గ్యాస్ పరిశ్రమ

ఫొటో సోర్స్, Getty Images

ముడి చమురు ధరల పెరుగుదల

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం షేర్ మార్కెట్, అలాగే అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై తీవ్రంగా పడింది. చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. షేర్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి.

యుద్ధ పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు దీర్ఘకాలం పాటు అడ్డంకులు ఏర్పడవచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి.

ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం.. అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా ఎంపికయ్యారు. వారం రోజులుగా ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, ఈ కొత్త నియామకం ద్వారా అధికారం ఇంకా తమ చేతుల్లోనే ఉందనే సంకేతాలను ఇరాన్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

గత 2-3 రోజుల్లో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులకు దిగాయి. ఇందులో అనేక ఆయిల్ డిపోలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలోని చమురు నిల్వలకు నష్టం వాటిల్లడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం (మార్చి 9) ఉదయం చమురు ధరలు 18 శాతం మేర పెరిగి, బ్యారెల్‌ 109 డాలర్లకు చేరాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)