మొసళ్ల నదిలో పోలీసుల రిస్కీ ఆపరేషన్.. మొసలి కడుపులో దొరికిన మానవ శరీర భాగాలు అదృశ్యమైన వ్యాపారవేత్తవేనా?

కోమతి నది, దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, South african police service

ఫొటో క్యాప్షన్, కోమతి నది వద్ద మొసలిని హెలీకాప్టర్‌లోకి ఎక్కిస్తున్న దృశ్యం
    • రచయిత, జోసెఫ్ వింటర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 3 నిమిషాలు

దక్షిణాఫ్రికాలో గతవారం వరద నీటిలో కొట్టుకుపోయిన ఒక వ్యాపారవేత్త కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో పోలీసులు మానవ శరీర భాగాలను కనుగొన్నారు.

మొసళ్లతో నిండిన కోమతి నదిలోకి ఒక పోలీసు అధికారిని హెలికాప్టర్ నుంచి కిందికి దించి ఈ ఆపరేషన్ నిర్వహించారు.

వరదలో కొట్టుకుపోయిన వ్యాపారవేత్తను తినేసి ఉంటుందని భావించిన మొసలిని హతమార్చారు. అయితే... ఆ మొసలిని చేరుకోవడానికి కెప్టెన్ జోహన్ పొట్గీటర్ సాహసం చేశారు. ఆ మొసలి వద్దకు వెళ్లినప్పుడు నరాలు తెగే ఉత్కంఠకు గురైనట్లు ఆయన చెప్పారు.

"మొసలి నోటి వైపు నుంచి దాన్ని సమీపించడం అస్సలు క్షేమకరం కాదు" అని ఆయన న్యూస్24 వెబ్‌సైట్‌తో పేర్కొన్నారు.

కోమతి నదిలో పొట్గీటర్ ఒక తాడు సాయంతో ఆ మొసలిని కట్టారు. ఆ తర్వాత పోలీసులు హెలికాప్టర్‌తో వారిద్దరిని పైకి లాగారు. మొసలి కడుపులో గుర్తించిన మానవ అవశేషాలు నీట్లో కొట్టుకుపోయిన వ్యాపారవేత్తవేనా కాదా అని నిర్ధరించేందుకు ఇప్పుడు డీఎన్ఏ పరీక్షలు జరపనున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

గతవారం వరదలు పోటెత్తిన సమయంలో ఒక చిన్న వంతెన దాటే క్రమంలో ఆయన కారు నీటిలో చిక్కుకుపోయింది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి కారు ఖాళీగా కనిపించింది. దీంతో ఆ వ్యాపారవేత్త వరద నీటిలో కొట్టుకుపోయి ఉంటారని అనుమానించినట్లు 'మ్పుమలంగా' ప్రొవిన్షియల్ పోలీసు ప్రతినిధి కల్నల్ మావేలా మసోండో జాతీయ వార్తాసంస్థ 'ఎస్ఏబీసీ' కి తెలిపారు.

గాలింపు కోసం డ్రోన్లు, హెలికాప్టర్లు వాడగా.. ఒక చిన్న ద్వీపంలో మొసళ్లు ఎండలో పడుకుని ఉండటం కనిపించిందని పోలీస్ డైవింగ్ యూనిట్ కమాండర్ పొట్గీటర్ వెల్లడించారు. తమకున్న అనుభవంతో వాటిని పరిశీలించి అందులో ఒక మొసలి ఇటీవలే ఏదో తిన్నట్లుగా గుర్తించామని ఆయన తెలిపారు.

కోమతి నది, దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోమతి నది

'బాగా తిని కదల్లేకపోయింది'

"మొసలి కడుపు నిండా తిని ఉండటంతో డ్రోన్లు, హెలికాప్టర్ శబ్దాలు వస్తున్నా అది అక్కడి నుంచి కదలలేదు, నదిలోకి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు" అని పొట్గీటర్ న్యూస్24కి వివరించారు.

దీంతో పోలీసులు ఆ మొసలిని చంపేశారు. ఆ తర్వాత సరీసృపాన్ని పట్టుకురావడానికి అత్యంత ప్రమాదకరమైన, సంక్లిష్టమైన ఆపరేషన్‌ను చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సుమారు 4.5 మీటర్ల పొడవు, 500 కిలోల బరువున్న ఆ భారీ మొసలిని సమీపంలోని క్రూగర్ నేషనల్ పార్క్‌కు తరలించారు. అక్కడ దాని పేగులను పరిశీలించగా మానవ అవశేషాలు బయటపడ్డాయి.

అవశేషాలతో పాటు మొసలి కడుపులో ఆరు రకాల బూట్లు ఉన్నట్లు పొట్గీటర్ తెలిపారు.

అది గతంలో ఇతరులను కూడా చంపి ఉండవచ్చని, లేదా మొసళ్లు దేన్నైనా మింగేస్తాయి కాబట్టి అవి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

పొట్గీటర్ సాహసాన్ని దక్షిణాఫ్రికా తాత్కాలిక పోలీస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ పులెంగ్ డింపనే అభినందించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)