మొసలి గుడ్డు చెప్పిన చరిత్ర.. చెట్లెక్కి వేటాడే ఈ ‘డ్రాప్ క్రాక్స్’ ఏంటి?

మొసలి గుడ్డు పెంకులు, 'డ్రాప్ క్రాక్స్'

ఫొటో సోర్స్, Panades et al 2025 (generated with Google Gemini AI)

ఫొటో క్యాప్షన్, డ్రాప్ క్రాక్ - మెకోసుచైన్ మొసలి ఎలా ఉంటుందో సూచించే ఏఐ జనరేటెడ్ చిత్రం
    • రచయిత, లానా లామ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆస్ట్రేలియాలో దశాబ్దాల కిందట కనుగొన్న అత్యంత పురాతనమైన మొసలి గుడ్డు పెంకులు 'డ్రాప్ క్రాక్స్' కు చెందినవి కావొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

భూమిపై ఎర(ఆహారం)ను వేటాడేందుకు చెట్లు ఎక్కే ప్రాచీన కాలం నాటి మొసళ్లు 'డ్రాప్ క్రాక్స్'.

ఈ 5.5 కోట్ల సంవత్సరాల పురాతన గుడ్డు పెంకులను క్వీన్స్‌ల్యాండ్‌లోని ఒక గొర్రెల పెంపకందారుడికి చెందిన ఇంటి వెనుక కనుగొన్నారు.

ఈ పరిశోధనలు జర్నల్ ఆఫ్ వెర్టిబ్రేట్ పాలియోంటాలజీలో ప్రచురితమయ్యాయి.

ఈ గుడ్లు మెకోసుచిన్స్ అని పిలిచే అంతరించిపోయిన మొసళ్ల సమూహానికి చెందినవని తేల్చారు.

అంటార్కిటికా, దక్షిణ అమెరికాతో ఆస్ట్రేలియా భాగమై ఉన్న సమయంలో లోతట్టు జలాల్లో ఇవి నివసించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'లెపర్డ్‌లా వేట'

పరిశోధకులలో ఒకరైన ప్రొఫెసర్ మైఖేల్ ఆర్చర్ మాట్లాడుతూ "డ్రాప్ క్రాక్స్ అనడం వింతగా అనిపించవచ్చు. కానీ, వాటిలో కొన్ని లెపర్డ్‌లా వేటాడి ఉండవచ్చు - చెట్ల నుంచి ఆహారంపైకి దూకి ఉండవచ్చు" అన్నారు.

ఐదు మీటర్ల వరకు పొడవు పెరిగే మెకోసుచైన్ మొసళ్లు దాదాపు 5.5 కోట్ల సంవత్సరాల కిందటివరకు ఉండేవని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో పాలియోంటాలజిస్ట్ అయిన ప్రొఫెసర్ మైఖేల్ ఆర్చర్ చెప్పారు.

దాదాపు 38 లక్షల సంవత్సరాల కిందట ఆస్ట్రేలియాకు వచ్చిన మోడర్న్ సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ మొసళ్ల కంటే ముందే ఇవి ఉన్నాయని ఆయన తెలిపారు.

ఈ 'డ్రాప్ క్రోక్' గుడ్డు పెంకులను వాస్తవానికి దశాబ్దాల కింటే కనుగొన్నారు. కానీ, స్పెయిన్‌లోని శాస్త్రవేత్తల సహాయంతో ఇటీవలే అధ్యయనం చేశారు.

ఈ పురాతన మొసళ్లలో కొన్ని 'అడవులలో నివసిస్తూ భూమి మీద వేటాడేవి' అని ప్రొఫెసర్ ఆర్చర్ వివరించారు.

గతంలో క్వీన్స్‌ల్యాండ్‌లోని మరొక ప్రాంతంలో 2.5 కోట్ల సంవత్సరాల పురాతన రాతి పొరలలో చిన్న మెకోసుచైన్ శిలాజాల కనుగొన్నారు. తాజా పరిశోధనలు వాటికి కొనసాగింపు.

saltwater crocodile

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సాల్డ్‌వాటర్ క్రొకడైల్

ఎక్కడ దొరికింది?

1980ల ప్రారంభం నుంచి, ఆర్చర్, ఇతర శాస్త్రవేత్తలు బ్రిస్బేన్‌కు వాయువ్యంగా 270 కి.మీ దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణమైన ముర్గాన్‌లోని ఒక బంకమట్టి గుంటను తవ్వుతున్నారు. సంవత్సరాలుగా, ఈ ప్రదేశం ఆస్ట్రేలియాలోని పురాతన శిలాజ ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ది చెందింది. దీని చుట్టూ ఒకప్పుడు దట్టమైన, పచ్చని అడవి ఉండేది.

"ముర్గాన్‌లోని పురాతన అడవి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సాంగ్‌బర్డ్స్, ఆస్ట్రేలియా తొలితరం కప్పలు, పాములు, దక్షిణ అమెరికా జాతులకు సంబంధించిన అనేక చిన్న క్షీరదాలు, ప్రపంచంలోని పురాతన గబ్బిలాలలో ఒక రకానికి నిలయం" అని ఈ రిపోర్ట్ సహ రచయిత డాక్టర్ మైఖేల్ స్టెయిన్ అన్నారు.

1983లో తనతో పాటు ఒక సహోద్యోగి ''ముర్గాన్‌కు కారులో వెళ్లి, రోడ్డు పక్కన వాహనం పార్క్ చేసి, పారలను తీసుకొని, వెనుక ప్రాంగణంలో తవ్వవచ్చా అని అడిగా'' అని ప్రొఫెసర్ ఆర్చర్ గుర్తుచేసుకున్నారు.

ఈ ప్రాంతంలో పాతకాలం నాటి సంపదలు ఉండవచ్చని, శిలాజ తాబేలు పెంకులు సమీపంలో కనుగొన్నట్లు వివరించడంతో, రైతులు అంగీకరించారని ఆయన తెలిపారు.

అప్పటి నుంచి, శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో అనేక శిలాజాలను కనుగొన్నట్లు చెప్పారాయన. మరింత తవ్వడం ద్వారా, భవిష్యత్తులో మరిన్ని ఆశ్చర్యకరమైనవి వెలికితీస్తామని ప్రొఫెసర్ ఆర్చర్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)