రేవంత్ రెడ్డి కేబినెట్లోకి అజారుద్దీన్.. ఈ మాజీ కెప్టెన్‌ కంటే ముందే మంత్రులైన క్రికెటర్లు ఎవరు?

తెలంగాణ సీఎంఓ

ఫొటో సోర్స్, TelanganaCMO

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆయన రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

అజారుద్దీన్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

గోపీనాథ్ మృతితో ఈ స్థానం ఖాళీ కాగా ప్రస్తుతం ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ముస్లిం ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న వేళ అదే వర్గానికి చెందిన అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయం ఓటర్లను ఆకట్టుకునే చర్య అంటూ బీజేపీ విమర్శించింది. అంతేకాదు, బీజేపీ ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేసింది.

కాగా, అజారుద్దీన్ సొంత రాష్ట్రం నుంచి ప్రత్యక్ష ఎన్నికలలో విజయం సాధించలేకపోయినప్పటికీ మంత్రి పదవి చేపడుతున్నారు.

క్రికెట్ నుంచి వైదొలిగాక రాజకీయాల్లోకి వచ్చిన అజారుద్దీన్ ప్రయాణం ఎలా సాగింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మూడు రాష్ట్రాల నుంచి పోటీ

అజారుద్దీన్‌ ఇప్పటివరకు మూడుసార్లు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి ఒకసారి విజయం సాధించారు.

భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన తరువాత 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన్ను బరిలో దించింది కాంగ్రెస్.

ఆ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ కుమార్ సింగ్‌పై 49 వేల పైచిలుకు మెజారిటీతో అజార్ విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు.

2014లో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్‌కు ఓటమి ఎదురైంది. బీజేపీ అభ్యర్థి సుఖ్‌బీర్ సింగ్ జోనాపురియా చేతిలో 1,35,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు.

2019 ఎన్నికలలో కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్‌ పదవిలో ఉన్న ఆయన్ను పార్టీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిపింది. 64 వేలకు పైగా ఓట్లను సాధించినప్పటికీ అజారుద్దీన్‌కు విజయం దక్కలేదు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న అజారుద్దీన్

ఫొటో సోర్స్, TelanganaCMO

విజయాలు.. వివాదాలు

మణికట్టు కదలికలతో బ్యాట్‌ను సొగసుగా తిప్పుతూ పరుగుల వరద పారించిన ఈ బ్యాటర్ కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేసుకున్నాడు.

కెరీర్‌లో 99 టెస్ట్ మ్యాచ్‌లు, 334 వన్డేలు ఆడిన అజారుద్దీన్ 47 టెస్ట్‌లు, 174 వన్డేలలో కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అజారుద్దీన్ కెప్టెన్సీలో టీమిండియా 14 టెస్టులు, 90 వన్డేలలో విజయం సాధించింది. టెస్ట్ విజయాల రికార్డును సౌరభ్ గంగూలీ, వన్డే విజయాల రికార్డును ధోనీ చెరిపేసే వరకు అత్యధిక విజయాల కెప్టెన్‌గా అజార్‌కు పేరుండేది.

అయితే, 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని సీబీఐ విచారణను ఎదుర్కొన్న అజారుద్దీన్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది.

సుదీర్ఘ విచారణ తరువాత ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, అప్పటికే ఆయన సుమారు 50 ఏళ్లకు సమీపంలో ఉండడంతో మళ్లీ క్రికెట్ ఆడలేదు.

అజహరుద్దీన్

ఫొటో సోర్స్, TelanganaCMO

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లోనూ అజార్ చుట్టూ వివాదాలున్నాయి.

ఆయన హెచ్‌సీఏతో పాటు డెక్కన్ బ్లూస్ క్లబ్‌కు కూడా ఒకే సమయంలో అధ్యక్షుడిగా ఉండడం కోర్టుల వరకు వెళ్లింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ ఆయనపై అనర్హత వేటు వేసింది.

కాగా అజారుద్దీన్‌ తరహాలోనే భారత క్రికెట్ జట్టుకు ఆడిన మరికొందరు ఆటగాళ్లు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్లో కొందరు మంత్రులు కూడా అయ్యారు.

మనోజ్ తివారి

ఫొటో సోర్స్, X/tiwarymanoj

ఫొటో క్యాప్షన్, 2021 అసెంబ్లీ ఎన్నికలలో మనోజ్ తివారి టీఎంసీ అభ్యర్థిగా శివపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేసి గెలిచారు.

మనోజ్ తివారీ: పశ్చిమ్ బెంగాల్‌లో క్రీడల శాఖ సహాయ మంత్రి

పశ్చిమ బెంగాల్‌కు చెందిన క్రికెటర్ మనోజ్ తివారీ మమతా బెనర్జీ ప్రభుత్వంలో క్రీడల శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.

2021 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా శివపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేసి గెలిచారు.

ఆ తరువాత ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది.

లక్ష్మీరతన్ శుక్లా

ఫొటో సోర్స్, Getty Images

లక్ష్మీ రతన్ శుక్లా: మంత్రి పదవి దక్కినా రాజకీయాలను వదిలేసిన ఫాస్ట్ బౌలర్

ఇంటర్నేషనల్ క్రికెట్లో తక్కువ మ్యాచ్‌లే ఆడినా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పశ్చిమ బెంగాల్‌కు దీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన ఫాస్ట్ బౌలర్ లక్ష్మీ రతన్ శుక్లా 2016లో 'హావ్డా నార్త్' అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు.. మమత బెనర్జీ కేబినెట్లో క్రీడల శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు.

కానీ, 2021లో ఆయన తన మంత్రి పదవికి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టేందుకు రాజకీయాలను వదిలేస్తున్నట్లు ప్రకటించిన ఆయన మళ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు.

chetan chauhan

ఫొటో సోర్స్, Getty Images

చేతన్ చౌహాన్: యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రిగా పనిచేస్తూ మృతి

చేతన్ చౌహాన్ ఉత్తర్ ప్రదేశ్‌లోని అమ్రోహా నియోజకవర్గం నుంచి రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన, 1991, 1998 ఎన్నికలలో విజయం సాధించారు.

ఆ తరువాత 2017లో ఉత్తర్ ప్రదేశ్‌లోని 'నోగావా సాదాత్' అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలోనూ పనిచేశారు. కోవిడ్ సమయంలో మరణించారు.

నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ

ఫొటో సోర్స్, X/sherryontopp

ఫొటో క్యాప్షన్, సిద్ధూ

సిద్ధూ: ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, పీసీసీ ప్రెసిడెంట్

రాజకీయాల్లో చురుగ్గా ఉన్న క్రికెటర్ల గురించి మాట్లాడితే తొలుత చెప్పాల్సిన పేరు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూది. టీమిండియాకు ఒకప్పుడు ఓపెనర్‌గా ఆడిన సిద్ధూ పంజాబ్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగానూ తెరపైకి వచ్చారు.

క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత తొలుత బీజేపీలో చేరిన సిద్ధూ 2004లో అమృత్‌సర్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి మంచి ఆధిక్యంతో విజయం సాధించారు. కొద్దికాలానికే ఓ కోర్ట్ కేసు కారణంగా ఆయన రాజీనామా చేశారు.

దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగే నాటికి కోర్టులో స్టే రావడంతో మళ్లీ పోటీ చేశారు. 2007లో జరిగిన ఈ ఉప ఎన్నికలోనూ ఆయన విజయం సాధించారు.

అనంతరం 2009 జనరల్ ఎలక్షన్లలో అమృత్‌సర్ నుంచే మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. కానీ, 6,858 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కారు.

2014లో బీజేపీ అమృత్‌సర్ టికెట్ సిద్ధూకు కాకుండా అరుణ్ జైట్లీకి ఇచ్చింది. జైట్లీ ఆ ఎన్నికలలో అమరీందర్ సింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు.

సిద్ధూను బీజేపీ 2016లో రాజ్యసభకు పంపించింది. కానీ, కొద్ది నెలలకే సిద్ధూ బీజేపీకి రాజీనామా చేశారు. మరికొందరు నేతలతో కలిసి 'ఆవాజ్ ఎ పంజాబ్' అనే పార్టీని స్థాపించారు.

అక్కడికి కొద్ది నెలలలోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున అమృత్‌సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అమరీందర్ సింగ్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కానీ, 2022 అసెంబ్లీ ఎన్నికలలో అదే అమృత్‌సర్ ఈస్ట్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో ఓటమి పాలయ్యారు.

అంతకుముందు 2021 నుంచి 2022 వరకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశారు.

గౌతమ్ గంభీర్

ఫొటో సోర్స్, GautamGambhir

గౌతమ్ గంభీర్: క్రికెట్ నుంచి పాలిటిక్స్.. మళ్లీ క్రికెట్

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన గౌతమ్ గంభీర్‌ను ఆ పార్టీ 'ఈస్ట్ దిల్లీ' నియోజకవర్గం నుంచి పోటీ చేయించింది. ఈ ఇండియా మాజీ ఓపెనర్ తన తొలి ఎన్నికలలోనే భారీ విజయం అందుకున్నాడు.

కాంగ్రెస్ నుంచి అర్వీందర్ సింగ్ లవ్లీ, ఆప్ నుంచి ఆతిషి ఆయనతో పోటీ పడగా 3,91,222 ఓట్ల భారీ ఆధిక్యంతో గంభీర్ గెలిచాడు.

అయితే, 2024 ఎన్నికల్లో మళ్లీ గంభీర్ పోటీ చేయలేదు. ప్రస్తుతం గంభీర్ భారత క్రికెట్ పురుషుల జట్టుకు కోచ్‌గా కొనసాగుతున్నారు.

kirti azad

ఫొటో సోర్స్, Getty Images

కీర్తి ఆజాద్: నాన్న సీఎం.. కొడుకు మూడు సార్లు ఎంపీ

మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ తండ్రి భగవత్ ఝా ఆజాద్ 1980ల చివర్లో బిహార్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

కీర్తి ఆజాద్ తొలుత క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నప్పటికీ ఆ తరువాత తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చారు.

బీజేపీలో చేరి 1993లో దిల్లీలోని గోల్ మార్కెట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

అనంతరం 1999, 2009, 2014 ఎన్నికలలో బిహార్‌లోని దర్భాంగ నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

2015లో బీజేపీ నుంచి సస్పెండై కాంగ్రెస్‌లో చేరిన ఆయన 2019 ఎన్నికలలో దర్భాంగలో ఓటమి పాలయ్యారు.

యూసఫ్ పఠాన్

ఫొటో సోర్స్, X/iamyusufpathan

ఫొటో క్యాప్షన్, 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూసఫ్ ఫఠాన్ బహరాంపూర్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.

యూసఫ్ పఠాన్: కాంగ్రెస్ దిగ్గజాన్ని ఓడించిన ఆల్‌రౌండర్

చాలాకాలం పాటు టీమ్‌ఇండియాకు ఆడిన ఈ ఆల్‌రౌండర్ పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో యూసఫ్ ఫఠాన్ బహరాంపూర్ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురిపై విజయం సాధించారు.

ఈ స్థానం నుంచి వరుసగా అయిదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన అధీర్ రంజన్‌పై పఠాన్ 85 వేలకు పైగా ఆధిక్యంతో గెలిచారు.

manoj prabhakar

ఫొటో సోర్స్, Getty Images

మనోజ్ ప్రభాకర్: హేమాహేమీలతో తలపడి ఓడిపోయిన ఆల్‌రౌండర్

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మనోజ్ ప్రభాకర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. భారత క్రికెట్ జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ 'ఓపెనర్‌'గా ఆడేవారు ప్రభాకర్. భారత్ తరఫున పదుల సంఖ్యలో వన్డే మ్యాచ్‌లలో ఆయన ఇలా ఆడారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఫీట్ సాధించినవారు చాలా అరుదు.

క్రికెట్ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన మనోజ్ ప్రభాకర్ 1996 జనరల్ ఎలక్షన్లలో ఎన్డీ తివారీ పార్టీ అయిన 'ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్-తివారీ' నుంచి దక్షిణ దిల్లీ నియోజకవర్గంలో పోటీ చేశారు.

ఆ ఎన్నికలలో దక్షిణ దిల్లీలో బీజేపీ అభ్యర్థిగా సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ పోటీ చేయడం, ఎన్డీ తివారీ పార్టీకి పెద్దగా ఆదరణ లేకపోవడంతో మనోజ్ ప్రభాకర్‌కు ఘోర పరాజయం తప్పలేదు. ఆయనకు 17,690 (3.28 శాతం) ఓట్లే వచ్చాయి.

మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ: రెండు సార్లు ప్రయత్నించినా పార్లమెంటులో అడుగుపెట్టలేకపోయిన 'టైగర్'

టైగర్ పటౌడీగా అభిమానులు పిలుచుకునే భారత జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ రెండు సార్లు లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేశారు.

1971లో తొలిసారి గుర్‌గావ్ నియోజకవర్గం నుంచి వికాస్ హరియాణా పార్టీ తరఫున బరిలో దిగిన ఆయన ఓటమి పాలయ్యారు.

1996లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండోసారి కూడా ఆయనకు పరాజయం తప్పలేదు.

కైఫ్

ఫొటో సోర్స్, Getty Images

మహ్మద్ కైఫ్: పొలిటికల్ టార్గెట్ ఛేదించలేకపోయిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్

టీమిండియా గొప్ప ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు ఉన్న, మిడిలార్డర్ బ్యాటర్ మహ్మద్ కైఫ్ పేరు చెప్తే 2002 నాటి నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గుర్తొస్తుంది.

ఆ మ్యాచ్‌లో 326 పరుగుల భారీ టార్గెట్‌ను యువరాజ్ సింగ్‌తో కలిసి కైఫ్ ఛేదించడం క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తే.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత కైఫ్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫూల్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. యూపీ బీజేపీకి చెందిన కీలక నేత కేశవ ప్రసాద్ మౌర్యపై కైఫ్‌ను పోటీ చేయించింది కాంగ్రెస్ పార్టీ.

ఆ ఎన్నికలలో కైఫ్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. సుమారు 58 వేల ఓట్లు సాధించి నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.

శ్రీశాంత్: ప్రత్యర్థుల వికెట్ తీయలేకపోయిన పేసర్

ఫిక్సింగ్ ఆరోపణలతో కెరీర్ ముగిసిపోయిన టీమ్ ఇండియా పేసర్ శ్రీశాంత్ 2016లో కేరళ అసెంబ్లీ ఎన్నికలలో తిరువనంతపురం నుంచి పోటీ చేశారు.

బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ నేత శివకుమార్ చేతిలో ఓడిపోయారు. మూడో స్థానంలో నిలిచినప్పటికీ 27 శాతానికిపైగా ఓట్లను సాధించారు శ్రీశాంత్.

వినోద్ కాంబ్లీ: పొలిటికల్ కెరీర్‌కు ఆదిలోనే బ్రేక్

క్రికెట్‌లో వినోద్ కాంబ్లీకి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఇప్పటికీ ఆయనకు అభిమానులున్నారు. 30 ఏళ్ల లోపే క్రికెట్ కెరీర్ ముగించిన కాంబ్లీ 2009లో లోక్ భారతి పార్టీ నుంచి ముంబయిలోని విక్రోలీ అసెంబ్లీ సీటుకు పోటీ చేశారు.

సుమారు నాలుగు వేల ఓట్లు సాధించిన ఆయన నాలుగో స్థానానికి పరిమితమయ్యారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)