పాకిస్తాన్ మాజీ మహిళా క్రికెటర్ సనా మీర్ వ్యాఖ్యలతో వివాదం, ఆమె ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా కప్ క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య షేక్‌హ్యాండ్స్, ట్రోఫీ వివాదం మర్చిపోకముందే, ఐసీసీ మహిళల ప్రపంచ కప్ - 2025లో మరో వివాదం తలెత్తింది.
మహిళల ప్రపంచ కప్‌లో భాగంగా అక్టోబర్ 2న కొలంబోలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సనా మీర్ కామెంటేటర్‌గా వ్యవహరించారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఒక పాక్ క్రీడాకారిణి నేపథ్యం గురించి మాట్లాడుతూ, ఆమె 'ఆజాద్ కశ్మీర్' నుంచి వచ్చినట్లుగా సనా సంబోధించారు.
దీంతో, భారత మీడియా, సోషల్ మీడియాలో సనాపై విమర్శలు వచ్చాయి.
దీనిపై ఎక్స్‌లో సనా స్పందిస్తూ.. 'దీనిపై బహిరంగ వివరణ ఇవ్వమని డిమాండ్లు రావడం విచారకరం' అని తెలిపారు.
కాగా, పాకిస్తాన్ తన నియంత్రణలో ఉన్న కశ్మీర్ ప్రాంతాన్ని 'ఆజాద్ కశ్మీర్' అని పిలుస్తుంది. మరోవైపు, జమ్మూ కశ్మీర్ మహారాజు రాజా హరి సింగ్ సంతకం చేసిన విలీన ఒప్పందం ఆధారంగా, ఇది చట్టబద్ధంగా భారతదేశంలో భాగమని భారత్ విశ్వసిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ సనా మీర్ ఏమన్నారు?
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ బ్యాటర్ నటాలియా పర్వేజ్ గురించి సనా మీర్ మాట్లాడుతూ "ఈ యువ జట్టు క్వాలిఫయర్స్ గెలిచింది. కానీ, వారిలో ఎక్కువ మంది కొత్తవారే. నటాలియా కశ్మీర్.. ఆజాద్ కశ్మీర్ నుంచి వచ్చారు. లాహోర్‌లో చాలావరకు క్రికెట్ ఆడారు. ఆమె క్రికెట్ ఆడాలంటే లాహోర్‌కే రావాలి" అని అన్నారు.
దీంతో, సనా మీర్ వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి. భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఐసీసీ, బీసీసీఐలను ట్యాగ్ చేయడం ప్రారంభించారు. వారు క్రికెట్‌ను రాజకీయం చేస్తున్నారని, ఆమెను కామెంటరీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

క్రికెట్ ఫ్యాన్స్ ఏమంటున్నారు?
మ్యాచ్ సమయంలో సనా మీర్ చేసిన వ్యాఖ్యలపై అంకిత్ భరోష్ అనే యూజర్ ఎక్స్‌లో స్పందిస్తూ "క్రికెట్‌లోకి రాజకీయాలను తీసుకురావడం తప్పు మాత్రమే కాదు, ఐసీసీ నిబంధనల ఉల్లంఘన కూడా. క్రీడలు దేశాలను ఏకం చేసే సాధనంగా ఉండాలి, ప్రచారానికి కాదు" అని తెలిపారు,
రాహుల్ రావత్ అనే మరో ఎక్స్ యూజర్, "పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సనా మీర్ కామెంట్రీ చేస్తూ, కశ్మీర్ సమస్యను లేవనెత్తి వివాదానికి దారితీశారు. ఆమె ఒక పాకిస్తాన్ క్రీడాకారిణిని "ఆజాద్ కశ్మీర్" నుంచి వచ్చిన వ్యక్తిగా అభివర్ణించారు. మహిళల ప్రపంచ కప్‌ను భారత్ నిర్వహిస్తోంది. సనా మీర్‌పై ఐసీసీ చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నాం" అని రాశారు.
సనా మీర్‌పై ఐసీసీ, బీసీసీఐలు చర్య తీసుకోవాలని అజయ్ జాంగిద్ అనే యూజర్ ఎక్స్‌లో డిమాండ్ చేశారు.
"ఆజాద్ కశ్మీర్ అనే ప్రదేశమే లేదు. ప్రపంచ వేదికపై ఇటువంటి ప్రకటనలు చేయడం చాలా అభ్యంతరకరం. వెంటనే, కఠిన చర్యలు తీసుకోండి. సనా మీర్‌ను నిషేధించండి. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. క్రికెట్‌లో ఈ రకమైన భారత వ్యతిరేక ప్రచారాన్ని సహించకూడదు!" అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయం చేయొద్దు: సనా మీర్
సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిస్పందనల అనంతరం, సనా మీర్ ఎక్స్‌లో ఒక పోస్టు ద్వారా వివరణ ఇచ్చారు.
"పాకిస్తాన్ ప్లేయర్ స్వస్థలం గురించి నేను చేసిన వ్యాఖ్యలు, పాకిస్తాన్‌లోని ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచి రావడం వల్ల ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, తన అద్భుతమైన ప్రయాణాన్ని హైలైట్ చేయడానికి మాత్రమే ఉద్దేశించినవి. కామెంటేటర్లుగా, ఆటగాళ్లు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పడంలో ఇదొక భాగం. నేను ఈరోజు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మరో ఇద్దరు ప్లేయర్ల గురించి కూడా మాట్లాడాను.
దయచేసి దీనిని రాజకీయం చేయొద్దు. కామెంటేటర్లుగా ఆట, జట్లు, ప్లేయర్స్‌పై దృష్టి పెట్టడం, వారి ధైర్యం, పట్టుదల స్ఫూర్తిదాయకమైన కథలను హైలైట్ చేయడం మా పని. నాకు ఎలాంటి దురుద్దేశం లేదా మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదు.''
"మా క్రీడాకారిణుల గురించి నేను ఎక్కువగా ఎక్కడి నుంచి సమాచారం తీసుకుంటానో ఆ స్క్రీన్‌షాట్స్ కూడా ఇక్కడ జత చేస్తున్నా. వాళ్లు పాకిస్తానీ ప్లేయర్స్ అయినా, ఇతర దేశాలకు చెందిన వారైనా. దానిని ఇప్పుడు మార్చేశారని నాకు తెలుసు, అయితే నేను అప్పుడున్న సమాచారం గురించే మాట్లాడుతున్నా" అని సనా మీర్ తెలిపారు.

ఫొటో సోర్స్, X
షేక్‌హ్యాండ్స్ ఉండవా?
ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం, భారత జట్టు ట్రోఫీని తీసుకోకపోవడంపై వివాదం తారస్థాయికి చేరుకున్న సమయంలోనే సనా మీర్ 'ఆజాద్ కశ్మీర్' వ్యాఖ్య వచ్చింది.
మహిళల ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడితే, ప్లేయర్లు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకుంటారనే విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా చెప్పడం చర్చనీయమైంది.
"భారత్ పాకిస్తాన్‌తో కొలంబోలో మ్యాచ్ ఆడుతుంది. అన్ని క్రికెట్ ప్రోటోకాల్‌లను పాటిస్తారు. ఎంసీసీ క్రికెట్ నియమాలు పాటిస్తామని హామీ ఇస్తున్నాను" అని దేవ్‌జిత్ బీబీసీ ప్రోగ్రామ్ స్టంప్డ్‌తో అన్నారు.
అయితే, "షేక్‌హ్యాండ్స్ లేదా హగ్స్ ఉంటాయా అనే దానిపై నేను ఈ సమయంలో ఎలాంటి హామీలు ఇవ్వలేను" అని అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ మొహ్సిన్ నఖ్వీ క్షమాపణ చెప్పినట్లు భారత మీడియాలో పలు కథనాలు వచ్చాయి.
అయితే, ఈ కథనాలను మొహ్సిన్ నఖ్వీ ఖండించారు.
ఆసియా కప్ ట్రోఫీని టీమిండియా తన నుంచి తీసుకోకపోతే, దాన్ని భారత్‌కు ఇచ్చేది లేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్ మొహ్సిన్ నఖ్వీ పునరుద్ఘాటించారు.
'' ఏసీసీ అధ్యక్షుడిగా ఆరోజు నేను ట్రోఫీని ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నాను. ఇప్పటికీ నేను సిద్ధమే. వారికి నిజంగా కావాలనుకుంటే, వారు ఏసీసీ కార్యాలయానికి రావొచ్చు. నా దగ్గరి నుంచి తీసుకోవచ్చు'' అని నఖ్వీ ఎక్స్‌లో రాసినట్లు ఇస్లామాబాద్‌కు చెందిన బీబీసీ ప్రతినిధి ఫర్హత్ జావెద్ చెప్పారు.
తాజాగా జరిగిన ఏసీసీ సమావేశం తర్వాత నఖ్వీ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. నఖ్వీ నేతృత్వంలో మంగళవారం దుబాయ్‌లో ఈ సమావేశం జరిగింది.
బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మాజీ ట్రెజరర్ ఆశిష్ షెలార్ వర్చ్యువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సూర్యకుమార్ యాదవ్ జట్టు ట్రోఫీని తీసుకుంటుందా? గెలుపొందిన జట్టు పతకాలను స్వీకరిస్తుందా? అనే దానిపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నఖ్వీ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) చైర్మన్ అయిన నఖ్వీ, ఆ దేశ హోం మంత్రిగా కూడా ఉన్నారు.
భారత మీడియాలో వస్తోన్న కథనాలను మొహ్సిన్ నఖ్వీ కొట్టిపారేశారు.
''భారత మీడియా నిజాలతో కాదు, అబద్ధాలతో నడుస్తోంది. నేను ఒకటి స్పష్టం చేయాలనుకుంటున్నా. నేనేమీ తప్పు చేయలేదు. బీసీసీఐకి నేను క్షమాపణ చెప్పలేదు. ఎప్పటికీ చెప్పేది లేదు'' అని నఖ్వీ ఎక్స్‌లో రాశారు.
'' ఈ కట్టుకథలు కేవలం చౌకబారు ప్రచారం తప్ప మరోటి కాదు. వాటి ఏకైక ఉద్దేశం ప్రజలను తప్పుదారి పట్టించడమే. దురదృష్టవశాత్తూ, భారత్ తరచూ క్రికెట్‌లోకి రాజకీయాలను లాగుతోంది. క్రీడాస్ఫూర్తిని ఇది దెబ్బతీస్తోంది'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్‌లోనే ఎందుకు?
ఇంతలో, చాలామంది ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇటువంటి రాజకీయ ఉద్రిక్తత క్రికెట్ చుట్టూ మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? ఇతర క్రీడల చుట్టూ ఎందుకు కనిపించదు?
మేలో 'ఆపరేషన్ సిందూర్' తర్వాత, జూన్ 2025లో జరిగిన ఆసియా స్క్వాష్ డబుల్స్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి.
సెప్టెంబర్‌లో, రెండు దేశాల అండర్-17 ఫుట్‌బాల్ జట్లు శాఫ్ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డాయి.
ఈ టోర్నీలు ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిగాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఎలాంటి ప్రకటనలు జారీ చేయలేదు లేదా బహిష్కరణకు పిలుపునివ్వలేదు. సోషల్ మీడియా ఎటువంటి మీమ్స్ లేదా బాయ్‌కాట్ కోసం పిలుపులు రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














