ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్ అంగీకారం, నెతన్యాహు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Doaa Albaz/Anadolu via Getty
ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయడానికి అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. అయితే గాజా కోసం అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలోని కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించాలనుకుంటున్నట్లు తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హమాస్‌కు గడువు నిర్దేశించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వచ్చింది.
బందీలను విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటించిన తర్వాత, "హమాస్ తాజా ప్రకటన ఆధారంగా, వారు శాశ్వత శాంతికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను" అని ట్రంప్ ట్రూత్‌లో తెలిపారు.
"ఇజ్రాయెల్ వెంటనే గాజాపై బాంబు దాడులను ఆపాలి. దీంతో మనం బందీలను సురక్షితంగా, త్వరగా బయటకు తీసుకురావచ్చు" అని ట్రంప్ తెలిపారు.
అరబ్, ఇస్లామిక్ మద్దతుతో కూడిన స్వతంత్ర పాలస్తీనియన్ సంస్థకు గాజా నియంత్రణను అప్పగించడానికి దాని ఒప్పందాన్ని పునరుద్ధరిస్తున్నట్లూ హమాస్ పేర్కొంది.
అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ఆధారంగా నేషనల్ ఫ్రేమ్ వర్క్ ద్వారా గాజా భవిష్యత్తు, పాలస్తీనియన్ల హక్కులను నిర్ణయించాలని, ఆ చర్చలలో తాము పాల్గొంటామని హమాస్ చెబుతోంది.
ఇటీవల, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికాలో పర్యటించారు. అక్కడ ట్రంప్, నెతన్యాహు మధ్య అమెరికా శాంతి ప్రణాళికపై ఒప్పందం కుదిరింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు "ప్రోత్సాహకరంగా" ఉన్నాయని హమాస్ ప్రతినిధి ఒకరు బీబీసీకి తెలిపారు.
ఖైదీల మార్పిడి, యుద్ధాన్ని ముగించడం, ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లిపోవడం కోసం వెంటనే చర్చలు ప్రారంభించడానికి బృందం సిద్ధంగా ఉందని ఆ ప్రతినిధి తెలిపారు.


ఫొటో సోర్స్, Alex Wong/Getty
ఇజ్రాయెల్ ఏమంది?
హమాస్ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ స్పందించింది.
శాంతి కోసం 'ట్రంప్ ప్రణాళిక'పై అమెరికాతో కలిసి పనిచేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలోొ "హమాస్ ప్రతిస్పందన తర్వాత, బందీల విడుదలకు ట్రంప్ ప్రణాళిక మొదటి దశను వెంటనే అమలు చేయడానికి ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తోంది" అని నెతన్యాహు అన్నారు.
"యుద్ధాన్ని ముగించడానికి మేం అధ్యక్షుడు ట్రంప్, ఆయన బృందంతో పూర్తిగా సహకరిస్తాం" అని ఆయన అన్నారు.
గాజా యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించిన ఖతార్, హమాస్ ప్రతిస్పందనను స్వాగతిస్తున్నట్లు పేర్కొంది.
బందీలను సురక్షితంగా విడుదల చేయడానికి, గాజాలో రక్తపాతాన్ని ఆపడానికి తక్షణ కాల్పుల విరమణ కోసం అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపుకు మద్దతు ఇస్తున్నట్లు కూడా తెలిపింది.
కాల్పుల విరమణను అమలులోకి తీసుకురావడంపై చర్చలను తిరిగి ప్రారంభించడానికి ఈజిప్ట్, అమెరికాతో కలిసి పనిచేయడం ప్రారంభించినట్లు ఖతార్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ శాంతి ఒప్పందం ఏమిటి?
గాజా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని తక్షణమే ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ఒక ప్రణాళిక రూపొందించారు.
ఈ ప్రణాళిక ప్రకారం హమాస్ 72 గంటల్లో సజీవంగా ఉన్న 20 మంది ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయాలి.
మరణించిన 24 మందికి పైగా బందీల శవాలను అప్పగించాలి.
ప్రతిగా, ఇజ్రాయెల్ వందలాది మంది పాలస్తీనియన్లను జైళ్ల నుంచి విడుదల చేస్తుంది.
హమాస్ అధికారులకు వైట్ హౌస్ 20-పాయింట్ల ప్రణాళిక ఇచ్చిందని.. కాల్పుల విరమణ చర్చల గురించి తెలిసిన పాలస్తీనా వర్గాలు బీబీసీకి తెలిపాయి.
దీనిలో హమాస్ గాజాను పాలించకూడదని పేర్కొనగా, భవిష్యత్తులో పాలస్తీనా దేశం ఏర్పడేందుకు మాత్రం వీలుకల్పించారని తెలుస్తోంది.
వైట్ హౌస్‌లో చర్చల తర్వాత ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఈ ప్రణాళిక "శాంతి దిశగా చరిత్రాత్మక రోజు" అని అన్నారు.
అయితే.. హమాస్ ఈ ఒప్పందానికి అంగీకరించకపోతే "హమాస్ ముప్పును అంతం చేసే పని పూర్తి చేయడానికి" నెతన్యాహుకు అమెరికా మద్దతు ఉంటుందని ఆయన అన్నారు
హమాస్ ఆ ప్రణాళికను తిరస్కరించినా లేదా అమలు చేయకపోయినా, "హమాస్ పని ముగిస్తాం" అని ఆయన తెలిపారు.
ఈ ప్రణాళిక వెంటనే అన్ని సైనిక యుద్ధాలను ఆపడంతో మొదలవుతుంది. ప్రస్తుత యుద్ధరేఖలు దశలవారీగా వెనక్కి తగ్గే పరిస్థితులు వచ్చే వరకు యథావిధిగా ఉంటాయి. హమాస్ తన ఆయుధాలను వదిలివేస్తుంది. దాని సొరంగాలు, ఆయుధ ఉత్పత్తి కేంద్రాలను నాశనం చేస్తారు.
ప్రతి ఇజ్రాయెల్ బందీ శవానికి, 15 మంది గాజా నివాసుల శవాలను ఇజ్రాయెల్ అప్పగిస్తుందని పేర్కొంది.
ఈ ప్రతిపాదనకు రెండు పక్షాలు అంగీకరించిన వెంటనే గాజాకు అన్ని రకాల సాయం అందుతుందని ఆ ప్రణాళిక నిర్దేశిస్తుంది.
భవిష్యత్తులో గాజాను ఎలా పాలించాలో కూడా ప్రణాళికలో పేర్కొన్నారు.
గాజాను తాత్కాలికంగా పాలించే పాలస్తీనా కమిటీ.. సాంకేతిక నైపుణ్యంతో, రాజకీయ రహితంగా ఉంటుంది. దానిని ట్రంప్ నేతృత్వంలోని కొత్త 'బోర్డ్ ఆఫ్ పీస్' పర్యవేక్షిస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














