మనుషులు చేపల నుంచి ఉద్భవించారా? నీళ్లలో నుంచి బయటకు వచ్చిన సార్కాప్టిజియాన్సే మానవ పరిణామానికి దారితీశాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
మానవులు ఎలా పుట్టారంటే, ఎవరైనా వెంటనే కోతులు, చింపాంజీల నుంచి అంటుంటారు.
కానీ, మానవులతో పాటు ఎలుగుబంట్లు, బల్లులు, హమ్మింగ్ బర్డ్ వంటి పక్షులు, టైరానోసారస్ రెక్స్ అనే ఒక రకమైన డైనోసార్లు నిజానికి 'లోబ్ ఫిన్డ్ చేపలు' అని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ ఎవల్యూషనరీ బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రిస్ ఆర్గాన్ ఒక కథనంలో రాశారు.
అలాగే, ఈ వాదనకు బలం చేకూర్చే ఆధారాలను బీజింగ్‌లోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులకు లభ్యమయ్యాయి.
చైనాలోని గ్వింజౌ, చోంగ్‌వింగ్ అనే ప్రాంతాల్లో 'ఎర్లీ సిలూరియన్' కాలానికి చెందిన రెండు శిలాజ నిల్వలను 2022లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెర్టెబ్రేట్ పాలియాంటాలజీ అండ్ పాలియోంత్రోపాలజీ (ఐవీపీపీ) పరిశోధకులు గుర్తించారు.

కనీసం 440 మిలియన్ ఏళ్ల క్రితమే దక్షిణ చైనాలోని జలాల్లో 'దవడలతో కూడిన చేపలు (జా వెర్టెబ్రేట్)' ఉండేవని నిరూపించే ఆధారాలను ఈ శిలాజాలు అందిస్తున్నట్లు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఐవీపీపీ పరిశోధకులు జు మిన్ పేర్కొన్నారు. వీరు చేసిన అధ్యయనాలకు సంబంధించిన నాలుగు రీసర్చ్ పేపర్లను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు.
జా వెర్టెబ్రేట్ వర్గానికి చెందిన 99.8 జీవజాతుల్లో నేటి మానవుడు కూడా ఒకరు.
చేపల నుంచి మానవులుగా వెర్టెబ్రేట్ పరిణామ క్రమ చరిత్రలో దవడలు గల 'జా వెర్టెబ్రేట్స్' ఆవిర్భావం అనేది అత్యంత కీలక ఘట్టాలలో ఒకటిగా చెబుతుంటారని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
చేపల్లో ప్రిమిటివ్ లింబ్స్, గాలి సంచులు
మానవులు, చేపల నుంచి వచ్చారని బీబీసీ డిస్కవర్ వైల్డ్ లైఫ్ పేర్కొంది.
అయితే మానవ ఆవిర్భావం అనేది సాల్మన్, హాడాక్ వంటి ఏ ఆధునిక చేప జాతుల నుంచి కాదని, దాదాపు 425 మిలియన్ ఏళ్ల కిందట లేట్ సిలూరియన్ కాలానికి చెందిన 'సార్కాప్టెరిజియాన్స్' అనే చేపల సమూహం నుంచి జరిగిందని ఒక కథనంలో రాసింది.
అందులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఒకప్పుడు సమృద్ధిగా, చాలా వైవిధ్యంగా ఉన్న సార్కాప్టరిజియాన్స్‌లో ఇప్పుడు రెండు జాతుల కోయిలకాంత్స్, ఆరు జాతుల లంగ్‌ఫిషెస్ మాత్రమే మిగిలిఉన్నాయి. మిగతావన్నీ అంతరించిపోయాయి.
అవి అంతరించిపోయినా, ఇప్పుడు మనుగడలో ఉన్న ఈ సార్కాప్టిజియాన్స్ ఏ రకంగా చూసినా చేపలే. కానీ, మామూలుగా ఒక చేపకు ఉండని కొన్ని లక్షణాలు కూడా వీటికి ఉంటాయి. అందులో ముఖ్యమైనది ప్రిమిటివ్ లింబ్స్‌ను పోలి ఉండే నాలుగు రెక్కలు.
అలాగే కొన్ని సార్కాప్టిజియాన్స్ చేపల్లో చిన్న, అంతర్గత గాలి సంచులు (ఎయిర్ సాక్స్) ఉంటాయి. మన ఊపిరితిత్తులకు పూర్వరూపమే ఈ ఎయిర్ సాక్స్.

నీళ్లలో నుంచి బయటకు వచ్చిన చేపలు మనుషులయ్యాయా?
ఇప్పుడు అంతరించిపోయిన కొన్ని సార్కాప్టిజియాన్స్, దాదాపు 350 మిలియన్ ఏళ్ల క్రితం తమ ప్రిమిటివ్ లింబ్స్‌ను ఉపయోగించుకొని నీళ్లలో నుంచి నేలపైకి వచ్చి, గాలిలోని ఆక్సిజన్‌ను తీసుకునేవి.
ఇలా చేయడం ద్వారా, ఒకప్పుడు నీటికి మాత్రమే పరిమితమైన ఈ చేపలు, పరిణామ చరిత్ర గమనాన్ని మార్చాయి. అలా భూమిపై జీవించగలిగే ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వంటి వాటి పుట్టుకకు కారణమయ్యాయి.
లైఫ్ స్టయిల్‌ను మార్చుకున్న మొదటి చేప ఏది?
నేలపై నడిచిన మొదటి చేప విషయంలో స్పష్టత లేదు. కానీ, 375 మిలియన్ ఏళ్ల క్రితం టెట్రాపోడోమార్ప్స్ అనే సార్కాప్టిజియాన్స్ సమూహం సెమీ అక్వాటిక్ లైఫ్ స్టయిల్‌తో ప్రయోగాలు చేసినట్లుగా చాలామంది అంగీకరిస్తారు.
అయితే, చేప నుంచే నేలపై నాలుగు కాళ్లతో నడిచే జీవులు ఉద్భవించాయనే భావనను బలపరిచే జంతువు ఏదో తెలుసుకునేందుకు పరిశోధకులు ఏళ్ల పాటు శోధించారు.
పాలియోంటాలజిస్ట్ నీల్ శుబిన్ నేతృత్వంలో ఆర్కిటిక్ కెనడాలో పనిచేసే ఒక చిన్న బృందం ఆ జంతువు 'టిక్టాలిక్' అని 2004లో గుర్తించింది.
2.5 మీ పొడవు ఉండే ఈ టెట్రాపాడ్ (నాలుగు కాళ్ల జీవి)కు రెండు బలమైన రెక్కలు ఉన్నాయని వారు గుర్తించారు. నీటిలో నుంచి బయటకు వచ్చేంత, నేలపై పాకేంత బలంగా ఆ రెక్కలు ఉన్నట్లు కనిపెట్టారు. చేపలకు, భూమిపై తిరిగే వెర్టిబ్రేట్స్‌కు మధ్య తెగిపోయిన లింక్‌గా ఈ జీవిని వారు భావించారు.
టిక్టాలిక్ మనకు ప్రత్యక్ష పూర్వీకులు కాకపోవచ్చు. కానీ, ఉభయచర జీవులు, సరీసృపాలు, క్షీరదాలకు ఇది దగ్గరి బంధువు కావొచ్చు. ఈ కోణంలో మానవులతోనూ దీనికి సంబంధం ఉన్నట్లే.

ఫొటో సోర్స్, Getty Images
మానవ శరీర నిర్మాణంలోనూ చేపల ఆనవాళ్లు
శిలాజాలను ఆధారంగా చూపుతూ చేపల నుంచి మనిషి ఆవిర్భవించాడని చెప్పడం మీకు కాస్త విచిత్రంగానే అనిపించొచ్చు. కానీ, ఈ వాదనను నిరూపించే ఆధారాలు మన శరీరంలోనూ ఉన్నాయి.
మన ముఖంలో ముక్కు కింద, పై పెదవి మీద ఉన్న ఖాళీ స్థలాన్ని (ఫిల్ట్రమ్) మీరు గమనించే ఉంటారు. ముఖంలో దీని విధి ఏంటి? నిజానికి ఇది స్పష్టంగా నిర్వర్తించే విధులేం లేవు.
కానీ, మన ముఖం ఎలా ఏర్పడిందో, ముఖ నిర్మాణం వెనుక ఏం జరిగిందనేదానికి ఇదొక రుజువని ఇన్‌సైడ్ ది హ్యుమన్ బాడీ కార్యక్రమంలో డాక్టర్ మైకేల్ మోస్లే వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మానవ పిండంలోనూ..
ఆయన చెప్పిన వివరాల ప్రకారం, మహిళ గర్భం దాల్చాక 2 నుంచి 3 నెలల మధ్యలో శిశువు ముఖం రూపొందుతుంది. పిండంలో ముఖం మొదట మూడు విభాగాలుగా ఏర్పడుతుంది. తర్వాత ఈ విభాగాలన్నీ ఒకటిగా కలిసిపోయి ముఖంగా మారుతుంది.
తొలినాళ్లలో మానవ పిండం అచ్చంగా ఒక క్షీరదం, పక్షి, ఉభయచర జీవి పిండంలాగే ఉంటుంది. ఈ జీవులన్నీ కూడా చేప నుంచి ఏర్పడినవే.
ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్లుగా కళ్లు ముఖం మధ్యలో కాకుండా, పిండంలో తలకు రెండు పక్కలా ఏర్పడతాయి. తర్వాత క్రమంగా అవి మధ్యలోకి కదులుతాయి. ఇది మొదటి విభాగం.
అలాగే పైపెదవి, దవడ, అంగిలి అనేవి మెడ మీది మొప్పల వంటి నిర్మాణాల ద్వారా రూపు దిద్దుకుంటాయి. ఇది రెండో విభాగం.
ఇక తల పైభాగం నుంచి ముక్కు, పై పెదవిలోని మధ్య భాగం అనేవి కిందకు వస్తాయి. ఇది మూడో విభాగం.
ఈ విభాగాలన్నీ సజావుగా కలిసిపోయి పూర్తి ముఖంగా తయారవుతుంది. ఇవన్నీ కలిసే చోటు అంటే ఒక జంక్షన్‌లా పైపెదవి మీద ఫిల్ట్రమ్ ఏర్పడుతుంది.
గర్భంలో ఈ విభాగాలన్నీ చాలా కచ్చితత్వంతో, సరైన సమయంలో అతుక్కుంటేనే ఎలాంటి లోపం లేని ముఖం ఏర్పడుతుంది.
ఒకవేళ ఏదైనా లోపం జరిగినా, ఇలా జరగడం కనీసం గంట ఆలస్యమైనా కూడా శిశువు పైపెదవిపై కోతలా ఏర్పడుతుంది. మామూలుగా చెప్పాలంటే దీన్ని గ్రహణ మొర్రి (క్లెఫ్ట్ లిప్) అంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 700 మందిలో ఒక శిశువు గ్రహణమొర్రితో పుడతారు.
బీజాశయాలు కూడా చేపల్లాగే...
ఒక షార్క్ లేదా చేపల్లో బీజాశయాలు దాని ఛాతీ భాగంలో, కాలేయం వెనుకాల ఉంటాయి.
వాటి తరహాలోనే మానవుల్లో కూడా బీజాశయాలు పైభాగంలో, అంటే కాలేయానికి దగ్గరలో జీవం పోసుకుంటాయి. అయితే, ఆ తర్వాత అవి శరీరంలో కిందిభాగానికి వెళ్లాల్సి ఉంటుంది.
అమ్మాయిల్లో అవి కిందకు దిగి వచ్చి ఓవరీలు (అండాశయాలు)గా మారతాయి. గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్ దగ్గర అమరిపోతాయి.
ఈ బీజాశయాలు పురుషుల్లో వృషణాలుగా మారతాయి. కానీ, అవి కిందకు దిగడం, వృషణం తిత్తిని నింపే ప్రక్రియ చాలా దీర్ఘంగా, చాలా కష్టంగా జరుగుతుంది. పర్యవసానంగా పురుషుల్లో అబ్డామినల్ వాల్ బలహీనంగా మారొచ్చు. అందుకే మహిళలతో పోలిస్తే పురుషుల్లో 'ఇంగ్వినల్ హెర్నియా' వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
వెక్కిళ్లు..
అమెరికాకు చెందిన చార్లెస్ ఓస్బార్న్ పేరిట అత్యధిక కాలం, 68 ఏళ్ల పాటు (1922-1990) ఎక్కిళ్లు తీసిన వ్యక్తిగా రికార్డు ఉంది.
ఛాతీలోని అతిపెద్ద కండరం డయాఫ్రమ్ సంకోచించడం, అసంకల్పిత గుటక (ఇన్‌వాలంటరీ గల్ప్) వల్ల వెక్కిళ్లు వస్తాయి. ఈ రెండు చర్యలకు చేపలతో, ఉభయచరజీవులతో సంబంధం ఉందని డాక్టర్ మైకేల్ చెప్పారు.
చేపల్లో శ్వాసను సక్రియం చేసే నరాలు, మెదడులోని పురాతన భాగం 'బ్రెయిన్ స్టెమ్' నుంచి గొంతు, మొప్పల వరకు ప్రయాణిస్తాయి. మానవుల్లో ఈ ప్రక్రియ కాస్త క్లిష్టంగా ఉంటుంది.
మనం సరిగ్గా శ్వాస తీసుకోవడానికి బ్రెయిన్ స్టెమ్ నుంచి గొంతుకు మాత్రమే కాకుండా ఛాతీకి, డయాఫ్రమ్‌కు కూడా సమాచారం చేరాల్సి ఉంటుంది. ఈ కఠిన అమరిక వల్ల నరాలు సంకోచించే అవకాశాలు ఉంటాయి. దాంతో వెక్కిళ్లు వస్తుంటాయి.
ఒకసారి వెక్కిళ్లు మొదలయ్యాక ఇక వస్తూనే ఉంటాయి. దీనికి కారణం మోటార్ రిఫ్లెక్స్. ఉభయచర జీవుల నుంచి వారసత్వంగా మనకు ఈ రిఫ్లెక్స్ సంక్రమించినట్లుగా అనిపిస్తుంది.
టాడ్‌పోల్‌లో ఈ రిఫ్లెక్స్‌ను నియంత్రించే నాడి.. గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లోని ద్వారం తెరిచి ఉండేలా, నీళ్లు తాగినప్పుడు మొప్పల్లోకి వెళ్లకుండా మూసుకునేలా చేస్తుంది.
అయితే, మానవులకు, వెక్కిళ్లు తీసే ఇతర క్షీరదాలకు దీని అవసరం లేదు. కానీ, మన పూర్వీకులకు సంబంధించిన మరో ఆధారంగా ఇది నిలుస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














