ఆసియా కప్ 2025: ఇండియా గెలిచింది.. కానీ, పాకిస్తాన్ ఓపెనర్ సెలబ్రేషన్ తీరు ఎందుకు చర్చనీయమైంది?

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది.
పాకిస్తాన్ ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలోనే ఛేదించింది.
అభిషేక్ శర్మ 74 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
లీగ్ దశలో మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకరికొకరు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్న తీరుపై చర్చ జరుగుతోంది. హాఫ్ సెంచరీ తరువాత ఫర్హాన్ బ్యాట్‌ను తుపాకీలా పట్టుకుని కాల్పులు జరుపుతున్నట్లుగా చేశాడు.
కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు దీనిపై ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.


ఫొటో సోర్స్, Getty Images
విరుచుకుపడిన అభిషేక్ శర్మ
భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అభిషేక్ శర్మ తొలి బంతినే సిక్సర్ కొట్టాడు. మరో ఓపెనర్ శుభమన్ గిల్‌తో కలిసి ధాటిగా ఆడాడు. ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడి భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు.
పవర్ ప్లేలో ఓపెనర్లు ఇద్దరు చెలరేగి ఆడటంతో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్నాక అభిషేక్ శర్మ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఏడో ఓవర్‌లో అభిషేక్ శర్మ రెండు సిక్సర్లు బాదాడు. 24 బంతుల్లోనే 4 సిక్సర్లు, నాలుగు ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు.
దీంతో భారత్ 8.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 100 పరుగులు దాటింది.
పాక్ బౌలర్ ఫహీమ్ అష్రాఫ్ పదో ఓవర్ ఐదో బంతికి శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేశాడు.
గిల్ 28 బంతుల్లో 47 పరుగులు చేశాడు.
ఆ తరువాత వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుకున్నాడు.
హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు.
వరుసగా గిల్, సూర్యకుమార్ యాదవ్ వికెట్లు కోల్పోయినా అభిషేక్ శర్మ తన దూకుడు కొనసాగించాడు.
39 బంతుల్లో 74 పరుగులు చేసి ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో అవుటయ్యాడు. సంజు శాంసన్ 13 పరుగులు చేసి రవూఫ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
తిలక్ వర్మ 19 బంతుల్లో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ అర్ధ సెంచరీ తర్వాత సెలబ్రేట్ చేసుకున్న తీరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ శ్రీనేత్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
'శభాష్ మోదీజీ! చూడటానికి ఇదే మిగిలి ఉంది. ఆయన ఇలా చేయడానికి ఎలా ధైర్యం వచ్చింది? నరేంద్ర మోదీ బలహీనమైన ప్రధానమంత్రి' అంటూ సుప్రియ 'ఎక్స్'లో రాశారు.
శివసేన (యూబీటీ) నాయకురాలు, రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఎక్స్‌లో దీనిపై స్పందిస్తూ బీసీసీఐని లక్ష్యంగా చేసుకున్నారు. 'బీసీసీఐకి అభినందనలు. ఈ చిత్రాలు మిమ్మల్ని తగినంతగా సంతృప్తి పరుస్తాయని, రెండు దేశాల మధ్య 'ఒలింపిక్' స్ఫూర్తిని ప్రభావితం చేయవని ఆశిస్తున్నాను. ఇది బాధించేది, కానీ రక్తంతో డబ్బు సంపాదించడంలో బిజీగా ఉన్నవారికి ఏ బాధా లేదు' అని ఆమె ట్వీట్ చేశారు.
రాజకీయ నాయకులతో పాటు, ఇతర సోషల్ మీడియా యూజర్లు కూడా ఫర్హాన్ స్పందన గురించి చర్చించుకోవడం కనిపించింది. జితేష్ అనే యూజర్ "సాహిబ్‌జాదా ఫర్హాన్ తన అర్ధ సెంచరీ తరువాత ఇలా వేడుక జరుపుకొన్నారు. మోదీజీ, ఇది యుద్ధం కాకపోతే, మరేమిటి?" అని రాశారు.
అయితే, స్టేడియంలో ఆటగాళ్లు ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. భారత మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోని, కోహ్లీ కూడా ఇలా చేసిన సందర్భాలున్నాయి.
ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ రిలీ రోసో కూడా ఫర్హాన్ తరహాలో సంబరాలు చేసుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
రాణించిన పాకిస్తాన్ బ్యాటర్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
పాకిస్తాన్ తమ ఓపెనింగ్ భాగస్వామ్యంలో మార్పు చేసింది. సైమ్ అయూబ్‌కు బదులుగా సాహిబ్‌జాదా ఫర్హాన్‌తో కలిసి ఫకార్ జమాన్ బ్యాటింగ్‌కు వచ్చాడు.
లీగ్ దశలో మ్యాచ్‌తో పోలిస్తే పాక్ బ్యాటర్లు ఈసారి రాణించారు.
ఫకార్ 9 బంతుల్లో 15 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. పాకిస్తాన్ 2.3 ఓవర్లలో 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
అయితే, మొదటి ఐదు ఓవర్లలో భారత ఫీల్డర్లు పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేశారు.
మొదటి ఓవర్ మూడో బంతికి అభిషేక్ శర్మ క్యాచ్ వదిలేయడంతో ఫర్హాన్ అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. నాలుగో ఓవర్ నాలుగో బంతికి కుల్‌దీప్ యాదవ్.. సైమ్ అయూబ్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు.
పాకిస్తాన్ ఆరు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఫీల్డింగ్‌కు ఏమైంది?
లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌తో పాకిస్తాన్‌ను కట్టడి చేసిన భారత్ ఈ మ్యాచ్‌లో బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలమైంది. ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేశారు.
ఏడో ఓవర్ మూడో బంతికి ఫర్హాన్ ఇచ్చిని క్యాచ్‌ను అభిషేక్ శర్మ బౌండరీ వద్ద వదిలేశాడు. ఫర్హాన్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 34 బంతుల్లో ఒక సిక్స్‌తో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
రెండో వికెట్‌కు ఫర్హాన్, సైమ్‌ల 72 పరుగుల భాగస్వామ్యాన్ని శివమ్ దుబే బ్రేక్ చేశాడు. పాకిస్తాన్ 10.3 ఓవర్లలో 93 పరుగుల వద్ద రెండవ వికెట్ కోల్పోయింది. సైమ్ 21 పరుగులు చేశాడు.
14వ ఓవర్ తొలి బంతికే హుస్సేన్ తలత్‌ను కుల్‌దీప్ యాదవ్ అవుట్ చేశాడు. దాంతో పాకిస్తాన్ 110 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మరో మార్పు చేసింది. మహ్మద్ నవాజ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.
15వ ఓవర్ తొలి బంతికే శివం దుబే ఫర్హాన్‌ను అవుట్ చేశాడు. దాంతో పాకిస్తాన్ 115 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులు చేశాడు.
శివం దుబే నాలుగు ఓవర్లలో 33 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
19వ ఓవర్ ఐదో బంతికి శుభ్‌మన్ గిల్.. ఫహీమ్ అష్రాఫ్ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ చేశాడు.
పాకిస్తాన్ మొత్తం 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 171 పరుగులు చేసింది.
శివమ్ దుబే రెండు వికెట్లు హార్దిక్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.

ఫొటో సోర్స్, Getty Images
టాస్ సమయంలో షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు
గ్రూప్ దశ మ్యాచ్‌లో జరిగినట్లుగానే.. ఈసారి కూడా కూడా టాస్ తర్వాత రెండు జట్ల కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ ఆగా కరచాలనం చేయలేదు.
గ్రూప్ దశ మ్యాచ్‌లో రెండు జట్ల కెప్టెన్లు కరచాలనం చేయకపోవడం చర్చనీయాంశమైంది.
మ్యాచ్ తర్వాత కూడా రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు.
రెండు జట్ల మధ్య జరిగిన గత కొన్ని మ్యాచ్‌లలో పాకిస్తాన్ భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది.
దీంతో భారత్ పాకిస్తాన్ మ్యాచ్‌లపై అభిమానుల ఆసక్తి తగ్గుతోంది.
స్పోర్ట్స్ స్టార్ జర్నలిస్ట్ ధ్రువ్ ప్రసాద్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఖాళీ కుర్చీల చిత్రాలను పోస్ట్ చేసి "దుబయిలో చాలా ఖాళీ కుర్చీలు ఉన్నాయి" అని రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














