అమెరికాతో వాణిజ్య చర్చల వేళ ప్రధాని మోదీ ప్రసంగం, ఆయన ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, narendramodi@x
రేపటి నుంచి దేశంలో జీఎస్టీ పొదుపు ఉత్సవం ప్రారంభం కానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఆదివారం సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
"ఆత్మనిర్భర్ భారత్" ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే కొత్త జీఎస్టీ రేట్ల గురించి మోదీ మాట్లాడారు. "మేడ్ ఇన్ ఇండియా" నినాదాన్ని కూడా ప్రస్తావించారు.
"నవరాత్రి మొదటి రోజైన సోమవారం నుంచి దేశంలో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమలవుతాయి. ఒక విధంగా, రేపటి నుంచి దేశంలో జీఎస్టీ పొదుపు ఉత్సవం ప్రారంభం కానుంది. ఇందులో మీ పొదుపు పెరుగుతుంది. మీకు నచ్చిన వస్తువులను మరింత సులభంగా కొనగలరు" అని అన్నారు మోదీ.
"పేదలు, మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యవస్థాపకులు, మన దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ పొదుపు ఉత్సవం నుంచి ప్రయోజనం పొందుతారు" అని ఆయన అన్నారు.
దేశంలోని వ్యాపారవేత్తలు పన్నుల వలలో(గతంలో) చిక్కుకున్నారని ప్రధాన మంత్రి మోదీ అన్నారు.

'డజన్ల కొద్దీ పన్నులుండేవి'
"మన దేశంలో డజన్ల కొద్దీ పన్నులు ఉండేవి. ఒక నగరం నుంచి మరొక నగరానికి వస్తువులను పంపాలంటే, మనం చాలా చెక్ పోస్టులను దాటాలి. చాలా ఫారమ్‌లను నింపాలి" అని మోదీ అన్నారు.
ఒక ఉదాహరణను ఉటంకిస్తూ, 2014లో తాను ప్రధాన మంత్రి అయినప్పుడు, ఒక విదేశీ వార్తాపత్రికలో ఒక ఆసక్తికరమైన సంఘటన ప్రచురితమైందని ఆయన అన్నారు.
"అందులో ఏం రాశారంటే, ఒక కంపెనీ తన వస్తువులను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు (500 కి.మీ) పంపవలసి వస్తే, అది మొదట తన వస్తువులను బెంగళూరు నుంచి యూరప్‌కు పంపేది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు పంపేది. ఇలాంటి వాటి కారణంగా, దేశంలోని లక్షలాది మంది ప్రజలు సమస్యలను ఎదుర్కొన్నారు" అని చెప్పారు మోదీ.
ఈ నెల ప్రారంభంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) రేట్లలో మార్పులను ప్రకటించారు. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ఆమోదించిన రేట్ల ప్రకారం, 12 శాతం, 28 శాతం శ్లాబులను రద్దు చేసి, 5 శాతం, 18 శాతాల్లో కలిపేశారు.
ఒక వైపు, సాధారణంగా ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ రేట్లు సడలించగా మరోవైపు, కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై జీఎస్టీని 40 శాతానికి పెంచారు.
'మేడ్ ఇన్ ఇండియా'కు ప్రాధాన్యత
"చాలా విషయాలు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. మన జేబులో ఉన్న దువ్వెన విదేశీయులదా లేక భారతీయులాదా అని కూడా మనకు తెలియదు. వీటిని కూడా మనం వదిలించుకోవాలి" అని మోదీ అన్నారు.
అమెరికా నుంచి భారత్ 50 శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో స్వదేశీ, స్వయంసమృద్ధి భారత్ కోసం ప్రధాని మోదీ నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నారు.
"మనం 'మేడ్ ఇన్ ఇండియా' వస్తువులను కొనుగోలు చేయాలి. ఇందులో మన దేశ యువత కృషి ఉంటుంది. మన దేశ కుమారులు, కూతుళ్ల చెమట ఉంటుంది. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చాలి. ప్రతి దుకాణాన్ని స్వదేశీతో అలంకరించాలి" అని ఆయన పిలుపునిచ్చారు.
"ఇది స్వదేశీ అని గర్వంగా చెప్పండి. నేను స్వదేశీనే కొంటాను, స్వదేశీ వస్తువునే అమ్ముతాను అని గర్వంగా చెప్పండి. ఇది ప్రతి భారతీయుడి వైఖరిగా మారాలి. ఇది జరిగినప్పుడు, దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది" అని మోదీ అన్నారు.
"ఈ స్వదేశీ ప్రచారంతో రాష్ట్రాల్లో తయారీని వేగవంతం చేయండి. పెట్టుబడికి వాతావరణాన్ని సృష్టించండి" అని ప్రధాని మోదీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
'నియో మిడిల్ క్లాస్' గురించి ఏమన్నారంటే..
దేశంలో గత 11 సంవత్సరాలలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడి, 'నియో మిడిల్ క్లాస్'గా పెద్ద పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి మోదీ చెప్పారు.
'నియో మిడిల్ క్లాస్' అనేది పేదరికం నుంచి బయటపడి, ఇంకా మధ్యతరగతిలో శాశ్వత భాగం కాని సామాజిక-ఆర్థిక తరగతి.
"ఈ నియో మధ్యతరగతికి సొంత ఆశయాలున్నాయి. ఈ తరగతికి రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితం చేయడం ద్వారా ప్రభుత్వం ఈ ఏడాది బహుమతిని ఇచ్చింది. ఇప్పుడు, పేదలకు రెట్టింపు బొనాంజా లభిస్తోంది. మొత్తం దేశానికి ఏకరీతి పన్ను వ్యవస్థ ఉంటుంది. జీఎస్టీ తగ్గింపు కలలను నెరవేర్చుకోవడం సులభతరం చేస్తుంది. అది ఇల్లు కట్టడం అయినా, టీవీ, రిఫ్రిజిరేటర్, స్కూటర్ లేదా బైక్ కొనడం అయినా... ఇప్పుడు వీటన్నింటికీ తక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. ప్రయాణం కూడా చౌకగా మారుతుంది" అని అన్నారు మోదీ.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, "ఈ నియో మిడిల్ క్లాస్ అనే పదాన్ని 2012 డిసెంబర్‌లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో మొదటిసారిగా ఉపయోగించారు".
ఆ తర్వాత, 2014 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో 'నియో మిడిల్ క్లాస్' ఆకాంక్షలను నెరవేరుస్తామని, వారు ముందుకు సాగడానికి సహాయం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














