అమరావతి: భూమి కోసం సీఆర్‌డీఏ వేధిస్తోందంటూ ప్రపంచ బ్యాంకు, ఏడీబీలకు ఫిర్యాదు చేసిన రైతులు.. స్పందించిన ప్రపంచ బ్యాంకు

అమరావతి
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలోని తమ భూములను ఇవ్వాలంటూ ఏపీ సీఆర్‌డీఏ (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) అధికారులు వేధిస్తున్నారని ఇద్దరు రైతులు ఏకంగా వరల్డ్‌ బ్యాంక్‌కు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌కు (ఏడీబీ) ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

ల్యాండ్‌ పూలింగ్‌లోని లేని తమ పొలాలను ల్యాండ్‌ పూలింగ్‌కి ఇవ్వలేమని పదే పదే విన్నవించుకున్నా.. సీఆర్‌డీఏ అధికారులు ఒప్పుకోవడం లేదనీ, బలవంతంగా తమ పొలాల్లోకి ప్రవేశించి తాము వేసుకున్న కంచెను ధ్వంసం చేశారని వీరు ఫిర్యాదు చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా.. వారు కంప్లయింట్‌ తీసుకోకపోగా తమనే బెదిరించారని, దీంతో తప్పని పరిస్థితుల్లోనే అమరావతికి నిధులిస్తున్న ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ)కు, వరల్డ్‌ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశామని ఇద్దరు రైతులు పసుపులేటి జమలయ్య, కలపాల శరత్‌కుమార్‌ బీబీసీకి చెప్పారు.

అయితే, వేధిస్తున్నారంటూ రైతులు చేసిన ఆరోపణలను అధికారులు తోసిపుచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ముగ్గురు వ్యక్తులు మందడం ప్రాంతంలో ఎకరం పొలం కొనుక్కున్నారు. తర్వాత జరిగిన పరిణామాలలో వారి పొలం నోటిఫైడ్‌ ప్రాంతంలోకి వచ్చింది.

అమరావతి

‘‘మా ముగ్గురిలో ఓ వ్యక్తి తనకున్న 30 సెంట్లను గతంలోనే ల్యాండ్‌ పూలింగ్‌కి ఇచ్చేశారు. మిగిలిన మా ఇద్దరిలో నాకు మందడం సర్వే నెంబరు 225/1లో 40 సెంట్లు, కలపాల శరత్‌కుమార్‌కి సర్వే నెంబరు 225/1లో 30 సెంట్లు భూమి ఉంది. విజయవాడలో మేము నివాసముంటున్నాం. 11 ఏళ్లుగా అక్కడ మేమిద్దరం వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటున్నాం'' అని జమలయ్య తెలిపారు.

స్పీడ్ యాక్సెస్ రోడ్డు
ఫొటో క్యాప్షన్, దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 18.270 కిలోమీటర్ల రహదారిని ఒక ప్యాకేజీగా విభజించారు.

ఒత్తిడి పెరిగిందన్న రైతులు

రైతుల వాదన

''ఆ హోటల్‌కు ఇచ్చిన భూమి పక్కనే ఉన్న మా పొలం కూడా భూసమీకరణలో భాగంగా ఇచ్చేస్తే వాళ్లకి విశాలమైన రోడ్డు వస్తుందని ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీ సీఆర్‌డీఏ) అధికారులు మాకు అప్పటి నుంచి చెబుతూ వస్తున్నారు’’ అని జమలయ్య, శరత్‌కుమార్‌ బీబీసీకి చెప్పారు.

‘‘మేం ముందు ఆలోచించుకుంటామనే చెప్పాం. కానీ, వాళ్లు వినకుండా ఒత్తిడి చేస్తూ వచ్చారు. సీఆర్‌డీఏ ఆఫీసుకు పిలిపించి మరీ ఉన్నతాధికారులు తమతో చర్చలు జరిపారు. 'భూసమీకరణకు ఇస్తే మంచి రేటిస్తాం. లేదంటే భూసమీకరణ ప్రకటన చేస్తే మీకు ఏమీ రాదు. ఆలోచించుకోండి' అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు'' అని జమలయ్య, శరత్‌కుమార్‌ బీబీసీకి వివరించారు.

దీనిపై సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్‌ శేషిరెడ్డి బీబీసీతో మాట్లాడుతూ...''మేం ఎవరినీ బెదిరించలేదు. వాళ్లు తొలుత గ్రీవెన్స్‌లో రిప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత వరల్డ్‌ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఇంతకుమించి నాకు తెలియదు. మేం అలా బెదిరించి తీసుకుంటే ఇన్ని వేల ఎకరాల భూసేకరణను ఇంత సామరస్యంగా తీసుకోగలమా..?'' అని వ్యాఖ్యానించారు.

పొలం

ఫొటో సోర్స్, UGC

‘అసలు మా పొలమే ఇక్కడ కాదని కంచె తొలగించారు’

ఓ పక్క మాతో చర్చలు జరుపుతూనే.. మరోపక్క తమ పొలంలోకి సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారులు బలవంతంగా వచ్చారని ఆ రైతులు ఆరోపించారు.

''ఈ ఏడాది సెప్టెంబర్‌ 5వ తేదీన పొక్లెయిన్లతో మా పొలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ తొలగించేశారు. మాకు విషయం తెలిసి, మేం పరుగున అక్కడికి వెళ్తే.. అసలు మీ పొలం హద్దులు ఏవి చూపించండి అని మాట్లాడారు. మేం మా కాగితాలు చూపించి బ్రతిమాలినా పట్టించుకోలేదు'' అని జమలయ్య చెప్పారు.

దీనిపై తుళ్లూరు తహశీల్దార్‌ సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ''అసలు ఆ ఇద్దరిలో ఎవరూ వారి వద్దకు రాలేదు. ఫెన్సింగ్‌ తొలగింపు విషయంలో కూడా మాకు కానీ, సీఆర్‌డీఏకు కానీ ఏ మాత్రం సంబంధం లేదు'' అని స్పష్టం చేశారు.

''ఆ ఇద్దరు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఒకవేళ ఫెన్సింగ్‌ తొలగించిన మాట నిజమే అయితే ఎవరు తీశారో కనుక్కుంటాం'' అని సునీల్‌కుమార్‌ బీబీసీతో అన్నారు.

అమరావతి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఇలా ప్రొక్లెయిన్‌తో ఫెన్సింగ్‌ను కూల్చివేసి తమ పొలాన్ని ధ్వంసం చేశారంటూ ఈ ఫోటోలను వరల్డ్‌ బ్యాంక్‌కి ఇచ్చిన ఫిర్యాదు కాపీలో జత చేసిన రైతులు

‘పోలీసులు పట్టించుకోకపోగా...’

''మాకేం చేయాలో తెలియక ఈనెల 9వ తేదీన తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాం. కానీ, పోలీసులు మా కంప్లయింట్‌ తీసుకునేందుకు నిరాకరించారు. పైగా సీఐ మమ్మల్నే బెదిరించే ధోరణిలో మాట్లాడారు. దాంతో మాకు భయం వేసింది'' అని జమలయ్య బీబీసీకి వివరించారు.

దీనిపై తుళ్లూరు సీఐ శ్రీనివాస్‌తో బీబీసీ మాట్లాడగా.. ''రోజుకి చాలామంది ఫిర్యాదుదారులు వస్తుంటారు. అలా ఎందుకు మాట్లాడతాం. వాళ్లిద్దరు ఎవరో నాకు గుర్తు రావడం లేదు'' అని చెప్పారు.

పసుపులేటి జమలయ్య

ఫొటో సోర్స్, Pasupuleti Jamalaiah

ఫొటో క్యాప్షన్, రైతులు వరల్డ్‌ బ్యాంక్, ఏడీబీలకు ఇచ్చిన ఫిర్యాదు కాపీ

‘వరల్డ్‌ బ్యాంక్‌, ఏడీబీలకు ఎందుకు ఫిర్యాదు చేశామంటే..’

అటు సీఆర్‌డీఏ అధికారులు ఫెన్సింగ్‌ తొలగించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారనీ, ఇటు పోలీసులు పట్టించుకోవడం లేదనీ, దాంతో విధి లేని పరిస్థితుల్లో తాము వరల్డ్‌ బ్యాంక్, ఏడీబీలకు ఫిర్యాదు చేశామని జమలయ్య, శరత్‌కుమార్‌ బీబీసీతో చెప్పారు.

''అమరావతి రాజధాని నిర్మాణానికి వరల్డ్‌ బ్యాంక్‌తో పాటు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ (ఏడీబీ)నిధులిస్తోంది. అందుకే వారికి ఫిర్యాదు చేశాం'' అని జమలయ్య, శరత్‌కుమార్‌ బీబీసీతో అన్నారు.

రైతుల ఫిర్యాదు

‘మా ఫిర్యాదులు రిజిస్టర్‌ అయినట్టు వచ్చింది’

కాగా, తాము ఈనెల 13న ఫిర్యాదును మెయిల్‌లో పంపించగా, వరల్డ్‌ బ్యాంక్, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకుల నుంచి ఈనెల 16వ తేదీనే తమ ఫిర్యాదు రిజిస్టర్‌ అయినట్టు వచ్చిందని జమలయ్య బీబీసీతో చెప్పారు.

పొలం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గతంలో ఫెన్సింగ్‌తో ఉన్న ఈ భూమి తమదేనంటున్న రైతులు

'మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు'

''ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇవ్వకుండా వరల్డ్‌ బ్యాంక్, ఏడీబీలకు ఫిర్యాదు చేయగానే.. మేము ప్రతిపక్ష, విపక్ష పార్టీల వాళ్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది మరీ అన్యాయం. నాకు 74 ఏళ్లు. నేను బీఎస్‌ఎన్‌ఎల్‌లో డీజీఎం హోదాలో పని చేసి 14 ఏళ్ల కిందట రిటైర్‌ అయ్యాను. నాకు ఇప్పుడు రాజకీయాలు అవసరమా..? పోనీ నేను ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీతో కలిసి ఉండటం ఎవరైనా చూశారా..?'' అని జమలయ్య ప్రశ్నించారు.

ఇదే విషయమై శరత్‌కుమార్‌ మాట్లాడుతూ.. డాక్టర్‌ చదివిన తాను విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చానని, తనకు రాజకీయాలతో అసలు సంబంధం లేదని చెప్పారు.

''ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను నిరసించిన వారిని, లేదా గళం విప్పిన వారిని విపక్ష పార్టీల వ్యక్తులుగా ముద్ర వేయడం గత ప్రభుత్వంలోనూ జరిగింది. ఇప్పుడూ జరుగుతోంది. ఇది మంచి పద్ధతి కాదు'' అని సీనియర్‌ జర్నలిస్టు వల్లభనేని సురేష్‌ బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)