సింగపూర్‌కు చంద్రబాబు.. అప్పటి మంత్రి ఈశ్వరన్ సంతకాలు చేసిన గత ఒప్పందాలు ఏమయ్యాయి?

ఫొటో సోర్స్, Facebook/Nara Chandrababu Naidu
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన బృందం జూలై 26న సింగపూర్ పర్యటనకు వెళ్లనుంది.
జూలై 30 వరకు ఈ బృందం సింగపూర్‌లో పర్యటించనుంది.
ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన అజెండాగా ఈ పర్యటన ఉంటుందని పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ. భరత్ బీబీసీకి తెలిపారు.
అక్కడి ఐటీ రంగం అభివృద్ధి, పోర్టుల ప్రగతి, మౌలిక వసతుల కల్పన, సింగపూర్ నగర సుందరీకరణ వంటి విషయాలను అధ్యయనం చేసి.. మన రాష్ట్రంలో ఏ మేరకు అమలు చేయొచ్చనే అవకాశాలను పరిశీలిస్తామని భరత్ చెప్పారు.
బీబీసీతో మాట్లాడుతూ, ఆయా రంగాల్లో ఆ దేశ సహకారం తీసుకునేందుకు ఉన్న అవకాశాలపై అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారని భరత్ అన్నారు.


ఫొటో సోర్స్, TDP/FB
గతంలోనూ సింగపూర్‌తో చర్చలు
2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారి సింగపూర్ వెళ్తున్న చంద్రబాబు గతంలోనూ ముఖ్యమంత్రిగా పలుమార్లు ఆ దేశ పర్యటనకు వెళ్లారు.
అత్యంత వేగంగా అభివృద్ధి సాధించిన సింగపూర్ తరహాలోనే తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. వేగవంతమైన ప్రగతి విషయంలో ఆయన ఎక్కువగా సింగపూర్‌నే ప్రస్తావించేవారు.
ఇక 2014లో తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాబు కొత్త రాజధాని అమరావతి నిర్మాణం కోసం సింగపూర్‌తో చర్చలు జరిపారు.
అమరావతి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడంతో పాటు పలు రాజధాని ప్రాజెక్టుల విషయమై సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఫొటో సోర్స్, TDP/FB
సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం
అమరావతి స్టార్టప్ ఏరియా డెవలెప్‌మెంట్ కోసం సింగపూర్ కన్సార్టియంతో అప్పట్లో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు.
అమరావతికి అవసరమైన టెక్నాలజీలకు సంబంధించిన స్టార్టప్‌లను ఇక్కడికి రప్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.
ఇందుకోసం 2017 మే 2న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అసెండాస్ సింగ్‌బ్రిడ్జ్– సెంబ్‌కార్ప్ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటైన సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం చేసుకుంది.
ఆ ఒప్పంద పత్రాలపై అప్పటి సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ సంతకాలు చేశారు.
మూడు దశల్లో 15 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నారు.
అయితే, స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందంలో మార్పులు, కొత్తగా షరతులు విధించేందుకు అవకాశం లేకుండా పవరాఫ్ అటార్నీ రాసి ఇవ్వాలని అసెండాస్ సింగ్‌బ్రిడ్జ్– సెంబ్‌కార్ప్ కన్సార్టియం కోరగా, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
సింగపూర్ కంపెనీలకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నట్లు జీవో నంబర్ 168ని నాటి టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ ప్రాజెక్టులో సింగపూర్ కంపెనీల పెట్టుబడి రూ.306.4 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.5721.9 కోట్లతో స్టార్టప్ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని పేర్కొంది.
ఇక స్టార్టప్ ఏరియా వాటాల కేటాయింపులపైనా అప్పట్లో .పెద్దయెత్తున చర్చ జరిగింది.
రూ.5721.9 కోట్లు వెచ్చిస్తామన్న ఏపీ ప్రభుత్వానికి 42 శాతం వాటా మాత్రమే ఉండగా, రూ. 306.4 కోట్లు మాత్రమే వెచ్చించే కన్సార్టియానికి 58% వాటా ఇవ్వడాన్ని నాడు విపక్షాలు విమర్శించాయి.
అయితే, ఈ నిర్ణయాన్ని నాటి తెలుగుదేశం ప్రభుత్వం, పార్టీ గట్టిగానే సమర్థించుకుంది.
మొత్తంగా ఈ స్టార్టప్ ఏరియా అభివృద్ధి ద్వారా 1.15 లక్షల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని, ఏటా 8 వేల నుంచి 10 వేల కోట్ల రూపాయలు పన్నుల రూపేణా ప్రభుత్వానికి వస్తాయని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆ ఒప్పందాన్ని రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం
2017లో టీడీపీ ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన వైసీపీ.. 2019లో అధికారంలోకి రాగానే, అదే ఏడాది నవంబర్‌లోనే సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
కన్సార్టియాన్ని ఎంపిక చేసే విషయంలో నిబంధనలు పాటించలేదని.. ఈ ప్రాజెక్టు దురుద్దేశపూర్వకంగా ప్రతిపాదించారని ఆరోపించింది.
ఇక అప్పటి నుంచి ఏపీ విషయంలో, ప్రత్యేకించి రాజధాని విషయంలో సింగపూర్ ప్రస్తావన లేకుండా పోయింది.

ఫొటో సోర్స్, TDP/FB
ఈశ్వరన్ అరెస్టు, జైలు శిక్షతో చర్చ
2017లో అమరావతి స్టార్టప్ ఏరియా డెవలెప్‌మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం.. సింగపూర్ కన్సార్టియంతో చేసుకున్న ఒప్పంద పత్రాలపై సంతకం చేసిన ఆ దేశ మంత్రి ఈశ్వరన్ ఆ తర్వాత అవినీతి ఆరోపణలతో జైలుపాలవ్వడం ఇక్కడ చర్చకు దారితీసింది.
ప్రవాస భారతీయుడైన ఈశ్వరన్.. సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్ట్‌లో అక్రమాలకు పాల్పడినట్లు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం నిర్ధరించి 2023 జూలై 12న అరెస్టు చేసింది.
ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదల కాగా, కరప్షన్ ప్రాక్టీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ) పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి 27 అభియోగాలతో ఆయన అవినీతిని నిగ్గు తేల్చింది. దీంతో అక్కడి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. 2024 అక్టోబర్‌లో తీర్పునిచ్చింది.
ఈశ్వరన్ అరెస్టుతో, ఆయన నేతృత్వంలో అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చర్చకు వచ్చింది.
2017లో జరిగిన ఈ ఒప్పందం కంటే ముందు.. 2015 అక్టోబర్‌లో జరిగిన అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యమ్రంలో కూడా ఈశ్వరన్ పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, AP CRD
మళ్లీ ఆ కన్సార్టియం వస్తుందా?
ఇప్పుడు చంద్రబాబు, మంత్రులు, అధికారుల పర్యటనతో మళ్లీ ఆ కన్సార్టియం వస్తుందా? రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడంలో భాగంగా అప్పట్లో వెనక్కి వెళ్లిన కంపెనీలు మళ్లీ వస్తాయా? అనే చర్చ మొదలైంది.
అయితే, దీనిపై మాట్లాడేందుకు మంత్రులు గానీ అధికారులు గానీ ముందుకు రాలేదు.
ఇదే విషయమై టీజీ భరత్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘అప్పుడేం జరిగిందో నాకు తెలియదు. రాజధాని నిర్మాణ పనుల్లో సింగపూర్ కంపెనీల ప్రమేయంపై అప్పుడే నేను మాట్లాడలేను. ప్రపంచంలోనే సుందరనగరంగా, పోర్టుల ప్రగతికి కేరాఫ్‌గా ఉన్న సింగపూర్‌ని అధ్యయనం చేసి అవసరమైతే అక్కడి కంపెనీల సహకారం తీసుకుంటాం’’ అని అన్నారు.
అయినా.. సింగపూర్‌తో బంధాలను మెరుగుపరుచుకుంటే తప్పేమీ లేదు కదా? అని ఆయన ప్రశ్నించారు.
‘విశాఖకు ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తాం’
సింగపూర్ పర్యటనలో మంత్రి లోకేష్‌తో పాటు తాను అక్కడి ఐటీ కంపెనీలతో సమావేశమై విశాఖకు రావాలని ఆహ్వానిస్తామని, ఐటీ శాఖ కార్యదర్శిగా తన ముందున్న ప్రధాన అజెండా అదేనని సీనియర్ ఐఏఎస్ అధికారి కాటంనేని భాస్కర్ బీబీసీతో చెప్పారు.
మిగిలిన వాటి గురించి తనకు తెలియదన్నారు.
ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందేందుకు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన నగరం సింగపూర్‌ను పరిశీలించి.. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వెళ్తున్న బృందంలో తానూ ఉన్నానని ఆర్థిక అభివృద్ధి సంస్థ సీఈవో సాయికాంత్ వర్మ బీబీసీతో అన్నారు.
పెట్టుబడుల సమీకరణపై దృష్టి పెడుతున్నామని, ఇంతకు మించి దానిపై అప్పుడే తాము బహిరంగంగా మాట్లాడలేమన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Gudivada Amarnath
‘ఈశ్వరన్‌ను పరామర్శించడానికి వెళ్తున్నారా?'
‘‘అప్పట్లో రాజధాని నిర్మాణ పనులకు టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసులో ఇప్పుడు జైల్లో ఉన్నారు. అందుకని ఆయన్ని పరామర్శించేందుకే చంద్రబాబు అండ్ కో సింగపూర్ వెళ్తున్నారా?’’ అని వైసీపీ హయాంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన ఆ పార్టీ నేత గుడివాడ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు.
పూర్తి నిబంధనలకు విరుద్ధంగా అప్పట్లో సింగపూర్ కంపెనీలతో కన్సార్టియం చేసుకున్నారని, మళ్లీ ఇప్పుడు అదే విధంగా కంపెనీలను తీసుకొచ్చి ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూములను దోచిపెడతారా? అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు మళ్లీ సింగపూర్ పర్యటనలకు వెళ్లడం.. నేల విడిచి సాము చేయడం లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు గాలి నాగరాజు వ్యాఖ్యానించారు.
‘‘గతంలో ఓసారి ఇలానే సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని విమర్శల పాలయ్యారు. అయినా బాబు మారకుంటే ఎలా?’’ అని ప్రశ్నించారు.
‘‘ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతోంది. రాజధాని పునర్నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టేశారు. ఇప్పుడు సింగపూర్ టూర్‌కి వెళ్లి చేసేదేముంది?’’ అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














