డీలిమిటేషన్‌పై జేఏసీ సమావేశానికి ఏపీ నుంచి ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు వెళ్లలేదు?

ఫొటో సోర్స్, FACEBOOK/TDP/JANASENA/YSRCP
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై(డీలిమిటేషన్) తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన రాజకీయ పార్టీల ఐక్య కార్యాచరణ సమితి(జాయింట్ యాక్షన్ కమిటీ - జేఏసీ) సమావేశం మార్చి 22న చెన్నైలో జరిగింది.
దేశంలో జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను జేఏసీ సమావేశం తీవ్రంగా వ్యతిరేకించింది. 1971 జనాభా ప్రాతిపదికన, ప్రస్తుతమున్న ఎంపీల సంఖ్యనే మరో పాతికేళ్లు కొనసాగించాలని జేఏసీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, అక్కడి ప్రభుత్వాలతో కూలంకుషంగా చర్చించిన తర్వాతే పునర్విభజనపై కేంద్రం ముందుకెళ్లాలని ఈ జేఏసీ సమావేశం తీర్మానించింది.
అయితే, ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్క పార్టీ ప్రతినిధులు హాజరుకాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఎవరెవరు హాజరయ్యారు?
డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జేఏసీ తొలిసారిగా సమావేశమైంది. మొత్తం 14 పార్టీల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఒడిశా మాజీ మంత్రి సంజయ్ కుమార్, ముస్లిం లీగ్ నేత పీఎంఏ సలాం, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఎస్.కె పరమచంద్రన్ సహా ఇతరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ వీడియో సందేశం పంపారు.
తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాన నరేంద్ర మోదీకి ఉమ్మడిగా వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. తదుపరి సమావేశాన్ని బహిరంగ సభగా హైదరాబాద్‌లో నిర్వహించాలని తీర్మానించారు.

ఫొటో సోర్స్, HANDOUT
ఏపీ నుంచి ఒక్కరూ వెళ్లలేదు..
ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రతినిధి కూడా హాజరుకాలేదు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల నుంచి అధికార, విపక్ష నేతలు పాల్గొన్నారు.
పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ హాజరయ్యారు. కానీ, ఏపీలో అటు అధికార పక్షం నుంచిగానీ, విపక్షం నుంచిగానీ ఏ ఒక్కరూ హాజరుకాలేదు.
జనాభా ప్రాతిపదికన నియోజవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రంలో ఎంపీ సీట్ల సంఖ్య తగ్గిపోతుందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, విపక్ష నేత - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
కానీ, స్టాలిన్ సమావేశానికి టీడీపీ, వైసీపీతో పాటు జనసేన నుంచి కూడా ఎవ్వరూ హాజరుకాలేదు.

ఫొటో సోర్స్, UGC
బాబు - జగన్ - పవన్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఆదివారం నాటి సమావేశానికి హాజరయ్యాయి.
ఎన్డీయే కూటమిలో టీడీపీ భాగస్వామ్య పార్టీగా ఉన్నందునే చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరుకాలేదన్న చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ జేఏసీ సమావేశానికి సంబంధించి ఆహ్వానం అందలేదని సీఎం సీపీఆర్వో ఆలూరి రమేశ్ బీబీసీతో చెప్పారు.
వాస్తవానికి, ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులను చెన్నైలోని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించేందుకు డీఎంకే మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్ మార్చి 12న ఏపీకి వచ్చారు.
వీరు అమరావతిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్‌కు డీఎంకే నేతలు అందజేశారు. అయినప్పటికీ, వైఎస్ జగన్ కానీ, ఆయన పార్టీ ప్రతినిధులు కానీ జేఏసీ సమావేశంలో పాల్గొనలేదు.
అదే రోజు, జనసేన అధ్యక్షుడు పవన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో జనసేన పార్టీ నేతలకు ఆ లేఖను అందించి వెనుదిరిగారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మోదీకి జగన్ లేఖ
చెన్నైలో జరిగిన అఖిలపక్ష భేటీకి హాజరుకాని వైఎస్ జగన్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఇదే విషయమై లేఖ రాశారు.
2026లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని వైఎస్ జగన్ ఆ లేఖలో కోరారు.
కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపులో భాగంగా, గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గిందనీ, ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనీ, అందువల్ల జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ లేకుండా చూడాలని జగన్ ఆ లేఖలో కోరారు.
''అటు లోక్ సభలో, ఇటు రాజ్యసభలో ఏ రాష్ట్రానికీ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా'' అని ప్రధాని మోదీని జగన్ కోరారు.

ఫొటో సోర్స్, JanaSena Party /FB
స్టాలిన్‌కు లేఖ పంపిన జనసేన
చెన్నైలో జరిగే జేఏసీ సమావేశానికి హాజరుకాలేదన్న సమాచారాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ద్వారా పంపించారు. ఈ మేరకు కాకినాడ ఎంపీ ఉదయ్ చెన్నైకి వెళ్లి ఆ లేఖను డీఎంకే నేతలకు అందజేశారు.
చెన్నై వెళ్లేముందు దిల్లీలో ఉదయ్ మీడియాతో మాట్లాడుతూ, ''అది సీల్డ్ కవర్. ఆ లేఖలో ఏముందో నాకు తెలియదు. మా అధినేత ఇచ్చి రమ్మన్నారు'' అని చెప్పారు.
ఇదే విషయమై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడుతూ, ''ఆహ్వానించారు కాబట్టి, ఆ సమావేశానికి హాజరుకావడం లేదని గౌరవంగా సమాచారం ఇచ్చేందుకే తమ అధినేత లేఖ పంపించారు'' అని చెప్పారు.
ఈ విషయమై మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా, జనసేన ఎంపీ ఉదయ్ అందుబాటులోకి రాలేదు. రాగానే ఈ కథనంలో అప్డేట్ చేస్తాం.

ఫొటో సోర్స్, HANDOUT
'ఏపీ నేతలు స్పందించకపోవడం అన్యాయం'
''వాస్తవానికి, నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ జనగణన నిలిచిపోవడంతో పునర్విభజన జాప్యమైంది. 2026లో పునర్విభజన తప్పకుండా ఉంటుంది. అయితే, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఇది తెలిసినప్పటికీ ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు మాట్లాడకపోవడం అన్యాయం'' అని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు.
లోక్ సభలో ప్రస్తుతం ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 543. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 129 సీట్లు. తెలంగాణలో 17, ఏపీలో 25, కేరళలో 20, తమిళనాడులో 39, కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం సీట్ల సంఖ్యలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతం.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 753కి పెరిగే అవకాశం ఉందని అంచనా. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పుడున్న 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోతుందని ఓ అంచనా.
''చెన్నైలో శనివారం నాటి సమావేశానికి తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి నేతలు హాజరయ్యారు. కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి అధికార, విపక్ష నేతలు హాజరుకాకపోవడం సరికాదు. టీడీపీ, జనసేనలు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నందున హాజరుకాకపోవచ్చు. కానీ, జరుగుతున్న అన్యాయాన్ని ఏదో రూపంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి, లేదంటే రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే. ఇక విపక్ష నేతగా వైఎస్ జగన్ కూడా హాజరై ఉంటే బావుండేది'' అని లక్ష్మణరావు బీబీసీకి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)














