ఎస్సీ వర్గీకరణకు ఏపీ మంత్రివర్గం ఆమోదం.. మాదిగలు, మాలలు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Manda Krishna Madiga/FB
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీలను ఏ, బీ, సీ మూడు కేటగిరీలుగా వర్గీకరించాలని నిర్ణయించింది.
ఆది ఆంధ్ర మాదిగ, ఆది ఆంధ్ర మాలలను మాదిగ, మాల ఉప కులాల కిందకు చేర్చాలని నిర్ణయించింది.
2011 జనాభా లెక్కల ప్రాతిపదికన, రాష్ట్రం ఒక యూనిట్‌గా వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికకు మార్చి 17న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ నెల 20న బడ్డెట్ సమావేశాల్లో చర్చ, తీర్మానం అనంతరం కేంద్రానికి పంపాలని నిర్ణయించింది.

కమిషన్ చేసిన సిఫార్సులు ఇవీ..
రాష్ట్రంలో మొత్తం షెడ్యూల్డ్ కులాలకు ఉన్న 15 శాతం రిజర్వేషన్‌లో, ఏ కులానికి ఎంత రిజర్వేషన్ అనే విషయంపై కమిషన్ చేసిన సిఫార్సులు ఇలా ఉన్నాయి.
గ్రూప్–1 (రెల్లి కులస్తులు) - 1%
గ్రూప్–2 (మాదిగ, ఉపకులాలు) - 6.5%
గ్రూప్–3 (మాల, ఉపకులాలు) - 7.5%
జనాభా ప్రాతిపదికన.. రెల్లి కులస్తులకు 1 శాతం, మాదిగ - మాదిగ ఉపకులాలకు 6.5 శాతం, మాలలు - మాల ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పించాలని నివేదికలో కమిషన్ సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్సీ వర్గీకరణ అంటే ఏమిటి?
షెడ్యూల్డ్ కులాల కోటాను కులాల వారీగా వర్గీకరించడాన్ని ఎస్సీ వర్గీకరణగా పేర్కొంటున్నారు.
దళితులు, గిరిజనులను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించి సమాన అవకాశాలను అందించే లక్ష్యంతో రాజ్యాంగం ఆర్టికల్ 16(4)తో రిజర్వేషన్లను తీసుకొచ్చింది.
మాల, మాదిగ సహా 59 కులాలు, ఉపకులాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించారు.
వర్గీకరణ వివాదం ఎప్పటిది..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ వివాదం మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో (అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) షెడ్యూల్డ్ కులాల్లో సంఖ్యాపరంగా మాల, మాదిగలు ఎక్కువగా ఉన్నారు.
2001 జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని షెడ్యూల్డ్ కులాల్లో 49.2 శాతం మాదిగ, 41.6 శాతం మాలలు ఉన్నారు.
ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం, ఎస్సీ జనాభా 1,38,78,078 మంది. వీరిలో మాదిగలు 67,02,609 కాగా, మాలలు 55,70,244. మాదిగల జనాభా మాలలకంటే 11,32,365 మంది ఎక్కువ.
షెడ్యూల్డ్ కులాల కోటాలో ఉద్యోగాలు, అవకాశాలు మాల కులస్తులకే ఎక్కువగా లభిస్తున్నాయని, అందరికీ సమానంగా అవకాశాలు లభించాలంటే షెడ్యూల్డ్ కులాల కోటాను కులాల వారీగా వర్గీకరించాలనే డిమాండ్‌తో మాదిగలు ఆందోళన చేస్తున్నారు.
1994లో ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా జులై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) ఏర్పాటైంది. 1990వ దశకంలో ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమంగా ఎంఆర్‌పీఎస్ ప్రాచుర్యం పొందింది.
మాదిగ దండోరాగా ఇది ప్రజల్లో నానింది.
అయితే, అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మాల మహానాడు కూడా నాటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది.
షెడ్యూల్డ్ కులాల అసమానత కులపరంగా కాకుండా ప్రాంతాలపరంగా చూడాలని మాలమహానాడు డిమాండ్ చేస్తూ వచ్చింది. ప్రధానంగా, మాలలు కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటే.. రాయలసీమ, తెలంగాణల్లో మాదిగ కులస్తులు ఎక్కువగా ఉంటారని, ఈ క్రమంలో వర్గీకరణ సరైన పరిష్కారం కాదని వాదిస్తూ వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
1997లో ఏ, బీ, సీ, డీగా వర్గీకరణ
అప్పట్లో ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో వర్గీకరణ ఉద్యమం ఉవ్వెత్తున సాగడంతో షెడ్యూల్డ్ కులాల మధ్య నెలకొన్న సామాజిక అసమానతలను అధ్యయనం చేసేందుకు 1996 సెప్టెంబర్ 10న రామచంద్రరాజు కమిషన్‌ను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌కు అనుకూలంగా 1997 మే నెలలో రామచంద్రరాజు కమిషన్ తన నివేదికను సమర్పించింది.
ఆ తర్వాత, 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ డిమాండ్‌కు అనుకూలంగా తీర్మానం చేశారు. 1997 జూన్ 6న ప్రభుత్వం జీవో ద్వారా షెడ్యూల్డ్ కులాల కోటాను వర్గీకరించింది. ఈ జీవో ప్రకారం ఎస్సీలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించారు.
ఏ-గ్రూపులో రెల్లి సహా 12 కులాలకు స్థానం కల్పించారు. బీ-గ్రూపులో మాదిగ, సంబంధిత 18 కులాలను చేర్చారు. సీ-గ్రూపులో మాల కులస్తులతో పాటుగా మరో 24 కులాలను చేర్చారు. డీ-గ్రూపులో ఆది ఆంధ్ర కులాలను చేర్చారు.
హైకోర్టు తీర్పుతో వర్గీకరణకు బ్రేక్
నాటి ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ మాల మహానాడు హైకోర్టులో కేసు వేయడంతో 1997 సెప్టెంబర్ 18న హైకోర్టు నిలుపుదల చేస్తూ తీర్పునిచ్చింది. ఈ జీవో ప్రభుత్వ పరిధికి మించినదనీ, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ జీవో అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ తర్వాత, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2004లో సుప్రీం కోర్టులో కూడా ఐదుగురు సభ్యుల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది.

ఫొటో సోర్స్, Getty Images
నిరుడు సుప్రీం ఇచ్చిన తీర్పుతో మళ్లీ..
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు గతేడాది జులైలో సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
వర్గీకరణ తప్పనిసరంటూ పేర్కొన్న ధర్మాసనం, ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని తుది తీర్పును వెల్లడించింది.
కమిషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలోనే, రాష్ట్రంలోని ఎస్సీల స్థితిగతుల అధ్యయనానికి గతేడాది 2024 నవంబర్ 15న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను కూటమి ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి కమిషన్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది.
దాదాపు మూడున్నర నెలల పాటు అన్ని జిల్లాల్లో పర్యటించి సిద్ధం చేసిన నివేదికను రాజీవ్ మిశ్రా మార్చి 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు అందజేశారు.

ఫొటో సోర్స్, Getty Images
30 ఏళ్ల కల ఫలిస్తోంది: మంద కృష్ణ మాదిగ
రిజ్వర్వేషన్ల వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తోన్న పోరాటం, కల ఇన్నేళ్లకు ఫలిస్తోందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక నేత మంద కృష్ణ మాదిగ బీబీసీ వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు.
''ఎస్సీ వర్గీకరణకు ఏపీ మంత్రిమండలి ఆమోదముద్ర వేసినందుకు ముందుగా సీఎం చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు. ఇది న్యాయమైన హక్కుల సాధనగా మేం చూస్తున్నాం. ఈ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎవరికీ నష్టం కాదు. మాల సోదరులకే కాదు. అందరికీ న్యాయం జరగబోతోంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Facebook
ఈ వర్గీకరణకు మేం వ్యతిరేకం: మాల మహానాడు
పక్కాగా కులగణన చేపట్టకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం వర్గీకరణ చేపట్టాలని చూడడం అన్యాయమని, ప్రభుత్వ నిర్ణయాన్ని మేం వ్యతిరేకిస్తున్నామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ బీబీసీతో అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన సర్వే లోపభూయిష్టంగా ఉందని ఆయన ఆరోపించారు. 2011 గణాంకాల ప్రకారం, 2025లో వర్గీకరణ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.
''కొత్తగా పెరిగిన జనాభాను దష్టిలో ఉంచుకుని కులగణన చేపట్టాలి. ఎస్సీ ఉపకులాల నివాసిత ప్రాంతాల్లో కమిషన్ పర్యటించలేదు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే నివేదిక ఇవ్వడం అనేది తూతూమంత్రంగా నడిపిన వ్యవహారంలా ఉంది'' అంటూ రాజేష్ ఆరోపణలు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














