మూవీ రివ్యూ: 'కోర్ట్' రూం డ్రామా పండిందా?

ఫొటో సోర్స్, X/NameisNani
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
చిన్నపిల్లలపై అత్యాచారాలు చేసే వాళ్లని కఠినంగా శిక్షించడానికి పోక్సో చట్టాన్ని 2012లో తెచ్చారు. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్.
ఈ చట్టం కింద నిందితులకు 14 ఏళ్లు శిక్ష పడే అవకాశం వుంది. 18 ఏళ్లు నిండని మైనర్లు ఈ చట్టం కింద వస్తారు. వాళ్ల మీద లైంగిక దాడి, వేధింపులు జరిగితే పోక్సో వర్తిస్తుంది.
ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసి అమాయకుల్ని ఇరికిస్తే ఏం జరుగుతుందనేది ‘కోర్ట్’ సినిమా.
ప్రముఖ నటుడు నాని సమర్పణలో వచ్చిన ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా నచ్చకపోతే తన హిట్-3 చూడాల్సిన అవసరం లేదని నాని ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా?


ఫొటో సోర్స్, X/NameisNani
కథ ఏమంటే..
చందు ఒక వాచ్‌మన్ కొడుకు. తల్లి ఇస్త్రీ చేస్తుంటుంది. ఇంటర్‌లో చదువు ఆపేసిన చందు చిన్నచిన్న పనులు చేస్తూ ఇంటి మీద ఆధారపడకుండా జీవిస్తూ వుంటాడు.
జాబిలి డబ్బున్న వాళ్ల అమ్మాయి. పరమ మూర్ఖుడైన మంగపతి మేనకోడలు. ఇంటి ఆడపిల్లలే పరువు అని భావిస్తూ, వాళ్లని తాకినా కోర్టు కేసులు పెట్టి వేధించే అహంభావి.
చందు, జాబిలి ప్రేమలో పడతారు. జాబిలి మైనర్ కాబట్టి చందుపై పోక్సో కేసు పెడతాడు మంగపతి.
శిక్ష ఖరారు అవుతున్న దశలో ఒక జూనియర్ లాయర్ తేజ రంగప్రవేశం చేసి చందూని ఎలా కాపాడాడు? అన్నదే మిగతా కథ.
కోర్టు రూమ్ డ్రామా పండితే అద్భుతంగా వుంటుంది. తేడా కొడితే అసహనానికి గురి చేస్తుంది.
ఎందుకంటే ఇరువైపుల వాదనల్లో తెలివి, ఎత్తుగడలు, అవతలి వారిని ఇరికించే చాకచక్యం తెరమీద కనిపించాలి. ఇవి హీరోల సినిమాలు కాదు, దర్శకుడి సినిమాలు.
దర్శకుడు రాం జగదీశ్‌కి ఇది మొదటి సినిమా. చాలా జాగ్రత్తగా రాసుకున్నాడు.
అనేక లీగల్ విషయాలు తెలుసుకుని తానే ఒక లాయర్‌లా మారిపోయాడు. అయితే తెలుసుకోవడం వేరు, అందరికీ అర్థమయ్యేలా తెరమీద చెప్పడం వేరు. ఆ పని సక్సెస్‌ఫుల్‌గా చేశాడు.
అందుకే తెరమీద నటులు కనపడరు. పాత్రలే కనిపిస్తూ వుంటాయి. ప్రతిచిన్న పాత్ర కూడా రిజిస్టరై, థియేటర్ నుంచి బయటికి వచ్చినా గుర్తుంటాయి.

ఫొటో సోర్స్, X/NameisNani
ఎవరెలా నటించారు?
ప్రియదర్శి మంచి నటుడు, బ్యాలెన్సింగ్‌గా చేశాడు. అమాయకుడు శిక్షకు గురి అవుతున్నాడనే బాధ కోర్టు రూమ్‌లో కనిపిస్తూ వుంటుంది.
సీనియర్ లాయర్‌గా సాయికుమార్ గుర్తు వుంటాడు. శివాజీలో ఇంత మంచి విలన్ వున్నాడని ఇప్పటిదాకా తెలియదు.
ఒక దశలో ప్రేక్షకులకి అసహనం పుట్టించాడంటే పాత్రకి న్యాయం చేశాడనే అర్థం. ప్రాసిక్యూషన్ లాయర్‌గా హర్షవర్ధన్ కూడా మెప్పించాడు.
హీరోహీరోయిన్లగా హర్ష్ రోషన్, శ్రీదేవి ఆకట్టుకుంటారు. ఈ కథని సెక్స్ సన్నివేశాల వైపు తీసుకెళ్లే అవకాశం ఉన్నా దర్శకుడు ఆ పని చేయలేదు. సున్నితమైన ప్రేమ కథనే చెప్పాడు.
నిజానికి ట్రైలర్ చూసినప్పుడే ఈ కథ అర్థమైపోయింది. కేసుల్లో ఇరుక్కున్న కుర్రాడిని, ప్రియదర్శి తన వాదనతో రక్షిస్తాడని, హీరోయిన్ తల్లి రోహిణి కథని మలుపు తిప్పుతుందని మనకి తెలిసిపోతుంది. అయినా.. కథ గ్రిప్పింగ్‌గానే వుంటుంది.
స్కూళ్లలో అన్ని పాఠాలు చెబుతారు. కానీ, చట్టం గురించి చెప్పరు. 16 ఏళ్ల పిల్లలు ప్రేమించుకోవాలని అనుకోవడం సహజం.
అయితే, తేడా వస్తే చట్టం ఎంత కఠినంగా వుంటుందో వాళ్లకి తెలియదు. అందుకే పిల్లలకి టెస్ట్ బుక్‌లో పోక్సో పాఠం వుండాలి. ఇదే లాయర్ ప్రియదర్శి చెప్పారు.

ఫొటో సోర్స్, X/NameisNani
అయినా మన దేశంలో చట్టం చేతిలో ఇరుక్కునేది పేదవాళ్లు, దళితులే. పరువు హత్యలకు గురయ్యేది వాళ్లే. జైళ్లలో మగ్గేది వాళ్లే.
అందరికీ ప్రియదర్శి, సూర్య (జైభీం) లాంటి లాయర్లు దొరకరు కదా? వాళ్ల దగ్గర లాయర్ ఫీజులకే డబ్బులండవు. తమ నిజాయితీని వారు కోర్టులో ఎలా నిరూపించుకుంటారు?
ఈ సినిమాలో హీరో హర్ష్ రోషన్ పైకి జులాయిగా కనిపించినా చాలా కష్టపడి పనిచేస్తూ వుంటాడు. సొసైటీలో వీళ్లే ఎక్కువ వున్నారు.
క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, ఈవెంట్ వర్కర్స్ ఎక్కడ చూసినా కనిపిస్తారు. రోజుకు 12 గంటలు పని చేస్తారు.
వాళ్ల వేషధారణ చూసి జులాయిలు అని ముద్ర వేస్తున్నారు. కోర్ట్ సినిమాలో అంతర్లీనంగా ఈ విషయం వుంటుంది.
నిర్మాత ప్రశాంతి తిపిర్నేని అభిరుచి మెచ్చుకోవాలి. మంచి కథ వుంటే చాలదు. ధైర్యంగా తీసే నిర్మాత కూడా కావాలి. ఈ సంస్థ నుంచి మరిన్ని మంచి సినిమాలు ఆశించొచ్చు.
విజయ్ బుల్లానిన్ సంగీతం, కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్, దినేశ్ పురుషోత్తమన్ కెమెరా మూడు కరెక్ట్‌గా కుదిరాయి.

ఫొటో సోర్స్, X/PriyadarshiPN
ప్లస్ పాయింట్స్
- ప్రియదర్శి, శివాజీల నటన
- డైలాగ్‌లు
- దర్శకుడి ప్రతిభ
మైనస్ పాయింట్స్
- సెకెండాఫ్‌లో కొంచెం సాగదీత
- కథను ముందే ఊహించగలగడం
రొడ్డ కొట్టుడు సినిమాలకి భిన్నమైంది. థియేటర్‌లో చూడదగినది.
(ఈ కథనంలోని అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం )
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














