సినిమా రివ్యూ: హిస్టారికల్‌ డ్రామా 'ఛావా' ఎలా ఉంది, భావోద్వేగాలు ఆకట్టుకున్నాయా?

ఛావాలో రష్మిక, విక్కీ కౌశల్ నటించారు.

ఫొటో సోర్స్, facebook/Maddock Films

ఫొటో క్యాప్షన్, ఛావాలో రష్మిక, విక్కీ కౌశల్ నటించారు.
    • రచయిత, జిఆర్‌ మహర్షి
    • హోదా, బీబీసీ కోసం

హిందీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఛావాని తెలుగులో గీతా ఆర్ట్స్‌ విడుదల చేసింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఛావా అంటే మరాఠీలో సింహం పిల్ల అని అర్ధం. శివాజీ సావంత్‌ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు.

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథే ఈ సినిమా. ఇదొక హిస్టారికల్‌ డ్రామా.

ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? శివాజీ కుమారుడికి, ఔరంగజేబుకు మధ్య సంబంధమేంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఛావా

ఫొటో సోర్స్, facebook/Maddock Films

ఫొటో క్యాప్షన్, శంభాజీగా విక్కీ కౌశల్ నటన ఆకట్టుకుంటుంది

కథ ఏంటి?

శివాజీ మరణ వార్త విని మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు సంతోషించడంతో కథ మొదలవుతుంది. అయితే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవదు.

బురహన్‌పూర్‌పై శివాజీ వారసుడైన శంభాజీ దాడి చేస్తాడు, మరాఠాల పౌరుషం చాటుతాడు. దీంతో, అతన్ని అణచి వేయడానికి ఔరంగజేబు సైన్యంతో దక్కన్‌కి బయలుదేరుతాడు.

శంభాజీ 25 వేల చిన్న సైన్యంతో, రకరకాల యుక్తులతో వారిని ఎదుర్కొంటాడు. అయితే వెన్నుపోటుకు గురై మొఘలుల చిత్రహింసలతో మరణిస్తాడు. సింపుల్‌గా ఇదీ ఛావా కథ.

సినిమా అక్కడక్కడ నెమ్మదిగా ఉన్నా ఉద్వేగంగా నడుస్తుంది. చివరి 15 నిమిషాలు సినిమాకి ప్రాణం. అనవసరమైన పాటలు, డ్రామా, ఉప కథలు లేకుండా సూటిగా నడుస్తుంది.

శంభాజీ, ఔరంగజేబుల మధ్యనే సన్నివేశాలన్నీ వుంటాయి. సెకండాఫ్‌లో మొఘలుల సైన్యంపై జరిగే దాడులు రిపీటెడ్‌గా అనిపిస్తాయి. అయితే ఎమోషన్‌ ప్రధానమైన కథ కాబట్టి విసుగు అనిపించదు.

ఛావా

ఫొటో సోర్స్, facebook/Maddock Films

ఆకట్టుకున్న నేపథ్య సంగీతం

ఇలాంటి సినిమాలకి ప్రాణం ఫొటోగ్రఫీ సౌరవ్‌ గోస్వామి ప్రతి ఫ్రేమ్‌ని తీర్చిదిద్దాడు. ఎఆర్‌ రెహమాన్‌ సంగీతంలో పాటలు ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ ఒక రేంజ్‌లో ఉంది. సెట్టింగులు చాలా రిచ్‌గా ఉన్నాయి. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ప్రతిభ కూడా కనిపిస్తుంది.

ఈ కథ మహారాష్ట్ర చరిత్ర కాబట్టి, అక్కడ సూపర్‌ హిట్టయింది. మిగతా వాళ్లకి ఈ కథ పెద్దగా తెలియదు. ఆ పాత్రల బ్యాక్‌గ్రౌండ్ మనకి ఎక్కువగా అర్థం కాకపోవచ్చు. అందుకే మిగతా ప్రాంతాల్లో సినిమా జస్ట్‌ ఓకే.

గతంలో వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌ కూడా తమిళనాడులో బాగా ఆడటానికి కూడా కారణం ఇదే. ఆ కథ వాళ్లకి బాగా తెలుసు. తెలుగువాళ్లకు తెలియదు.

చరిత్రని తీసేటప్పుడు ఈ సమస్య తప్పదు. అయితే యాక్షన్‌ సన్నివేశాలు ఎక్కువగా వుండటం. ఎమోషన్‌ కనెక్ట్‌ అయ్యేలా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

సంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక నటించారు.

ఫొటో సోర్స్, facebook/Maddock Films

ఫొటో క్యాప్షన్, శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక నటించారు.

ఎవరెలా నటించారు?

గతంలో లుకా చుప్పితో హిట్‌ కొట్టిన లక్ష్మణ్‌ ఉటేకర్‌ కష్టం స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో విక్కీకౌశల్‌ గురించి. సినిమాని మొత్తం భుజాల మీద మోశాడు. శంభాజీ బతికుంటే ఇలాగే వుంటాడేమో అనిపించేంత బావున్నాడు. యాక్షన్‌, ఎమోషన్‌ రెండింటిలో పైచేయి సాధించాడు.

శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక నటించారు. పుష్పలో చిత్తూరు అమ్మాయిగా కనిపించిన రష్మిక ఇక్కడ మరాఠా మహారాణిగా కనిపించింది. పాత్రలోకి ఒదిగిపోయి దానికి అనుగుణమైన నటన చూపించడంలో ఆమెని మెచ్చుకోవచ్చు. ముఖ్యంగా భర్తని యుద్ధానికి పంపిస్తున్నప్పుడు ఎక్స్‌ప్రెషన్స్‌ అద్భుతం.

ఔరంగజేబుగా అక్షయ్‌ఖన్నా నటించారు.

ఫొటో సోర్స్, facebook/Maddock Films

ఫొటో క్యాప్షన్, ఔరంగజేబుగా అక్షయ్‌ఖన్నా నటించారు

నెత్తురుపారిస్తూ..టోపీలు కుడుతూ..

ఔరంగజేబుగా అక్షయ్‌ఖన్నా నటించారు. అతి క్రూరమైన ప్రభువు. కానీ, ఎక్కడా ఆవేశం వుండదు. అంత పెద్ద యుద్ధాన్ని లక్షల మందితో నడిపిస్తూ నెత్తురు పారించే మొఘల్‌ చక్రవర్తి సాదాసీదాగా కనిపిస్తూ టోపీలు కుట్టుకుంటూ వుంటాడు. స్వభావమే తప్ప విలన్‌ కనపడడు. ఔరంగజేబు ఎంత క్రూరుడుగా వుంటే హీరో అంత ఎలివేట్‌ అవుతాడు. ఈ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేయడమే శ్రద్ధగా చేశారు.

అశుతోష్‌ రాణా లాంటి ఒకరిద్దరు తప్ప మిగతా నటులెవరూ మనకి తెలియదు. తెలుగు డబ్బింగ్‌ చాలా శ్రద్ధగా చేశారు. డైలాగులు చాలాచోట్ల బావున్నాయి.

ఈ సినిమా హిందీలో లాభాలు తెచ్చిపెట్టిందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. తెలుగులో కూడా ఆదరణ పొందే అవకాశముంది. దేశభక్తి కనెక్టింగ్‌ సబ్జెక్ట్‌ కాబట్టి. సినిమాపై వివాదాలు కూడా వచ్చాయి.

నమ్మకద్రోహులుగా చూపించిన వ్యక్తుల కుటుంబీకులు కోర్టులో కేసు వేశారు. చరిత్రని వక్రీకరించినట్టు విమర్శలు వచ్చాయి.

చరిత్రలో చాలా జరిగాయి. అయితే ఒక వర్గంపైనే ఇలా సినిమాలు తీయడం విద్వేషాన్ని మరింత పెంచడమేనని సోషల్‌ మీడియాలో విభిన్న గొంతులు కూడా వినిపించాయి.

ఛావా సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, facebook/Maddock Films

ప్లస్‌ పాయింట్స్‌

విక్కీకౌశల్‌ నటన

ఎఆర్‌ రెహమాన్‌ బిజిఎం

ఫొటోగ్రఫి

మైనస్‌ పాయింట్స్:

ఫస్టాఫ్‌ సాగతీత

సెకండాఫ్‌లో వరుసగా వచ్చే దాడి సన్నివేశాలు

నిడివి ఎక్కువ

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం )

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)