దేశం మధ్యలో దేశం.. ట్రంప్ ‘ఎన్నడూ వినని కంట్రీ’ గురించి 9 ఆసక్తికర విషయాలు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, బాసిలియో రుకాంగా
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఎవరూ ఎప్పుడూ వినలేదు" అంటూ ఆఫ్రికన్ దేశం లెసొతో గురించి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ ప్రభుత్వాన్ని ఆశ్చర్యపోయేలా చేశాయి.
ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఇదొక చిన్న దేశం. చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉన్న లెసొతో మరో దేశం దక్షిణాఫ్రికా మధ్యలో ఉంటుంది.
అంటే లెసొతో చుట్టూ దక్షిణాఫ్రికాయే ఉంటుందన్నమాట.
ఈ దేశం గురించి 9 ఆసక్తికర అంశాలు..


కింగ్‌డమ్ ఆఫ్ ది స్కై
‘కింగ్‌డమ్ ఆఫ్ లెసొతో’లో ఎక్కువ భాగం ఎత్తైన ప్రాంతాల్లోనే ఉంది. ఇక్కడ గ్రామాలకు చేరుకోవాలంటే కాలి నడకన కానీ, గుర్రాలపై కానీ వెళ్లాలి.
తేలికపాటి విమానాల్లోనూ చేరుకుంటారు.
ఈ దేశాన్ని "కింగ్‌డమ్ ఆఫ్ స్కై" అని కూడా పిలుస్తారు.
ఒక దేశంలోని మొత్తం భూభాగమంతా సముద్ర మట్టం కంటే కనీసం 1,000 మీటర్లు (3,281 అడుగులు) ఎత్తులో ఉండడం అనేది ప్రపంచంలో ఒక్క లెసొతోలో మాత్రమే ఉంది. ఈ మేరకు ‘ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా’ పేర్కొంది.
ఈ దేశంలో అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతం సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తున ఉంది.
విమానాలను ల్యాండింగ్ చెయ్యడానికి ప్రపంచంలో ప్రమాదకరమైన ఎయిర్‌స్ట్రిప్‌లలో ఈ దేశం ఒకటి. ఇక్కడి మటెకానే ఎయిర్‌స్ట్రిప్‌లో చాలా చిన్న రన్ వే ఉంది. దీనికి రెండు వైపులా లోయలు ఉన్నాయి.
ఈ విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగరడమంటే.. "ఎగరడం నేర్చుకునే దశలో పక్షిని గూడులో నుంచి బయటకు నెట్టేయడంలాంటిదే" అని బిజినెస్ ఇన్‌సైడర్ వెబ్‌సైట్ రాసింది.

ఫొటో సోర్స్, Getty Images

నీటిని ఎగుమతి చేసే దేశం.. అక్కడ నీరు ‘తెల్లబంగారం’
లెసొతో ఎత్తయిన పీఠభూమి ప్రాంతం కావడంతో కఠిన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వనరులు తక్కువ.
దిగువ భూముల్లోనూ వ్యవసాయానికి పనికొచ్చేవి చాలా తక్కువ.
ఈ దేశానికి అతి పెద్ద వనరు నీరు. అందుకే అక్కడ నీటిని తెల్ల బంగారంగా పిలుస్తారు.
లెసొతో తన వద్ద ఉన్న నీటిని సౌత్ ఆఫ్రికాకు ఎగుమతి చేస్తుంది.
వజ్రాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. వజ్రాలూ ఎగుమతి చేస్తుంది ఈ దేశం.

చుట్టూ దక్షిణాఫ్రికా
లెసొతో చుట్టూ సౌత్ఆఫ్రికా ఉంది. అయితే లెసొతోలో పర్వతాలు ఆ దేశానికి సౌత్ఆఫ్రికాకు మధ్య సరిహద్దులా ఉన్నాయి.
ఈ దేశంలో వ్యవసాయానికి అనువైన భూమి ఎక్కువగా లేదు. దీంతో ఇక్కడి ప్రజలు అప్పుడప్పుడూ ఆహార కొరత ఎదుర్కొంటారు.
సౌతాఫ్రికాలో ఉద్యోగాలు చేస్తూ వచ్చిన ఆదాయంతోనే జీవిస్తుంటారు. లెసొతోలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో వేల మంది ప్రజలు అనేక సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం సౌతాఫ్రికా వలస వెళ్లారు.
లెసొతో జనాభా 20 లక్షలు. ఈ దేశానికి సౌతాఫ్రికాకు మధ్య కొన్ని భాషా పరమైన సంబంధాలు ఉన్నాయి. సౌతాఫ్రికా అధికారిక 11 భాషల్లో లెసొతో ప్రజలు మాట్లాడే సెసొతో ఒకటి. సౌతాఫ్రికాలో 46 లక్షల మంది సెసొతో మాట్లాడతారు.

ఫొటో సోర్స్, AFP

సబ్ సహారన్ ఆఫ్రికాలో అతి పెద్ద స్కీ రిసార్ట్
మీరు స్కీయింగ్ చేయాలనుకున్నప్పుడు, మీకు యూరప్, నార్త్ అమెరికాలో మంచుతో కప్పేసిన ఏటవాలు ప్రాంతాలు కనిపిస్తాయి.
అయితే లెసొతోలో అలాంటి మంచులో ఆడుకునే దృశ్యాలు చూడవచ్చు. సబ్ సహారన్ ప్రాంతంలో అత్యంతఎత్తైన స్కీ రిసార్ట్ లెసొతోలోనే ఉంది. మొత్తం ఆఫ్రికా ఖండంలోనే స్కీ రిసార్ట్ ఇదే.
ఆఫ్రిస్కీ అని పిలిచే ఈ రిసార్ట్ సముద్ర మట్టానికి 3,222 మీటర్ల ఎత్తులో ఉంది. లెసొతోలోని మలొటి పర్వతాల్లో ఉన్న ఈ రిసార్ట్‌కు ఆఫ్రికాలోని అన్ని ప్రాంతాల నుంచి పర్యటకులు వస్తుంటారు.

ఫొటో సోర్స్, AFP

ప్రపంచంలోనే అత్యధిక హెచ్‌ఐవీ రేట్
ప్రపంచంలో హెచ్ఐవీ రేట్ అత్యధికంగా ఉన్న దేశం ఇది. దేశ ప్రజల్లో ప్రతి ఐదుగురు పెద్దవాళ్లలో ఒకరు హెచ్ఐవీతో జీవిస్తున్నారు.
పొరుగున ఉన్న నమీబియా, బోట్స్‌వానా, ఎస్వాతిని కంటే ఎక్కువగా ఇక్కడ లక్ష మందికి హెచ్ఐవీ సోకింది.
హెచ్ఐవీ బాధితులకు చికిత్స అందించేందుకు, హెచ్ఐవీ నివారణకు 2006 నుంచి ఈ దేశానికి బిలియన్ డాలర్ల సాయం అందించేందుకు అమెరికా హామీ ఇచ్చిందని అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

లెసొతో దుప్పట్లు ప్రత్యేకం
లెసొతో ప్రజలతో ముడిపడి ఉన్న సాంస్కృతిక అంశం వారు ఉపయోగించే దుప్పట్లు.
అలాగే వారు పెట్టుకునే సంప్రదాయ బుట్ట టోపీలను మొకొరొట్లో అని పిలుస్తారు.
ఈ టోపీ ఈ దేశపు జాతీయ చిహ్నం. లెసొతో జాతీయ పతాకం మధ్యలో కనిపిస్తుంది.
ఈ దుప్పట్లను మందపాటి ఊలుతో తయారు చేస్తారు.
దీని మీద అల్లే వివిధ రకాల నమూనాలు లెసొతో ప్రజల చరిత్ర గురించి గురించి చెబుతాయి.
వీటిని లెసొతో ప్రజలు శాలువా మాదిరిగా కప్పుకుంటారు. ప్రత్యేక సందర్భాల్లో వీటినే బహుమతిగా ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రిన్స్ హ్యారీకి లెసొతోతో అనుబంధం
బ్రిటన్ మాదిరిగానే లెసొతో కూడా రాజ్యాంగబద్ధమైన రాచరికం ఉన్న దేశం. ఇక్కడ రాజ కుటుంబం ఉంటుంది కానీ, ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి దేశాన్ని పాలిస్తారు.
లెసొతో యువరాజు సీయిసో, ప్రస్తుత రాజు కింగ్ లెట్సీ 3కి సోదరుడు. ప్రిన్స్ సీయిసో, ప్రిన్స్ హ్యారీ స్నేహితులు
వీళ్లిదరూ కలిసి లెసొతోలో సెంటెబేల్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. సెంటెబేల్ అంటే స్థానిక భాషలో మర్చిపోవద్దు అని అర్థం. ఈ సంస్థ స్థానికంగా హెచ్ఐవీ బాధితులైన యువకులకు సాయం చేసేందుకు క్షేత్ర స్థాయిలో పని చేస్తుంది.
19 ఏళ్ల వయసులో ప్రిన్స్ హ్యారీ లెసొతోను తొలిసారి సందర్శించారు. ఆ తర్వాత కూడా అనేక సార్లు వచ్చారు.

అమెరికాకు జీన్స్ ఎగుమతి
అమెరికన్లు వేసుకునే జీన్స్ ప్యాంటుల్లో ఎక్కువ భాగం లెసొతోలోనే ఉత్పత్తి అవుతాయి. అమెరికాలో ప్రముఖ బ్రాండ్లైన లెవిస్, రాంగ్లర్‌కు అవసరమైన జీన్స్ ప్యాంట్లను లెసొతోలోని బట్టల ఫ్యాక్టరీల్లోనే కుడతారు. దీంతో ఈ దేశానికి "డెనిమ్ కేపిటల్ ఆఫ్ ఆఫ్రికా" అని పేరు వచ్చింది.
కేవలం జీన్స్ మాత్రమే కాదు. సబ్ సహారన్ ఆఫ్రికాలో అమెరికాకు భారీ సంఖ్యలో సాధారణ దుస్తుల్ని ఎగుమతి చేస్తున్న దేశం కూడా ఇదే.
గతేడాది లెసొతో 237 మిలియన్ డాలర్ల విలువైన బట్టల్ని అమెరికాకు ఎగుమతి చేసింది.
లెసొతోలోని బట్టల దుకాణాల్లో ఎక్కువ భాగం చైనా, తైవాన్‌కు చెందిన వలసదారుల ఆధీనంలో ఉన్నాయి.

ప్రపంచంలోనే ఎక్కువ ఆత్మహత్యలు ఇక్కడే
ది మౌంటెన్ కింగ్‌డమ్‌లో ఆత్మహత్యల రేటు కూడా ఎక్కువే.
లక్షకు 87.5మంది ప్రజలు ఆత్మహత్య ద్వారా జీవితాల్ని ముగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ప్రపంచ సగటుతో పోలిస్తే ఈ సంఖ్య 10రెట్లు ఎక్కువ. ఆత్మహత్యల విషయంలో రెండో స్థానంలో ఉన్న గయానా కంటే కూడా రెట్టింపు. గయానాలో ఆత్మహత్యలు లక్షకు 40 గా ఉన్నాయి.
ఆత్మహత్యలకు కారణం ఏంటంటే అనేకం కనిపిస్తున్నాయి. మాదకద్రవ్యాల వినియోగం, ఆల్కహాల్, నిరుద్యోగిత, మానసిక దౌర్బల్యం లాంటివి కారణంగా చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














