చేతబడి: ‘ఇక్కడ వారానికొక వృద్ధుడిని హత్య చేస్తున్నారు’-బీబీసీ ఆఫ్రికా ఐ పరిశోధనలో ఇంకా ఏం తేలిందంటే...

- రచయిత, ఎన్జేరి మావాంగి, కిలిఫి కౌంటీ నుంచి, తమాసిన్ ఫోర్డ్, లండన్ నుంచి..
- హోదా, బీబీసీ ఆఫ్రికా ఐ
(ఈ కథనంలో మిమ్మల్ని కలచివేసే అంశాలు ఉంటాయి.)
చేతబడి ఆరోపణలపై హత్యలు చేయడం కెన్యాలో పెరిగిపోయింది. ఆ దేశంలోని కిలిఫీ తీరంలో, చేతబడి చేశారనే అనుమానంతో అనేక మంది హత్యకు గురవుతున్న ఘటనలు బీబీసీ పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి.
చేతబడి పేరుతో దాడికి గురైన వారిలో జెఫ్వా ఒకరు.
74 ఏళ్ళ తంబాలా జెఫ్వా ఒంటికన్నుతో తన ఇంట్లో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. చొక్కా విప్పేందుకు భార్య సీదీ ఆయనకు సాయపడుతున్నారు.
‘‘కత్తితో పొడిచి కన్నును బయటకు తీసేశారు.’’ అని ఆయన కాలర్ బోన్ నుంచి పెద్ద కుట్టును చూపిస్తూ సీదీ చెప్పారు.
తరువాత ఆయన తలను తన చేతుల్లోకి తీసుకున్న సీదీ, మరోసారి జరిగిన దాడి గురించి వివరిస్తూ "డాక్టర్లు ఆయన తలను వెనుకకు వంచి పట్టుకుని, కుట్లు వేయాల్సి వచ్చింది." అని తెలిపారు.
తీరప్రాంత పట్టణమైన మలిండి నుంచి 80 కి.మీ దూరంలో జెఫ్వా ఇల్లు ఉంటుంది. ఆయన మంత్రగాడని ఆరోపిస్తూ కొందరు దుండగులు రెండుసార్లు దాడి చేశారు. మొదటి దాడిలో ఆయన ఒక కంటిని కోల్పోగా, రెండో దాడిలో దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు.
జెఫ్వా దంపతులకు 30 ఎకరాలకు పైగా భూమి ఉంది. దానిలో వాళ్లు మొక్కజొన్న పండిస్తారు. కొన్ని కోళ్లను కూడా పెంచుతారు.
భూమి సరిహద్దుల విషయంలో వారికి, మిగతా కుటుంబ సభ్యులతో గొడవలు జరిగాయి.
జెఫ్వా మీద హత్యా ప్రయత్నం జరగడానికి కారణం ఆయన మంత్రగాడు అన్న అనుమానం కాదని, భూమి కోసమే ఇలాంటి హత్యాయత్నం చేశారని ఆ దంపతులు భావిస్తున్నారు.
“నేను చచ్చిపోయాననుకుని వాళ్లు వెళ్లిపోయారు. నా రక్తం చాలా పోయింది. వాళ్లు నాపై ఎందుకు దాడి చేశారో తెలియదు, కానీ భూమి కోసమే అని నా అనుమానం.” అని జెఫ్వా అన్నారు.


వారానికో వృద్ధుని హత్య
మంత్రవిద్యలు, మూఢనమ్మకాలు చాలా దేశాలలో సర్వసాధారణం.
కానీ కెన్యా, మలావి, టాంజానియా, దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో వృద్ధులను చంపి, వాళ్ల భూములను ఆక్రమించుకోవడానికి ఇలాంటి ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది.
కెన్యా మానవ హక్కుల సంస్థ హకీ యేటు విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, కిలిఫీ తీరం వెంబడి మంత్రవిద్య పేరుతో ప్రతీ వారం ఒక వృద్ధుడు హత్యకు గురవుతున్నాడు.
ఆ సంస్థ ప్రోగ్రాం ఆఫీసర్ జూలియస్ వాన్యామా, ‘‘ ఇలా చంపమని ఆదేశించేది వారి బంధువులే అని ఆ కుటుంబాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.’’ అన్నారు.
"వాళ్లు మంత్రవిద్య అనే వంకతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఎందుకంటే అప్పుడే వాళ్లకు ప్రజల నుంచి సానుభూతి లభిస్తుంది. అతను మంత్రగాడైతే చంపడం మంచిదేనని జనం కూడా అంటారు.’’ అని వాన్యామా అన్నారు.
ఈ ప్రాంతంలో కొందరికే తమ భూమికి సంబంధించిన హక్కు పత్రాలు ఉన్నాయి. వీలునామాలాంటివి లేకుండా, వాళ్లు ఈ భూములను తమ వారసులకు అప్పగిస్తారు.
అలా జరుగుతున్న ప్రతి 10 హత్యలలో, ఏడుగురు వృద్ధులేనని వాన్యామా చెప్పారు,
ఎందుకంటే భూయాజమాన్యం, వారసత్వ హక్కులు వారి వద్దనే ఉంటాయి.
“కిలిఫీలోని చాలా భూములకు అధికారిక పత్రాలు లేవు. వారి వద్ద ఉన్న ఏకైక పత్రం, ఈ వృద్ధులు చెప్పే మాటలే. అందుకే ఎక్కువగా వాళ్లనే హత్య చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి వాళ్లను చంపితే, ఇక అడ్డంకి తొలగిపోయినట్లే.” అని వాన్యామా అన్నారు.

జెఫ్వా కుటుంబానికి చెందిన భూమి నుంచి దాదాపు గంట ప్రయాణం చేస్తే, మలిండి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న వృద్ధుల సంరక్షణా కేంద్రం వస్తుంది.
దాదాపు 30 మంది వృద్ధులు ఇక్కడ తల దాచుకుంటున్నారు. వాళ్లంతా ఇలాంటి దాడులకు గురైన వారే. వీళ్లు సొంత భూములకు తిరిగి వెళ్ళలేరు.
చూడటానికి తన వయసు కంటే చాలా పెద్దగా కనిపిస్తున్న అరవై మూడేళ్ళ కటానా చారా దాదాపు 12 నెలలుగా ఇక్కడే ఉంటున్నారు.
ఏప్రిల్ 2023లో ఆయన బెడ్‌రూమ్‌లోనే ఆయనపై కొడవలితో దాడి చేసిన తర్వాత, కటానా చారా ఆ కేంద్రంలో చేరాల్సి వచ్చింది. ఆ దాడిలో ఒక చేయి మణికట్టు వద్ద, మోచేయి పైనా గాయలయ్యాయి. ఆయన ఇకపై పని చేయలేరు. అన్నం తినాలన్నా, దుస్తులు ధరించాలన్నా, చిన్న చిన్న పనులకు సైతం ఆయన ఇతరులపై ఆధారపడాలి.
"నా చేతులు నరికిన వ్యక్తి నాకు తెలుసు. కానీ, అప్పటి నుంచి మేము ఎప్పుడూ ముఖాముఖి కలుసుకోలేదు." అని ఆయన చెప్పారు.
ఒక వ్యక్తి, తన బిడ్డ మరణానికి చారా చేసిన చేతబడే కారణమని ఆరోపించారు. అయితే తనపై దాడి చేయడానికి అసలు కారణం తన ఆరు ఎకరాల భూమేనని చారా భావిస్తున్నారు.
“ చేతబడితో ఎలాంటి సంబంధం లేదు. నాకు కొంచెం భూమి ఉంది. దాని కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.” అని చారా అన్నారు.
చారా కుటుంబ సభ్యులలో చాలామందిని ఈ దాడిపై అధికారులు ప్రశ్నించారు. కానీ ఎవరినీ అధికారికంగా విచారించలేదు. చారాకు న్యాయం జరగడం కోసం వాన్యామా ప్రయత్నిస్తున్నారు.
“ఇలాంటి వృద్ధుల హత్యారోపణలపై చాలా కొద్ది మందిపై మాత్రమే అభియోగాలు మోపారు. అందుకే వీటికి కారకులైన వ్యక్తులు తమను ఎవరూ ఏమీ చేయలేరని భావిస్తున్నారు.’’ అని తెలిపారు.

‘సొంతవాళ్ళే చేయిస్తున్నారు’
బీబీసీ తన పరిశోధనలో, ఇలా సుమారు 20 మందిని చంపినట్లు చెప్పుకునే వ్యక్తిని గుర్తించింది. అతను ప్రతి హత్యకు కనీసం రూ.33 వేలు తీసుకున్నట్లు అంగీకరించాడు.
“ఎవరైనా వృద్ధుడిని చంపినట్లయితే, దానికి ఆయన కుటుంబమే డబ్బు చెల్లించి ఉంటుందని అర్థం చేసుకోండి.’’ అని ఆయన బీబీసీకి చెప్పారు.
ఒకరి ప్రాణాలను తీయడానికి నీకు హక్కు ఏముంది అన్న ప్రశ్నకు, “నాకు ఎవరో ఒక వ్యక్తి ఒక పనిని అప్పగించినందువల్ల నేను చెడ్డ పని చేసి ఉండొచ్చు. కానీ చట్ట ప్రకారం, దేవుని ప్రకారం, నన్ను ఆ పని చేయమని ఆదేశించిన వ్యక్తే దోషి.” అని చెప్పారు.
కెన్యా నేషనల్ కమీషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఫిబ్రవరి 2023లో ఐక్యరాజ్య సమితికి ఒక పత్రాన్ని సమర్పించింది. "పశ్చిమ కెన్యాలోని కిసీ, తీరప్రాంతమైన కిలిఫీ కౌంటీ వంటి ప్రాంతాల్లో మంత్రగాళ్ల పేరిట కాల్చి చంపడం, హత్య చేయడం, భౌతిక దాడులు లాంటివి విస్తృతంగా ఉన్నాయి." అని దానిలో పేర్కొంది.
భూమిని చేజిక్కించుకోవాలనుకుంటున్న చిన్న వయసు కుటుంబ సభ్యులే ఈ హత్యల వెనుక ఉన్నారని తెలిపింది.
కరువు కాటకాలు, ఆదాయ వనరులు తక్కువగా ఉన్నప్పుడు దాడులు, హత్యలు పెరిగినట్లు నివేదిక తెలిపింది.
భూకబ్జాలను సమర్థించుకోవడానికి, చేతబడుల పేరిట జరుగుతున్న ఇలాంటి హత్యలు "జాతీయ విపత్తు"గా మారాయని వాన్యామా ఆందోళన వ్యక్తం చేశారు.
“ఇది ప్రాంతీయ సమస్యగా ప్రారంభమైంది, దేశవ్యాప్తంగా వ్యాపించింది. దానిని పరిష్కరించకపోతే, మొత్తం దేశం వృద్ధ తరాన్నే కోల్పోయే ప్రమాదం ఉంది.’’ అని అన్నారు వాన్యామా.
సంప్రదాయ ఆఫ్రికన్ సంస్కృతిలో వృద్ధులను గౌరవిస్తే, కిలిఫీలో మాత్రం వృద్ధులుగా కనిపించడానికి భయపడుతున్నారు.
చాలామంది యవ్వనంగా కనిపించడానికి జుట్టుకు రంగు వేసుకుంటున్నారు.
ఈ ప్రాంతంలో ఎవరి మీద అయినా చేతబడి ఆరోపణలు వచ్చాయంటే, వాళ్లు బతకడం చాలా అరుదు.
చారా ఇప్పుడు వృద్ధుల సంరక్షణా కేంద్రంలో సురక్షితంగా ఉండగా, జెఫ్వా వంటి వాళ్లు, తనను హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్లు మళ్లీ తిరిగి వస్తారనే భయంతో జీవిస్తున్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














