'అమ్మాయినైతే మా నాన్నమ్మ శవాన్ని నేను ముట్టుకోకూడదా? ఇదేం వివక్ష'

బీబీసీ షీ
    • రచయిత, హర్షిత శారద
    • హోదా, బీబీసీ కోసం

మా నాన్నమ్మ మరణంతో నేను చాలా కుంగిపోయాను. ఆమెతో నాకు ప్రత్యేక అనుబంధముంది. ప్రపంచంలో నాకంటే అత్యుత్తమమైనది ఏదీ లేదని అనిపించేలా ఆమె నన్ను చూసుకునేవారు.

అమితంగా ప్రేమించే ఆప్తులను కోల్పోయాననే బాధ ఒకవైపు నన్ను వెంటాడింది. మరోవైపు అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు మహిళలు ఎదుర్కొనే వివక్ష ఎలా ఉంటుందో అప్పుడే నేను ప్రత్యక్షంగా చూశాను.

2022 జనవరి 23న మా నాన్నమ్మ నిర్మలా దేవి (95) కార్డియాక్ అరెస్టుతో మరణించారు.

ఆమె నాకు అన్ని వేళలా అండగా నిలిచేవారు. చనిపోయేరోజు సాయంత్రం కూడా నేను చేసిన టీ చాలా బావుందని చెప్పారు. మా తమ్ముడి కంటే నేను చక్కగా టీ పెడతానని కితాబు ఇచ్చారు. నిజానికి టీ ఎవరు బాగా పెడతారని నేను, మా తమ్ముడు పోటీ పడేవాళ్లం.

ఆమెకు కుటుంబం అంతా ఇష్టమే. నేనంటే మరింత ఎక్కువ ఇష్టం. నేను చేసే రొట్టెలు గుండ్రంగా లేకపోయినా, ఉప్పు ఎక్కువైనా ఆమె మెచ్చుకునేవారు. మంచి నీళ్ల గ్లాసు చేతికి ఇచ్చినా ప్రశంసలు కురిపించేవారు.

ఆమెకు కార్డియాక్ అరెస్టు అయ్యింది. వారం రోజులపాటు ఆమె ఆసుపత్రిలో గడిపారు. ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చారు. నాలుగు రోజుల తర్వాత కన్నుమూశారు.

BBCShe ప్రాజెక్టులో భాగంగా విమెన్స్ వెబ్‌తో కలిసి ఈ కథనాన్ని మీకు అందిస్తున్నాం. మహిళా పాఠకులకు మరింత చేరువ అయ్యేందుకు BBCShe ప్రాజెక్టును బీబీసీ మొదలుపెట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి)

బీబీసీ షీ

నేను దిల్లీలో చదువుకుంటున్నాను. కానీ, నాన్నమ్మకు ఒంట్లో బాగోలేదని తెలిసిన వెంటనే జలంధర్‌కు వచ్చేశాను. ఆమె చివరి క్షణాల్లో ఒక కోరిక కోరారు. తనను నేలపైనే మరణించేలా చూడాలని అడిగారు. ఆమె కోరిక మేరకు మా నాన్న ఆమెను నేలపై పడుకోబెట్టారు.

ఆమెను పైకి ఎత్తేటప్పుడు, కొంచెం సాయం చేయాలని మా నాన్న నన్ను అడిగారు. వెంటనే సాయం కోసం నేను ముందుకు వెళ్లాను. కానీ, మా నాన్నమ్మను చూసుకునేందుకు వచ్చిన ఒక మహిళ నా చెయ్యి వెనక్కి లాగేశారు. నాన్నమ్మను ముట్టుకోవద్దని నాకు సూచించారు. ఎందుకంటే నేను ముట్టుకుంటే ఆమెకు శాపం తగులుతుందని అన్నారు.

ఆమె మాటలు నాకు చాలా కోపం తెప్పించాయి. వెంటనే నేను గట్టిగా అరిచాను. నేను ముట్టుకుంటే మా నాన్నమ్మ చాలా సంతోష పడుతుందని గట్టిగా చెప్పాను. ఎందుకంటే మా ఇద్దరి మధ్య అంత అనుబంధముందన్నాను. ఆ తర్వాత, ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాను. ఎందుకంటే ఇలాంటి పురుషాధిక్య ఆచారాలపై పోరాడే సమయం అదికాదు.

ఆ మహిళ చేసిన వ్యాఖ్యలకు మా అమ్మానాన్న కూడా అభ్యంతరం చెప్పారు. ఆ గదిలోకి రావాలని మళ్లీ వారు నన్ను పిలిచారు. కానీ, ఆ మహిళ వ్యాఖ్యలు నాపై చాలా ప్రభావం చూపించాయి. నేను లోపలకు వెళ్లలేకపోయాను.

ఇక్కడితో అంతా ముగిసిపోలేదు. మా నాన్నమ్మ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఒక దుప్పటిని తీసుకొచ్చారు. అయితే, మృతదేహాన్ని ఎత్తేటప్పుడు అది చిరిగిపోయింది. వెంటనే ఆ మహిళ మళ్లీ నా దగ్గరకు వచ్చారు. ‘‘నువ్వు ముట్టుకోవడం వల్లే వారు నియంత్రణ కోల్పోయారు. దీంతో దుప్పటి చిరిగిపోయింది’’అని నాతో అన్నారు.

బీబీసీ షీ

అసలు ఆమె ఏం మాట్లాడుతోందో నేను నమ్మలేకపోయాను. నేను ముట్టుకోవడం వల్ల మా నాన్నమ్మ వచ్చే జన్మ కూడా మలినం అయిందని ఆమె అంటోంది. నా నోటి నుంచి మాట రాలేదు. అసలు నాకు, మా నాన్నమ్మకు మధ్య అనుబంధం ఆమెకు తెలియనే తెలియదు.

మా ఇంట్లో కొడుకులు, కుమార్తెలను సమానంగా చూస్తారు. మా అమ్మానాన్నలు నాకు, మా తమ్ముడికి ఒకే ప్రాధాన్యం ఇచ్చేవారు. మా నాన్నమ్మ కూడా ఎప్పుడూ మాపై వివక్ష చూపలేదు.

కానీ, ఎవరో పరాయి వ్యక్తి వచ్చి ఇప్పుడు, మా నాన్నమ్మను నేను ముట్టుకోవడంతో శాపం తగిలిందని చెప్పడంతో నేను భరించలేకపోయాను. ఇది దెబ్బ మీద దెబ్బ లాంటిది. ఒకవైపు అమితంగా ప్రేమించే నాన్నమ్మను కోల్పోయాను. రెండోవైపు ఈ పురుషాధిక్య ఆచారాలు నన్ను మరింత బాధపెడుతున్నాయి.

చిన్నప్పటి నుంచీ నా చుట్టుపక్కల స్ఫూర్తి ప్రదాతలైన మహిళలు ఉండేవారు. మా అమ్మతోపాటు, నాన్నమ్మ, అమ్మమ్మ ఇలా అందరూ నాలో స్ఫూర్తి నింపేవారు.

మా నాన్నమ్మ చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలని చాలా మంది చెప్పినప్పటికీ, ఆమె ఆ ప్రయత్నం చేయలేదు. ఆమె చదువుకోవాలని అనుకున్నారు. ఆ నిర్ణయమే ఆమెకు మేలు చేసింది. ఆమె ఒక స్కూలుకు ప్రిన్సిపల్‌గా మారారు.

ఆమెకు పిల్లలు లేరు. మా నాన్న ఆమెకు చెల్లికొడుకు అవుతారు. కానీ, ఆయన్ను ఆమె సొంత కొడుకులానే చూసుకుంది. మేం మా నాన్నమ్మను ‘‘బడే దీదీ’’అని పిలుచుకునేవాళ్లం. ఆమె చాలా మంచిది. ఆమె ఏ పురుషుడిపైనా ఆధారపడి జీవించలేదు. తనకు నచ్చినట్లుగా ఆమె బతికింది. ఆ కాలంలో మహిళలను గడప కూడా దాటనిచ్చేవారు కాదు. కానీ, ఆమె బయటకు వెళ్లడమే కాదు, ప్రిన్సిపల్‌గా పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.

బీబీసీ షీ

ఎన్నో ప్రశ్నలు..

ఆమె మరణం తర్వాత, చాలా ప్రశ్నలు నన్ను వెంటాడాయి. ఆమె అంత్యక్రియల సమయంలో మగవారికే ప్రాధాన్యం ఇచ్చారు. ఒక ఫెమినిస్టుగా జీవితం గడిపిన మా నాన్నమ్మ దీనికి అనుమతించేవారా? ఆమె జీవితంలో చివరి వరకు పక్కనే ఉన్న నేను.. ఆమె మృతదేహం ముట్టుకుంటే అంత తప్పు ఏం వచ్చింది?

ఆసుపత్రిలో ఆమె పక్కనే ఉంటూ, ఆమెను చూసుకున్నప్పుడూ ఎవరూ నువ్వు మగ లేదా ఆడా? అని ప్రశ్నించలేదు. ఆమె మరణం తర్వాత, పరిస్థితులు ఇంతలా ఎలా మారిపోయాయి? మరణానికి ముందు, నేను అమ్మానాన్నతో కలిసి నాన్నమ్మకు గంగాజలం తాగించాను. మా తల్లిదండ్రులు దేనికీ అడ్డుచెప్పేవారు కాదు. ఎందుకంటే నాన్నమ్మతో నాకు మంచి అనుబంధముందని వారికి తెలుసు. కానీ, బయట వ్యక్తులు వచ్చిన తర్వాత, పరిస్థితులు ఇంతలా ఎలా మారిపోయాయి?

ఒక్కసారిగా మా అమ్మమ్మ చనిపోయినప్పటి పరిస్థితులు కూడా నాకు గుర్తుకు వచ్చాయి. నాతోపాటు కొందరు శ్మశానికి బయలుదేరుతుండగా, ఒక మహిళ వద్దని సూచించారు. ఇక్కడే ఉండి ఇల్లు శుభ్రం చేయాలని ఆమె మాతో అన్నారు.

కానీ, మా అమ్మ, అత్తయ్య మాత్రం మీరు శ్మశానానికి వెళ్లండని చెప్పారు. దీంతో మేం అక్కడకు వెళ్లాం. నేను ఈ ఇంట్లో జన్మించి ఉండకపోతే, మా నాన్నమ్మ అంత్యక్రియలను చూసే అవకాశం కూడా నాకు వచ్చేది కాదేమో.

బీబీసీ షీ

ఎందుకు కేవలం మగవారు మాత్రమే అంత్యక్రియలు నిర్వహించాలి? అని నేను ప్రశ్నించినప్పుడు, నాకు చాలా మంది చాలా సమాధానాలు చెప్పారు. కానీ, అవేమీ నన్ను సంతృప్తి పరచలేదు. కొన్నిచోట్ల అయితే, మహిళలను కనీసం శ్మశానానికి కూడా వెళ్లనివ్వరు.

కొంత మంది అయితే, అమ్మాయిల కంటే అబ్బాయిలను కనడానికే ప్రాధాన్యం ఇస్తారు. బహుశా, అంత్యక్రియల్లో కొడుకు తోడుంటాడనేమో! నిజానికి దేవుడు మనల్ని సృష్టించే సమయంలో ఇలా వివక్ష చూపించివుంటాడా?

ఆప్తులు మరణించినప్పుడు, వారి లోని లోటు గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తాం. చివరిసారిగా వారిని ముట్టుకునే అవకాశం వచ్చినా, లేదా వారి అంత్యక్రియల్లో పాల్గొన్నా మనకు కొంత ఉపశమనం దక్కినట్లుగా అనిపిస్తుంది.

ఒకటి మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను. మా నాన్నమ్మ బతికే ఉంటే, ఆమెను ముట్టుకోవద్దని నన్ను వారించిన అందరినీ గట్టిగా తిట్టేవారు.

(ప్రొడ్యూసర్ – ఖుష్బూ సంధు, సిరీస్ ప్రొడ్యూసర్ – దివ్య ఆర్య)

వీడియో క్యాప్షన్, పాకెట్ మనీ కోసం ఉద్యోగాలు చేయడం అన్న కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే భారత్‌లో కూడా పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)