‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా

ఫొటో సోర్స్, Facebook/RajashyamalaEnt
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ఆడిటోరియం అంతా జనం.. ఒకటే చప్పట్లు. నాటక రంగంలో కాకలు తీరిన రాఘవరావు (ప్రకాశ్ రాజ్)కు జరుగుతున్న సన్మాన కార్యక్రమం అది.
'రంగమార్తాండ..' అంటూ రాఘవరావుకు బిరుదిస్తారు. స్వర్ణకంకణం తొడుగుతారు.
''ఈ రోజుతో నాటకాలకు స్వస్తి. రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నా. తండ్రిగా, భర్తగా ఇన్నాళ్లూ నేను నిర్లక్ష్యం చేసిన నా నిజ జీవిత పాత్రలకు ఇక నుంచి న్యాయం చేస్తా'' అని సగౌర్వంగా ప్రకటిస్తాడు రాఘవరావు.
మళ్లీ ఆడిటోరియం దద్దరిల్లిపోతుంది.
నటుడిగా ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడే రాఘవరావు నటనకు స్వస్తి చెప్పాడు. ప్రశాంత జీవితాన్ని తన కుటుంబంతో కలిసి జీవిద్దామనుకొన్నాడు.
ఇప్పుడు రాఘవరావు ‘రంగమార్తాండ’ రాఘవరావు కాదు. ఓ సగటు నాన్న. ఓ మామూలు భర్త. ఓ సాదా సీదా స్నేహితుడు. అంతే!
ఇక నుంచి రాఘవరావు అసలు 'నాటకం' ప్రారంభం అవుతుంది!

ఫొటో సోర్స్, Facebook/RajashyamalaEnt
నాందీ ప్రస్తావన!
''జీవితం ఓ నాటకం'' అంటాడు షేక్‌ష్పియర్. నిజమే, కానీ మనిషి వేషం అంత సులభం కాదు.
నాటకంలో రిహార్సల్స్ ఉంటాయి. మనం చెప్పాల్సిన డైలాగులను తెర వెనుక నుంచి అందించేవాళ్లుంటారు. తప్పొప్పుల్ని సరి చేసుకోవొచ్చు. ఈ నాటకం కాకపోతే ఇంకోటి. ఈ వేషం లేకపోతే మరోటి. జీవితం అలాక్కాదు. ఒక్కటే వేషం. చేయందించే వాళ్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తప్పుల లెక్కలు ఎప్పటికప్పుడు సరితూచుకోలేం. “అరె.. ఇలా చేయకుండా ఉండాల్సింది” అనుకొనే లోగా తెర వేసేసే ప్రమాదం ఉంది.
నాటకం సమాప్తమైతే ఇంకో ఛాన్స్ లేదు. నాటకాల్లో అద్భుతంగా రాణించిన నటుడు జీవితంలో తేలిపోవొచ్చు. జీవితంలో ప్రతి పూటా, ప్రతి చోటా అద్భుతంగా నటించే సగటు మనిషి, స్టేజీ మీద ఒణికిపోవొచ్చు. ఇది తొలి రకం మనిషి కథ..
కృష్ణవంశీకి 20 సినిమాలు తీసిన అనుభవం ఉంది. ఓ గులాబీ, ఓ అంతఃపురం, ఓ నిన్నే పెళ్లాడతా.. ఓ మురారీ! ప్రతీ సినిమాలోనూ 'వారెవా కృష్ణవంశీ' అనిపించే సందర్భమో, సన్నివేశమో, సంఘటనో ఏదో ఒకటి కచ్చితంగా ఉంటుంది. అదీ కృష్ణవంశీ మార్క్.
మనసు మూలల్లో ఉండిపోయిన ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే కిటుకు కృష్ణవంశీకి బాగా తెలుసు. అందుకే ఆయన సినిమా చూస్తున్నప్పుడు.. అది హిట్ సినిమా కావొచ్చు, ఫ్లాప్ కావొచ్చు.. ఎక్కడో చోట గుండె తడుస్తుంది.
గులాబీ నుంచి.. నక్షత్రం వరకూ.. అన్నీ కృష్ణవంశీవి సొంత కథలే! ఆయన తొలిసారి చేసిన రీమేక్- 'రంగమార్తాండ'. మరాఠీలో 'నటసామ్రాట్' చూసిన వాళ్లంతా ‘శభాష్’ అన్నారు. కంటతడి పెట్టారు. ఎందుకంటే ఆ సినిమాలోని సంఘర్షణ అలాంటిది. ఆ ఉద్వేగం, ఆ కంటి చెమ్మ తెలుగు ప్రేక్షకులకూ ఇవ్వాలనుకొన్నారు కృష్ణవంశీ.

ఫొటో సోర్స్, Twitter/RajashyamalaENT
తొలి అంకం
రంగస్థలంపై రాఘవరావును మించిన వారు లేరు. 40 ఏళ్లు నాటకాలకు జీవితాన్ని ధారబోసిన రాఘవరావు చివరి దశలో ప్రశాంతంగా జీవితాన్ని గడపాలనుకొంటారు. అయితే తన సంతానం నుంచి అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతాయి. అవేంటి? జీవితానికీ, రంగస్థలానికీ తాను తెలుసుకొన్న తేడా ఏమిటి? రంగస్థలంపై గెలిచిన నటుడు.. జీవితంలో ఎలా తడబడ్డాడు? అనేది రంగమార్తాండ సినిమా కథ.
నటసామ్రాట్‌లో ఉన్నవన్నీ 'రంగమార్తాండ'లోకి తీసుకొచ్చేందుకు కృష్ణవంశీ ప్రయత్నం చేశారు. లేని అందాలు తెచ్చి పెట్టేందుకూ శ్రమించారు. తనలోని కళాత్మకతనూ, భావోద్వేగాన్నీ మేళవించి, ఓ సరికొత్త చిత్రాన్ని ఆవిష్కరించేందుకు తన వంతు కృషి చేశారు. అది రంగమార్తాండలో అడుగడుగునా కనిపిస్తుంది. కథాపరంగా నటసామ్రాట్‌నే అనుసరించారు. పాత్రల స్థాయి, వాటి ఔచిత్యం విషయంలో కొన్ని సొంత నిర్ణయాలు తీసుకొన్నారు.
రాఘవరావు, చక్రి(బ్రహ్మానందం), రాజుగారు (రమ్యకృష్ణ) పాత్రలు, వాటిని ఆవిష్కరించిన విధానం, మధ్యమధ్యలో నాటకాల గురించి, తెలుగు భాష గురించి చర్చించిన పద్ధతీ, ఇవన్నీ కృష్ణవంశీ భావుకతకూ, తన ఆలోచనా సరళికీ, సమాజంపై తనకున్న లోతైన అవగాహనకూ, పట్టింపుకూ అద్దం పడతాయి.
అమ్మానాన్నల కథ
నాటకాలు, వాటి హంగామా పక్కన పెడితే, ఇది సగటు తల్లిదండ్రుల కథ. బిడ్డలపై ప్రేమతో, నమ్మకంతో తాము సంపాదించినదంతా వాళ్లకే ధారబోస్తారు తల్లిదండ్రులు.
చివరి దశలో తమ పిల్లలు తమను చూడకపోతారా అనే నమ్మకం, ధైర్యం. కానీ అడ్డాల నాటి బిడ్డలు గడ్డాలొచ్చేసరికి మాటలు వింటారా? పెద్దల ప్రేమ చాదస్తంలా అనిపించవచ్చు.
పిల్లల ముక్కుసూటిదనం తల్లిదండ్రులకు మేకుల్లా గుచ్చుతుంటుంది. తరాల అంతరాలు మామూలే. ఇవన్నీ కలిసి తల్లిదండ్రులను ఎవరూ లేనివారిని చేస్తుంది.
'రంగమార్తాండ'లో అంతర్లీనమైన మరో కథ ఇది. ఇదేం కొత్త కథ కాదు. తరాలుగా ఉన్నదే. కానీ ఈ సాదాసీదా కథ చెప్పడంలో కథకుడు ఎంచుకొన్న కోణాలు, అల్లుకొన్న భావోద్వేగాలూ సినిమాకు బలాన్ని అందిస్తాయి. (మాతృక అయిన నటసామ్రాట్ రచయితకే ఈ మార్కులు పడతాయి.)

ఫొటో సోర్స్, Facebook/rajashyamalaEnt
'చక్ర'బంధనం
ఈ కథలో నటుడి జీవితమే కాదు. స్నేహితుల మమకారం ఉంది. భార్యాభర్తల బంధం ఉంది. ఈ రెండు కోణాలూ తెరపై హృదయాన్ని తాకేలా డైరెక్టర్ కృష్ణవంశీ ఆవిష్కరించారు. ముఖ్యంగా చక్రి (బ్రహ్మానందం) పాత్రను మలిచిన తీరు, ఆ నేర్పు ఆకట్టుకొంటాయి.
రాఘవరావు-చక్రి స్నేహ బంధం చూస్తే కష్టాలనూ, కన్నీటినీ, బాధలనూ, పరాజయాలనూ పంచుకోవడానికి చక్రిలాంటి స్నేహితుడు ఒక్కరైనా అందరికీ ఉండాలని అనిపిస్తుంది. చక్రి -రాఘవరావు మధ్య నడిచే సన్నివేశాలను సహజంగా తెరకెక్కించారు.
చక్రి పాత్రను దర్శకుడు తెలివిగా ప్రజెంట్ చేశారు. చక్రిని పరిచయం చేసిన తొలి సన్నివేశంలో ఆ పాత్రపై ఒక్క క్లోజప్ కూడా పడదు. గుంపులో అతనొకడంతే. రెండో సన్నివేశంలో రాఘవరావుకి ఆయనెంత ఆప్తుడో చెబుతారు. ఆ తరవాత ఒక్కో సన్నివేశానికీ చక్రి పాత్ర తాలుకూ ఔచిత్యం, ఔన్నత్యం అర్థమవుతుంటాయి. ఒక దశలో అసలైన రంగమార్తాండ రాఘవరావు కాదు, చక్రి అన్నంతగా ఆ పాత్ర విస్తరిస్తుంది.
“నువ్వొక చెత్త నటుడివి” అంటూ రాఘవరావు చెంప పగలగొట్టినప్పుడు, “ముక్తినివ్వరా రాఘవా” అంటూ స్నేహితుడ్ని వేడుకొంటున్నప్పుడు చక్రి పాత్ర ఆకాశం అంత ఎత్తుకు ఎదుగుతుంది. ఈ సన్నివేశాలే 'రంగమార్తాండ'కు ప్రాణం.

ఫొటో సోర్స్, Facebook/RajashyamalaEnt
రాజుగారు
ఓ భర్త తన భార్యని 'రాజుగారూ' అని పిలుస్తూ సేవలు చేయడం చూస్తుంటే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. చూస్తోంది తెరపైనే అని తెలిసినా సరే.
ఈ సినిమాలో రాఘవరావుకూ, ఆయన భార్య రాజుగారు (రమ్యకృష్ణ)కీ మధ్య నడిపించిన సన్నివేశాల్లో కృష్ణవంశీ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.
భర్తంటే భార్యకు వల్లమాలిన ప్రేమ. తన అమాయకత్వంతో, అజ్ఞానంతో, అతి ప్రేమతో ఎక్కడ అభాసుపాలైపోతాడో అనే భయం భార్యది.
తన భర్త తన బిడ్డలకు ఆస్తుల్ని రాసేస్తుంటే, “మన బిడ్డలైనా సరే నమ్మకు” అని వాస్తవిక ప్రపంచంలో నిలబడి భర్తను ఆమె హెచ్చరిస్తుంది. కూతురైనా సరే తన భర్తను “దొంగ” అన్నప్పుడు భార్యగా ఆమె రగిలిపోతుంది.
కన్న మమకారం పక్కన పెట్టి, కట్టుకున్నవాడి వెంట నడిచిపోతుంది. తన భర్త తలదించుకోకూడదు అని అడుగడుగునా తాపత్రయపడుతుంది. ఈ మధ్య కాలంలో సొంత వ్యక్తిత్వంతోనూ, ఆత్మభిమానంతోనూ తీర్చిదిద్దన ఇల్లాలి పాత్రల్లో రాజుగారి పాత్ర ఒకటని కచ్చితంగా చెప్పొచ్చు.
'నట సామ్రాట్'కూ 'రంగమార్తాండ'కూ మధ్య తూకం వేసినప్పుడు 'రంగమార్తాండ' కాస్త ఎక్కువ తూగితే, ఆ ఘనత రాఘవరావు భార్య పాత్రకే దక్కుతుంది. ఆ పాత్ర ను రమ్యకృష్ణ పోషించిన తీరు అభినందనీయం.
తెలుగు భాష గొప్పదనం చెప్పిన సందర్భంలోనూ, షేక్ ష్పియర్ కంటే, నాటక రంగంలో ఉద్దండులు మన తెలుగులో ఉన్నారని చెప్పే సన్నివేశంలోనూ మాతృభాషపై, తెలుగు గడ్డపై కృష్ణవంశీ ప్రేమ కనిపిస్తుంది.
ఇది రంగస్థల కళాకారుడి కథే అయినప్పటికీ ఒక్క చోట కూడా 'నాటకం' చూపించలేదు. కానీ ఆ ఛాయలు, నాటకంపై రాఘవరావుకు ఉన్న ప్రేమ కనిపిస్తూనే ఉంటాయి.
యవనిక (తెర ముందు)
ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ.. వీళ్లంతా గత చిత్రాలకంటే భిన్నంగా కనిపించిన సినిమా ఇది. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాలు దక్కించుకొన్న ప్రకాష్ రాజ్, మరోసారి ఆ స్థాయికి తగ్గని నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరింత మెప్పిస్తుంది.
ప్రకాష్ రాజ్ నటనలో కొన్ని లోపాల్ని వెదుకుతుంటారు సినీ విశ్లేషకులు, విమర్శకులు. ముఖ్యంగా ఆయన నవ్వు సహజంగా ఉండదని, విషాదాన్ని సరిగా క్యారీ చేయలేరని చెబుతుంటారు. ఆ రెండు లోపాల్ని ఈసారి అధిగమించినట్టు కనిపిస్తుంది.
ఈ సినిమాలో ఆశ్చర్యపరిచే అంకం- బ్రహ్మానందం. ఆయన్ను ప్రేక్షకులు ఇప్పటివరకు హాస్య నటుడిగానే చూశారు. ఇది వరకు చూసిన మన బ్రహ్మానందమేనా అనేలా ఈ సినిమాలో ఆయన నటన సాగింది. ఒక నటుడిగా ఆయన ఎంత ఎత్తులో ఉన్నారో ఆయన నటన గుర్తుచేస్తుంది.
చక్రిని వెతుక్కొంటూ రాఘవరావు వచ్చే సన్నివేశంలో చక్రిగా బ్రహ్మానందం నటన కంటతడి పెట్టిస్తుంది. ఆసుపత్రి సన్నివేశంలో, బ్రహ్మానందంపై ఓ టైట్ క్లోజ్ వేశాడు కృష్ణవంశీ. అది కొన్ని సెకన్ల పాటు అలా ఉండిపోతుంది. ఆ క్షణంలో ప్రేక్షకుల గుండెలు బరువెక్కుతాయి. క్లైమాక్స్‌కి పావు గంట ముందే చక్రి పాత్ర ముగుస్తుంది. కానీ సినిమా పూర్తయిన తరవాత కూడా చక్రి మిమ్మల్ని వెంటాతాడు. కన్నీళ్లు తెప్పిస్తాడు.
ఉత్తమ ఇల్లాలు అనే ట్యాగ్ లైన్‌కు రాజుగారి పాత్రలో రమ్యకృష్ణ పూర్తిగా న్యాయం చేశారు. ఆమె పాత్ర హుందాగా ఉంది.
ఈ కథలో కనిపించే స్త్రీ పాత్రలు మూడే.
శివాత్మిక, అనసూయ పాత్రలూ, అవి ప్రవర్తించిన విధానంలోనూ తప్పులేం కనిపించవు. ఎందుకంటే.. ఈ సినిమాలో విలన్లు ఉండరు. రెండో వైపు నుంచి ఆలోచిస్తే రాఘవరావు దంపతులకు జరిగిన అన్యాయానికి కాలానిది తప్ప ఇంకెవ్వరిదీ తప్పు లేదనిపిస్తుంది.
ఓ మంచి అల్లుడు పాత్రలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (ఆస్కార్ సాధించిన నాటు.. నాటు పాట పాడిన గాయకులలో ఒకరు ) కనిపిస్తారు. ఇందులోనూ తనది గాయకుడి పాత్రే. కాబట్టి సహజంగానే ఆ పాత్రని ఈజీ గా ఫాలో ఐపోతారు ప్రేక్షకులు.
చాలా కాలం తర్వాత, దర్శకుడిగా కృష్ఱవంశీ స్థాయిని మరోసారి గుర్తు చేసిన సినిమా ఇది. ఆయన అభిమానులకు ఈ ప్రయత్నం తప్పకుండా నచ్చుతుంది. బలమైన ఉద్వేగాలు, నటీనటుల ప్రతిభ, ఇళయరాజా సంగీతం, ఇవన్నీ.. కృష్ఱవంశీ చిత్రీకరణకు వెన్నుదన్నుగా నిలిచాయి.

ఫొటో సోర్స్, Facebook/KrishnaVamshi
గగనిక ( తెర వెనుక)
“నేనొక నటుడ్ని” అనే లక్ష్మీ భూపాల షాహెరీతో ఈ కథ మొదలవుతుంది. రంగస్థల నటుడి విశ్వరూపాన్ని ఈ షాహెరీలో చెప్పారు. ఈ షాహెరీని ప్రముఖ నటుడు చిరంజీవి పలికిన విధానం ఆకట్టుకొంటుంది. కథలోకి లాక్కెళుతుంది.
తన స్వరాలతో ఇళయరాజా తనకంటూ ఓ పాత్రని ఈ కథలో సృష్టించుకొన్నారనిపిస్తుంది. ఇళయరాజా పాటలు సందర్భానికి తగినట్టు ఉన్నాయి. 'పూవై విరిసే ప్రాయం' పాట బాగుంది. ఆ పాటలోని చరణాల్ని కథలోని సందర్భానికి తగ్గట్టుగా వాడుకొన్నారు.
నాటక రంగానికీ, జీవితానికీ ముడి పెడుతూ రాసిన సంభాషణలు బాగున్నాయి. సహజత్వం ఉండేలా జాగ్రత్త పడ్డారు.

ఫొటో సోర్స్, Facebook/KrishnaVamshi
భరతవాక్యం (ముగింపు)
మంటల్లో కాలి బూడిదై శిథిలావస్థకు చేరుకొన్న నాటక వేదిక అది.
రంగమార్తాండ ఎప్పట్లా అద్వితీయంగా నటిస్తుంటాడు.
అనర్గళంగా సంభాషణలు వల్లిస్తుంటాడు.
కానీ తన కుటుంబ సభ్యులు తప్ప ప్రేక్షకులు లేరు. నైరాశ్యం తప్ప, చప్పట్లు లేవు. అంతా విషాదం.
నాటక రంగంలో అద్భుతంగా నటించిన రాఘవరావు కన్నకొడుకు ముందు ఓడిపోయాడు. కూతురు ముందు తేలిపోయాడు. అసలు జీవితంలోనే ఓడిపోయాడు.
''రంగులేసుకొని నటించడం చాలా తేలిక. నిజ జీవితంలో నటించడమే కష్టం'' అనే నిజాన్ని తెలుసుకొని ఈ నాటకానికి భరత వాక్యం పలికి నిష్క్రమిస్తాడు. వెళ్తూ.. వెళ్తూ ఈ సమాజానికి, తల్లిదండ్రులకు తన జీవితాన్ని ఓ హెచ్చరికగా వదిలి వెళ్తాడు.
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: వైఎస్ జగన్ ‘‘తెలుగు జెండా’’ అంటే ప్రాంతీయ వాదం అవుతుందా?
- కే హుయ్ క్వాన్: ఒకప్పుడు శరణార్థి...నేడు ఆస్కార్ విజేత
- మాతృత్వం: ‘మా అమ్మ వయసు 50 ఏళ్లయితే మాత్రం.. రెండవ బిడ్డను కనడానికి ఎందుకు సిగ్గుపడాలి?’
- కర్నాటక: ‘‘మైకుల్లో ప్రార్థించకుంటే అల్లాకు వినపడదా..’’ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు... మరి నిబంధనలు ఏం చెబుతున్నాయి
- లావణి డ్యాన్స్: మహిళలను ప్రైవేటుగా బుక్ చేసుకునే ఈ నృత్యం ఏంటి? ఈ జీవితం మీద ఆ మహిళలు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














