దేవికా రాణి: బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన ఈ ‘ముద్దు సీన్’ చుట్టూ అల్లుకున్న కథలేంటి?

కర్మ సినిమా

ఫొటో సోర్స్, WIKIMEDIA COMMONS

ఫొటో క్యాప్షన్, ఆన్‌స్క్రీన్‌పై ముద్దు సీన్‌ను ప్రదర్శించిన తొలి బాలీవుడ్ చిత్రం కర్మ (1933)
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక అందమైన యువరాణి, స్పృహ లేకుండా పడి ఉన్న తన ప్రియుడిని ముద్దుతో మేల్కొలిపేందుకు ప్రయత్నించిన దృశ్యం సినిమా చరిత్ర పుటల్లో ప్రముఖ ఘట్టంగా నిలించింది.

1933లో వచ్చిన ‘కర్మ’ సినిమా ఈ దృశ్యానికి వేదిక అయింది. నిజ జీవిత దంపతులు అయిన దేవికా రాణి, హిమాన్షు రాయ్ ఈ సినిమాలో నటించారు.

లిప్ లాక్ సన్నివేశం ఉన్న తొలి బాలీవుడ్ సినిమా ఇదేనని, బాలీవుడ్‌ సినిమాల్లో ఎక్కువ నిడివి ఉన్న ముద్దు సీన్ ఇదేనని చాలా కాలం పాటు ఈ సన్నివేశం గురించి వార్తలు రాశారు.

కానీ, ఈ రెండు వాదనల్లో నిజం లేదు.

ఈ ముద్దు నిడివి నాలుగు నిమిషాలకు పైగా ఉన్నట్లు ఆ సమయంలోని పత్రికలు రాశాయి. వెండితెరపై ఈ సన్నివేశంలో నటించినప్పటి నుంచి దేవికా రాణి, హిమాన్షు రాయ్ జంట భారత్‌లో అనేక కల్పిత కథలకు కేంద్రంగా మారింది.

1934లో రాయ్-రాణి జంట బాంబే టాకీస్ పేరిట భారత తొలి ప్రొఫెషనల్ సినిమా స్టూడియోను నెలకొల్పింది.

భారత్‌లో టాకింగ్ సినిమా వచ్చిన తొలి దశాబ్ద కాలంలో ఈ స్టూడియో ఆధిపత్యం ప్రదర్శించింది. అనేక ట్రెండ్స్‌ను నమోదు చేసింది.

కర్మ సినిమా

ఫొటో సోర్స్, WIKIMEDIA COMMONS

ఫొటో క్యాప్షన్, కర్మ సినిమాలో రాజ భవంతులను చూపించారు

2020లో వచ్చిన ఒక పుస్తకానికి ఇటీవలే జాతీయ అవార్డు లభించింది. భారత సినిమాపై వచ్చిన ఉత్తమ పుస్తకంగా దీనికి ‘నేషనల్ ఫిల్మ్ అవార్డు’ను రాష్ట్రపతి అందజేశారు.

ఈ పుస్తకంలో రాయ్-రాణి జంట జీవితం గురించి, కర్మ సినిమాలో ముద్దు గురించి ప్రస్తావించారు.

‘‘రాయ్, రాణిలకు పెళ్లి జరిగిన కొత్తలో ఈ సినిమాను తీశారు. అప్పటికీ వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. కాబట్టి స్క్రీన్‌పై అలా ముద్దులు పంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు’’ అని కిశ్వర్ దేశాయ్ పేర్కొన్నారు.

‘ద లాంగెస్ట్ కిస్: ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ దేవికా రాణి’ అనే పుస్తకాన్ని కిశ్వర్ రాయ్ రాశారు.

‘‘ఆ సమయంలో భారతీయ సినిమాలో ముద్దు సన్నివేశాలు ఉండటం అసాధారణం కాదు. అప్పటికి భారత్, బ్రిటిష్ పాలనలోనే ఉంది. పాశ్చాత్య అభిమానుల కోసం చాలా సినిమాలను ఇక్కడ తీశారు. 1920, 1930లలో వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా ముద్దు సీన్లు ఉన్నాయి’’ అని ఆమె పుస్తకంలో పేర్కొన్నారు.

కర్మ సినిమా

ఫొటో సోర్స్, ENGINEER RASHID ASHRAF, KARACHI

ఫొటో క్యాప్షన్, 1937 నాటి ఇజ్జత్ సినిమా సెట్‌లో హిమాన్షు రాయ్, దేవికా రాణి, అశోక్ కుమార్

అప్పటి చాలా సినిమాల తరహాలోనే కర్మ సినిమా నిర్మాణంలో కూడా పాశ్చాత్య అభిమానులను పరిగణలోకి తీసుకున్నారు.

63 నిమిషాల నిడివి గల ఈ ‘లవ్ డ్రామా’ను బ్రిటిష్ సినీ నిర్మాత జేఎల్ ఫ్రీర్ హంట్ తీశారు.

సినిమా ముగింపులో రాయ్, రాణిల మధ్య ముద్దు సీన్ ఉంటుంది. కోబ్రా కాటుతో అపస్మారక స్థితిలో పడి ఉన్న తన ప్రియుడిని బతికించే ప్రయత్నంలో నిరాశకు గురైన యువరాణి అతనికి ముద్దు పెడుతుంది.

‘‘ఈ సీన్ నాలుగు నిమిషాలకు పైగా ఉంటుందని అపోహ ఉంది. కానీ, అది నిజం కాదు. బాలీవుడ్ సినిమాల్లో ఇదే అత్యంత నిడివి ఉన్న ముద్దు సీన్ అయితే కచ్చితంగా కాదు. సమయం పరంగా చూసుకుంటే ఇది దాదాపు 2 నిమిషాలకు మించదు’’ అని దేశాయ్ అన్నారు.

సినిమా తీసిన సమయంలో సినిమాకు ప్రచారం కోసం ఈ ముద్దు సీన్‌ను వాడుకోలేదు. కానీ సినిమా వచ్చిన చాలా కాలం తర్వాత ప్రెస్ కారణంగా ఇది టాకింగ్ పాయింట్‌గా మారిందని ఆమె చెప్పారు.

ఈ మధ్య కాలంలో సినిమాల్లో బోల్డ్‌నెస్ పెరిగింది. కానీ, ఒకప్పుడు భారత్‌లో స్క్రీన్ మీద లేదా ఆఫ్ స్క్రీన్‌లో ప్రేమను బహిరంగంగా ప్రదర్శించడం అనేది నిషేధంగా ఉండేది.

కర్మ సినిమా

ఫొటో సోర్స్, ENGINEER RASHID ASHRAF, KARACHI

ఫొటో క్యాప్షన్, దేవికా రాణి

2007లొ దిల్లీలోని ఒక చారిటీ ఈవెంట్‌లో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరీ, బాలీవుడ్ నటి శిల్పా శెట్టిని ముద్దు పెట్టుకున్న తర్వాత నిరసనలు చెలరేగాయి.

భారతీయ సంస్కతిని అవమానించారంటూ రిచర్డ్ దిష్టిబొమ్మలను నిరసనకారులు తగులబెట్టారు.

ఇది జరిగిన రెండేళ్ల తర్వాత బహిరంగ ప్రదేశంలో ముద్దు పెట్టుకున్నందుకు అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ దిల్లీలో యువ దంపతులపై కేసు నమోదు చేశారు.

అప్పట్లో సెన్సార్ బోర్డులు కూడా సినిమాను చాలా నిశితంగా పరిశీలించి సర్టిఫికెట్లు ఇచ్చేవి. సినిమాల్లో ముద్దు సీన్‌కు ప్రతీకగా స్క్రీన్‌పై పువ్వులను చూపించేవారు.

కాబట్టి ఆ కాలంలోనే ముద్దు సీన్‌ను ప్రదర్శించిన కారణంగా కర్మ సినిమా కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. కానీ, ఇదొక ప్లాఫ్ సినిమా.

‘‘సినిమాలో నటి ఓపెరాటిక్ స్టయిల్‌లో పాట పాడుతుంది. ఈ స్టయిల్ భారత అభిమానులకు నప్పదు. దీన్ని భారతీయులు ఇష్టపడరు.

వీడియో క్యాప్షన్, జాన్వీ కపూర్ ఇంటర్వ్యూ: ‘...అలాంటి కామెంట్ల వల్ల సినిమాలే మానేద్దామనుకున్నా’

బాంబే నుంచి ప్రపంచ స్థాయి సినిమాను తీయగలమని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ఈ సినిమాను తీశారు.

యూరప్‌లో అప్పటికే హిమాన్షు రాయ్ విజయవంతం అయ్యారు. ఆయనకు వర్థమాన తారగా అక్కడ పేరు వచ్చింది. కానీ, ఆయన చాలా తెలివైన వ్యాపారవేత్త. అప్పటికే బాంబేలో ఒక స్టూడియోను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. కర్మ లాంటి సినిమాను తీయడం ద్వారా హాలీవుడ్‌కు తగు రీతిలో తాము కూడా సినిమా తీయగలమనే సందేశాన్ని పంపించేందుకు ఆయన ప్రయత్నించారు’’ అని దేశాయ్ వివరించారు.

పెట్టుబడిదారులు ఎక్కువగా బ్రిటిషర్లు లేదా పాశ్చాత్య వేషధారణలో ఉండే పార్సీ కమ్యూనిటీ సభ్యులు కావడంతో ఇలాంటి సినిమా తీయడం ఆయనకు అవసరం అయిందని ఆమె చెప్పారు.

అక్కడే ఆయనకు రాణి గుర్తింపు కూడా సహాయపడింది. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలి కూతురు అయిన రాణి తొమ్మిదేళ్ల వయస్సు నుంచే ఇంగ్లండ్‌లో చదువుకున్నారు. పాశ్చాత్య, కాస్మోపాలిటన్ వ్యక్తిగా ఆమె ఇమిడిపోయారు.

వీడియో క్యాప్షన్, రామసేతు రాముడి కాలంలో జరిగిన నిర్మాణమా, ప్రకృతి సిద్ధమా?

లండన్‌లోని మార్బుల్ ఆర్చ్ థియేటర్‌లో చాలా గొప్పగా కర్మ సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకు బ్రిటిష్ ఉన్నత వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కింగ్ జార్జి-5తో పాటు క్వీన్ మేరీ కూడా ఈ సినిమా ప్రీమియర్ చూడటానికి వస్తారనే ఊహాగానాలు వచ్చాయి.

ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. దేవికా రాణి అందం, డిక్షన్‌తో విమర్శకుల ప్రశంసలు పొందారని దేశాయ్ చెప్పారు.

‘‘ఆమె కన్నా సరైన వ్యక్తిని కనిపెట్టడం చాలా కష్టం’’ అని ఒక వార్తా పత్రిక రాయగా, ‘‘ఆమె అందమైన కళ్లు, అద్భుతమైన కదలికలు’’ అంటూ మరో వార్తా పత్రిక ఆమెను ప్రశంసించింది.

ఈ సినిమాతో దేవికా రాణి క్రేజ్ మరింత పెరిగింది. హాలీవుడ్, యూరోపియన్ సినిమా ఆసక్తి కనబరుస్తోన్న భారత్‌కు చెందిన అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన తారగా దేవికా రాణి పేరు పొందారు.

కానీ, ఆమె భారత్‌లో తొలి ప్రొఫెషనల్ స్టూడియోను స్థాపించడం కోసం రాయ్‌తో కలసి ముంబై వచ్చారు. అక్కడ ఆమె చాలా కష్టపడి పని చేశారు.

వీడియో క్యాప్షన్, బాహుబలి సినిమాలో బ్యాగ్రౌండ్‌ శబ్దాలు చేసింది వీళ్లే, వీళ్ల టాలెంట్ చూశారా..

ఆమె డజనుకు పైగా సినిమాల్లో నటించారు. దిగ్గజ నటుడు అశోక్ కుమార్‌తో ఆమె జోడీ ఆన్ స్క్రీన్‌పై హిట్ జోడీగా నిలిచింది. వీరిద్దరూ పలు హిట్ సినిమాల్లో నటించారు.

ప్రతిభతో పాటు అందం కలగలిపిన రాణి అభిమానుల హృదయాలను దోచుకున్నారు. ఆమె భారత సినిమా ప్రథమ మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, అంతలోనే రాయ్‌తో ఆమె అనుబంధానికి బీటలు వారాయి.

‘‘ఆమె చాలా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు దక్కలేదు. రాయ్‌కు అంతకంటే ముందు పెళ్లి జరిగిందని, ఒక కూతురు కూడా ఉందని ఆమెకు తర్వాత తెలిసింది. దీంతో వారి బంధం దెబ్బతింది’’ అని దేశాయ్ రాశారు.

రాయ్ మరణం తర్వాత రష్యా కళాకారుడు స్వెటోస్లావ్ రోరిచ్‌తో ఆమెకు పరిచయం అయింది. తర్వాత అతనితో ఆమెకు వివాహం జరిగింది. తన రెండో భర్తకు రాసిన లేఖల్లో రాయ్ తనతో ఎలా ప్రవర్తించేవారో, బాగా జ్వరం ఉన్నప్పటికీ పని చేయాలని ఎలా ఒత్తిడి చేసేవారో రాణి వివరించారు.

ఒక సందర్భంలో రాయ్ తనను నేలపై పడి రక్తం వచ్చేంతవరకు కొట్టారని లేఖలో ఆమె పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, బాలీవుడ్ సినిమా జల్సాలో నటించిన తెలుగు అబ్బాయి సూర్య కాశీభట్లతో బీబీసీ ఇంటర్వ్యూ

బాంబే టాకీస్‌పై రెండో ప్రపంచ యుద్ధం తీవ్ర ప్రభావం చూపింది. అందులో పనిచేసే జర్మన్ సిబ్బంది మొత్తాన్ని భారత్‌లోని బ్రిటిష్ పాలకులు నిర్బంధించి శిబిరాల్లో ఉంచారు.

1940లో రాయ్ మరణించిన తర్వాత దేవికా రాణి నిర్మాతగా మారి స్టూడియోను నడిపారు. దిగ్గజ నటులైన మధుబాల, దిలీప్ కుమార్ వంటి వారికి మంచి సినిమాలను అందించారు.

కానీ, 1945లో ఆమె తన వాటాలను విక్రయించి స్వెటోస్లావ్ రోరిచ్‌ను వివాహం చేసుకుని హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిపోయారు. అక్కడి నుంచి బెంగళూరుకు మారారు.

1994లో మరణించే వరకు ఆమె అక్కడే ఉన్నారు. ఆమె మరణం కంటే సంవత్సరానికి ముందు రోరిచ్ కూడా చనిపోయారు.

‘‘రోరిచ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత బహుశా ఆమె కోరుకున్న జీవితాన్ని పొందారు’’ అని దేశాయ్ చెప్పారు.

రాణి తన వాటాలను విక్రయించిన తర్వాత బాంబే టాకీస్ ఎక్కువ రోజులు మనుగడ సాగించలేకపోయింది. 1954లో మూతపడిందని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)