జవాన్ ఛాతిలో పేలని గ్రెనెడ్, డాక్టర్లు, బాంబ్ స్క్వాడ్‌ను రప్పించాక....

గుండెలో గ్రెనెడ్

ఫొటో సోర్స్, HANNA MALIAR FACEBOOK

ఫొటో క్యాప్షన్, ఆపరేషన్ తర్వాత గ్రెనెడ్‌ను పరిశీలిస్తున్న సర్జన్ ఆండ్రీ వెర్బా

ఒక జవాన్‌కు వైద్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు.

గాయపడిన జవాన్ ఛాతి లోపల ఇరుక్కుపోయి, ఎప్పుడైనా పేలిపోయే స్థితిలో ఒక చిన్న గ్రెనెడ్‌ను వారు విజయవంతంగా బయటకు తీశారు.

యుక్రెయిన్ ఉప రక్షణ మంత్రి హన్నా మలైర్ ఈ శస్త్రచికిత్స గురించి వెల్లడించారు. దీన్నొక ‘హ్యాపీ షాక్’గా ఆమె అభివర్ణించారు.

‘‘గుండెకు అయ్యే ప్రతీ గాయం ప్రాణాంతకం కాదని తెలిసింది’’ అని ఆమె సోషల్ మీడియాలో రాశారు.

ఇద్దరు మిలిటరీ పేలుడు పదార్థాల నిపుణుల పర్యవేక్షణలో ఈ గ్రెనెడ్‌ను జవాన్ శరీరం నుంచి యుక్రెయిన్ మిలిటరీ వైద్యులు బయటకు తీశారని ఆమె చెప్పారు.

పేలుడు పదార్థాల నిపుణులు వైద్య సిబ్బంది సురక్షితంగా శస్త్ర చికిత్స నిర్వహించేలా సహాయపడ్డారు.

చికిత్స సమయంలో గ్రెనెడ్ పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారు వైద్యులకు సూచించారని ఆమె తెలిపారు.

ఛాతిలో గ్రెనెడ్

ఫొటో సోర్స్, Hanna Maliar Facebook

ఫొటో క్యాప్షన్, జవాను గుండె సమీపంలో గ్రెనెడ్ ఎక్స్‌రే చిత్రం

మిలిటరీ సర్జన్ ఆండ్రీ వెర్బా ఈ శస్త్రచికిత్సను చేశారని హన్నా వెల్లడించారు.

యుక్రెయిన్ ఆర్మీలోని అత్యంత అనుభవజ్ఞులైన వైద్యుల్లో 57 ఏళ్ల ఆండ్రీ వెర్బా కూడా ఒకరు.

భద్రత కోసం శస్త్రచికిత్స విధానంలో మార్పులు చేయాల్సి వచ్చింది. గుండె ఆపరేషన్‌కు సంబంధించి ఎలక్ట్రోకాగులేషన్ అనేది ఒక ప్రామాణిక పద్ధతి.

ఈ కేసులో గ్రెనెడ్ పేలకుండా ఉండేందుకు ఎలక్ట్రిక్ కరెంట్‌ను నిరోధించడానికి ఈ పద్ధతిని ఉపయోగించలేదు.

జవాన్ శరీరంలోని గ్రెనెడ్ 4 సెం.మీ వ్యాసార్థంతో, 275 గ్రాముల బరువుతో ఉంది. ఇది రష్యా వీఓజీ ప్రాంగ్మెంటేషన్ గ్రెనెడ్.

1960లలో వీఓజీ గ్రెనెడ్లను తొలిసారిగా యూఎస్‌ఎస్‌ఆర్‌లో అభివృద్ధి చేశారు. అనేక రకాల గ్రెనెడ్ లాంచర్లలో వీటిని ఉపయోగించారు. వీటి రేంజ్ 400 మీటర్లు.

ఛాతిలో గ్రెనెడ్

ఫొటో సోర్స్, Hanna Maliar Facebook

2014లో తూర్పు యుక్రెయిన్‌లో వివాదం మొదలైనప్పటి నుంచి ఈ రకమైన ఆయుధాలను తమపై ఉపయోగిస్తున్నారని యుక్రెయిన్ మిలిటరీ తెలిపింది. మానవరహిత డ్రోన్లతో వీటిని ప్రయోగిస్తున్నారని చెప్పింది.

వీఓజీ గ్రెనెడ్ సాధారణంగా ప్రయోగించిన 20 సెకన్ల తర్వాత పేలుతుంది.

పేలని గ్రెనెడ్‌ను శరీరం నుంచి ఎలా బయటకు తీశారనే అంశంపై యుక్రెయిన్ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాకుండా ఆపరేషన్‌లో వెలికి తీసిన తర్వాత నిపుణులు నిర్వీర్యం చేసేంతవరకు ఆ గ్రెనెడ్ ఎప్పుడైనా పేలిపోయే స్థితిలో ఉండటం వారిని మరింత ఆశ్చర్యపరిచింది.

గాయపడిన జవాను పేరును వారు వెల్లడించలేదు. కానీ, ఆయన వయస్సు 28 ఏళ్లు అని చెప్పారు.

‘‘గాయపడిన జవాను పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉంది. అతను 1994లో జన్మించారు. ఇప్పుడు అతన్ని పునరావాస కేంద్రానికి తరలించారు’’ అని యుక్రెయిన్ మిలిటరీని ఉటంకిస్తూ యుక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు ఆంటోన్ జెరాష్‌చెంకో తన సోషల్ మీడియాలో రాశారు.

‘‘ఈ కేసు వైద్య పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కుతుందని నేను భావిస్తున్నా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ మీద పోరాడేందుకు పుతిన్ చేపట్టిన సైనిక సమీకరణపై రష్యాలో పెరుగుతున్న వ్యతిరేకత

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)