రష్యా - యుక్రెయిన్ యుద్ధం: ‘‘రష్యాను తప్పుపట్టొద్దు.. ఇరు దేశాలకూ అది విషాదమే’’: పుతిన్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, థామస్ మకింతోష్
- హోదా, బీబీసీ న్యూస్, లండన్
రష్యా - యుక్రెయిన్ యుద్ధానికి రష్యాను తప్పపట్టకూడదని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. ఆ యుద్ధం ‘‘ఇరు దేశాలకూ విషాదమే’’ అని పేర్కొన్నారు.
పుతిన్ బుధవారం నాడు సీనియర్ మిలటరీ అధికారులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని టెలివిజన్‌లో ప్రసారం చేశారు. యుక్రెయిన్‌ను తాము ‘‘సోదర దేశం’’గానే భావిస్తున్నామని పుతిన్ ఈ సందర్భంగా చెప్పారు.
‘‘మూడో దేశాల విధానాల ఫలితంగా’’ తమ రెండు దేశాల మధ్య ఘర్షణ తలెత్తిందని, రష్యా విధానం కారణం కాదని ఆయన పేర్కొన్నారు.
ఆయన మాటలు.. పశ్చిమ దేశాల విస్తరణను పరోక్షంగా ప్రస్తావిస్తున్నాయి. ఈ వాదనను ఇతర దేశాలు కొట్టివేస్తూ ఉన్నాయి కూడా.
సోవియట్ అనంతర రిపబ్లిక్ దేశాలను పశ్చిమ ప్రపంచం ‘‘బ్రెయిన్‌వాష్’’ చేసిందని (ఆలోచనలను మార్చివేసిందని), అందులో మొదటిది యుక్రెయిన్ అని పుతిన్ విమర్శించారు.
‘‘యుక్రెయిన్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకోవటానికి మేం చాలా ఏళ్ల పాటు ప్రయత్నించాం. రుణాలు ఇచ్చాం. చౌకగా ఇంధనం అందించాం. కానీ అది ఫలించలేదు’’ అని పేర్కొన్నారు.
‘‘మమ్మల్ని నిందించటానికి ఏమీ లేదు. యుక్రెయిన్ ప్రజలను మేం ఎల్లప్పుడూ సోదర జనంగానే చూశాం. నేను ఇప్పటికీ అలాగే అనుకుంటున్నాను’’ అన్నారాయన.
‘‘ఇప్పుడు జరుగుతున్నది ఒక విషాదం. అది మా తప్పు కాదు’’ అని వ్యాఖ్యానించారు.
పుతిన్ ప్రసంగం సందర్భంగా.. సైనికాధికారులు యుక్రెయిన్‌లో ‘‘ప్రత్యేక సైనిక చర్య’’ను 2023లో కొనసాగిస్తామని ప్రతినబూనారు.
ఎన్ని డబ్బులైనా ఖర్చు చేయటానికి రష్యా సిద్ధంగా ఉందని, దానికి పరిమితి లేదని పుతిన్ పేర్కొన్నారు.
రష్యా సైన్యంలో తప్పనిసరిగా పనిచేయాల్సిన వయసు పరిధిని పెంచాలని రక్షణ మంత్రి సెర్గీ షోయుగు ఈ సందర్భంగా ప్రతిపాదించారు.
ప్రస్తుత చట్టం ప్రకారం.. 18 నుంచి 27 ఏళ్ల వయసు మధ్య ఉన్న రష్యా పౌరులను తప్పనిసరిగా సైన్యంలో పనిచేయటానికి రప్పించవచ్చు. ఈ వయసు పరిమితిని 21 నుంచి 30 ఏళ్లకు మార్చాలని రక్షణ మంత్రి సెర్గీ ఇప్పుడు ప్రతిపాదిస్తున్నారు.
యుక్రెయిన్ మీద రష్యా దండయాత్రలో స్వాధీనం చేసుకున్న బెర్దియాన్స్క్, మరియుపూల్ రేవు నగరాల్లో రెండు సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే ప్రణాళికలను కూడా సెర్గీ ప్రకటించారు.

ఫొటో సోర్స్, EPA
అమెరికా ప్రయాణమైన జెలియన్‌స్కీ
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియన్‌స్కీ అమెరికా ప్రయాణం నేపథ్యంలో పుతిన్ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది.
రష్యా 10 నెలల కిందట యుక్రెయిన్ మీద దండయాత్ర మొదలుపెట్టాక జెలియన్‌స్కీ తొలిసారి దేశం నుంచి బయటకు వచ్చారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ను జెలియన్‌స్కీ కలుస్తారు.
ఆయనకు పొంచి ఉన్న ముప్పు రీత్యా, ఆయన ప్రయాణ వివరాలను బహిరంగంగా ప్రకటించలేదు.
ఆయన బయలుదేరటానికి కేవలం కొన్ని గంటల ముందుగా మాత్రమే అమెరికా ప్రయాణం గురించి అధికారికంగా వెల్లడించారు.
అయితే అమెరికా పార్లమెంటులో తాను ప్రసంగిస్తానని, పలు సమావేశాల్లో పాల్గొంటానని జెలియన్‌స్కీ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్‌గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్‌బాల్ పిచ్‌ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















