ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్‌బాల్ పిచ్‌ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది

ఖతార్ ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఖతార్‌లో గృహ అవసరాలకు వినియోగించే నీరును డీశాలినేషన్ ద్వారా తయారు చేస్తున్నారు

ఖతార్‌లోని లుసైల్ స్టేడియంలో ఆదివారం అర్జెంటీనా, ఫ్రాన్స్‌ల మధ్య ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఫైనల్ మ్యాచ్ జరగనున్న ఈ పిచ్‌పై టోర్నీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 300 టన్నుల నీటిని ఉపయోగించారు.

ఖతార్‌లోని ఎడారి వాతావరణం కారణంగా గ్రౌండ్‌లోని టర్ఫ్‌ను ఆటకు అనుకూలంగా ఉంచేందుకు గ్రౌండ్ స్టాఫ్ రోజూ 10 వేల లీటర్ల కంటే ఎక్కువ నీటిని పిచికారీ చేస్తున్నారు.

ఖతార్‌లో డజన్ల కొద్దీ పిచ్‌లు ఉన్నాయి. వీటిని టోర్నమెంట్ మ్యాచ్‌లు, ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తున్నారు.

ప్రపంచంలో నీటి కొరత ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న దేశాల్లో ఖతార్ కూడా ఒకటి.

ఈ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పిచ్‌లను తడిగా ఉంచడానికి.. మైదానాన్ని పచ్చగా ఉంచడానికి భారీ మొత్తంలో నీటిని వినియోగిస్తున్నారు.

ఈ టోర్నీ నిర్వహణలో ఖతార్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో నీరు కూడా ఒకటి.

ఖతార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం 8 పిచ్‌లు, ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం 136 పిచ్‌లు వాడుతున్నారు

ఎడారి దేశం

ప్రస్తుత ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ జరుగుతున్న స్టేడియంలలో పనిచేస్తున్న గ్రౌండ్ స్టాఫ్ నీటి విషయంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు.

మొదట అనుకున్నట్లుగా ఈ ప్రపంచకప్‌ను వేసవిలో నిర్వహిస్తే 136 ప్రాక్టీస్ పిచ్‌లు సహా ఒక్కో పిచ్‌కు రోజుకు 50 వేల లీటర్ల నీరు అవసరమయ్యేది.

ఖతార్‌లో పిచ్‌ క్యురేటర్లు, సిబ్బంది.. ఇక్కడి పిచ్‌ల నిర్వహణ గురించి మాట్లాడుతూ ఇతర దేశాల్లోని పరిస్థితులతో పోలిస్తే ఇక్కడ ఎదురవుతున్న సవాళ్లు భిన్నమైనవని చెప్పారు.

మైదానాల కోసం అవసరమైతే వెంటనే వినియోగించడానికి వీలుగా ఖతార్ రాజధాని దోహాకు ఉత్తరాన 4,25,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎమర్జెన్సీ గ్రాస్ రిజర్వ్ (అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే గడ్డి)‌ను పెంచారు.

రీసైకిల్ చేసిన నీటిని ఇది పెంచడానికి ఉపయోగించారు.

వరల్డ్ కప్ మ్యాచ్‌లు, ప్రాక్టీస్ పిచ్‌ల కోసం డీశాలినేషన్ (సముద్రపు నీటి నుంచి లవణాలు తొలగించే ప్రక్రియ) ద్వారా మంచి నీటిని తయారు చేస్తున్నారు.

ఖతార్ యూనివర్సిటీ హైడ్రాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ రాధౌయాన్ బిన్ హమాదౌ మాట్లాడుతూ... ‘సహజంగా లభించే నీటిపై ఆధారపడి ఉంటే, ఖతార్‌లో కేవలం 14,000 మంది మాత్రమే నివసించి ఉండేవారు. ఆ నీరు, ప్రపంచకప్ స్టేడియంలో పావు వంతుకు కూడా సరిపోదు’’ అని అన్నారు.

ఖతార్‌లో ఒక్క నది కూడా లేదు. అక్కడ సగటు వర్షపాతం ఏడాదికి 10 సెంటీమీటర్ల కంటే తక్కువ.

ఖతార్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలో నీటి కొరతతో అత్యంత ప్రభావితమైన దేశాల్లో ఖతార్ కూడా ఒకటి

పెరుగుతున్న సమస్య

ఖతార్‌లో దాదాపు 29 లక్షల మంది నివసిస్తున్నారు. 

ఖతార్ జనాభాకు అక్కడ లభ్యమయ్యే నీటి పరిమాణానికి మధ్య చాలా అంతరం ఉంది. 

ఖతార్ నీటి అవసరాలకు ప్రత్యామ్నాయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.

ప్రధానంగా డీశాలినేషన్ విధానంలో ఖతార్ తన అవసరాలకు సరిపడా నీటిని సమకూర్చుకుంటోంది.

‘గృహ, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే నీరు 100 శాతం డీశాలినేషన్ విధానంలో లభిస్తుంది’ అని యూకే సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్‌లోని ఫిషరీష్ అక్వాకల్చర్ సైన్స్‌ మిడిల్ ఈస్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ విల్ లే క్యూజోన్ చెప్పారు.

ఈ ప్రక్రియలో సముద్రం నుంచి ఉప్పునీటిని తీసుకొని అందులోని ఉప్పుతో పాటు ఇతర మలినాలను తొలగిస్తారు.

దీంతో ఈ నీరు తాగడానికి, బట్టలు ఉతకడానికి అనువుగా మారుతుంది.

ఖతార్ ఈ ప్రక్రియ ద్వారా భారీ మొత్తంలో నీటిని తయారు చేస్తుంది.

అయితే, ఖతార్‌ వరల్డ్ కప్ వంటి మెగా క్రీడా ఈవెంట్ల నిర్వహణ కోసం ప్రణాళికలు రచిస్తున్నందున ఈ ప్రక్రియలో నీటి ఉత్పత్తిని మరింత వేగవంతం చేయాల్సి ఉంటుంది.

ప్రపంచకప్ సందర్భంగా దాదాపు పది లక్షల మంది పర్యాటకులు ఖతార్‌కు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి వినియోగం దాదాపు 10 శాతం పెరుగుతుందని అంచనా వేశారు.

ఖతార్‌లో సముద్రం కారణంగా ఉప్పు నీటి లభ్యత పుష్కలంగా ఉంది.

గ్యాస్, సహజ వనరులు, ఆర్థిక వనరులతో పాటు డీశాలినేషన్‌తో మంచి నీటిని తయారు చేయడానికి అవసరమైన శక్తి వనరులూ ఖతార్ వద్ద ఉన్నాయి. 

కానీ ఈ ప్రక్రియలో ఒక ప్రధాన లోపం ఉంది. ఇది చాలా ఎనర్జీని వినియోగిస్తుంది.

"మొత్తం గల్ఫ్ ప్రాంతంలో డీశాలినేషన్ కోసం ఉపయోగించే శక్తిలో 99.9 శాతం హైడ్రోకార్బన్ ఇంధనాల నుంచి వస్తుంది’’ అని డాక్టర్ విల్ లే క్యూజోన్ చెప్పారు.

చమురు, గ్యాస్ వంటి హైడ్రోకార్బన్ ఇంధనాలు చాలా కాలుష్యాన్ని కలిగిస్తాయి. పర్యావరణానికి సంబంధించి ఖతార్ కొన్ని లక్ష్యాలను విధించుకుంది.

2030 నాటికి గ్రీన్‌హౌస్ ఉద్గారాలను 25% తగ్గించాలని ఖతార్ భావిస్తోంది. ఈ ప్రపంచకప్‌ను జీరో కార్బన్‌ ఎమిషన్‌ టోర్నీగా నిర్వహిస్తున్నామంటూ వరల్డ్ కప్ నిర్వాహక కమిటీ పేర్కొంది.

అయితే ‘‘కార్బన్ మార్కెట్ వాచ్’’ వంటి పర్యావరణ గ్రూప్‌లు మాత్రం ఖతార్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రశ్నలను లేవనెత్తాయి.

ఖతార్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఖతార్ వద్ద శక్తి వనరుల నిల్వలు విస్తారంగా ఉన్నాయి, అయినప్పటికీ సౌరశక్తిపై భారీగా పెట్టుబడి పెడుతోంది

హరిత లక్ష్యాలు

‘‘డీశాలినేషన్ కోసం సౌరశక్తిని ఉపయోగించుకునే అంశంపై ఖతార్ పనిచేస్తోంది. సౌర ఫలకాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, దాన్ని రివర్స్ అస్మోసిస్ కోసం ఉపయోగించవచ్చు. లేదా సూర్యుని ప్రత్యక్ష వేడిని నీటిఆవిరి చేయడానికి వినియోగించవచ్చు’’ అని డాక్టర్ విల్ లే క్యూజోన్ అన్నారు.

రివర్స్ అస్మోసిస్ ప్రక్రియలో నీరు ఒక వాహకం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ ప్రక్రియలో నీటిలో మలినాలు తొలిగిపోతాయి. స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వస్తుంది.

ఇటీవల ఏర్పడిన రాజకీయ వివాదం తర్వాత పొరుగు దేశాలు ఖతార్‌ను బహిష్కరించాయి. దీంతో ఆ దేశం ఆహారకొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది.

అప్పటి నుంచి ఖతార్ దేశీయంగా పాల ఉత్పత్తి, సాగు పెంచడంపై కృషి చేస్తోంది.

బీడు భూములను వ్యవసాయానికి వాడటం, జంతువుల పెంపకం పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు.

అయితే, ఈ విధానాలు కూడా ఖతార్‌లోని పరిమిత నీటి వనరులపై ఒత్తిడిని పెంచుతాయి.

‘‘నీటి వనరుల్లో మూడో వంతును వ్యవసాయంలో ఉపయోగించాలి. అయితే, ఖతార్ స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం పాత్ర 1 శాతం కంటే తక్కువే. ఇది 0.1 శాతమే’’ అని డాక్టర్ హమాదౌ అన్నారు.

ఆర్థిక లాభం కోసం కాకుండా అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రజలకు ఆహారం అందించాలనే ఉద్దేశంతోనే వ్యవసాయం వైపు మొగ్గుతోంది.

ఖతార్ ఎనర్జీ ప్రణాళికలు బయటి వారికి వింతగా అనిపించవచ్చు. ఖతార్ ఎదుర్కొంటున్న సవాళ్లు అలాంటి మరికొన్ని దేశాలకు మరీ భిన్నంగా ఏమీ లేవని డాక్టర్ లే క్యూజోన్ చెప్పారు.

‘‘ఎడారి దేశాల్లో నీరు అవసరం ఉంటుంది. శీతల దేశాల్లో వెచ్చదనం, వేడి అవసరం ఉంటుంది. దీన్నిబట్టి ప్రతీ దేశానికి కొన్ని రకాల సవాళ్లు ఉంటాయి’’ అని ఆయన అన్నారు.

ఖతార్ 2036లో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించాలని భావిస్తోందని, అలా జరిగితే ఖతార్‌కు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని ఊహాగానాలు ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, ఫిఫా ప్రపంచ కప్ నిర్వహణకు గడువు దగ్గర పడుతుండగా వలస కూలీల భద్రతపై తలెత్తుతున్న సందేహాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)