మూడేళ్ల నుంచి ఈమె నోటితోనే ఎందుకు శ్వాస తీసుకుంటున్నారు

షెబియా
    • రచయిత, మోహన్
    • హోదా, బీబీసీ కోసం

తమిళనాడు కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళ మూడేళ్లుగా నోటితోనే శ్వాస తీసుకుంటున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ శస్త్రచికిత్స సరిగా చేయకపోవడం వల్లే తన శ్వాస నాళం దెబ్బతిందని, ఫలితంగా నోటితోనే శ్వాస తీసుకోవాల్సి వస్తోందని ఆమె చెప్పారు.

తనకు న్యాయం చేయాలని కోరుతూ కోయంబత్తూరు జిల్లా కలెక్టరును ఆమె అభ్యర్థించారు.

ఇటీవల తమిళనాడులోని చెన్నైకి చెందిన ఒక యువ ఫుట్‌బాల్ క్రీడాకారిణి కూడా వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది.

ఈ నేపథ్యంలో కోయంబత్తూరుకు చెందిన షెబియా కథ కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

షెబియా

అసలేం జరిగింది?

షెబియా సొంత ఊరు కోయంబత్తూరులోని సౌరిపలయం. భర్త నాగరాజ్, ఇద్దరు కూతుర్లతో కలిసి ఆమె జీవిస్తోంది.

కొయంబత్తూరులోని ఒ ప్రైవేటు కాలేజీలో హౌస్‌కీపింగ్ సిబ్బందిగా షెబియా, ఆమె భర్త పనిచేసేవారు.

2019లో షెబియా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఉద్యోగానికి ఆమె సెలవు పెట్టారు.

థైరాయిడ్ రుగ్మత ‘‘మల్టీనోడ్యులర్ గోయిటర్’’ ఆమెకు సోకింది. అదే ఏడాది డిసెంబరు 10న కోయంబత్తూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు.

ఆ తర్వాత ఏం జరిగిందో షెబియా బీబీసీ తమిళ్‌కు వివరించారు.

‘‘ఆపరేషన్ జరిగిన రోజే నాకు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఎదురైంది. వెంటనే మళ్లీ నేను ఆసుపత్రికి వెళ్లాను. అప్పుడు శ్వాస మెరుగ్గా తీసుకోవడానికి మెడ దగ్గర వారు ఒక గొట్టాన్ని ఏర్పాటుచేశారు. కానీ, అది పనిచేయలేదు. శస్త్రచికిత్స సమయంలో శ్వాస మార్గంలోని ఒక రక్త నాళం దెబ్బతిన్నట్లు వారు చెప్పారు. నెల లేదా రెండు నెలల్లో అంతా సర్దుకుంటుందని అన్నారు. మూడు నెలల తర్వాత మెడ దగ్గర అమర్చిన గొట్టాన్ని తొలగించారు. ఒ రంధ్రాన్ని కూడా మూసివేశారు. కానీ, అప్పటికీ నాకు శ్వాస సమస్య అలానే ఉంది’’అని షెబియా చెప్పారు.

కోయంబత్తూరు ఆసుపత్రి

దీంతో ఈఎస్ఐ ఆసుపత్రికి షెబియా వెళ్లారు. అయితే, అప్పటికి దాన్ని కోవిడ్-19 వార్డుగా మార్చేశారు. దీంతో మళ్లీ కోయంబత్తూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కే వెళ్లాలని ఆమెకు సూచించారు. దీంతో శ్వాస మెరుగ్గా తీసుకొనేందుకు పైపును ఏర్పాటుచేసే ట్రాకియోస్టమీ చికిత్సను మరోసారి నిర్వహించారు. అలా.. శ్వాస తీసుకునేందుకు ఆమె గొంతులో ఒక పైపు మళ్లీ ఏర్పాటుచేశారు. గొంతులో ఆ గొట్టం ఉండటంతో ఆమె సరిగా మాట్లాడలేకపోయారు. దీంతో మళ్లీ ఆమె మాట్లాడేందుకు గొంతులో రంధ్రం పెట్టారు.

‘‘అసలేమైందని ఈఎస్ఐ ఆసుపత్రిలో అడిగినప్పుడు, ఇలా లక్ష మందిలో ఒకరికి మాత్రమే జరగుతుందని చెప్పారు. ఇది దురదృష్టకరమైన ఘటన అని, ఇప్పుడేమీ చేయలేమని అన్నారు. ఇప్పటికి మూడేళ్లు గడిచాయి. నేను నోటితోనే శ్వాస తీసుకుంటున్నాను’’అని ఆమె చెప్పారు.

మరోవైపు థైరాయిడ్ శస్త్రచికిత్స కూడా సరిగా చేయలేదని ఆమె వివరించారు. మళ్లీ గొంతు నొప్పి ఎక్కువైందని చెప్పారు. ‘‘శస్త్రచికిత్స ద్వారా శ్వాస సమస్య సరిచేయొచ్చని, కానీ, మళ్లీ నేను మాట్లాడేలా చూస్తామని హామీ ఇవ్వలేమని వైద్యులు అంటున్నారు’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

మూడేళ్ల నుంచి తను ఇలానే అవస్థ పడుతున్నట్లు వివరించారు. ‘‘నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను. తినలేకపోతున్నాను. సరిగా పని చేసుకోలేకపోతున్నాను. నా ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతోంది’’అని ఆమె వివరించారు.

‘‘అసలు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. మేం అద్దె ఇంటిలో జీవిస్తాం. నా భర్త జీతమే మా కుటుంబానికి ఆధారం’’అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఇండియాలో లెజ్బియన్స్ పెళ్లిళ్లు చేసుకోవడం కష్టమా?

హాస్పిటల్‌ నుంచి సమాధానం లేదు

ఆ ఆసుపత్రి నుంచి తమకు తగిన సమాధానం రావడంలేదని షెబియా భర్త నాగరాజ్ వివరించారు.

‘‘మేం పోలీసులను కూడా సంప్రదించాం. కానీ, తామేమీ చేయలేమని అన్నారు. ఆరోగ్య విభాగానికి వెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్తే ఈఎస్ఐ హాస్పిటల్‌పై తాము విచారణ చేపట్టలేమని అన్నారు’’అని ఆయన చెప్పారు.

‘‘నాకు వచ్చే రూ.9,000 మా కుటుంబానికి ఆధారం. షెబియా ఆరోగ్య ఖర్చులు కూడా దీనిలోనే చూసుకోవాలి. పిల్లలను చదివించుకోవాలి.. ఇంటి ఖర్చులు కూడా ఉన్నాయి. ముందు, షెబియా ఆరోగ్య సమస్యకు పరిష్కారం దొరకాలి’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, వరంగల్: ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్

పోలీసులు జోక్యం చేసుకోలేరా?

ఈ అంశంపై మాజీ ఎస్పీ కరుణానిధిని మేం సంప్రదించాం. వైద్యుల నిర్లక్ష్యంపై పోలీసులు విచారణ చేపట్టొచ్చని ఆయన అన్నారు.

‘‘తప్పుడు చికిత్స లేదా నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతే క్రిమినల్ కేసు పెట్టొచ్చు. పోలీసులు కూడా జోక్యం చేసుకోవచ్చు’’అని ఆయన చెప్పారు.

‘‘ఇక్కడ ప్రభావితమైన కుటుంబం ఆరోగ్య విభాగం దగ్గర కేసు పెడితే, శాఖాపరమైన దర్యాప్తు కూడా చేపడతారు. మరోవైపు కోర్టులో కూడా కేసు పెట్టొచ్చు’’అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, ఫొటోగ్రఫీతో 57 ఏళ్ల సత్యభామ ప్రత్యేక గుర్తింపు.. ఫొటోల కోసం పోలీసులూ ఆమెను పిలుస్తారు

దీన్ని వైద్యుల నిర్లక్ష్యంగా చూడొచ్చా?

శస్త్రచికిత్స అనంతరం తలెత్తే సమస్యలను వైద్యుల నిర్లక్ష్యం వల్లే వచ్చినట్లు పరిగణించొచ్చా?

థైరాయిడ్ సర్జరీల్లో ఇలాంటి సమస్యలు తలెత్తిన సందర్భాలు కొన్ని ఉన్నాయని డాక్టర్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ ఈక్వాలిటీ సభ్యుడు డాక్టర్ జీవీ రవీంద్రనాథ్ చెప్పారు.

‘‘అయితే, ఇవన్నీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే వచ్చాయని భావించకూడదు. ఆరోగ్య విభాగంపై దీనిపై దర్యాప్తు చేపడుతుంది. ఇక్కడ నిర్లక్ష్యం ఏమైనా ఉందో లేదో పరిశీలిస్తుంది’’అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, మెంటల్ హెల్త్ సెంటర్లో ప్రేమ, పెళ్ళి

‘‘చాలా అరుదైన కేసు’’

సర్జరీల సమయంలో ఇలా అరుదుగా సమస్యలు వస్తుందటాయని ఈఎస్ఐ ఆసుపత్రి డీన్ డాక్టర్ ఎం రవీంద్రన్ చెప్పారు.

‘‘ఈ కేసులో ఆమె ప్రాణాలు కాపాడేందుకు ట్రాకియోస్టమీ చికిత్స నిర్వహించారు. గొంతు దగ్గర రంధ్రాన్ని కూడా పూడ్చారు. నిజానికి ట్రాకియోస్టమీ చికిత్స తర్వాత చాలా మంది మాట్లాడే సామర్థ్యం కోల్పోతారు. కానీ, దాని వల్ల రోగి ప్రాణాలు కాపాడొచ్చు’’అని ఆయన చెప్పారు.

అరుదైన కేసులో ఇలాంటి సమస్యలు వస్తాయని, అన్నింటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని చెప్పలేమని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)