వివాహేతర లైంగిక సంబంధాలను నిషేధిస్తూ చట్టం తెచ్చిన ఇండోనేసియా

ఇండోనేసియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు

వివాహేతర లైంగిక సంబంధాలను నిషేధిస్తూ రూపొందించిన బిల్లును ఇండోనేసియా పార్లమెంట్ ఆమోదించింది.

మూడేళ్లలో అమల్లోకి రానున్న ఈ చట్టం కింద వివాహేతర సంబంధం ఉంటే ఎవరికైనా ఏడాది పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

ముస్లింలు అధికంగా ఉన్న ఇండోనేషియాలో సంప్రదాయవాదుల నుంచి వచ్చిన ఒత్తిళ్లు ఈ చట్టం రూపకల్పనకు దారితీశాయి.

అయితే, ఈ చట్టం మానవ హక్కులకు తీవ్ర భంగం కల్గిస్తుందని విమర్శకులు అంటున్నారు. దేశ పర్యాటకానికి, పెట్టుబడులకు ఇది పెద్ద ఎదురు దెబ్బని వారు చెబుతున్నారు.

ఈ చట్టం మూలంగా ఇండోనేసియా పౌరులతో పాటు అక్కడి విదేశీయులకు కూడా శిక్షలు వేసే అవకాశం ఉంటుంది.

అయితే, పెళ్లి కాకుండానే సెక్స్‌లో పాల్గొన్నారని ఫిర్యాదు అందితేనే అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. పెళ్లి అయిన వారి విషయంలో భర్త లేదా భార్య ఫిర్యాదు చేయొచ్చు.

ఇండోనేసియా

ఫొటో సోర్స్, EPA

తమ భాగస్వామి ఇతరులతో సెక్స్‌లో పాల్గొంటున్నారని భావిస్తే భర్త లేదా భార్య ఫిర్యాదు ఇవ్వవచ్చు. పెళ్లి కాని వారి విషయంలో అయితే తమ పిల్లలు సెక్స్ పాల్గొంటున్నట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

పెళ్లి కాకుండా కలిసి జీవించడాన్ని అంటే సహజీవనాన్ని కూడా ఈ చట్టం నిషేధిస్తోంది. దోషులుగా తేలితే ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు.

అయితే, ఈ కొత్త చట్టం వల్ల ఇండోనేసియా పేరు దెబ్బతినే అవకాశం ఉందని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. పర్యాటకం తగ్గడంతోపాటు పెట్టుబడుల రాక దెబ్బతింటుందని వారు ఆందోళనవ్యక్తం చేశారు.

‘ఇలాంటి సంప్రదాయ చట్టాలు తీసుకురావడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయి. దాంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు’ అని ఇండోనేసియా ఎంప్లాయర్స్ అసోసియేషన్ అంటోంది.

గతంలోనే తీసుకొచ్చిన ఇలాంటి బిల్లు 2019లోనే ఆమోదం పొందాల్సి ఉంది. కానీ నాడు దేశవ్యాప్తంగా ఆ బిల్లుకు వ్యతిరేకత వచ్చింది. వేల మంది వీధుల్లో నిరసనకు దిగారు.

వీడియో క్యాప్షన్, ఖతర్‌లో మహిళల జీవితం ఇంకా మగవాళ్ల చేతుల్లోనే

ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఎంతో మంది విద్యార్థులు నిరసనకు దిగడం, ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. నిరసనకారుల మీద టియర్ గ్యాస్, జలఫిరంగులు ఉపయోగించారు.

ముస్లింలు మెజారిటీగా ఉండే ఇండోనేసియాలో సెక్స్ మీద ఆంక్షలు కొత్తేమీ కాదు. అచెహ్ ప్రావిన్స్ ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తోంది. గ్యాంబ్లింగ్, మందు తాగడం, అపోజిట్ సెక్స్ వారిని కలవడం వంటి కేసుల్లో శిక్షలు కూడా విధించింది.

2021లో జరిగిన ఒక కేసులో సెక్స్‌లో పాల్గొన్నందుకు ఇద్దరు మగవారిని చుట్టుపక్కల వారు వెలివేశారు. బహిరంగంగా వారిని పోలీసులు కొరడా దెబ్బలు కొట్టారు.

అదే రోజున ఒక మహిళ, ఒక పురుషుడు చాలా దగ్గర ఉన్నందుకు 20 కొరడా దెబ్బల శిక్షను విధించారు. మద్యం తాగినందుకు ఇద్దరు మగవారిని 40 కొరడా దెబ్బలు కొట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)